– డాక్టర్ పార్థసారథి చిరువోలు
జూన్ 12 ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నిర్దేశించారు. ఆ దిశగా ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. భారత్ కూడా ఈ లక్ష్యాలను అందుకోవటానికి తన వంతు కృషి చేస్తోంది. అయితే ఈ ప్రయాణం ప్రస్తుతం ఏ దిశగా సాగుతోందో చూద్దాం.
‘బలపం పట్టాల్సిన చేతులతో
బండచాకిరీ చేస్తూ పసిజీవితాలను నాశనం చేసుకుంటున్నారు..
చిన్నారులను చదివిద్దాం.. వారి భవిష్యత్తును కాపాడదాం..’
ఈ నినాదం మనం వినడం కొత్త కాదు. బాలకార్మిక వ్యవస్థను తరిమి కొట్టాలని పిలుపునిచ్చే సంస్థల ప్రచార కార్యక్రమాల్లో ఈ తరహా నినాదాలను తరచూ వింటూ ఉంటాం. అసలు బాల కార్మికులంటే ఎవరు? 18 ఏళ్ల లోపు పనిచేసే వారంతా బాలకార్మికులే అని బాలల హక్కులపై ఐరాస సదస్సు పేర్కొంటే, 15 ఏళ్ల లోపు పనిచేసే వాళ్లందరినీ ఆ పేరుతో పిలవాలని అంతర్జాతీయ కార్మిక సదస్సు పేర్కొంటోంది.
నిర్వచనాలు పక్కన పెడితే..
బాలలకు కొన్ని హక్కులున్నాయి. ఆరోగ్యంగా జీవించే హక్కు , సామాజిక భద్రత పొందే హక్కు, ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు, విశ్రాంతిగా ఉండే హక్కు, ఆటలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు… వాటిలో కొన్ని. చాలా మంది ఈ హక్కులకు దూరంగా జీవిస్తున్నారు. పేదరికం, కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో.. గనులు, పేలుడు పదార్థాలు, బాణసంచా, అగ్గిపెట్టెల తయారీ, ఇటుక బట్టీలు, తివాచీ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. హోటళ్లలో బాలలతో పని చేయించరాదు. మద్యపానం నుంచి వారిని దూరంగా ఉంచాలి. వాటిని వారి ద్వారా తెప్పించుకోవటం నేరమని ప్రభుత్వ హెచ్చరికలు ఉన్నా, చాలామంది పిల్లలు ఈ పనుల్లో ఉండటం గమనించవచ్చు. కుటుంబ నేపథ్యం ఒక్కటే కాకుండా, ప్రపంచీకరణ కారణంగా పెరుగుతున్న ఆర్థిక అంతరాలు బాలకార్మికులను పెంచుతున్నాయి.
బాలకార్మిక వ్యవస్థ గురించి అధ్యయనం చేసి, దాని నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం 1979లో గురుపాద స్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థ (నిషేధం-నియంత్రణ) అనే చట్టాన్ని 1986లో సిద్ధంచేశారు. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలనూ గుర్తించి వాటిలో పిల్లలు పని చేయడాన్ని నిషేధించింది. ఈ చట్టరీత్యా చర్యల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థపై ఒక జాతీయ విధానాన్ని 1987లో రూపొందించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో బాలలను ప్రమాద కరమైన పనుల నుండి మానిపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు, చర్యల ద్వారా వారికి నాణ్యమైన విద్యను అందించాలని సూచించింది. చదువుకోవడం బాలల హక్కు అని, ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించి బలవంతంగా పనుల్లోకి తీసుకునే యజమానుల నుంచి వసూలు చేసిన జరిమానాతో ఆ కుటుంబాలకు పునరావాస సౌకర్యాలు కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఒడంబడికను సంక్షిప్త రూపంలో చెప్పాలంటే.. బాలల్ని నిర్బంధించరాదు. లైంగిక దూషణ చేయరాదు. బాలల సంక్షేమంలో దోపిడీ ఏ రూపంలో ఉన్నా ప్రభుత్వాలు నిషేధించాలి. 18 సంవత్సరాలలోపు వయస్సు గలవారిని విడుదల చేయటానికి వీలులేని నేరాలకు ఉరి శిక్షగాని, యావజ్జీవ శిక్షగాని విధించరాదు. దేశంలో గాని, అంతర్జాతీయంగా గాని బాలలకు ఇంతకంటే మెరుగైన హక్కులను అందించే చట్టాలు ఉంటే వాటిని పొందడానికీ పిల్లలకు హక్కు ఉంది. కానీ వాస్తవాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలో పుట్టిన 12 మిలియన్ల బాలికల్లో 3 మిలియన్ల మంది తమ 15వ పుట్టిన రోజును, మిలియన్ మంది మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే మరణిస్తున్నారు. లింగవివక్ష వల్ల ప్రతి ఆరుగురిలో ఒక బాలిక మృత్యువాత పడుతోంది. 50% బాలబాలికలకు పోషకాహారం అందడం లేదు. ఇక రెండేళ్ల లోపు వయస్సు గల శిశువులలో 58 శాతం మందికి పూర్తిగా వాక్సినేషన్ అందడం లేదు. దేశంలో 60 శాతం పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) భారత్‌లోని స్థితిగతులను 2017లో గణాంక సహితంగా వివరించింది. దేశంలో 25 మిలియన్ల నుంచి 30 మిలియన్ల వరకు బాలకార్మికులున్నారని, వారిలో 50 శాతం మంది పాఠశాలలకే వెళ్లడం లేదని పేర్కొంది. 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారిలో దాదాపు 20 శాతం మంది ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేస్తున్నట్టు చెప్పింది. 17 ఏళ్లు నిండకుండానే పనుల్లో చేరుతున్న వారి సంఖ్య కోటికి పైగానే ఉంది. సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే భారత్‌లో ఈ సవాలును అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు నిపుణులు. 2002లో మొదటిసారి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక (జూన్ 12) దినోత్సవాన్ని ప్రారంభించింది. ఏటా ఓ థీమ్‌తో దీనిని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ రవాణా సహా వ్యభిచార కూపంలోకి బాలికల్ని దింపటానికి ప్రధాన కారణం బాలకార్మిక వ్యవస్థే. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్థానిక ప్రభుత్వాలు సహకరించాలని ఐఎల్‌ఓ పిలుపునిస్తోంది. అంతర్జాతీయ సంస్థలూ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. చిన్నారులను ఈ కూపంలో నుంచి బయటపడేసి ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నాయి. పిల్లలు పనుల్లోకి వెళ్లకుండా రక్షించు కోవాలని సూచిస్తున్నాయి.
మార్పు దిశగా అడుగులు
కేంద్రం చేపట్టిన అందరికీ విద్యా విధానం (సర్వశిక్షాభియాన్)లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన విధానాన్ని జోడించారు. బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం కుటుంబాల పేదరికమని అనేక అధ్యయ నాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల బాలకార్మికులను పని నుంచి విముక్తులను చేసి, వారికి పునరావాసం కల్పిస్తున్నారు. వారి కుటుంబాలకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద సహకారాన్ని అందించే చర్యలు చేపట్టారు. ఉదాహరణకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కూడా ఇతోధికంగా ఉపయోగపడు తోంది. అంతర్జాతీయ కార్మిక సంఘం, అమెరికా ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ కూడా భారత ప్రభుత్వ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకాలకు సహకారాన్ని అందిస్తున్నాయి.
గణాంకాల ప్రకారం
2000 నుంచి 2016 మధ్య ప్రపంచ వ్యాప్తంగా బాలకార్మికుల సంఖ్య 38 శాతం వరకు తగ్గింది. అంటే పనిచేస్తున్న పిల్లల సంఖ్య 9.4 కోట్ల మంది వరకూ తగ్గింది. కొన్ని దేశాలు వ్యతిరేక దిశలోనూ నడుస్తున్నాయి. 2014లో కార్మికులకు ఉండాల్సిన కనీస వయసును బొలివియా 14 నుంచి పదేళ్లకు తగ్గించింది. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. మానవ హక్కుల సంస్థలపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కొన్ని దేశాలు కూడా బాలకార్మిక వ్యవస్థను చట్టబద్ధం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా బాలకార్మిక వ్యవస్థ నిషేధం విధించాల్సిన అవసరం ఏముంది? అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘ఈ నిషేధం ప్రమాదకరం, అనవసరం’ అని అంతర్జాతీయ విద్యావేత్తల బృందమొకటి ఆ మధ్య వ్యాఖ్యానించింది. కొవిడ్ -19 వల్ల ఆర్థిక వ్యవస్థకు తూట్లు పడటం వల్ల బాలకార్మిక వ్యవస్థపై ఉన్న నిషేధం ఎత్తి వేయాలనే డిమాండ్లు మరింతగా పెరిగాయి. ఆఫ్రికా లాంటి దేశాల్లో బాలకార్మికులు సర్వ సాధారణం. 2016 అంచనాల ప్రకారం.. అక్కడ ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒక బాల కార్మికుడున్నాడు. బాలకార్మికుల్లో ఎక్కువమంది కుటుంబ వృత్తులు, వ్యాపారాల్లోనే ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నా రని ఐఎల్‌వో వివరించింది. దీన్ని అడ్డుకునేందుకు ఐరాస తీసుకొచ్చిన నిబంధనలను 180కిపైగా దేశాలు ఆమోదించాయి.
మరింత కఠిన చట్టాలు అవసరం
రేపటి తరాన్ని నిర్లక్ష్యం చేసిన ఏ దేశమైనా దారుణమైన ఫలితాలను చవిచూడవలసిందే. అందుకే బాలల శారీరక, మానసిక వికాసానికి, అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలి. బాలల రక్షణకై శిశు సంరక్షణాలయాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్లినట్లయితే ఆ బాలల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పిల్లలను ఎవరైనా హింసించినా, దౌర్జన్యం చేసినా, వేధించినా నేరంగా పరిగణించాలి. బాలల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. శరణార్థులుగా మారిన బాలలకు మానవతతో సాయం చేయాలి. మానసికంగా, శారీరకంగా దివ్యాంగులైన వారి వృద్ధికి, వారిలో ఆత్మ విశ్వాసం పెంపుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. బాలకార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య. దీన్ని నిర్మూలిం చడానికి స్థిరమైన, దీర్ఘకాల కృషి అవసరం. చట్టాలు సమగ్రంగా ఉండాలి. ఈ చట్టాల అమలుకు అవసరమైన పటిష్ట యంత్రాంగం కూడా ఉండాలి. రాజకీయ చిత్తశుద్ధి లేనిదే బాలకార్మిక వ్యవస్థను తొలగించలేం. ఈ వ్యవస్థ నిర్మూలన చట్టంతో పాటు విద్యాహక్కు చట్టం లాంటి వాటినీ సమర్థంగా అమలు చేయాలి. వీటితో పాటు బాలల సమగ్ర అభివృద్ధికి, రక్షణకు కార్యాచరణ ప్రణాళికను రచించి అమలు చేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించటం వీలవుతుంది.
– సీనియర్ జర్నలిస్ట్