తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడులో 2024 ఎన్నికల్లో గెలుపునకు తొలిదశ మానిఫెస్టో ప్రకటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇది ఓటర్లను కొనుగోలుచేసే ప్రకియకు మరింత కొనసాగింపు. ఎన్‌టీఆర్, చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి నుంచి మరల నేటి చంద్రబాబు వరకు అందరూ సంక్షేమం పేరుతో పలురకాల పథకాలు ప్రకటించి ఓటర్లను ఆకర్షితులను చేస్తున్నారు. ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్ధిక భారం మోపుతున్నా పార్టీలు మాత్రం పట్టించుకోక పోటీలు పడి పథకాలు ప్రకటిస్తున్నాయి. అసలే లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన విభజిత ఆంధప్రదేశ్‌కు ఈ పథకాలు మరింత ఆర్ధిక భారంగా మారాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలక అప్పులు చేసి మరీ పథకాలు అమలు చేస్తున్నారు.
2014 నాటికి లక్ష కోట్లు అప్పులుండగా, చంద్రబాబు అయిదేళ్లలో లక్షన్నర కోట్లు అప్పు చేయడంతో మొత్తం రూ.2.50 లక్షల కోట్ల భారం పడింది. నవరత్నాల పేరుతో నగదు పంపిణీ పథకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఈ నాలుగేళ్లలో దాదాపు 7.50 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అలా రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరాయంటున్నారు. దీనిపై ఏటా చెల్లించాల్సిన వడ్డీనే సుమారు రూ.50 వేల కోట్లట. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన పథకాలతో మరింత ఆర్ధికభారం పడనుంది. ఈ ఉచిత పథకాలతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఆదాయం పెరగక, అప్పుల సుడి గుండంలో కూరుకుపోతోంది.
నగదు పంపిణీ పథకాలు
టీడీపి అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి మహానాడులో తమ తొలి మ్యానిఫెస్టోగా భవిష్యత్తుకు గ్యారంటీ పథకం కింద ఆరు పథకాలను ప్రకటించారు. మహాశక్తి పథకం కింద నాలుగు పథకాలను ప్రకటించారు. ఇందులో ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద చదువుకుంటున్న పిల్లల తల్లులకు రూ.15 వేలు ఇస్తామన్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నా ఈ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. యువగళం పథకం కింద నిరుద్యోగ యువతకు ‘యువగళం నిధి’ పేరుతో నెలకు రూ.3 వేలు చొప్పున, ‘అన్నదాత’ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ నగదు పంపిణీ పథకాలే. ఇవే ఈ చర్చకు కారణం.
పేర్లు మార్పు
టీడీపీ ప్రకటించిన ఈ పథకాల్లో చాలావరకు గతంలో అమలు చేసినవే ఉన్నాయి. పాతవాటికి పేర్లు మార్చి కొన్నిటిని ప్రకటించారు.
‘ఆడబిడ్డ నిధి’ పథకం వైఎస్‌ఆర్ చేయూత పథకం రెండూ ఒకలాంటివే. వైఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయస్సున్న బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఏడాదికి రూ.18,750 చెల్లిస్తున్నారు. రెండేళ్లుగా ఒసీలకు కూడా ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ‘ఆడబిడ్డ నిధి’ పథకం కింద నెలకు రూ.1,500 చెల్లిస్తామంటున్నారు. వైఎస్‌ఆర్ చేయూత పథకంలో లబ్ధి చేకూరని వారిని కూడా టీడీపీ తన పథకంలో చేర్చింది. 18-59 ఏళ్ల మధ్య వయసుగల మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని చదువుకునే పిల్లల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రకటించిన రూ.15 వేలు వైసీపీ ‘అమ్మఒడి’ పథకమే. అయితే ‘అమ్మఒడి’ కింద ఒకరికే లబ్ధి చేకూరగా కుటుంబంలోని పిల్లలందరికీ వర్తింపచేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. వైసీపీ ప్రవేశపెట్టిన ‘రైతు భరోసా’ పథకం లాంటిదే టీడీపీ ప్రకటించిన ‘అన్నదాత’ పథకం. ‘రైతు భరోసా’ కింద రూ.7,500 మాత్రమే చెల్లిస్తుండగా టీడీపీ దానిని తన హామీలో రూ. 20 వేలకు పెంచింది.
లక్షల కోట్లు పంపిణి
వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాల కోసం ఏటా రూ.50 వేల కోట్లకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. గత నాలుగేళ్లలో మొత్తం రూ.2 లక్షల కోట్లు చెల్లించినట్లు ముఖ్యమంత్రి జగనే స్వయంగా చెప్పారు. ఈ ఏడాది మరో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.2.50 లక్షల కోట్లు ఉచిత పథకాల కింద ఖర్చుచేసినట్లు. నాలుగేళ్లలో ఖర్చయిన రూ.2 లక్షల కోట్లు అప్పనుకుంటే పాత అప్పులు రూ.2.50 లక్షల కోట్లు కలిపి మొత్తం రూ.4.50 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉండాలి. కానీ ఆ అప్పు రూ.10 లక్షల కోట్లకు చేరడమే వింత. అంటే రూ.5.50 లక్షల కోట్లు ఏమయ్యాయో ప్రభుత్వం లెక్క చెప్పాలి. కొత్తగా వచ్చే ప్రభుత్వంపై లక్షల కోట్ల అప్పు, దాని వడ్డీ భారం తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రభుత్వానికి మద్యం ద్వారానే ఏటా రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఈ మొత్తం దేనికి ఖర్చుచేస్తున్నారో అనేది ప్రశ్నార్ధకమే.
ఆదాయం మృగ్యం
ప్రభుత్వం చేసే ఖర్చులో రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు మూలధన వ్యయంగా ఉండాలి. అయితే రూ.15 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఖర్చు కూడా అనుమానమే. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేయక పోవడంతో రాష్ట్రానికి ఆదాయం సమకూరడం లేదు. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని అందరికీ తెలిసిన విషయమే. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా, ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు వద్ద నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ జోన్ (నిమ్జ్), కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం కాంప్లెక్సు, చిత్తూరులో ఈఎంసీ ఎలక్ట్రానిక్ క్లస్టర్, నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ జోన్ (నిమ్జ్), మూడు ఇండస్ట్రియల్ పార్కులు, అయిదు డెవలప్‌మెంట్ జోన్లు ప్రకటిం చారు. కాని వీటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు చేపట్ట లేదు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం అనుమతి ఇచ్చిన ఓడరేవుల నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. కాకినాడ వద్ద పెట్రోలియం కాంప్లెక్సు నిర్మాణానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాదికి రూ.900 కోట్లు ఇవ్వాలని కేంద్రం కోరినా రాష్ట్రం చేతులెత్తేసింది. రాష్ట్రంలో ధ్వంసమైన రోడ్లను సైతం పునర్నిర్మించ లేదు. అతి ప్రధానమైన కోటిపల్లి-నరసాపురం, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైన్‌లకు తన భాగస్వామ్య మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. వీటన్నిటి వల్ల రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరగలేదు. కొత్త పరిశ్రమలు రాలేదు. పాతవి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి వ్యవస్థతో ఆదాయం ఎలా సమకూరుతుంది?
అధికార దుర్వినియోగం
పేదలను ఆదుకుంటామంటూ ప్రభుత్వం అమలుచేసే ఉచిత పథకాల అసలు లక్ష్యం రానున్న ఎన్నికల్లో ఓట్ల కొనుగోలే. పేదలను అభివృద్ధిలోకి తీసుకురావడాన్ని ఎవరూ కాదనరు. కాని, ఈ పేరుతో ఓట్ల కొనుగోలు కార్యక్రమం రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతోంది. పథకాల లబ్ధికి అర్హత రేషన్ కార్డుగా ఉంది. పట్టణాల్లో ఏడాదికి రూ. క్ష, గ్రామాల్లో రూ.80 వేలు లోపు ఆదాయం ఉంటే కార్డు ఇస్తారు. ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదు. డబ్బున్నవారు, అధిక సంపాదనగలవారు సైతం కార్డులు పొందారు. రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయ పరిమితితో అర్హత గలవారు సగం మంది మాత్రమే ఉంటారు. మిగతా సగం మంది అనర్హులే. కుటుంబ పెద్దకు ఆదాయం పెరిగితే ఆ వ్యక్తిని మాత్రం కార్డు నుంచి తొలగించి మిగతా వారి పేరున కార్డులు ఇస్తున్నారు. కుటుంబ పెద్దకు వచ్చిన జీతం, లేదా ఆదాయం ఒక్కడే ఖర్చుచేసుకోడు. కుటుంబం మొత్తానికి ఖర్చుచేస్తాడు. అది గమనించని ప్రభుత్వం ఆ వ్యక్తినే కార్డు నుంచి తప్పిస్తోంది. కార్డుల జారీలో ఇదో పెద్ద తప్పు. ఆదాయపు పన్ను శాఖకు దొరక్కుండా చేసే వ్యాపారాలుచేసేవారు, మారుపేర్లతో చేసే వ్యాపారులు, సర్వీసు చేస్తూ ఆదాయం పొందేవారు కార్డులు పొందుతున్నారు. తల్లిదండ్రుల పేర ఆస్తులుండి, ఆ ఇళ్లు, భవనాల్లో పిల్లల కుటుంబాలు నివసిస్తూ, అద్దెలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో వీరి తల్లిదండ్రులకే రేషన్‌కార్డు నిలిపివేస్తున్నారు. పిల్లలకు మాత్రం రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇలా నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన రూ.2 లక్షల కోట్ల నగదు పంపిణీలో రూ.లక్ష కోట్లు డబ్బున్నవారికే మరల వెళ్లింది. ఈ మేరకు విలువైన ప్రజాధనం దుర్వినియోగం అయినట్లే.
లబ్ధ్దిదారుల్లో కనిపించని పురోగతి
రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఖర్చు చేసిన రూ.2 లక్షల కోట్లతో పేదరికం తగ్గుముఖం పట్టాలి. అయితే అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. 2019 నాటి కంటే ఇప్పటి పరిస్థితి దారుణంగా తయారైంది. నాలుగేళ్లుగా ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు, పేద కుటుంబాలు అల్లాడిపోతు న్నాయి. ప్రభుత్వ వ్యవహార తీరుతో కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్నవి వెళ్లిపోతున్నాయి. పథకాల అమలుకు మద్యం ఆదాయం పెంచుకునే చర్యలు, పన్నుల పెంపు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు తీవ్ర భారం మోపాయి. పట్టభద్రులకు ఆయా రంగాలు ఉపశమనం ఇవ్వలేదు. అందువల్ల అన్ని వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ మరిన్ని తాయిలాలు ప్రకటిచింది.
మరింత ఆర్ధికభారం
టీడీపి ప్రకటించిన పథకాలన్నీ నగదు పంపిణీకి సంబంధించినవే. ఇప్పటి వరకు వైసీపీ పథకాలను విమర్శించిన టీడీపీ ఇప్పుడు వాటికే పేర్లు మార్చి అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కాని వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలను,ప్రభావాన్ని గుర్తించడం లేదు. ఈ పథకాలన్నిటి వల్ల ప్రభుత్వంపై ఆదనంగా భారం పడనుంది. పాలన చేతకాక, కేవలం పథకాలతో పాలన కొనసాగించడం పులిమీద స్వారీ చేయడమే. పథకాలకు నిధులు రానినాడు, చేతిలో డబ్బు పడనప్పుడు..అప్పటి వరకు పొగిడిన లబ్ధిదారులు వెంటనే తిట్ల దండకం ప్రారంభిస్తారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితిపై పెను ప్రభావం చూపించనున్న నగదు పంపిణీ పథకాలపై పార్టీలు పునరాలోచించాలి. ఆదాయ పెంపునకు చర్యలు తీసుకోవాలి.
– వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఛైర్మన్,సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు,
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.