జూన్‌ 5 ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్ట్ ‌శిఖరం మీద ఆ ఇద్దరు పర్వతారోహకులు ఆ రోజు పాదాలు మోపారు. కరచాలనం చేసుకున్నారు. అతి కష్టం మీద తప్ప ఊపిరి అందని ఆ ప్రదేశం వదిలి తిరుగు ప్రయాణం ఆరంభించారు. మే 29,1953న ఆ శిఖరం మీద ఆ ఇద్దరు గడిపిన ఆ పదిహేను అతి చల్లని నిమిషాలకు ప్రపంచ చరిత్ర సమున్నత స్థానం ఇచ్చింది. అలాంటి చరిత్రను సృష్టించినవారే టెన్జింగ్‌ ‌నార్గే, సర్‌ ఎడ్మండ్‌ ‌పెర్సివల్‌ ‌హిల్లరీ. నార్గే టిబెట్‌ ‌షెర్పా జాతీయుడు. హిల్లరీ న్యూజిల్యాండ్‌ ‌దేశీయుడు. కానీ తరువాతి కాలమంతా సర్‌ ‌హిల్లరీ (జూలై 20,1919- జనవరి 11,2008) హిమసానువులకు ప్రజలు, ప్రభుత్వాలు, పరిశ్రమలు పట్టిస్తున్న దుస్థితి గురించి క్షోభిస్తూనే ఉన్నారు. వాటి రక్షణకు తన ప్రయత్నం తాను చేశారు. 1960లో హిమాలయన్‌ ‌ట్రస్ట్ ‌పేరుతో నేపాలీలకు సేవలు ఆరం భించారు. నిజమే, పర్యాటకులు, కొందరు భక్తులు విసిరేసిన ప్లాస్టిక్‌ ‌సీసాలతో కప్పడి పోయిన మంచు పర్వతాల అంచులను చూస్తే కన్నీరొస్తుంది. వాటిని శుభ్రంచేయడం కంటే పాకిస్తాన్‌తో యుద్ధంచేయడం చాలా సులభం. ఇది ఇటీవలి పరిస్థితి.  కానీ అది జరిగిన సుదీర్ఘకాలం తరువాత కూడా,  మే 6, 1990 ‘ఇలస్ట్రేటెడ్‌ ‌వీక్లీ ఆఫ్‌ ఇం‌డియా’కు హిల్లరీ రాసిన వ్యాసం (సేవింగ్‌ ‌ది హిమాలయాస్‌) ‌లోను మంచుపర్వతాలకు కలుగుతున్న నష్టం గురించిన ఆక్రోశమే కనిపిస్తుంది.  భారత్‌కి ‘పెట్టని కోట’ వంటి హిమాలయాల రక్షణకోసం మనం చేసిందేమిటి? చేయగలిగిందేమిటి? అంటూ మనను మనం ప్రశ్నించుకునేటట్టు చేస్తుంది.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాసంలోని కొన్ని భాగాలు.

నలభయ్‌ ఏళ్ల క్రితం నేను మొదటిసారి నేపాల్‌ ‌వెళ్లినప్పుడు అదొక అసాధారణ సుందరదేశం. ఆ అంబర చుంబిత మహా పర్వతసానువులు నేటికీ అలాగే ఉన్నాయి. కానీ వాటి నిటారు పాదాల దగ్గర దృశ్యం మాత్రం చాలావరకు మారిపోయింది. ఒకనాడున్న ఆ దట్టమైన అడవులు ఇప్పుడు తరిగిపోయాయి. వర్షాలతో భూమికోత జరిగి, ఆ మట్టంతా పర్వతాలలోని నదులలోకి, హిందూ మహాసముద్రంలోకి కొట్టుకుపోతోంది. ఇదంతా అక్కడ పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిపోవడంతో వచ్చిన ముప్పు. ఎముకలు కొరికే ఆ చలిలో రాత్రిళ్లు అత్యవసరంగా మంటలు వేయడానికి కట్టెల కోసం అడవులు కొట్టిస్తున్నారు. ఇందుకు బాగా డబ్బులు ఇస్తున్నారు. ఆ ముప్పునకు ఇంకొక ప్రధాన కారణం స్థానికంగా జనాభా పెరగడం కూడా. వీళ్లు అడవులను విపరీతంగా నరికి, సాగు కోసం ఆ ప్రాంతాన్ని వినియోగిస్తున్నారు. ఇదంతా ఎప్పుడు ఆగిపోతుందో, అప్పుడు అదో అద్భుతమే అవుతుంది.

భూటాన్‌ ‌నుంచి పాకిస్తాన్‌ ‌వరకు విస్తరించి ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు ఈ భూగోళం మీద దిగ్భ్రాంతిని కలిగించే ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. అక్కడ ఆకాశాన్ని అందుకుంటున్నట్టు ఉండే పర్వతాలే కాదు, పొడవైన హిమానీ నదాలు, మహోగ్రంగా జాలువారే నదులు, విస్తృతమైన కొండపీఠాలు, వాటి మధ్య సారవంతమైన గ్రామాలు ఉన్నాయి. విస్తారమైన ఎడారులు, కారడవులకూ కూడా ఇది నిలయమే. జీవ వైవిధ్యమే కాదు, వివిధ రకాల సంస్కృతులను ఆచరించే తెగలవారు నివసించే కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అనేక మతాచారాలు, భాషలు కూడా కనిపిస్తాయి. 1951లో నేను తొలిసారి హిమాలయ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఏకాంత జీవనం గడుపుతూ ఉండేవారు. వారికి పట్టణ, నగర జీవనం ఎలా ఉంటుందో దాదాపు తెలియదు. రైలు లేదా బస్సు ఎలా ఉంటాయో కూడా వారు ఎరుగరంటే అతిశయోక్తి కాదు. ఇక విదేశీయుడు అన్నవాడిని వారు అప్పటికి చూసి ఉండరు.

ఇవాళ మనం చెప్పుకుంటున్న పర్యాటకం అనేది కూడా అప్పుడు అక్కడేమీ కనిపించేది కాదు. అయితే తరువాత అక్కడ వచ్చిన మార్పు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సాహసోపేత పర్యాటకం వల్లనే అనిపిస్తుంది. మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు నిర్మించారు. అలాగే ఇటీవలి కాలంలో హిమాలయ కనుమలలో డ్రైవింగ్‌, ‌పర్వతా రోహణ, నదులలో ఈత వంటి కృత్యాలు చేయడానికి మనుషులలో ఆసక్తి బాగా పెరిగింది. ప్రధానంగా యువతలో ఈ ధోరణి ఎక్కువ. అలాగే విమానాల రాకపోకలకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇందులో కొందరు హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలకు వచ్చేవారూ ఉన్నారు. ఈ మార్పు మూలంగా అంతా చేటే జరిగిందని ఎవరూ అనడం లేదు. అలా అని అంతా ఆ ప్రాంతం మంచికే అని కూడా అనలేం. పర్యాటకం ద్వారా ఆదాయం వచ్చి పడడంతో స్థానికుల జీవన ప్రమాణాలు గణనీయంగా వృద్ధి చెందిన మాట నిజమే. అదే సమయంలో అక్కడ లోయలు, దారులు, కొండ వాలులు, నదులు, సరస్సులు చెత్తచెదారంతో నిండి పోతున్నాయి. పర్యాటకుల వంటావార్పూ కోసం, చలి మంటల కోసం అక్కడి అడవులు బలైపోతున్నాయి. కొండ అంచుల మీద వందలాది చిన్న చిన్న హోటళ్లు కనిపిస్తాయి. కానీ వాటిలో చాలావాటికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. కొన్నింటికి ఆ ఏర్పాటు ఉన్నా, అది ఏమాత్రం చాలేది కాదు. ఆ రకంగా అటు పర్యాటకం పెరగడం వల్ల, ఇటు స్థానిక జనాభా పెరగడం వల్ల కూడా హిమాలయ ప్రాంత పర్యావరణం దెబ్బ తింటున్నది. సాగుభూమి క్రమంగా కనుమరుగైపోతోంది. అడవులు ఖాళీ అయిపోతున్నాయి. ఇక్కడ మాయమైన సాగు కొండవాలులకు చేరింది. మరొక వాస్తవం కూడా ఉంది. పెరుగుతున్న జనాభాను అదుపు చేయడమెలాగో ఎవరికీ అంతుబట్టడం లేదు. ధనిక దేశాలలో జనాభా అదుపులో ఉంది. కానీ మూడో ప్రపంచ దేశాలకు ఇప్పటికీ పెద్ద కుటుంబమే జీవనానికి భరోసాను ఇవ్వగలుగుతున్నది. సామాజిక భద్రతకు కూడా అదే పూచీ పడుతున్నది. పెరిగే జనాభా కారణంగా పారిశ్రామికాభి వృద్ధి, ఆహారోత్పత్తి పోటీ పడవలసి వస్తున్నది. పెరిగే పర్యాటకుల సంఖ్య చాలా ప్రభావం చూపుతున్నదన్నది రూఢి అయిన సత్యం. దీనితో హిమాలయ ప్రాంతంలోని చాలా సుందర ప్రదేశాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి. ఈ ముప్పు నుంచి కాస్త సాంత్వనకు ఒక పని చేయవచ్చు. స్థానిక జనాభా తక్కువ ఉన్నచోటకు పర్యాటకులను మళ్లించడానికి తగిన ఆకర్షణలు కల్పించాలి. అప్పుడు ఎక్కువ జనాభా ఉన్నచోట్లకే పర్యాటకులు కూడా చేరుతూ ఉండడం వల్ల కలిగే అనర్థాలను నివారించ వచ్చును. పర్యాట కులు కూడా హిమాలయాల సౌందర్యానికి చేటు చేయని విధంగా వ్యవహరించేందుకు పర్యాటక సంస్థలు బాధ్యత వహించాలి. భూమి మొత్తం కాంక్రిట్‌ ‌జంగిల్‌లా మారిపోకుండా కాపాడుకుంటూ, దాని సహజ సౌందర్యాన్ని రక్షించడానికి మనమంతా కూడా నిబద్ధులమై ఉండాలి.

కొద్దికాలం క్రితం ఐక్యరాజ్య సమితి నిర్వ హించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు నేను హాజరయ్యాను. అక్కడ థోర్‌ ‌హెయర్‌థాల్‌, ‌జాక్విస్‌ ‌కాస్టా, సర్‌ ‌పీటర్‌ ‌స్కాట్‌ ‌వంటివారు చెప్పిన వాస్తవా లతో నేను బెంబేలెత్తిపోయాను.  సాగరాలనూ, అటవీ సంపదనూ ధ్వంసం చేయడం, దానితో వస్తున్న ప్రమాదం గురించి తీవ్ర స్థాయిలో వారు హెచ్చరిం చారు. ఓజోన్‌ ‌పొరకు జరుగుతున్న చేటు, భూమి వేడెక్కడంవంటి అంశాల గురించి శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు కూడా కలవరం కలిగించాయి. ఈ భూ గోళం భవిష్యత్తును తలుచు కుంటూ తీవ్ర మనో వేదనతో నేను సభా మందిరం నుంచి బయటకు వచ్చేశాను. పగటివేళ లండన్‌ ఇచ్చే సౌఖ్యాన్నీ, ఆకుపచ్చని చెట్లనీ, నీలాకాశాన్నీ, తివాచీ వంటి ఆకుపచ్చని గడ్డినీ వాటి మీద ఆహ్లాదంగా ఆడుకుంటున్న పక్షులనూ చూశాక మనసుకు కాస్త ఊరట దొరికింది. నిజంగానే ప్రకృతి ఇంకా కాస్త అందంగానే కనిపిస్తున్నది. కాబట్టి ఏదో కొంచెం ఆశ.

ఈ కొంచెం ఆశ అయినా మిగిలి ఉండడానికి చాలా పెద్ద కృషి జరగాలి. ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు, నిజానికి వ్యక్తులు కూడా ఆ కృషిని అకుంఠితంగా సాగించాలి. తనను తాను పునఃసృష్టి చేసుకునే అద్భుత లక్షణం ప్రకృతికి ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ దానిని ధ్వంసం చేసే శక్తి మానవాళికి అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మనం చేసే ప్రతి పనిని ఆర్థిక ప్రయోజనాలు శాసించడం నేటి చేదునిజం. పరిశుభ్ర పర్యావరణం అనే అంశం కంటే లాభార్జనకే పెద్దపీట వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజాభిప్రాయానికి ఇంకా బలం పెరుగుతుంది. ఓట్ల మీదే ఆధారపడే ప్రభుత్వాలు వారి వత్తిడికి లొంగక తప్పదు. అయితే ప్రభుత్వాలు గట్టిగా తలుచుకుంటే పరిశ్రమలను అదుపు చేయడం కష్టం కాదు. నిజానికి ఇప్పటికే పెద్ద పెద్ద పరిశ్రమలు, కార్పొరేషన్లు పరిశుభ్ర పర్యావరణ కోసం జరిగే ప్రయత్నంలో తమ భాగస్వామ్యం ఉంటుందని చెప్పాయి. కానీ ఇదొక్కటే చాలదు. చక్కని పర్యావరణం కోసం, కాలుష్య నివారణ కోసం ప్రభుత్వాలు, ప్రజలు, పారిశ్రామిక సంస్థలు కలసికట్టుగా కఠోరదీక్ష వహించాలి. అప్పుడే ప్రకృతి తన సౌందర్యాన్ని తను నిలుపుకోగలుగుతుంది. హిమాలయాలంటే అందరికీ శ్రేయస్సును కూర్చేవి. కాబట్టి వాటిని నాశనం చేసే ఏ చర్యనూ అను మతించరాదు. సాగనివ్వరాదు. అలాగే అడవులను రక్షించుకోవాలి. నివాస ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి. కాలుష్యం నుంచి నదులను కాపాడుకోవాలి. కొండ ప్రాంతాలలో ఈ అందాల ప్రకృతిని నిర్దయగా, అర్ధరహితంగా ధ్వంసం చేసే పనిని నిరోధించాలి. హిమాలయాల ఉనికికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికే హిమాలయన్‌ ‌ట్రస్ట్ ఏర్పాటు చేశాం. కాగితాల మీద ఎన్ని రక్షణ చర్యలు ఉన్నా నిష్ప్రయోజనమే. మనమంతా గట్టిగా నమ్మవలసింది హిమాలయాల రక్షణ, అక్కడి ప్రజల రక్షణ గురించి. అందుకు సంబంధించి కార్యాచరణ గురించి. అక్కడ చూపవలసిన చిత్తశుద్ధి గురించి.

– సర్‌ ఎడ్మండ్‌ ‌హిల్లరీ     

About Author

By editor

Twitter
YOUTUBE