పదార్థ లక్షణాల అధ్యయన సారం- రసాయనశాస్త్రం. అంటే వస్తు, ద్రవ, గుణ, విశేషాల పరిశీలనం. పదార్థాలు ఒకదానితో మరొకటి విలీనమైనప్పుడు కలిగే ఫలితాల పరిశోధనం. అనేక రసాయన బంధాలు, పక్రియల అధ్యయనం – ప్రయోగాలు ఫలితాలనిస్తుంటాయి. వాటిని సమాజ, శాస్త్రీయ అవసరాలకు సమన్వయించడమే శాస్త్రవేత్తల పని. జీవ, ఆంగిక, సైద్ధాంతిక, భౌతికాలతో పాటు వైద్య, ఔషధ, ఉపరితల, వాతావరణ, విశ్లేషణాత్మక రసాయనాల అను శీలనం వారి ధర్మం. ఆ విధి నిర్వహణలో ఒకటిన్నర దశాబ్దం క్రితమే నోబెల్ పురస్కృతి అందుకున్న వనితారత్నం యోనత్. ఇజ్రాయెల్ పరంగా అంతటి ప్రతిష్ఠాత్మక విజేతల్లో యోనత్ (80) ప్రథమ మహిళామణి. తన శోధనా కృషిని మరెన్నో దేశాలకు విస్తరించిన ఆ ప్రతిభామూర్తి పుట్టినరోజు జూన్ 22ను పురస్కరించుకుని…
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్. పశ్చిమాసియా ప్రాంతం. తీర, పర్వత ప్రదేశాల సమ్మిళితం. అధిక సంఖ్యాకులైన నివాస యూదులు చాలావరకు పశ్చిమ ప్రదేశాల నుంచి వలస వచ్చినవారు. ఈ దేశం అలనాడు ఐరాస తీర్మాన ఫలితంగా రూపుదిద్దుకుంది. సరిహద్దు పోరాటాలవల్ల కలిగిన ఆటుపోట్లను సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చింది. వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులను అనుసరించి, శాస్త్ర పరిజ్ఞాన ఉన్నతి అందుకుంది. సామాజిక సంక్షేమ సాధనలోనూ ముందంజలో ఉంది. జైరూసలేమ్‌లోని విశ్వవిద్యాలయం, హైఫా పరిసరాల్లో ఉన్న సాంకేతిక వ్యవస్థలు పేరెన్నిక వహించాయి. ప్రత్యేకించి వైద్య సహాయం అనేది ప్రభుత్వ, వృత్తి సంస్థల కీలక బాధ్యత. దేశ నిర్మాణ కృషిలో ప్రముఖ పాత్ర పోషించిన వీజ్‌మన్ ప్రధానంగా రసాయనికవేత్త. అటువంటి ప్రాధాన్యం నిండిన ఇజ్రాయెల్ ఈ విజ్ఞానవంతురాలి స్వస్థలం.
పుస్తకమే సమస్తం
యోనత్ అమ్మానాన్నా తొలి నుంచీ కష్టజీవులు. చిన్నపాటి పనులతో కుటుంబాన్ని పోషించుకునే వారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, రోజువారీ అవస రాలు గడవడమే ఎంతో కష్టతరమైనా ఆమెకి మాత్రం బాల్యం నుంచే చదువంటే మక్కువ ఎక్కువ. ఇరుకిరుకు గదుల్లో ఉండాల్సి వచ్చినా, అక్కడే ఏదో ఒక మూల కూర్చుని పుస్తకాలు చదువుతుండేది. ‘విద్యను మించిన ధనం’ ఉండదని చిన్నప్పుడే అర్థం చేసుకుంది. కుటుంబీకులు కొంతకాలం తర్వాత జైరూసలేమ్ ప్రాంతానికి నివాసం మార్చారు. అక్కడా ఆమె చదువుతోనే స్నేహం చేస్తుండేది. నాలుగు పదుల వయసయినా నిండకుండానే తండ్రి శాశ్వతంగా కన్నుమూయడం యోనత్‌కు పిడిగు పాటుగా మారింది. అయినా బాధను దిగమింగుకుని, పుస్తక నేస్తాలతోనే సాంగత్యం కొనసాగించింది. ఇంకా కొన్నాళ్లకు టెల్ అవిల్ పరిసరాల్లోని ఉన్నత పాఠశాలలో చేరింది. మరి స్కూల్ ఫీజులు కట్టేదెలా? కన్నతల్లే ఆదుకుంది. బడిపిల్లలకు గణిత పాఠాలు చెప్పడం ద్వారా వచ్చిన కొద్దిపాటి డబ్బులే అందుకు ఆధారమయ్యాయి.
దేశ విదేశాల్లో…
మేరీ క్యూరీ పేరు విన్నారు కదా! ఆ శోధక, సాధకురాలే యోనత్ విద్యాసక్తికి ప్రేరకురాలు. రసాయన, భౌతికశాస్త్రాలు రెండింటిలోనూ తొలి నోబెల్ విజేత మేరీ క్యూరీ. ఫ్రెంచి శాస్త్రకారిణు లందరిలోనూ మణిదీపం. పారిస్, వార్సా ప్రాంతాల్లో ప్రయోగ సంస్థల వ్యవస్థాపకురాలు. అందుకే పోలెండ్ సైతం అప్పట్లో ఆమె పేరిట అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరాన్ని ప్రకటించింది. ఆ జీవితచరిత్రతో ప్రభావితురాలైన యోనత్, ఎంతగానో అంతర్మథనానికి లోన య్యారు. అనంతరకాలంలో తాను తిరిగి జైరూసలేమ్ చేరడం, కళాశాల విద్యలో నిమగ్నం కావడం జరిగిపోయింది. అక్కడే రసాయనశాస్త్రంలో పట్టభద్రురాల య్యారు. ఇంకొంత కాలానికే బయోకెమిస్ట్రీ పాఠ్యాంశంగా పీహెచ్‌డీ చేశారు. తదుపరి రోజుల్లో మెలాన్ వర్సిటీలో సేవలు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన విలియం ల్యాబ్‌రేటరీలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తానే సొంతంగా ప్రయోగశాల స్థాపించి ఏళ్ల తరబడి పరిశోధనల పరంపర కొనసాగిం చారు. మార్పు చేర్పుల పర్యవ సానంగా నివాసం బెర్లిన్‌కు మారింది. అంతేకాదు, చికాగో విశ్వవిద్యాలయ అతిథి ఉపన్యాసకురాలిగా ఎంతో అనుభవం గడించారు. పనిలో పనిగా జర్మనీలోనే ప్రత్యేక సంస్థను నిర్వహించారు. దశాబ్దాల తరబడి కొనసాగిన ఆ సేవ అమూల్యం, అపురూపం, అపూర్వం. ఎక్కడ ఏ సంస్థను నెలకొల్పినా, ఎటు వంటి బాధ్యతలు వహించినా, సహాయక బాధ్యతలు నిర్వహిం చినా తనదంటూ ప్రత్యేక ముద్ర వేయగలిగారు. ప్రేరణ పొందడమే కాకుండా ఇవ్వడం కూడా ఆమెకు చాలా బాగా తెలుసు.
బహూకృతులన్నీ సొంతం
శాస్త్రం విజ్ఞానం- ఈ రెండింటి అంతస్సారాన్ని యోనత్ ఎంత గ్రహించాలో అంతా గ్రహించారు. రసాయనాలతో పాటు ఇతర శాస్త్ర సంబంధ అంశాలనూ క్రోడీకరించి, అన్నింటికీ మూలాధారం సామాజిక పురోగమనమేనని చాటి చెప్పారు.
నీతికి దూరమైన అవినీతికి పాతరలైన ఏటికీ
యాతనలిన్ని శోధనలు యంత్రములున్ జ్వలితాగ్ని తంత్రముల్?
భీతిని ద్రోల, శాంతిమయ విశ్వమునేలగ నేడు శాస్త్ర సాం
కేతిక దేహచిత్రము లిఖింపుడు మానవతాముఖమ్ముతో (గరికిపాటి)
సింధువుకు ఆధారమైన బిందువును, దాని పుట్టుకను ఉదాహరించినప్పుడు…
ఓ దివ్యాత్మ విభూతి శక్తికణమా, యోగాత్మ సంకల్పమా?!
ఓ దుర్భాగ్ర నిశాత బుద్ధి మహిమా, హోమ ప్రభా ధూమమా!
నీ దైవాంశకు మొక్కి నిర్మలమనో నీరాజనంబిచ్చి, ఆ
పో దీర్ఘ ప్రతిభా చరిత్రను నవవ్యూహంబునన్ బల్కెదన్
అన్నట్లు యోనత్ తన ప్రతీ పరిశోధన అంశానికీ నేపథ్యాన్ని విశదీకరిస్తూ వచ్చారు. ప్రతిభా వ్యుత్పత్తులను సమరసంగా మేళవించిన ఫలితంగానే అమెరికాకు సంబంధించిన నేషనల్ అసెంబ్లీ ఆఫ్ సైన్స్ ప్రాతినిథ్యాన్ని అందుకు న్నారు. అదే దేశానికి చెందిన అకాడమీ ఆఫ్ ఆర్టస్ అండ్ సైన్సెస్‌లో కూడా ఆమె ఒక సభ్యురాలు. అంతేగాక, యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ పరంగానూ సభ్యత్వాన్ని పొందారామె. స్వదేశమైన ఇజ్రాయెల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ ప్రతినిధిగా అపార సేవాసహాయ సహకార సమన్వయాలు అందించారు. దాదాపు ప్రతీ సంవత్సరమూ వరస వెంబడి పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 2002లో హార్వే బహూకృతి; 2004, 2006 సంవత్సరాల్లో పతకాలు; అదే 2006లో మరి మూడు పురస్కృతులూ ఆమె కీర్తిమకుటానికి కాంతిరేఖలై ప్రభవించాయి.
వైజ్ఞానిక ఆవిష్కరణల దిశ
బయాలజీ, లైఫ్ సైన్సెస్‌లతో పాటు కెమిస్ట్రీ అంశాల్లో అనేక బహుమానాలు ఆమెను వరించాయి. ప్రధానంగా 2009వ సంవత్సరం యోనత్ జీవితరంగంలో కీలకమైనది. రసాయనశాస్త్రంలో నోబెల్ ఫ్రైజ్‌ను మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి స్వీకరించారు. ఆ ఇద్దరిలో ఒకరు భారతీయ మూలాలున్న వెంకటరామన్ రామకృష్ణన్. మరో ఆరేళ్లకు విశేష ప్రాముఖ్యమున్న మెడికల్ యూనివర్సిటీ వారి టైటిల్ సైతం ఆమె వశమైంది. పలు దేశాలకు జతగా యునైటెడ్ కింగ్‌డమ్, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ వర్సిటీలు గౌరవ డాక్టరేట్ డిగ్రీలను ఆమెకు సగౌరవంగా ప్రదానం చేశాయి. పురస్కృతులు అందుకున్న ప్రతిసారీ యోనత్ కీలకంగా ప్రస్తావించింది పర్యావరణ పరిరక్షణ గురించి కూడా. వైజ్ఞానిక ఆవిష్కరణలు విస్తృతం కావాల్సిన అవసరాన్నీ నొక్కి చెప్పారామె. దీని నేపథ్యాన్ని అవలోకిస్తే, మరో హృద్యపద్యం మన మనోమందిరాన్ని పులకితం చేస్తుంది.
ఆద్యజ్యోతి యనుగ్రహించె కలలే ఆవిష్కరింపంబడెన్
ఉద్యత్కాంతులెసంగె లండనుపురిన్, న్యూయార్కులో రాత్రులన్
సద్యోజాత సుధాస్రవంతులెడిసన్ జ్ఞానప్రభా వీచికల్
విద్యుద్దేవత వీధులందు వెలసెన్ విజ్ఞాన మర్పింపగన్
ఈ సారాంశాన్ని అవగతం చేసుకుని, భవితవ్యం వైపు చూపు సారిస్తే మరెందరో శాస్త్రకోవిదులు వరసలో నిలుస్తారు. వారి పరంపరలో, ఆ జ్ఞాపకాల క్రమంలో మహిళా శాస్త్రవేత్తలు ఇప్పటివారూ స్ఫురణకు వస్తూనే ఉంటారు. వారందరిలో ఒకరిగా ఉన్న యోనత్ రసాయనశాస్త్ర సాంకేతికతల పరంగా పేరెన్నిక పొందినవారు, భావి పరిశోధక యువతీ లోకానికి అన్ని విధాలా మార్గదర్శకులు, ఆదర్శ చరితురాలు.
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్