సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌జ్యేష్ఠ బహుళ నవమి – 12  జూన్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఆ ‌సదస్సుకి వాళ్లు పెట్టిన పేరు మొహబ్బత్‌ ‌కీ దుకాన్‌. అం‌టే ప్రేమ విఫణి. ప్రేమ మాటేమో గానీ, ఆ దుకాణంలో నవ్వులైతే పుష్కలంగా దొరికాయి. కాంగ్రెస్‌ ‌నాయకుడు, ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగి రాహుల్‌ ‌గాంధీ అమెరికాలోని కాలిఫోర్నియా శాంతాక్రజ్‌ ‌విశ్వవిద్యాలయానికి వెళ్లి మరీ తెరిచారు దుకాణం. ఎంత గంభీరంగా ముఖం పెట్టి, గొంతు నిండా ఆవేదన ఆక్రోశం యథాశక్తిన పలికించినా అది జనాలకు నవ్వులు మాత్రమే ఇచ్చింది.  ఎందుకంటే  ఈ ప్రేమ దుకాణంలో ఆయన విక్రయానికి పెట్టిన దంతా కల్తీ లేని ద్వేషమే. పదవి లేదన్న ఆక్రోశమే. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ మీదనే. అలా అని అక్కడ నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలలో కనిపించే జన సందోహం ఏమీలేదు. మోదీమోదీ అంటూ మిన్నంటి వినిపించే నినాదాలు అసలే లేవు. అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యులూ లేరు. ఆ ప్రేమ దుకాణంలోనే మొదలు పెట్టారు రాహుల్‌ ‌విద్వేషపు బేరాలు. ఆ ప్రేమ దుకాణంలో చౌకగా దొరికే మరొక వస్తువు హిందూ ద్వేషం.

ఈ మధ్యనే మూడు నగరాల పర్యటన కోసం రాహుల్‌ అమెరికాలో అడుగు పెట్టారు. పర్యటన ఉద్దేశం ఏమిటీ అంటే- ఓవర్సీస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో పునరుత్తేజం నింపడం. ఏమైనా కర్ణాటకలో గెలుపు రాహుల్‌లో ఎంతో కొంత నూతనోత్సాహం నింపినట్టే ఉంది. అందుకే రెండో విడతగా ఒవర్సీస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీని పటిష్టం చేసే పనిని ఆలస్యం లేకుండా ఆరంభించారన్నమాట.

మెట్ట వేదాంతమని మనమంతా అనుకోవచ్చు కానీ, రాహుల్‌ ఎప్పుడు ఉపన్యసించినా దాని నిండా ఒక రకమైన తాత్త్వికత ఉప్పొంగుతూ ఉంటుంది. ఈ ప్రపంచం చాలా పెద్దది. ఇందులో ప్రతీ విషయం తెలుసుకోవడం అంటే మానవమాత్రులకు సాధ్యం కాదు. కానీ కొందరు ఉంటారు, తాము సర్వజ్ఞులమని గాఢంగా నమ్ముతారు. అంతేకాదు, తాము దేవుడి కంటే ఒక మెట్టు పైననే ఉన్నామని కూడా విశ్వసిస్తారు. అంతేనా, వాళ్లు దేవుడి పక్కనే కూర్చుని ఏం జరుగుతున్నదో, జరగబోతున్నదో ఆయనకి విడమరచి చెప్పగలరు కూడా. వీళ్ల మాటలకి నేను సృష్టించిన ఈ విశ్వం ఇంత గందర గోళంగా ఉందా అని దేవుడే తికమక పడ•డం ఖాయం. అలాంటి వారిలో మన ప్రధాని కూడా ఉన్నారు అని ఆ ప్రసంగంలో రాహుల్‌ ‌వ్యాఖ్యానించారు. నిజమే, ఎప్పుడూ దెయ్యాల కోసం, దెయ్యాల చేత నడిపిస్తున్న పార్టీ నుంచి వచ్చినవాడికి కాస్త మంచి పని ఏదైనా సైతాను చర్యగానే కనిపిస్తుంది. పార్లమెంటులో సెంగోల్‌ (‌రాజదండం)కు ప్రధాని మోదీ సాష్టాంగ దండ ప్రమాణం చేయడం గురించి అమెరికాలో విమర్శలు కురిపించడం ఏమిటి? ఇదీ ఒకరకం సైతాను వ్యక్తీకరణే.

కొయ్యరా కొయ్యరా కోనయ్యా అంటే, కోటప్పకొండ మిరియాలు తాటి కాయలంత అన్నాడని సామెత. తన భారత్‌ ‌జోడో యాత్రా కథనాలతో రాహుల్‌ ‌గాంధీ అక్కడి ప్రవాస భారతీయులను జ్ఞానవంతులను చేయాలని సంకల్పించిన తీరుతెన్నులు చూస్తే ఆ సామెత గుర్తుకు వచ్చి తీరుతుంది. భారత్‌ ‌జోడో యాత్ర ఉద్దేశం విద్వేషం అనే బజారులో ప్రేమ దుకాణం తెరవడానికేనట.  బీజేపీ పాలనలో ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం ఊపిరి సలపక తల్లడిల్లిపోతున్నదని కూడా అమెరికాలో కోశారు. భారతదేశ రాజకీయాలను బీజేపీ, ఆరెస్సెస్‌ ‌శాసిస్తున్నా కూడా ప్రజల గుండెల నిండా ప్రేమ నిండి ఉన్న సంగతి తన భారత్‌ ‌జోడో యాత్రలో కనిపెట్టేశానని రాహుల్‌ ‌సెలవిచ్చారు. భారతదేశంలో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ బతుకులు ఈడుస్తున్నారు, భావ ప్రకటనా స్వేచ్ఛ కంచు కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు వంటి ముక్తాయింపులు కూడా రాహుల్‌ ‌చేశారు.

ఇంతకాలం మైనారిటీలంటే ముస్లింలే అన్నట్టు వ్యవహరించిన కాంగ్రెస్‌ ఈ ‌మధ్య ధోరణి మార్చుకుంటోంది. సిక్కులు కూడా మైనారిటీలన్న సంగతి ఇప్పుడిప్పుడే ఆ శతాధిక వర్షాల పార్టీకి గుర్తుకు వస్తోంది. తన అమెరికా కార్యక్రమాలకు సిక్కులు రావడం కూడా చూశారట రాహుల్‌. ఒకచోట మాత్రం సభాస్థలిలోకి ఖలిస్తాన్‌ ‌సమర్థకులు వచ్చి నినాదాలు చేసి వెళ్లారు. ఈ సంగతి ఎలా ఉన్నా, సిక్కు మత గురువుల  గురించి సిక్కులకు కూడా తెలియని ఒక దేవ రహస్యాన్ని రాహుల్‌ అమెరికా గడ్డ మీద వెల్లడించారు. గురు నానక్‌ ‌మక్కా, థాయ్‌లాండ్‌, శ్రీ‌లంకలను కూడా సందర్శించారని రాహుల్‌ ‌బయటపెట్టారు. ఈ మహా రహస్యం వెల్లడించడానికి ఆయన భారత్‌ ‌జోడో యాత్రనే ఎంచుకున్నానని కూడా ఆయన చెప్పారు. భారత్‌ ‌జోడో- అంటే భారత్‌ను ఏకం చేద్దాం అన్న ఆలోచన మనం పుట్టక ముందే నానక్‌ ‌వంటి మహాపురుషులు కూడా చేపట్టారని చెబుతూ, నానక్‌తో తనను సమం చేసుకునే విఫలయత్నం చేశారు రాహుల్‌. ‌దీనికే పాపం, సిక్కు మతస్థులకి  ఏమనాలో తోచలేదు. నీ అజ్ఞానాన్ని మేం ఇంకా ఎంతకాలం క్షమించాలి రాహుల్‌ అం‌టూ నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నారు వారు.

ఇదంతా ఒక ఎత్తు. వాషింగ్టన్‌ ‌డీసీ ప్రెస్‌క్లబ్‌ ‌సమావేశంలో రాహుల్‌ ‌చెప్పిన మాట ఒకటీ ఒక ఎత్తు. దీనికి భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం విస్తుపోతోంది. అఖిల భారతీయ ముస్లిం లీగ్‌ అనేది పరిపూర్ణ సెక్యులర్‌ ‌పార్టీ అని తేల్చారు రాహుల్‌. ‌ముస్లింలీగ్‌ ‌సెక్యులర్‌ ‌కాదు అని ప్రకటించడానికి ఒక్క అంశం కూడా దొరకదని సవాలు కూడా చేశారాయన. పైగా ముస్లిం లీగ్‌ ‌మతతత్త్వం గురించి ప్రశ్నించిన విలేకరి దాని గురించి అధ్యయనం చేయలేదేమోనని అధిక ప్రసంగం కూడా  చేశారు.

ఒక దేశ ప్రధాన ప్రతిపక్ష ప్రముఖుడు విదేశీ గడ్డ మీద ఇలా వాగడం మనం ఎక్కడా చూడం. ఇందుకే పనిగట్టుకుని విదేశాలకు వెళ్లే ఏ దేశ పౌరుడినీ అసలు చూడలేం. అది రాహుల్‌గాంధీకి మాత్రమే సొంతం.

About Author

By editor

Twitter
YOUTUBE