అరబిక్ కడలి మీద సాయం సంధ్య ఎంత మనోహరంగా ఉంటుందో ఆ బీచ్‌లో నిలబడి చూస్తే తెలుస్తుంది. వేకువ వెలుగు రేఖలలో కోలీలు అని పిలిచే జాలర్లు వేటకోసం పడవల మీద నుంచి వలలు విసురుతున్న దృశ్యాలు కూడా అక్కడ నుంచే అద్భుతంగా కనిపిస్తాయి. అదే ముంబైలోని భరత్‌నగర్, అంధేరీ వెస్ట్, వెర్సోవా బీచ్.
అంతగా రద్దీగా ఉండని ఆ బీచ్‌కి వెళితేనే అరేబియా సాగర సౌందర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం సాధ్యమవుతుందనే వారూ ఉన్నారు. ఇక్కడి సంధ్యాసమయం బంగారు వన్నెలో ఉంటుంది. అదే అద్భుతం. సమీపంలోనే ఉన్న జుహూ బీచ్‌కు కొనసాగింపులా ఉంటుంది వెర్సోవా. ఇది ముంబై నగరంలోనే అత్యంత పరిశుభ్రంగా ఉండే బీచ్‌గా పేరు తెచ్చుకుంది. అరేబియా సముద్రంలో సాధారణంగా కెరటాలు ఉగ్రరూపంలో ఉండవు. ఈ బీచ్ దగ్గర కనిపించే ఆ సముద్రం మాత్రం అందుకు కొంచెం భిన్నం. అందుకే ఇక్కడ ఈత కొట్టడం కూడా నిషిద్ధం. భారీ తాబేళ్లు పడుకుని ఉన్నాయని అనిపించే నల్లటి రాళ్లతో మూడు కిలోమీటర్ల పొడువు ఉండే ఈ బీచ్‌లో అలీవ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువ. చాలామంది వీటిని చూడడానికే వస్తారు కూడా. గుర్రపుస్వారీ, సైక్లింగ్ కూడా ఉన్నాయి. అలాగే ఫోటోగ్రాఫర్లకు ఇదొక ఆకర్షణీయ కేంద్రం. పురాతన కాలం నుంచి చేపలవేటతో బతుకుతున్న కోలి వర్గీయులే ఇక్కడ ఎక్కువ. అందుకే పెద్ద చేపల బజారు కూడా ఉంది.
కానీ ఇంత అందమైన ఈ బీచ్ దగ్గరే ముంబై నగరం విసర్జించే సర్వ వ్యర్థాలను ఆ సాగరంలోకి వదిలిపెడతారు. దీనిని శుద్ధి చేసే పని 2015 అక్టోబర్ నుంచి మూడేళ్ల పాటు నిర్వహించారు. అఫ్రోజ్ షా అనే స్వచ్ఛంద సేవకుడు తన సహాయకులతో కలసి ఈ పనిని నిర్వహించాడు. ఆ బీచ్‌నే ఇటీవల అరేబియా సాగరం తనలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపేసింది.
బిపర్‌జాయ్ తుపానును ఆసరా చేసుకుని పర్యావరణం మనిషికి ఒక హెచ్చరిక చేయాలని అనుకున్నట్టే ఉంది. అందుకు వెర్సోవా బీచ్‌ను వేదికను చేసుకుందని అనిపిస్తుంది. గుజరాత్‌ను వణికించిన బిపర్‌జాయ్ తీరం తాకక ముందే అనూహ్యంగా ఈ అందాల వెర్సోవా బీచ్‌ను ప్లాస్టిక్ వ్యర్థాల పెను తుపాను తీరం తాకింది. సముద్రంలో కల్లోలం ఆరంభం కాగానే బురద, ప్లాస్టిక్ చెత్తా చెదారం, ప్లాస్టిక్ తునకలు, మెటాలిక్ వ్యర్థాలు ఆ తీరానికి చేరాయి. నిజానికి ఈ మూడు కిలోమీటర్ల తీరంలో చాలా భాగం ఆ వ్యర్థాలతో ఒక తివాచీ పరిచినట్టు తయారయింది. ప్రకృతిలో ఉన్న జల రాశిలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతగా చొచ్చుకు పోయాయో దీనిని బట్టి అర్ధమవుతుందని నిపుణులు అంటున్నారు. నిజానికి ప్లాస్టిక్ తునకలు లేదా కణాలు, అణువులు భూమి పొరల అట్టడుగుకు కూడా చేరిపోయాయి. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఉన్న మరియానా కందకం లోతులకు కూడా అవి చేరిపోయాయని తేలింది. మరియానా ట్రెంచ్ లేదా కందకం ఈ భూగోళం మీద ఏర్పడిన అతి పెద్ద సాగర కందకం. మరియానా అనే దీవులకు 200 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఈ కందకం పొడవు 2,550 కిలో మీటర్లు. వెడల్పు 69 కిలోమీటర్లు. మరియానా కందకం మొదలు ఎవరెస్ట్ పర్వతం మీద వరకు కూడా ప్లాస్టిక్ తునకలు ఆక్రమించాయి. అంటార్కిటిక్ సముద్ర గర్భంలో కూడా ఆ తునకలు ఉన్నాయి. అలాగే ప్రపంచం మొత్తం ప్రజానీకం తాగుతున్న నీటిలో కూడా అవి చేరాయి. ఈ తునకలు సముద్ర జీవాల శరీరంలోకి, ఆ విధంగా ప్రపంచ మానవాళి శరీరాలలోకి ప్రవేశించాయి. ఆఖరికి మనుషుల రక్తంలో కూడా వీటి జాడలు ఉన్నాయని పరిశోధకుల తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం కనిపించదు. నీరు, తిండి పేరుతో మనం తీసుకునే ప్రతిపదార్థంలోను ప్లాస్టిక్ తునకలు ఆందోళన పెట్టే స్థాయిలో ఉన్నాయి. ఒక లీటర్ సీసా నీళ్లలో 325 ప్లాస్టిక్ తునకలు ఉంటాయని తేల్చారు. ఎన్=21 పేరుతో సాగిన ఈ అధ్యయనమే పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను, దేశాధినేతలను ఉలిక్కిపడేటట్టు చేసింది. ఒక లీటర్ సీసా నీటిలోను, ఒక లీటర్ కుళాయి నీటిలోను ఉండే మైక్రోప్లాస్టిక్ శాతం ఎంతో తేలింది. అదెంత విషపూరితమో వెల్లడైంది. మైక్రోప్లాస్టిక్ తునకలు, కణాలు మరీ చిన్నవిగా చీలిపోయేకొద్దీ పర్యావరణా నికి వాటితో ముప్పు అనూహ్యంగా పెరిగిపోతోందని తెలిసింది.
పాలిమర్స్ నుంచి వచ్చే ప్లాస్టిక్ పదార్థం, దాని ఉత్పత్తులు ప్రవేశించని మానవ జీవిత కోణం లేనేలేదు. అంటే మన ప్రమాదాన్ని మనమే ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించుకున్నాం. ఏడు దశాబ్దాలుగా ఇది ప్రపంచాన్ని చుట్టుముడు తున్నది. ఈ 70 ఏళ్లలో ప్లాస్టిక్ ఉత్పత్తి 200 రెట్లు పెరిగింది.2000 సంవత్సరం నుంచి చూస్తే ఏటా ఉత్పత్తిలో నాలుగు శాతం పెరుగుదల కనిపిస్తుంది. మనిషి ప్రాణం కాపాడే మందులు, ప్రాణం నిలిపే ఆహారం కూడా ప్లాస్టిక్ కాగితాతోనే అందిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. దానిలో ఉన్న సరళత్వం ఇందుకు ప్రధాన కారణం. తక్కువ ధర, ఎక్కువ కాలం మన్నిక వంటి పలు ఇతర కారణాలు కనిపిస్తాయి. అందుకే గడచిన కొన్ని దశాబ్దాలలో ప్లాస్టిక్ ఉత్పత్తి భయపెట్టే స్థాయికి చేరుకుంది. 2018 సంవత్సరంలో ప్రపంచంలో జరిగిన ప్లాస్టిక్ ఉత్పత్తి 359 మిలియన్ టన్నులని తేల్చారు. ఇక 2020 సంవత్సరంలో ఆ ఉత్పత్తి 367 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరిపోయింది. ఫలితం 29.1 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం ప్రపంచం మీద వచ్చి పడింది.
ఇప్పటివరకు జరిగిన పరిశోధనలను బట్టి ప్లాస్టిక్ వ్యర్థంలో 9 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. మరో 12 శాతం చేస్తున్నారు. మిగిలిన 79 శాతం వ్యర్థం వెళ్లి భూమాత గుండెల మీద కూర్చుంటున్నది. దీనిలో ఉన్న సౌలభ్యం కొద్దీ ఉత్పత్తి పెంచుకున్నా, వాడేసిన తరువాత అది పర్యా వరణానికీ, మానవాళికీ చేసే చేటు గురించి చాలా కాలం మనిషి ఆలోచించలేదు.ఏటా అనూ హ్యంగా నదులలోకి, సరస్సులలోకి, సాగరాలలోకి, మట్టిలోకి చేరుతున్న ఈ ప్లాస్టిక్ వ్యర్థం వల్ల నాణ్యమైన సహజ వనరులకు కూడా మనిషి దూరమై పోతున్నాడు.
ప్లాస్టిక్ తునకల కాలుష్యం ప్రకృతిలోని ప్రతి అణువులోను ఉంది. మైక్రోప్లాస్టిక్ ఎంత చిన్న పరిమాణంలో ఉంటుందంటే కేవలం అయిదు మిల్లీమీటర్ల కంటే తక్కువే.కానీ ఇవే మానవాళికి ప్రాణప్రదమైన జలరాశిని ధ్వంసం చేస్తున్నాయి. వందలాది మైళ్లు విస్తరించి ఉండే సముద్రాలను కూడా కలుషితం చేయగల శక్తి ఆ నలుసంత కణాలకు ఉంది. సాగర ఉపరితలాలలోను, సాగర తీరాలలోను తీవ్రస్థాయిలో ప్లాస్టిక్ తునకలు కేంద్రీకృతమవుతున్నాయి. సాగరాలే కాదు, నదులు కూడా సురక్షితంగా లేవు.పెద్ద పెద్ద సరస్సులు వరస కూడా అంతే. జలరాశిని కలుషితం చేస్తున్న వాటిలో ప్లాస్టిక్ కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తున్నది. ప్లాస్టిక్ కణాలు, ఇంకా మైక్రోప్లాస్టిక్ అదేదో ప్రత్యేక సృష్టి కాదు. పెద్ద పెద్ద ప్లాస్టిక్ ముక్కల నుంచి వచ్చినవే. ప్లాస్టిక్‌ను పడేసిన తరువాత అది మట్టిలో భాగం కాదు. ముక్కులు ముక్కలుగా విడిపోతుంది. ఔషధాల కోసం, సౌందర్యపోషకాల కోసం, టూత్ పేస్టులు ఇవన్నీ ప్లాస్టిక్ కణాలకు జన్మనిచ్చేవే. మైక్రోప్లాస్టిక్ లేదా మైక్రోబీడ్స్ అని కూడా వీటిని పిలుస్తున్నారు. కానీ ఈ బెడద ఐదు దశాబ్దాల క్రితమే ఆరంభమైందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం చెబుతోంది. కానీ నేటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్లాస్టిక్ కణాలు, తునకలు, అణువుల వల్ల మనిషికి పెద్ద ఎత్తున చేటు జరగదని, దాని గురించి తీవ్రంగా భయపడవలసిన అవసరం లేదనే అభిప్రాయపడుతోంది. ఇది నిజంగా వింతే. ప్లాస్టిక్ చెత్తాచెదారం వల్ల బీచ్‌లలోను, నదులలోను ప్లాస్టిక్ తునకలు చేరుతున్నాయి. ఆ విధంగా ఆ జలరాశులకు అదొక శాశ్వత బెడదగా తయారయింది. ఇప్పుడు జలరాశి నుంచి ఈ తునకలు వేరు చేయడం గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ సీసాలు, పాలిథిన్ సంచులు జలరాశికి అతి పెద్ద బెడదగా తయారైన సంగతి ఇప్పటికే రుజువైంది. వీటిని ప్లాస్టిక్ చెత్తగా చెబుతారు. కానీ దాని తునకలు లేదా కణాలు జలరాశికి మరింత ముప్పు తెచ్చి పెడుతున్నాయి. ఇవి సముద్ర జీవుల శరీరాలలోకి ప్రవేశించడం అనివార్యంగా జరుగు తుంది. దీనితో వాటికి ఊపరి సలపకపోవడం అనే స్థితి ఎదురవుతున్నది. లేదంటే చావు కూడా తప్పక పోవచ్చు. 2019లో జరిగిన ఒక అధ్యయనంలో చెప్పిన విషయం ఒకటి ఉంది. ప్లాస్టిక్ తునకల వల్ల సాగర ఉపరితలం మీద మైక్రోఅల్గే అనే పదార్థం ఏర్పడుతుంది.
మనకు తెలిసిన సంచులు, జగ్‌లు మాత్రమే ప్లాస్టిక్ వ్యర్థం అని అనుకోరాదు. మైక్రోప్లాస్టిక్‌ను రెండు విభాగాలుగా చెబుతారు. మొదటివి అవసరార్థ ఉత్పత్తి చేసుకున్నవి. వీటిని వాణిజ్య లేదా పారిశ్రామిక ఉత్పత్తులని కూడా అంటారు. అంటే రంగులు, మైక్రోబీడ్స్, శుభ్రం చేసే పరికరాలు, సౌందర్య పోషకాలు. రెండో రకం కణాలుగా, తునకలుగా మారి, చిరకాలం శిథిలం కాకుండా ఉండిపోయే వ్యర్థాలు. ఇవి తక్కువ బరువు ఉండడం వల్ల గాలిలో కూడా ప్రయాణిస్తాయి. అలా భూమి అంతటా, జలరాశిని చేరుకుంటున్నాయి. కాబట్టి ఇదొక విశ్వవ్యాప్త పర్యావరణ సమస్య. అలాగే మొత్తం ప్రజారోగ్యానికి సంబంధించినది కూడా. ఇక మనిషి శరీరంలోకి, లోపలి అంగాలల•కి చొచ్చుకు పోవడానికి కూడా అనేక మార్గాలు దీనికి ఉన్నాయి. చేపలను ఆహారంగా తీసుకునేవారితో పాటు, పళ్లు, కూరగాయలు తీసుకునేవారు కూడా వీటి బారిన పడతారు. టేబుల్ సాల్ట్, ప్యాకేజ్డ్ ఆహారం ద్వారా కూడా ఆ కణాలు మనిషిలో చాలా సులభంగా ప్రవేశిస్తాయి.
ప్లాస్టిక్ కణాలు లేదా తునకలు సాగర గర్భంలోకి వెళ్లి మరింత దట్టంగా గుమిగూడతాయి. ఇది కూడా అంత లోతున మాత్రమే సముద్రంలో నివసించే జీవరాశికి ముప్పుగా మారుతోంది. వేటలో దొరికిన చాలా రకాల చేపలలో, తాబేళ్లలో ప్లాస్టిక్ కణాలు విరివిగా ఉంటున్నాయి. అవన్నీ నీటి ద్వారానే ఆ కణాలను తమలోకి తీసుకుంటున్నాయని వేరే చెప్పక్కరలేదు. ఈ జీవులు ప్లాస్టిక్‌ను కడుపులోకి తీసుకుంటున్నాయి. లేదా ప్లాస్టిక్ వలలు వంటి వాటిలో చిక్కుకుంటున్నాయి. ఏదైనా వాటి చావుకే. కొందరు ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వాటిని మనలో చాలామంది చూసే ఉంటాం. పెద్ద పెద్ద సముద్ర తాబేళ్లు, ఇతర భారీ చేప జాతుల కళేబరాలు గట్టుకు కొట్టుకు వచ్చినప్పుడు వాటి ఉదరాలు కిలోల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంటున్నాయి. సముద్రంలో కొన్నిచోట్ల చెత్త దిబ్బలు పేరుకుపోయాయని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఎక్కువ సముద్ర ఉత్పత్తులకు సంబంధించినదే అయినా, ప్లాస్టిక్ వాటా కూడా చిన్నదేమీ కాదు. వీటిని వెంటనే గుర్తించడం కూడా సాధ్యంకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ త్వరగా శిథిలం కాదు. పైగా ముక్కలుగా, తునకలుగా, కణాలుగా విడిపోతూ ఉంటుంది. అదే మైక్రోప్లాస్టిక్, మైక్రోస్కోపిక్ నానోప్లాస్టిక్.
రోజువారీ ఆహారంలో చేపలు వగైరా తీసుకునే వారికి ఇవన్నీ పట్టవు. అయినా ఆ కణాలు మనిషికి కూడా పెద్ద ఎత్తునే చేటు చేయగలవు. ఆ చేటు ఎంతగా ఉంటుందో అంచనాకు కూడా అందదు. గత పరిశోధనలు వెల్లడించిన దానికంటే, ఊహిస్తున్న దాని కంటే ఎక్కువే ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. మనిషికి ఈ కణాలు చేసే చేటును రెండు విధాలుగా చెబుతున్నారు. ఒకటి భౌతికమైనవి, రెండు రసాయనిక ప్రభావం కోణం లోనివి. మనిషి తీసుకుంటున్న ఏ ఇతర విషపదార్థం కంటే కూడా అది తక్కువ కాదు. ఇటీవల జరిగిన విస్తృత పరిశోధన ప్రకారం మనిషిలో కూడా ప్లాస్టిక్ కణాలు అధికంగానే ఉన్నాయి. జీర్ణకోశానికి సంబంధించిన భాగాలలో, రక్తంలో, ఆఖరికి గర్భస్థ శిశువును కప్పి ఉంచే మాయ (ప్లసంటా)లో కూడా ప్లాస్టిక్ కణాల జాడ ఉంది. ఇదెలా సాధ్యం? ప్లాస్టిక్ తునక మైక్రాన్ కంటే చిన్నదిగా ఉంటుంది. అందుకే రక్తకణాలలోకి, కండరాలలోకి చొరబడగలదు. పైగా ఇప్పుడు మనిషి శరీరంలోకి నిరంతరం వెళుతున్న ప్లాస్టిక్ కణాల వల్ల ప్రమాదం మరింత ఎక్కువగానే ఉంటుంది. అయినా అవి శరీరంలోకి చేరడం వల్ల వెనువెంటనే ప్రమాదం ఏమీ ఉండదని ప్రస్తుతానికి నమ్ము తున్నారు. అయితే అది దీర్ఘకాలిక సమస్య. కొందరిలో హృద్రోగ రూపంలో తరువాత ఎప్పుడో బయటపడ వచ్చు. ఇంకొందరిలో కంతులు తయారై అంతిమంగా అవి కేన్సర్ అని తేలవచ్చు. ప్లాస్టిక్ కణాలలో ఉండే పదార్థాలు అంత ప్రమాదకరమైనవి.
కొద్దికాలం క్రితం వరకు కూడా ప్లాస్టిక్ కొద్దికాలం క్రితం వరకు కూడా ప్లాస్టిక్ అణువులు, వాటితో వచ్చే ఆరోగ్య సమస్య, అందులోని వాస్తవాల గురించి మానవాళి తీవ్రంగా పరిగణించలేదు. ఇప్పుడు మైక్రోప్లాస్టిక్స్‌తో మానవాళి ఆరోగ్యానికి ముప్పు ఉందని నిర్ధారణకు వచ్చారు. నెదర్లాండ్స్‌లోని వ్రిజే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డిక్ వెట్‌హాక్ పరిశోధనల ప్రకారం మానవ శరీరం నుంచి తీసుకున్న నమూనాల ప్రకారం 80 శాతం రక్తం ప్లాస్టిక్ కణాలతో కలుషితమయింది. ఇది మార్చి, 2022న వెలువడిన నివేదిక. ఈ పరి శోధన ప్రకారం ప్లాస్టిక్ కణాలు శరీరమంతా ప్రయా ణించడమే కాదు, లోపలి భాగాలలో స్థిరంగా ఉండి పోగలవు కూడా. అయితే వాటితో ఫలానా రోగం వస్తుందని, దాని తీవ్రత ఇంత అని ఇదమిత్థంగా శాస్త్రవేత్తలు ఏమీ చెప్పడం లేదు.కానీ శరీరంలోని కణాలకు వాటివల్ల చేటే జరుగుతుందని చెప్పగలుగు తున్నారు.
ప్లాస్టిక్ ద్వారా మానవాళికి జరుగుతున్న ముప్పు గురించి ఇప్పటికే ప్రపంచానికి తెలుసు. అందులో కీలకమైన అంశం అది మట్టిలో కూడా కలవదు. కొన్ని వందల ఏళ్లు అలాగే ఉండిపోతుందని తేలింది. కాబట్టి ఆ ప్రమాదం విస్తృతి ఇప్పుడు మొత్తం ప్రకృతి మీద ఎంత ఉన్నది అన్న వాస్తవాన్ని ఆకళింపు చేసుకోవాలి. దానిని నిరోధించే క్రమాన్ని తెలుసు కోవాలి. ఇందులో మొదటి మెట్టుగా వీటిని ఆచరిం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్లాస్టిక్‌ను పూర్తిగా వినియోగించకపోవడం. అలాగే నైలాన్, పాలిథీన్, పాలిస్టర్ లతో తయారు చేసిన వస్తువులను కూడా వాడకుండా నిరోధించడం. ప్లాస్టిక్‌తో సంబంధం ఉండే సౌందర్య పోషకాల వాడకం ఆపాలి. అయితే రీసైకిల్ చేయడానికి వీలైన ప్లాస్టిక్‌ను ఉపయోగించేందుకు జనాన్ని ప్రోత్స హించాలి. ప్లాస్టిక్ వస్తువులను సముద్ర తీరాలలో, సముద్రాలలో పడేసే పాడు అలవాటును మానుకో వాలి. ప్లాస్టిక్ ఉపయోగం నుంచి జనం మళ్లడానికి మార్గాలు వెతకాలి. విధానాలు రూపొందించాలి. చిన్న వస్తువుకు పెద్ద ప్యాకింగ్ చేయడం, అందుకు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం మానుకోవాలి.
మళ్లీ వెర్సోవా బీచ్ దగ్గరకు వద్దాం. మనిషీ! నీవు విసిరేసిన వ్యర్థాలు మళ్లీ నీకే ఇస్తున్నాను, తీసుకో అని చెప్పినట్టు లేదా ఆ దృశ్యం! ఒక తివాచీ మాదిరిగా సాగరతీరం ప్లాస్టిక్ వ్యర్థాలతో కప్పుకు పోయిందంటే మరొక రకంగా ఎలా ఆలోచించాలి. తనని ధ్వంసం చేస్తున్న మనిషికి అది ప్రకృతి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనిపించడం లేదా? మనిషి సముద్రంలో పారేసిన, భూమిలో పాతేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు వేర్వేరు మార్గాలలో మళ్లీ మనిషికే చేరుతున్నాయి. అందుకే వెర్సోవా పరిణామాన్ని ప్రకృతికి మనిషికి చెప్పిన గుణపాఠంగా తీసుకుంటే మంచిదే. మనం పారేసిన వ్యర్థాలను బిపర్‌జాయ్ గట్టుకు తిరగకొట్టి ఒక తివాచీ మాదిరిగానే పరిచింది. ఈ కాలుష్యం ఇంకాస్త ఎక్కువైతే తివాచీ కాదు, ఆ వ్యర్ధాలతో ఒక సునా మీయే ప్రపంచాన్ని తాకదని హామీ ఏమిటి?
అక్కడ గంటకు 25 లక్షల ప్లాస్టిక్ సీసాలు ఉపయోగిస్తున్నారు
మైక్రోప్లాస్టిక్ బెడద కొత్తది కాదు. కానీ అదొక ముంచుకొస్తున్న పెను ప్రమాదమని కాస్త ఆలస్యంగా ఇటీవల కాలంలో గుర్తించారు. నిజానికి చాలా ఆలస్యంగా మానవాళి మేలుకుంటున్నది. సాధారణ పరిస్థితులలో కాకుండా గట్టిగా వాన పడినప్పుడు ఒక నది ఒడ్డునో, లేదా సాగరతీరంలోనో నిలబడితే ఈ ప్లాస్టిక్ తునకల బెడద ఎంత తీవ్రంగా ఉన్నదో అర్ధమవుతుంది. ప్లాస్టిక్ సీసాలు, పాల జగ్‌లు, ఆహార పదార్థాల మీద చుట్టే ప్లాస్టిక్ కాగితాలు, సంచులు, రబ్బరు బంతులు ఎన్నో కొట్టుకు వచ్చి నీళ్లలో కలుస్తుంటాయి. మనం చూస్తున్నది ఉపయోగించుకో- తరువాత విసిరిపారెయ్ అన్న దృక్పథం కలిగిన సమాజం. ఇది ప్రపంచ పరిణామం. అమెరికాలో గంటకు 25 లక్షల ప్లాస్టిక్ సీసాలు ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక వారంలో ఉపయోగించే ప్లాస్టిక్ సంచులు పది బిలియన్‌లని టెన్నెసీ విశ్వవిద్యాలయం చేసిన ఒక సర్వే చెబుతోంది. ఏటా ఎనభయ్ లక్షల మెట్రిక్ టన్నుల పారేసిన ప్లాస్టిక్ మొత్తం వచ్చి సాగరాలలో చేరుతోంది. ఈ లెక్క నేషనల్ ఓషనిక్ అండ్ ఎట్‌మాస్‌ఫియర్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఇచ్చినది. చెత్త లేదా వ్యర్థాల పేరుతో పారేసిన ప్లాస్టిక్ మట్టిలోకి, జలరాశిలోకి చేరుకుంటున్నది. ఇదంతా చెత్త నిర్వహణ పట్ల అశ్రద్ధ లేదా అసమర్ధత, వరద నీటిని క్రమబద్ధం చేయలేకపోవడం, చేపల పడవలు, ఇతర నౌకలు ద్వారా చేరుతోంది.
ఎక్కడ చూసినా అదే
పెను ప్రమాదం లేకున్నా, ప్లాస్టిక్ కణాలు, తునకల ఉనికి నిజమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. తాగునీటిలో ప్లాస్టిక్ ఉనికితో వచ్చే ఆరోగ్య సమస్యల మీద సంస్థ ఒక సమీక్ష చేయించింది. ప్రపంచంలోనే పేరుగాంచిన కొన్ని సంస్థల నీళ్ల సీసాల మీద పరిశోధన తరువాతనే సంస్థ ఈ నిర్థారణకు వచ్చింది.వాటిలో 90 శాతం సీసాలలో ప్లాస్టిక్ తునకలు ఉన్నాయని ప్రకటించింది. కుళాయిల ద్వారా అందే నీటిలో కూడా ప్లాస్టిక్ జాడ ఉందని అంతకు ముందే రుజువైంది. ప్రపంచం నలుమూలలా తొమ్మిది దేశాలలో 19 ప్రాంతాల నుంచి 259 సీసాలను తెప్పించి వాటి మీద పరిశోధన చేశారు. అవి 11 బ్రాండ్‌లకు చెందినవి. అమెరికా, బ్రిటన్, చైనా, భారత్, ఇండోనేషియా, మెక్సికో, లెబనాన్, కెన్యా, థాయ్‌లాండ్‌ల నుంచి ఆ సీసాలను సేకరించారు. ప్రతి నీటి సీసాలోను సగటున 325 ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తేల్చారు. నెస్లే ప్యూర్ లైఫ్ బ్రాండ్ సీసాలో అత్యధికంగా 10,000 కణాలు ఉన్నట్టు కనుగొన్నారు. 259 సీసాలలో 17 సీసాలలోని నీరు మాత్రమే ప్లాస్టిక్ రహితంగా ఉంది. అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఆర్బ్ మీడియా ఇందులో పాల్గొన్నాయి. వీటిలో సర్వసాధారణంగా కనిపించిన ప్లాస్టిక్ రకం పోలీప్రోపిలీన్‌కు సంబంధించినది. ఈ రకం ప్లాస్టిక్‌తోనే నీళ్ల సీసాల మూతలు తయారు చేస్తారు.
నమ్మలేని నిజాలు
ఆర్బ్ మీడియా సేకరించిన వివరాల ప్రకారం ప్రపంచంలోని ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో వినియోగిస్తున్న నీటిలో ప్లాస్టిక్ ఫైబర్స్ అనే పదార్థం ఉంది. ఆ ప్రాంతాల నుంచి తెచ్చిన 83 శాతం నీటిలో ఆ పదార్థం ఉంది.
కారు టైర్ల నుంచి కూడా మైక్రోప్లాస్టిక్ విడుదలవుతుంది. రోడ్డుకీ, టైరుకీ మధ్య రాపిడి జరిగినప్పుడు ప్లాస్టిక్ ధూళి వెలువడుతుంది. అదే గాలి ద్వారా నీళ్లలోకి చేరుతోంది. కారు టైర్లు ప్రతి 100 కిలోమీటర్లకు 20 గ్రాముల వంతున ప్లాస్టిక్ దస్ట్‌ను వదిలిపెడతాయి.
కొందరు మాత్రమే ధరించే ఫ్లీస్ జాకెట్‌ను ఉతికిన ప్రతిసారి 2,50,000 మైక్రోఫైబర్స్ విడుదలవుతాయి.
సముద్రం మీద నుంచి భూమి మీదకి..
సముద్రంలో నీళ్ల సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు దిబ్బల్లా నిలబడి ఉన్నాయని మొదట కనిపెట్టినవాడు చార్లెస్ మూర్. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఆ దిబ్బల పేరే గ్రేట్ పసిఫిక్ గార్బెజ్ ప్యాచ్ అని స్థిరపడింది. ఇతడు 1997లో కాటామారన్ (పెద్ద పడవ) మీద హవాయ్ నుంచి కాలిఫోర్నియాకు వెళుతుంటే ఉత్తర పసిఫిక్ సముద్రంలో అలాంటి వాటి జాడ కనుగొన్నాడు. అది ప్లాస్టిక్ నీళ్ల సీసాలు, ప్లాస్టిక్ వలలు, విరిగిన ప్లాస్టిక్ వస్తువుల గుట్ట. అయితే ఇది యురేకా అనవలసిన సమయం కాదన్నారాయన. అప్పటికే ఇలాంటి పరిస్థితి ఉండి ఉంటుందని ఒక అంచనా ఉంది. తన అనుభవాల మీద ఆయన ప్లాస్టిక్ ఓషన్ పేరుతో ఒక పుస్తకం రాశారు. రెండేళ్ల తరువాత మళ్లీ శాస్త్రవేత్తల బృందంతో అక్కడికి వచ్చి పరిశోధనల కోసం నీటిని తీసుకుని వెళ్లారాయన. ఆ తరువాత ఆ అంశం మీద పరిశోధనలు పదునెక్కాయి. గతంలో చేసిన పరిశోధనలలో వచ్చిన ఫలితాల తాజా ఫలితాల ముందు వెలవెలబోయాయి. సముద్రం మీద నుంచి భూమి మీదకు వచ్చే గాలితో ప్లాస్టిక్ తునకలు భూమికి చేరాయని కూడా పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. మూర్ అధ్యయనం ప్రకారం పసిఫిక్ మహా సముద్రంలో 5.25 ట్రిలియన్ ప్లాస్టిక్ తునకలు ఉండవచ్చు. వాటి బరువు 2,50,000 టన్నులు. కానీ 2014లో తన అంచనాతో తనే మూర్ విభేదించారు. వాటి సంఖ్య నిస్సందేహంగా ఇంకా ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. ప్లిమత్ మెరైన్ లెబోరేటరీ ఆయన కొత్త అంచనాను సమర్ధించింది కూడా.
– జాగృతి డెస్క్