డా।। కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

హైదరాబాద్‌ ‌సంస్థానంలో ఉద్యమ తీవ్రత పెరిగింది. అదే స్థాయిలో రజాకారుల దౌర్జన్యాలూ పెచ్చుమీరాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకై పోరాడిన ప్రజలపై మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ‌ముస్లిమీన్‌ అం‌డదండలతో నిజాం దమనకాండ సాగింది. గత్యంతరంలేని విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష చర్యకు పూనుకోవలసి వచ్చింది. పోరాట దళాలు, సరిహద్దు శిబిరాలు ఏర్పాట య్యాయి. ఆర్య సమాజనేతలు వినాయక రావు, బస్సీలాల్‌జీ వ్యాస్‌, ‌బి.కిషన్‌లాల్‌ ‌వంటివారు ఆయుధాలు సేకరించి ఆత్మ రక్షణార్థం ప్రజలకు ఇవ్వాల్సి వచ్చింది. అనితర సాధ్యమైన త్యాగాలు చేసిన మన స్వాతంత్య్ర యోధుల కల సాకారమయ్యే తరుణం ఆసన్నమైంది. జూన్‌ 3, 1947‌న బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆగస్టు 15, 1947 కల్లా భారతీయులకు అధికార బదలీ జరుగుతుందన్నదే దాని సారాంశం.

అయితే, భారత్‌లోని సుమారు 565 సంస్థానాలు భారత్‌లో కాని, పాకిస్తాన్‌లోకాని చేర వచ్చని; రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యునికేషన్లకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంటే సరి పోతుందనీ, తతిమ్మా విషయాల్లో స్వతంత్రంగా కూడా ఉండవచ్చునని మౌంట్‌బాటన్‌ ఒక దుర్మార్గపు మెలిక పెట్టాడు. ఈ ప్రకటనను సాకుగా తీసుకుని నిజాం భారత్‌ ‌యూనియన్‌లో చేర నిరాకరించాడు. ఆగస్టు 27,1947న ఒక ఫర్మానా జారీ చేశాడు. ‘భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత తలెత్తిన సమస్యల పట్ల నా వైఖరిని జూన్‌, 1947‌లో విడుదల చేసిన నా ఫర్మానాలోనూ, ఆగస్టు 14,1947న నేను చేసిన ప్రసంగంలోనూ వెల్లడించాను. నా సంస్థా నానికి సంబంధించినంతవరకు బ్రిటిష్‌వారు వైదొలగడంతోనే నేను స్వతంత్రుడనవుతాను. ఆ విధంగానే ఆగస్టు, 15,1947నే ఆ స్వయంప్రతిపత్తి నాకు వచ్చింది’ అని పేర్కొన్నాడు.

1947 ప్రారంభంలో మహమ్మదాలీ జిన్నా హైదరాబాదులో ప్రసంగిస్తూ, ‘కోడి మెడను విరిచినట్లుగా హిందువుల మెడలను విరిచేస్తాం. ముల్లంగి కాడల్లా తుంచేస్తాం’ అని రెచ్చగొడుతూ మాట్లాడాడు. ఒక రాజ్యం సాధించడానికి జిన్నా మతాన్ని ఆశ్రయించాడు. ఉన్న సంస్థానాన్ని రక్షించుకోవడానికి నిజాం నవాబు కూడా మతాన్ని ఆశ్రయించాడు. తన పాత ‘అనల్‌ ‌మాలిక్‌’ ‌సిద్ధాంతానికి మెరుగులు దిద్దాడు.

రజాకార్‌ ‌నాయకుడు ఖాశిం రజ్వీ క్రూరుడు, నీచుడు, మత దురహంకారి. అతని సభలకు వేలమంది వచ్చి గంటల తరబడి వినేవారు. ‘అతడి భాషా ప్రయోగం అత్యంత రమణీయం’ అని దాశరథి కూడా ఒప్పుకున్నారు. ‘లాల్‌ ‌ఖిలేపర్‌ అసఫ్‌జాహీ జండా లహెరాయెగా. ఔర్‌ ‌హమారీ తల్వారే మభీ బందర్‌కే ఖలీజె బంగాల్‌మే దోయెంగె’ (లాల్‌ఖిలా మీద అసఫ్‌జాహీ పతాకం రెపరెపలాడుతుంది. మన కరవాలాలు బందర్‌ ‌బంగాళాఖాతంలో కడుగుతాం). రజ్వీ ఉపన్యాసాలు ఉర్దూలో చదవడానికి ‘రహన్మా-ఏ-దక్కన్‌’ ‌దినపత్రిక తెప్పించుకునేవారు కొందరు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎదురైన పెద్ద సమస్య హైదరాబాద్‌ ‌సంస్థానం. పెద్ద బెడద నిజాం నవాబు. ఇతడు కొంప కాలేటప్పుడు వాసం పీక్కోవాలనుకున్నాడు. మరిన్ని సమస్యలు సృష్టించాడు. భారత ప్రభుత్వమనే మత్తగజం చెవిలో నిజాం మశకం దూరి బాధించింది.

నిజాం నవాబు సైన్యాలు పెరుగుతున్నాయని పుకార్లు బయలుదేరాయి. పాకిస్తాన్‌ ‌నుంచి అయిదు లక్షల మందిని నిజాం నియమించుకున్నాడని మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాని రెడ్డియార్‌ ‌ప్రకటించాడు. నిజాంసేన దాడి చేస్తే తన రాష్ట్రానికే ప్రమాదం వాటిల్ల వచ్చునని భయపడ్డాడు. దొంగచాటుగా సిడ్నీ కాటన్‌ ఆయుధాలు చేరవేస్తున్నాడు. వీటన్నింటితో భీతావహ వాతావరణం ఏర్పడింది. వీటన్నింటి దృష్ట్యా 1948 జనవరిలోనే సైన్యాన్ని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ‘హైదరాబాదు సైన్యాలు భారతదేశం మీద దండెత్తే వీలు లేకుండా చూడాలి. అందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి’ అని జనవరి 20, 1948న సైనిక ప్రధాన కార్యాలయం సదరన్‌ ‌కమాండ్‌ను ఆదేశించింది. హైదరాబాదు సైన్యానికి దాడి చేసేశక్తి లేదని సదరన్‌ ‌కమాండ్‌ ‌నివేదిక ఇచ్చింది.ఈ ప్రణాళికకు ‘పోలో’ అని (1948 ఫిబ్రవరిలో) పేరు పెట్టారు. హైదరాబాద్‌ ‌పోలో ఆటకు ప్రసిద్ధి. అందుకే ఆ పేరు ఖరారు చేశారు.

ఆపరేషన్‌ ‌పోలో సన్నాహాలు పూర్తి అయినాయి. ఏప్రిల్‌ 6, 1948‌న జనరల్‌ అటల్‌ అం‌చనా ప్రకారం సైన్యం రోజుకు 30 మైళ్లు పురోగమించగలదు. నిజాం వైపు నుండి గట్టి ప్రతిఘటన ఉన్నా ఆ పురోగమనం సాధ్యమే. షోలాపూర్‌ -‌హైదరాబాద్‌ ‌మధ్య దూరం 186 మైళ్లు. చొచ్చుకుపోవడానికి 15 రోజులు పడుతుంది. పోలో వ్యూహాన్ని గవర్నర్‌ ‌జనరల్‌కు సైతం తెలియనంత రహస్యంగా ఉంచారు. తన పదవీకాలంలో హైదరాబాద్‌ ‌మీద సాయుధ చర్య తీసుకోబోమని గవర్నర్‌ ‌జనరల్‌కు నెహ్రూ మాట ఇచ్చారు కాబట్టి మౌంట్‌బాటన్‌ ఉం‌డగా సైనిక చర్య సాధ్యపడదు. అందుకే జూలై చివరికి ప్రణాళిక సిద్ధమయింది. 22 వేల మంది సైన్యానికి 22 రోజులు సరిపడా ఆహారం సిద్ధంచేసి మేజర్‌ ‌జనరల్‌ ‌జయంత్‌నాథ్‌ ‌చౌదరి సైనిక చర్య నిర్వహణకు నియమించారు. అయితే ఒక చిక్కు వచ్చిపడింది. గూఢాచారి దళం పటిష్టంగా లేదు. ఆ లోటును కె.ఎమ్‌.‌మున్షీ సుగమం చేశాడు. ఆయన హైదరాబాద్‌ ‌సైన్యంలోని ఓ అధికారిని లోబరచుకొని సైనిక వివరాలు రాబట్టగలిగాడు. దానితో జె.ఎన్‌.‌చౌదరికి హైదరాబాదును సునాయాసంగా జయించగలమనే నమ్మకం కలిగింది.

 భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబరు 12,1948 అర్థరాత్రి దాడి ప్రారంభమైంది. సిక్కుసేన 13 సెప్టెంబర్‌ ఉదయానికి ‘జల్కోట’ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది. సాయంత్రానికి 61 మైళ్లు లోపలికి చొచ్చుకువచ్చి ‘ఉమర్‌గా’ను పట్టుకున్నారు. తూర్పున గూర్ఖాసైన్యం 13 ఉదయం దాడి ప్రారంభించి ‘మునగాల’ను సునాయాసంగా ఆక్రమించింది. దక్షిణంలో రాయచూర్‌ ‌ప్రాంతంలో తుంగభద్ర వంతెన ఆక్రమించుకుని ‘జింగెరా’ చేరుకున్నారు. ఉత్తరంలో మాత్రం రజాకార్లు మిడతల దండులా భారత సైన్యం మీద పడ్డారు. అయినా సాయంత్రానికి భారతసైన్యం ‘హింగోలీ’ చేరుకుంది.

హైదరాబాద్‌ ‌వాయుదళం పటిష్టమైనదన్న ఊహను భగ్నం చేస్తూ, తొలి కొన్ని గంటలలోనే గగనతలం వశపరుచుకున్నారు. మహా వాయుదళా నికి వరంగల్‌లో ఒకటి, బీదర్‌లో రెండు విమానాలు న్నాయి. సిడ్నీ కాటన్‌ ‌తెచ్చిన విమాన విధ్వంసానికి డ్రైవర్‌ ‌లేడు. ప్రజలు నిద్రలేవక ముందే వాయుసేన లొంగిపోయింది.

మేజర్‌ ‌ప్రెడ్డీప్రీ మాంటల్‌ ‌నాయకత్వంలోని జాల్నా ఔరంగాబాద్‌ ‌సెక్టర్‌లో నిరాటంకంగా గూర్ఖాసేన సాగిపోతుండగా, తోవలో ఓ గ్రామంలోని దుస్థితి ఆయన కంటపడింది. పూరిళ్లు, మట్టిమిద్దెలు, ఆకలితో ఉన్న జనం, ముక్కు కారుతున్న పిల్లలు కనిపించారు. అతనికి జాలి కలిగింది. తుపాకీ పక్కన పెట్టి గ్రామసేవ, సమాజసేవ ప్రారంభించాడు. అప్పటి నుండి దానిపేరు ‘‘ప్రెడ్డీనగర్‌’’ అయ్యింది.

నిజాం సైన్యాల ప్రధానాధికారి మేజర్‌ ‌జనరల్‌ ఎ‌డ్రోస్‌ను మున్షీ పిలిపించాడు. లొంగుబాటుకు సంబంధించిన పత్రం నిజాం దక్కన్‌ ‌రేడియోలో చదివి వినిపిం చాడు. నిజాం తన పదవీచ్యుత శాసనాన్ని తానే చదివాడు. సెప్టెంబరు 17, 1948న హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది.


చవుదరి చెవ్వు పట్టి గుంజ్కు పోయి పటేల్‌ ‌ముంగల నిలబెట్టిండు

సన్నాసాయన ఢిల్లీకి ఉరికిండు. సన్నాసాయన ఎవరయా అంటే రామానంద తీర్థ. మల్లగాయన ఢిల్లీకెందుకు ఉరికె? అరె ఎరకయిత లేదా? నైజామోడు మందిని నరకబట్టె – ఆడోళ్లను చెరచబట్టె -కొంపలు దోచబట్టె తగల పెట్టబట్టె-అవు ఎరకయి తాంది! ఢిల్లీల యాడికి పోయిండా మల్ల! యాడికి పోతాడే – పటేల్‌ ‌తానికి పోయిండు. ఓర్యవ్వ ఊళ్లల్లనీ తెల్వి దొంగల్తోల మన పటేళ్లు కారే-సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌! ఈ ‌కొత్త పటేల్‌ ‌యాడికెల్లొచ్చె? నీ యవ్వ నీ దిమాక్‌ ‌సరిగ్గా లేదు! వల్లభాయ్‌ ‌గారే కద. భారత సైనికులను నడిపిచ్చేటి మంత్రి. అట్లు చెప్పరాదు మల్ల పటేలంటే నాకు ఎర్కలేదు. సర్లే సన్నాసాయన పటేల్‌ ‌కాడికి పోయిండు. అటెన్క కథ చెప్పు.

సన్నాసాయన పోయేటార్కల్ల పటేల్‌ ‌పండి ఉన్నడు. ఏమన్నా భీమారేమో పాపం! ఎహే పటేలంటే ఉక్కు మనిషి. బీమార్‌ ‌గీమార్‌రేం లేదు. ఆరాం చేస్తాండు, పెద్దోండ్లు ఆరామ్‌ ‌చేయక పని చేస్తారే? చెప్పనిస్తవా అడ్డపుల్ల లేస్తుంటావా? ఎర్క లేక అడుగుతున్నా-కోపమెందు కయితవు జర సమ్జా యించి చెప్పు. సన్నాసాయన పటేల్‌కాడికి పోయిండు. పటేల్‌ ‌పన్నడు, అటెన్క కధ చెప్పు.

సన్నాసాయన పన్న పటేల్ను చూసిండు, మండి పడ్డడు. సన్నాసోడికి సతకోపం వస్తదా? మల్ల లగాయించినవ్‌! ‌నోర్మూస్తవా! అట్లెందుకంటవే ఎర్కలేక అడిగిన ఇడమర్చి చెప్పరాదు. ఇక అడగన్లే సన్నాసాయనకు కోపం వచ్చింది. అటెన్క కధ చెప్పు.

సన్నాసాయన పటేల్ను దులిపి పెట్టిండు. పటేలూరకున్నాడా?

 మల్ల అడ్డ మొస్తున్నావు. ఊరుకోక ఏం చేస్తాడు? ఈడ రాజ్యం తగల బడ్తాంది. ఆడనేమో ఆయన నిద్రపోతాండు. వచ్చినాయన సన్నాసాయన. శాపం పెడ్తాడేమోనని బుగులు పడ్డాడు.

గది పర్లేదే! ఏమని దులిపిందో చెప్పక పోతివి. చెప్పమంటావా? ఇను, ఆడ నైజామోడు రక్కసుడ యిండు. ఆడోల్లును చెరుస్తాండు, మునులను బంది స్తాండు, యాగ గుండాలల్లా సారా పోస్తాండు. కల్లు పోస్తాండు, నువ్వేమో ఆ సామి పామ్మీద పన్నట్టు పన్నవ్‌. ఏమనుకుంటున్నావ్‌ అన్నాడు. దోసిల్ల నీళ్లు పట్టిండు శపించెటంద్కు.  ఎర్క లేక అడుగత, ఇంక శపించే టోల్లున్నారె కలిఘ్రంల! మల్ల అడ్డు మోస్తున్నావ్‌, ‌చెపుతే ఇంటలేవు. అరె ఆయన తాన అన్ని శక్తులుండ బట్కె పటేల్ను గన్ని మాటలన్నాడు. ఇంకొకలకు అంత తడాక ఉంటాదా? సరె సన్నాసాయన దులిపిండయా – పటేలాయన ఏం చేసిండు?

పటేలాయన దిగ్గున లేచి కూచున్నాడు. కాల్పొక్త కొప్పడకుండి అన్నాడు. సన్నాసాయన్ను కూకుండ పెట్టిండు. ఇంతకు నన్నెం చేయమంటారు అనిడిగిండు. అంత గమ్మత్తుగున్నది. సన్నాసాయన దులుపుడు- పటేల్‌ ‌కాల్పట్టుకొనుడు. కోప్పడకే అన్న అటెన్క చెప్పు. సన్నాసాయన అన్నాడు, పటేల! ఇంక నన్నే అడుగుతవ్‌. ‌జల్ది చౌదరిని పిలిపిచ్చు. పట్నం పంపిచ్చు. నిజాంను పట్టి తెప్పిచ్చు. సన్నాసి హుకుం జారీ చేసిండు. నోర్మూసుకుంట ముంగలికత చెప్పు.

‘‘గట్లనే బాంచెన్‌’’ అన్నాడు పటేల్‌. ‌చవుదరిని పిలిపించాడు. చవుదరి బీడీ తాగుతున్నాడు, పారేసిండు, వచ్చిండు, చవుదరీ నీ డ్రస్సు యాడున్నది అంట అడిగిండు పటేల్‌. ‌చిలుకొయ్యకు తగిలించి వచ్చిన అంటన్నడు. చవుదరి జల్ది దిరీస్సేసుకుని రమ్మంట చవుదరిని పంపిండు.

 ఒక్క మాటడుగుత ఏమనుకోకన్న? అంత పటేల్‌ ‌ముంగలికి చవుదరి దిరస్స లేకుండా ఎట్లు వచ్చె? బీడీ తాక్కుంట ఎట్లకూకునే?

అన్న! నీ భేజల పెండ ఉన్నదే! పటేల్‌ ‌పండిండు గద! గందుకే చవుదరి దిరస్సు ఇడిచిండు- బీడీ తాగుతున్నాడు. ఇంకేమన్న అడిగెడిదుంటె గిప్పుడే అడుగు. అటెన్క చెప్ప. ఇప్పుడు ఎట్ల అడుగుతలేగని చవుదరి ముచ్చట చెప్పు.

చవుదరి దిరస్సు ఏసుకొని వచ్చిండు. పటేలుకు సలాం పెట్టిండు. నిక్కి నిల బడ్డడు, పటేల్‌ ‌చవుదరితోని అన్నాడు-చెప్పెడిది బాగా ఇను. దిమాగ్లా ఎక్కించుకో. తీర ఆడ్కిపోయి గప్లత్ల ఇంకొకన్ని పట్టుకొచ్చెవు! పీరన్‌ ‌హైదరాబాద్‌ ‌షోగా నైజామ్ము ఈడికి గుంజ్కరా. ఈడ ఉన్నట్లు రావెలె. మేము చాయ్‌ ‌తాగుతుంటాం. నీ యవ్వగా చవుదరి నా సోంటోడున్నట్లున్నాడు. ఇంతకు వానికి దిమాగ్‌కు ఎక్కిందంటావ్‌?

అరె నీ అఖల్ల మన్నువడ! చవుదర సామాన్నుడనుకున్నావా? పట్నం వచ్చిండు, నిజాంగల్ల పట్టిండు. వాడు ఉచ్చ పోసుకున్నాడు. చెప్పినట్టు ఇంటనన్నడు. అట్ల యితే ముంగల పోయి పైజమా బద్దాయించ్కరమ్మన్నడు. చవుదరి వాసన పట్టలేక పోయిండు.

నైజామోడేమన్నడు ఇన్నవ? చెప్పకనే పోతివి, ఎట్టింట! నైజామన్నడంటే నాకు ఒక్కటే పైజమున్నది. ఇట్లనే వస్తనన్నడు! ఓర్యవ్వవీన్ని ఇట్లెట్ల పట్క పోదును అంట పాత పైజమా తెప్పిచ్చిచ్చిండు చవుదరి.

చవుదరి పదహారు బండ్లు కట్టిండు, ఎనక బండిలో నైజామును కూకుండ బెట్టిండు. చవుదరి ముంగలి బండ్ల కూకున్నాడు, అంతదూరం గంటె నిజామోడు పారిపోకుండటడా అని. మల్ల ఏం చేస్తడయ్యాగా నిజామోని షేర్వాణీ వాసన పట్టలేకపోయింది. గదేంటే గమ్మతు గంటవు. గంత వాసనుంటాదే! నీ యవ్వ నీకేమెర్క. వాడు గద్దె కెక్కిన్నాడు తొడిగిండు, ఇడ్వలేదు. ఉత్కలేదు సరెగని నిజామోడు డిల్లీ చేరెనే. చవుదరి చెవ్వు పట్టి గుంజ్కు పోయి పటేల్‌ ‌ముంగల నిలబెట్టాడు. నిజామోడు పటేల్‌ను చూచిండు రొండు మూసుకున్నాడు. చలిజరం వచ్చినట్లు వణికిండు నిలబడ్డాడు.

‘‘ఏమ్రా! ఏమో నఖ్రాలు చేస్తున్నవట’’ అన్నాడు పటేల్‌ అట్ల వంగనే నిజాం పటేల్‌ ‌కాల్ల మీద పడ్డాడు. బాంచెను, కాల్మొక్త – గులాపొన్నయిత మానం పోయింది, పానం దక్కించు’’ అని బతిమాలాడిండు.

అరె భడివే మేం కూరగాయలు తినేటోల్లం, నిన్ను చంపి ఏం చేస్తం బేగీ చవుదరి చెప్పినట్లు ఇనుకో. నువ్వు డిల్లీలవద్ద, లత్తు కొడ్తది. పట్నం పొమ్మన్నడు చవుదరి ‘‘తిరంగ’’ అందించాడు చార్మ్‌నార్‌ ‌మీద ఎగరెయ్యమన్నడు. పంపించిండు.

ఇంతకు నిజామోన్ని ఏం చేసెనో చెప్పక పోతివి. గది ఎర్కలేకనే చవుదరి మల్ల పటేల్‌ ‌తానికి వచ్చిండు. సలాం పెట్టిండు అడిగిండు.

‘‘భాడ్‌ఖావ్‌ ‌గాన్ని గద్దె మీద కూకుండపెట్టు మెసిల్తే నీతో చెప్పు’’ అన్నాడు. పటేల్‌, ‌సన్యాసాయన ఇరగబడి నవ్విన్రనుకో!

అన్న కత బలె బాగా చెప్పినావ్‌, ‌కల్నీలు తాగుదం పా. అట్లనే నైజామోడు దిగిపాయె మల్ల మనం కల్లన్న తాగొద్దా?

నిజాం దాసోహం అన్నాడు.

అంతకు ముందే సేనలు లొంగాయి

లొంగి పోవలసిందని నిజాం ఫర్మాను జారీ చేశాడు.

అది అతని చరమ ఫర్మాను.


ఫకీరు ముందే చెప్పాడు తెలుసా?

అసఫ్‌ ‌జాహీ రాజవంశ స్థాపకుడు అసఫ్‌జాహీ ఖమ్రుద్దీన్‌ ‌నిజాం ఉల్‌ ‌ముల్క్. ఔరంగాబాద్‌ను రాజధానిగా పరిపాలన ప్రారంభించాడు. కానీ మహారాష్ట్రులను ఎదుర్కోలేక రాజధానిని హైదరాబా దుకు మార్చుకున్నాడు. తన భుజబలం, బుద్ధిబలం, సామర్ధ్యంతో దక్కన్‌ ‌సామ్రాజ్యాన్ని నిర్మించాడు.

అయితే ఖమ్రుద్దీన్‌ ‌గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. అతడు ఒకసారి వేటకు వెళ్లాడు. అనేక జంతు వులను వేటాడాడు కానీ ఒక మృగం తప్పించుకుంది. దాని వెంటే పరిగెత్తాడు. తన శిబిరానికి దూర మయ్యాడు. డస్సిపోయాడు. దూరంగా ఓ కుటీరం కనిపించింది. అది ఒక ఫకీరుది. ఫకీరును నీళ్ల కోసం అర్థించాడు సమ్రాట్టు. ఖమ్రుద్దీన్‌ ‌నీళ్లు తాగి నీడలో కూర్చున్నాడు. ఆకలి మండిపోతుంది.

‘‘ఆకలిగా ఉందా నాయనా?’’ అడిగాడు ఫకీరు.

 ‘‘అవునన్నాడు, ఆకలి ముందు సామ్రాజ్యాలు ఎందుకూ కొరగావని అర్థమైంది. అన్నం పెట్టండి! బడా జాగీరు ఇస్తాను’’ అన్నాడు నవాబు.

‘‘ఆకలి ముందు సామ్రాజ్యాలు కొరగావన్నావు. ఒక జాగీరు ఇచ్చి అన్నం కొనాలనుకుంటున్నావు. మేము ఫకీరులం. అన్నం అమ్ముకోం, ఆకలి తీరుస్తాం, రొట్టెలు తెస్తాను, నిలువు’’ అని ఆ ఫకీరు ఒక పళ్లెంలో రొట్టెలు తెచ్చి ఖమ్రుద్దీన్‌ ‌కు ఒక్కొక్కటీ ఇచ్చాడు. ఆకలితో ఏడు రొట్టెలు తిన్నాడు. మరొకటి తినమని బలవంతం చేసినా ఖమ్రుద్దీన్‌ ‌తినలేక పోయాడు.

 అప్పుడు ఖమ్రుద్దీన్‌ ‌తాను సుల్తానుని తెలియపరిచాడు. కావలసింది కోరుకొమ్మన్నాడు.

 ‘‘ఇచ్చేవాడు భగవంతుడు నాయనా! నీకు సామ్రాజ్యాన్నిచ్చాడు. నాకు ఈ కుటీరాన్నిచ్చాడు. నాకు ఇంతవరకే అర్హత. ఇంతకుమించి కోరే అధికారం నాకు లేదు. నాయనా! అసఫ్‌జాహీ వంశం ఎంతకాలం ఏలుతుందని అనుకుంటున్నావు?’’ అడిగాడు ఫకీరు.

‘‘సూర్యచంద్రులున్నంత వరకూ’’ అన్నాడు సుల్తాన్‌.

‘‘‌పిచ్చివాడా! ఈ విశ్వంలో భగవంతుడు తప్ప ఏదీ శాశ్వతం కాదు. అసఫ్‌ ‌జాహీ వంశం ఏడుతరాలు మాత్రమే ఏలగలదు’’ అన్నాడు ఫకీరు.

‘‘జనాబ్‌! అలా అనకండి! నా వంశం కలకాలం నిలవాలని దీవించండి!’’.

‘‘వెర్రివాడా! నీవు ఏడు రొట్టెలే తిన్నావు! బలవంతం చేసినా మరొకటి తినకపోతివి. నీవు ఏడు తరాలు అడుక్కున్నావ్‌. ‌భగవంతుడు అంతే ఇచ్చాడు. తృప్తిపడు. వెళ్లిరా’’ అన్నాడు ఫకీరు.

About Author

By editor

Twitter
YOUTUBE