– డాక్టర్ పార్థసారథి చిరువోలు
ఇది కేవలం ఒక భవనం కాదు. ఆకృతి దాల్చిన స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నం. పురోగమించే భావి భారత్ కోసం తీర్మానాలను రచించే సమున్నత వేదిక. అభివృద్ధి చెందిన రేపటి భారతావనిని దర్శించే సభ. పార్లమెంట్ కొత్త భవనం పరాయి పాలన, వలస పాలనలకు తుది వాక్యం. అందుకే కొత్త భవనం జాతికి అంకితమైన ఈ మే 28 చరిత్రాత్మక దినం. ఇది వర్తమాన భారత రాజకీయ సంకల్పానికి గుర్తు. భారతీయుల దృఢశక్తికి నిదర్శనం. మన ప్రాచీన, ఆధునిక నిర్మాణ శైలుల కలయిక. మే 28 చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. సనాతన ధర్మం ఉట్టిపడేలా, అత్యాధునిక హంగులతో నిర్మించిన పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగి దేశ ప్రజలకు కొత్త దృష్టిని నింపింది.
‘కొత్త పార్లమెంటు భవనం ప్రతి భారతీయు డిని గర్వపడేలా చేస్తుంది: అందుకే ఈ వీడియోను చూసిన తర్వాత మీ భావాలను వీడియో ద్వారా షేర్ చేయండి’ అని ప్రారంభోత్సవానికి ముందే ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి మంచి స్పందన వచ్చింది.
విజయాలనే నమ్ముకుంటున్న వ్యక్తి మోదీ. విజయ సాధనకు తొలి మెట్టు విజయం మీద నమ్మకం కలిగి ఉండడమే అంటూ ఆయన ఈ సందర్భంగా ఇచ్చిన సందేశం కూడా ప్రజలను ఆలోచింపచేసింది. రెండవ భాగం కార్యక్రమంలో ఆయన ఎంపీలు, అతిథులు, ముఖ్యులను ఉద్దేశించి కొత్త భవనంలోనే అద్భుతంగా ప్రసంగించారు. దేశ ప్రగతిలో కొన్ని అంశాలు అజరామరంగా నిలుస్తాయంటూ ఆ ప్రసంగం ప్రారంభమైంది. ఇది కేవలం ఒక భవనం కాదు.. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని అభివర్ణించారు. స్వాతంత్య్ర వీరుల కలల సాకారానికి కొత్త భవనం వేదికగా నిలుస్తుందన్నారు. భారత్ కొత్త లక్ష్యాలను ఎంచుకుందని కొత్త ఆశలు.. కొంగొత్త లక్ష్యాలతో దేశం పురోగమిస్తోందన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశగా చూస్తోందని చెప్పారు. భారత్ ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి జనని అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేది ఎక్కడా ఆగిపోకూడదని, అది ముందుకెళ్తూనే ఉండాలని చెప్పారు. ఆజాదీ కా అమృతకాలం.. దేశానికి కొత్త దిశను నిర్దేశించే కాలం అని తెలిపారు.
కొత్త భారతావనికి ఆజాదీ కా అమృతకాలం మార్గం కావాలన్నారు. 21వ శతాబ్దంలో భారత్ ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు. దేశం బానిస వాసనలను వదిలిపెట్టి ముందుకెళ్తోందని అన్నారు. పాత పార్లమెంట్ భవనంలో అనేక ఇక్కట్లు ఎదురయ్యేవి.. కనీసం కూర్చోవడానికే కాదు.. సాంకేతికంగానూ అనేక సమస్యలు వచ్చేవని గుర్తు చేసుకున్నారు మోదీ.
నూతన పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించిన ప్రధాని మోదీ.. స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. భవనం మొదటిదశ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. లోక్‌ససభలో సెంగోల్‌ను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులను సత్కరించి వారికి జ్ఞాపికలు అందజేశారు.
కొత్త పార్లమెంట్ సిద్ధమైందని, ఇది ఆత్మనిర్భర్ భారత్‌కి ప్రతీకగా నిలుస్తుందని గతవారం లోక్‌సభ ఓ ప్రకటన చేసింది. ఈ నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 డిసెంబర్ 10వ తేదీన శంకుస్థాపన చేశారు. కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 2021 జనవరిలో నిర్మాణం మొదలైంది. అహ్మదా బాద్‌కి చెందిన హెచ్సీపీ డిజైన్ అండ్ ప్లానింగ్ అండ్ మేనేజిమెంటు దీనిని డిజైన్ చేసింది. ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ పక్కనే టాటా ప్రాజెక్ట్సు ఈ నిర్మాణాన్ని చేసింది.
పాత పార్లమెంట్‌లో లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 250 మంది కూర్చునేందుకు వీలుండేది. కొత్త పార్లమెంట్‌లో దాని సామర్థ్యాన్ని పెంచారు. 888 మంది లోక్‌సభలో, 300 మంది రాజ్యసభలో కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పాత భవనం డయామీటర్ 560 అడుగులు. అది కేవలం 24,281 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. ఇప్పుడీ విస్తీర్ణాన్ని భారీగా పెంచారు. ప్రస్తుత పార్లమెంట్‌లో సెంట్రల్ హాల్ ఉంది. ఇందులోనే సమావేశాలు జరిగేవి. కొత్త పార్లమెంట్‌లో లోక్‌సభ ఛాంబర్‌లోనే సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. కొత్త పార్లమెంటులో కార్పెట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఈ కార్యక్రమంలో 25 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన అన్నా డీఎంకే, అప్నాదళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన షిండే వర్గం, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలు ఇందులో భాగస్వాములయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘‘సువిశాల మైన, అద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా విభేదాలను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావాలి’’ అని జగన్ ట్వీట్ చేయటం వివాదా స్పదమైంది. ప్రతిపక్షాలన్నీ ఆయనపైన విరుచుకు పడ్డాయి. టీడీపీ అధినేత ఈ కార్యక్రమాన్ని స్వాగతిం చారు. మహానాడు కార్యక్రమాల వల్ల ఆయన వ్యక్తిగతంగా హాజరుకాకపోయినా, టీడీపీ తరపున కనకమేడల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్ తరఫున అభినందన సందేశం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లిఖితపూర్వక సందేశాన్ని కూడా ఇదే సందర్భంగా సభలో వినిపించారు.. భవనం ప్రధాన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, పారిశ్రామికవేత్త రతన్ టాటా, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించవలసిన సందర్భంలోనూ అవాకులు చెవాకులు పేలాయి. ప్రారంభోత్సవాన్ని రసాభాస చేయాలని కంకణం కట్టుకున్నట్టు వ్యవహరించిన విపక్షాలకు అడుగడు గునా అపకీర్తి, అపజయమే ఎదురయ్యాయి. వీరి వాదన వినకుండా కోర్టు ఛీకొట్టింది. సెంగోల్ గురించి చేసిన వాదనలు శుద్ధ తప్పని తేలింది. రాజకీ యాల్లో సిద్ధాంతపరంగా ఎన్ని విభేదా లయినా ఉండచ్చు. అంత మాత్రాన దేశ ప్రతిష్ఠను ఇనుమడించే ఇలాంటి కార్యక్ర మాన్ని బహిష్కరిస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ 20 రాజకీయ పక్షాలు పార్లమెంటు ప్రారంభోత్స వాన్ని బహిష్కరించటానికి కారణం ఉందా? పార్లమెంటు భవనం ప్రారంభోత్స వానికి తాము హాజరు కావడం లేదని 19 ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి. వాటితో పాటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఈ కార్య క్రమాన్ని బహిష్కరించింది. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అంతేగాక హిందుత్వ ప్రతిపాదకుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతికి ఈ కార్యక్రమాన్ని చేపట్టటానికి ఎంచుకోవటాన్ని తప్పుపట్టాయి. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. రాష్ట్రపతి ముర్ముని పూర్తిగా పక్కనపెట్టి, పార్లమెంట్‌ను ప్రారంభించాలని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఘోరమైన అవమానమని, ఇది ప్రజాస్వామ్యంపై చేస్తున్న ప్రత్యక్ష దాడి అంటూ పేర్కొంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడింది. ‘‘ఈ ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్ ప్రారంభోత్స వాన్ని బాయ్‌కాట్ చేశాయి. రేపు అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్నీ బైకాట్ చేస్తారా..?’’ అని అసోం సీఎం, హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. భారత పార్లమెంటు భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభోత్సవం చేయించక పోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సావర్కర్ జయంతి రోజున ఈ భవనాన్ని ప్రారంభించడమంటే అది జాతి నేతలను పూర్తిగా అగౌరవపరచడమేనని కాంగ్రెస్ విమర్శించింది. ఇదంతా ఒక గొప్ప త్యాగాన్ని అవహేళన చేయడమే. పార్లమెంటు భవనం అహంకారం అనే ఇటుకలతో నిర్మితం కాలేదని, రాజ్యాంగ విలువలతో నిర్మితమైందని రాహుల్ ట్వీట్ చేయడం వింతల్లోకెల్లా వింత కాదా! సావర్కర్ జయంతి రోజున పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించనుండడం గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్ తదితరులందరినీ విస్మరించడమేనని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అందించిన భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తవుతున్న నవంబర్ 26, 2023న ఈ కొత్త భవనాన్ని ప్రారంభిస్తే బాగుండేం దని, అలా కాకుండా సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే వ్యాఖ్యా నించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కచ్చి, రాష్ట్రీయ లోక్ దళ్, జనతాదళ్(యు), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్‌జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే మే 24న సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇవే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్క రిస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒక వీడియో విడుదల చేశారు. కొత్త భవనాన్ని శవపేటికలా ఉందంటూ అవినీతి గడ్డికి కేరాఫ్ వంటి ఆర్‌జేడీ పెట్టిన ట్వీట్‌ను దేశ ప్రజలు అక్షరాలా అసహ్యించుకున్నమాట నిజం.
విపక్షాల ప్రకటనపై బీజేపీ సహా ఎన్‌డీఏలోని 14 పార్టీలు స్పందించాయి. కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా విపక్షాలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను వదిలేస్తున్నాయని ఆరోపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి ఈ పార్టీలు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించి కార్యక్రమానికి హాజరు కావాలని ఆ ప్రకటనలో కోరాయి. బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ శిందే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమొక్రటిక్ పొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, జననాయక్ జనతా పార్టీ, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, అప్నాదళ్ (సోనేలాల్ వర్గం), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా-మహారాష్ట్ర, తమిళ్ మానిల కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, ఐఎంకేఎంకే, ఏజేఎస్‌యూ-ఝార్ఖండ్, మిజో నేషనల్ ఫ్రంట్‌లు ఈ మేరకు ప్రకటించాయి. బీఎస్పీ అధినేత మాయావతి కూడా కొత్త పార్లమెంటు ప్రారంభాన్ని స్వాగతించారు. తనకు ఆహ్వానం పంపినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు ముందే నిర్ణయమైన కొన్ని కార్యక్ర మాలలో పాల్గొనాల్సి ఉన్నందున తాను రాలేనని చెప్తూ అభినందనలు తెలిపారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అన్నింటికీ సుప్రీం కోర్టును అడ్డం పెట్టడం ఇటీవల ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. ఇప్పుడూ అదే అస్త్రం ప్రయోగించారు. కానీ అది దారుణంగా బెడిసికొట్టింది. కొత్త పార్లమెంట్‌ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్క రించింది. పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జయసుకీన్ అనే లాయర్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. దానితో పాటు ఇలాంటి పిటిషన్ వేసినందుకు అసహనం వ్యక్తం చేసింది ‘‘ఇలాంటి పిటిషన్ వేసినందుకు మేమెందుకు మీకు ఫైన్ వేయకూడదు..?’’ అని ప్రశ్నించింది.
‘‘రాజ్యాంగం ప్రకారం అధినేత రాష్ట్రపతి అవుతారు. అదే పరిపాలనా పరమైన విషయాల్లోకి వస్తే వాటికి చీఫ్ ప్రధాని మాత్రమే అవుతారు. ఇందులో విచారించాల్సినంత విషయం ఏమీ కనిపించడం లేదు. అందుకే పిటిషన్‌ని తిరస్కరి స్తున్నాం’’ అని స్పష్టంగా చెప్పింది. ఇది సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సిన విషయం కాదని స్పష్టం చేసింది. చిత్రం ఏమిటంటే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పు ఇచ్చినా ప్రారంభోత్సవం పూర్తయిన తరువాత కొందరు ప్రతిపక్ష నేతలు అదే వాదనను కొనసాగించారు.
మొత్తం మీద జాతి యావత్తూ గర్వపడేలా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం ముగిసింది. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఆయన కీర్తికిరీటంలో మరో కొత్త చేరికగా పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని పేర్కొని తీరాలి.
ఇక రెండోదశ ప్రారంభోత్సవంలో ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను, 35 గ్రాముల రూ.75 నాణాన్ని విడుదల చేశారు. దీన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమంతో తయారుచేశారు. ఇది 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది.
ఈ రూ.75 నాణేంకు ఒకవైపు మధ్యలో అశోక స్తూపంపై ఉన్న సింహాలు కనిపిస్తాయి.ఈ జాతీయ చిహ్నానికి ఇరువైపుల దేవనాగరి లిపిలో భారత్ అని, ఇంగ్లిష్‌లో ఇండియా అని ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంది. దీని కింద రూపాయి గుర్తుతో నాణెం విలువను సూచిస్తూ 75 సంఖ్యను ముద్రించారు. మరోవైపు పార్లమెంట్ భవనం ఉంటుంది. దాని ఎగువన దేవనాగరి లిపిలో ‘సన్‌సద్ సానుకూల్’ అని.. దిగువన ‘పార్లమెంట్ కాంప్లెక్స్’ అని ఆంగ్లంలో ముద్రించి ఉంటుంది. పార్లమెంట్ కాంప్లెక్స్ కింద 2023 అని రాసి ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఈ రూ.75 నాణాన్ని విడుదల చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వజ్రోత్సవాలను పురస్కరించుకొని కేంద్రం ఈ నాణాన్ని రూపొందించింది. సాధారణ కరెన్సీ నోట్లు, నాణాల మాదిరిగా ఈ స్మారక నాణాలు వినియోగం కోసం జారీ చేసినవి కావు. వీటిని వెండి తదితర లోహాలతో తయారు చేయడం వల్ల వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని కేవలం సేకరించడానికి తప్ప.. వినియోగానికి ఉపయోగించరు. మరోవైపు సాధారణ లోహంతో తయారు చేసిన స్మారక నాణాలు కొంతకాలం పాటు చలామణిలో ఉంటాయి.
2024లో మళ్లీ నరేంద్రమోదీనే ప్రధానిగా రావాలని మధురై అధీనం ప్రధాన పూజారి శ్రీ హరిహర దేశి స్వామి అన్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో సెంగోల్ (న్యాయ దండం)ను ప్రధానికి ఆయనే అందించారు. ఈ సందర్భంగా హరిహర దేశి స్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందిన నాయకుడని కొనియాడారు. ప్రపంచ నాయకులు మోదీని అభినందిస్తున్నందుకు అందరూ గర్వపడాలని చెప్పారు.
——————–
న్యాయ దండమా! మోదీ మంత్రదండమా?
అది చోళులు, ఇతర ప్రాచీన భారత పాలకుల న్యాయదండం కావచ్చు. కానీ ప్రతిపక్షాలు చేసిన నాటువైద్యంలో న్యాయదండమల్లా ప్రధాని మోదీ చేతిలో మంత్రదండంగా జన్మనెత్తింది. దాని పేరే సెంగోల్. పార్లమెంట్ కొత్త భవన విశేషాలన్నిటి కంటే ఎక్కువ ప్రాచుర్యానికి నోచుకున్న వస్తువు. ఎంతో కళాత్మకంగా తయారు చేసిన ఈ దండం వెనుక పెద్ద చరిత్ర ఉంది. అందులో కాస్త కూడా తెలియ కుండా కాంగ్రెస్, వామపక్ష మేధావులు కొందరు దారుణంగా మాట్లాడారు. దానిని మౌంట్‌బాటెన్‌కు తరువాత నెహ్రూకు అప్పగించారని ఎందరు చెప్పినా కాంగ్రెస్ పెద్దలు వినలేదు. అలాంటి వస్తువును నెహ్రూ తాకడానికి కూడా ఇష్టపడి ఉండేవారు కాదని ఒక టీవీ చర్చలో ఒక ఎరుపు మేధావు వాక్రుచ్చడం కొసమెరుపు. చివరకు ఇందుకు సంబంధించి ‘టైమ్’ పత్రికలో వచ్చిన పెద్ద వార్త దేశం ముందుకు వచ్చింది. ఆ పార్టీ మౌఢ్యం, వెర్రితనం బయటపడ్డాయి. తరువాత అధీనముల నుంచి వచ్చిన సాధువులతో బ్రాహ్మణ వాదానికి పెద్ద పీట వేశారని ఉత్తరప్రదేశ్ ఎస్‌పీ నాయకుడు స్వామి ప్రసాద్‌మౌర్య వ్యాఖ్యానించి ఈ దేశంలోనే అతి పెద్ద మూర్ఖుడిగా నిలిచిపోయారు. ప్రధాని నివాసానికీ, తరువాత పార్లమెంట్ కొత్త భవనంలోకీ ప్రవేశించిన అధీనముల లేదా మఠాల అధిపతులంతా ఓబీసీ వర్గీయులే. వారెవరూ బ్రాహ్మణ వర్గ సాధుసంతులు కానేకారు. సెంగోల్ చరిత్ర గురించి ప్రఖ్యాత పత్రికా రచయిత, ‘తుగ్లక్’ పత్రిక సంపాదకుడు ఎస్. గురుమూర్తి ప్రచురించారు. దానిని ప్రముఖ నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం ప్రధాని కార్యాలయానికి తెలియచేశారు. దీనితో కదలిక వచ్చింది. బ్రిటిష్ వారు భారతీయులకు అధికారాన్ని (స్వాతంత్య్రం) అప్పగిస్తూ.. ఈ న్యాయ దండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించారు. ఆగస్ట్ 14, 1947 రాత్రి 10.45 గంటల సమయంలో.. పండిట్ నెహ్రూ తమిళనాడులో బ్రిటిష్ వారి నుంచి అధికార బదలీకి ప్రతీకగా ఈ న్యాయదండాన్ని స్వీకరించారు. అనంతరం దీనిని అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచారు. పైగా అవమానకరమైన రీతిలో దీనిని వాకింగ్ స్టిక్‌గా పేర్కొన్నారు. ఇంతకాలం సెంగోల్‌ను మ్యూజియంలో ఉంచటంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలను, సంస్కృతీ. సాంప్రదాయాలను ఎందుకు అంతగా ద్వేషిస్తోందని అమిత్ షా ప్రశ్నలు సంధించారు. తమ ప్రవర్తనపై పునరాలోచించాలని కాంగ్రెస్‌కు చురకలు వేశారు. పవిత్ర సెంగోల్ కర్తవ్యం, సేవలకు ప్రతీక అని ప్రధాని మోదీ ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. సెంగోల్ గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయని.. మీడియా కథనాల ద్వారా సెంగోల్ గౌరవం మరింత పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. సెంగోల్‌కు దక్కవలసిన స్థానం దక్కిందని తరువాత ప్రధాని కూడా వ్యాఖ్యానించారు.
సెంగోల్ గురించి లిఖితపూర్వకమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ వాదించింది. దీనితో తాజాగా తిరువావడుతురై అధీనం కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారికంగా లేఖ విడుదల చేసింది. ఆ లేఖకు సంబంధించిన వివరాలివి.. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు రాజదండంపై చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి.
1947లో బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ఈ రాజదండం చిహ్నం అబద్ధమని వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా పత్రాలు ఉన్నాయి. రాజాజీ ఆహ్వానం మేరకే సెంగోల్‌ను మేము మౌంట్‌బాటెన్‌ను అప్పగించాం. తర్వాత మౌంట్ బాటెన్ ఈ దండాన్ని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అధికారిక మార్పిడిలో భాగంగా ఇచ్చారు. సెంగోల్ ముమ్మాటికీ స్వీయ పాలనకు చిహ్నమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సెంగోల్ ప్రాముఖ్యతను తగ్గించాలని చూడడం చాలా బాధాకారం అని పేర్కొన్నారు.
————————-