జనతాదళ్‌ (‌సెక్యులర్‌) అధినేత హెచ్‌డి దేవెగౌడ ఆ మధ్య లోతైన వ్యాఖ్య చేశారు. అది గత పాతికేళ్ల భారత రాజకీయ చిత్రానికీ, బీజేపీకీ ఉన్న బంధం గురించినది. నిజానికి అదొక సవాలు. బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ కలసి పోరాడాలని కొందరు నాయకులు పిలుపునిస్తున్న నేపథ్యంలో దేవెగౌడ విసిరిన సవాలే అది. ఐదేళ్ల పాటు, లేదా కొద్దికాలం బీజేపీ ప్రభుత్వాలతో కలసి నడచిన వారే బీజేపీని ఓడించాలని పిలుపునివ్వడం, అదొక మతతత్త్వ పార్టీ అని గొంతు చించుకోవడం అతి పెద్ద రాజకీయ ప్రహసనం. ఆ సంగతి గుర్తించారు కాబట్టే దేవెగౌడ అలవోకగా సవాలు చేశారు. బీజేపీతో కలవని రాజకీయ పార్టీ ఏదో చెప్పండి అన్నదే ఆ సవాలు. నిజంగా దేశంలోని రాజకీయ పార్టీలు తమను తాము వేసుకోవలసిన ప్రశ్న ఇది.  ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన  పాలనా విధానాలను తూర్పార పడుతున్న కొన్ని పార్టీలు ఒకప్పుడు తాము బీజేపీతో అంటకాగిన విషయాన్ని మరిచిపోతున్నాయి. 2019 ఎన్నికల తరువాత నుంచి జరుగుతున్న ప్రతిపక్షాల ఐక్యతా యత్నం ఒక ప్రహేళిక కంటే ఎక్కువగానే తికమక పెడుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే ధ్యేయంగా సాగుతున్న ప్రతిపక్షాల ఐక్యతా ప్రయత్నానికి పదే పదే పల్టీలు కొట్టే కోతికి ఉన్నట్టు తోక ఉందేమో కానీ, రాజకీయ నేతలకు ఉండాల్సిన తల మాత్రం లేదు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం మే 26 నాటికి తొమ్మిదేళ్లను పూర్తి చేసుకుంది. పార్టీ నేతలు ఆ సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అదే సమయంలో మరో చారిత్రక సందర్భాన్ని పార్టీ ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు. అది ఎన్డీఏ పాతిక వసంతాల ఉత్సవం. మే15, 1998లో ఎన్డీయే ఏర్పాటయింది. అప్పటి నుంచి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే వరకు దాని ప్రస్థానాన్ని పరిశీలిస్తే కొన్ని తేడాలు ఉన్నాయని అంగీకరించకతప్పదు. అప్పటి నుంచి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమితో కలసి నడిచిన పార్టీల జాబితా తీస్తే చాలా పెద్దదే అయి ఉంటుంది. ఈ పాతికేళ్లలో కొన్ని పార్టీలు బీజేపీతో జతకట్టాయి. కొన్ని పార్టీలు దూరమయ్యాయి. బీజేపీ సగర్వంగా చెప్పుకునే హిందుత్వ సహా, చాలా అంశాల మీద తీవ్ర వైరుధ్యాలు ఉన్న రాజకీయ పార్టీలు కూడా కమలం పంచన చేరాయి. అన్నాడీఎంకే అంటే వన్నె తగ్గిన ద్రవిడవాదంతో నడుస్తున్న పార్టీ. డీఎంకే అంటే కరుడుగట్టిన హిందూ, హిందీ వ్యతిరేక పార్టీ. బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ అంటే అగ్రకుల వ్యతిరేక పార్టీ అని ముద్ర. కానీ అగ్రకులాలకు ప్రాతినిధ్యం వహిస్తుందంటూ కొందరు విమర్శించే బీజేపీతో బీఎస్‌పీ కలసి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తెలుగు దేశం, శివసేన వంటి ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీతో కలసి నడిచాయి. ఈ రాజకీయ స్థితిని బీజేపీ చక్కగానే ఉపయోగించుకుంది. తాను బలంగా ఎదిగింది. ఆఖరికి కశ్మీర్‌ ‌మీద ప్రత్యేక విధానం కలిగి ఉన్నప్పటికీ బీజేపీతో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌దానికి ప్రబల శత్రువు పీడీఎఫ్‌ ‌కూడా ఒక దశలో మైత్రిని ఏర్పరుచుకున్నాయి. మెహబూబా ముఫ్తీ బీజేపీతో కలసి కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొన్ని పార్టీలు బీజేపీకి వెన్నుపోటు పొడిచిన మాట కూడా నిజం. అయితే అవన్నీ బీజేపీ ప్రబల శక్తిగా ఎదగడానికే దోహదం చేశాయి. ఇప్పుడు ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న భారత రాజకీయ పార్టీ బీజేపీ.

గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోదీ నాయకత్వంలో మున్నెన్నడూ లేనంత పటిష్ఠంగా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించటం దాదాపు అసాధ్యం అన్న అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ వ్యక్తం అవుతోంది. కానీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మోదీ ఒక వైపు.. ప్రతిపక్షాలన్నీ మరోవైపు అన్న చందంగా దేశ రాజకీయ ముఖచిత్రం మారి పోయింది. సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి ఒకే వేదిక పైకి వచ్చి పోరాడితే గానీ, మోదీ వంటి అత్యంత శక్తిమంతమైన వ్యక్తిని ఓడించటం సాధ్యం కాదని అవి గుర్తించక తప్పడం లేదు. మరోవైపు 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 140 ‌సీట్లు సాధించినప్పుడు, తాము 160 సీట్లు తెచ్చుకున్నా, తమ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు మాత్రమే అధికారంలో ఉన్న విషయాన్ని బీజేపీ మరిచిపోలేదు. ఎన్డీఏలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టటం కీలకమైన అంశంగా భావిస్తోంది. తదనుగుణంగా వ్యూహాలకు పదునుపెడుతోంది.

 మారిన రాజకీయ పరిణామాల వల్ల కావచ్చు. ఆయా పార్టీల అవసరాలు కారణం కావచ్చు. బీజేపీని కొద్ది మంది పాత స్నేహితులు వదిలేశారు. మరి కొంత మంది కొద్ది వాళ్లు వచ్చి చేరుకున్నారు. తెలుగు దేశం 1999, 2004, 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. తరువాత ఎన్డీయేకి దూరమైన టీడీపీ తాజాగా బీజేపీ వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో ఏపీలో అధికారంలో కొచ్చిన జగన్‌ ‌ప్రభుత్వం ఎన్డీయే భాగస్వామి కాకపోయినా, బీజేపీకి మిత్రపక్షంగానే కొనసాగు తోంది. ఇదొక వైచిత్రి. బీజేపీని ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా విమర్శించిన పాపాన పోలేదు. మారిన పరిణామాల నేపథ్యంలో, బీజేపీ అగ్రనేతలు అమిత్‌ ‌షా, నడ్డాలు విశాఖలో పర్యటించి అవినీతి ఆరోపణలు చేసినా సీఎం జగన్‌ ‌పెద్దగా పట్టించు కోలేదు. విశేషంలేదు. బీజేపీతో మైత్రిని వదులుకోవ టానికి ఆ పార్టీ సిద్దంగా లేదు. మరో వైపు ఏపీలో ఉన్న మరో పార్టీ జనసేన, బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఈ పరిణామాల దృష్ట్యా ఏపీలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

ఇక తెలంగాణ విషయానికొస్తే, మోదీపైన, బీజేపీ పైన సానుకూలవైఖరితో ఉండే కేసీఆర్‌ ‌తర్వాత రోజుల్లో బీజేపీ వ్యతిరేక ఎజెండాను ఎంచుకున్నారు. పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఇతర రాష్ట్రాలలో విస్తరించాలన్న వ్యూహంతో కేంద్రంపై విమర్శలను ఎక్కుపెట్టారు. మమత, కుమారస్వామి, కేజ్రీవాల్‌, ‌నితీష్‌ ‌లాంటి నేతలతో వరస భేటీలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటయిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయకపోవటం, తనకు మద్దతుగా నిలిచిన కుమారస్వామి తరపున ప్రచారానికి కూడా ముందుకు రాకపోవటం వంటి అంశాలు రాజకీయ పరిశీలకు లను ఆశ్చర్యపరిచాయి. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలన్నీ బహిష్కరించి, విమర్శలు చేసినా ఆయన వారితో శ్రుతి కలపలేదు. ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆయన వ్యూహమేమిటనే విషయం సందిగ్థంగా ఉంది.

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవి?

11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్డీయేతో భాగస్వామ్యంలో ఉన్న పార్టీలు ఉన్నాయి. ఎన్డీయేలో ప్రధాన పార్టీ బీజేపీ. ఇంకా, మహారాష్ట్రలో రెండుగా విడిపోయిన శివసేనలో ఏక్‌నాథ్‌ ‌షిండె వర్గం బీజేపీతో ఉంది. ఉద్దవ్‌ ‌ఠాక్రే మహావికాస్‌ అగాడీతో కలిసి ఉన్నారు. తమిళనాడులో ఏఐడీఎంకె, పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌, ‌పి ఎన్‌ ‌కె, పుతియ తమిళగం బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. ఒకప్పుడు డీఎంకే బీజేపీ మంత్రివర్గంలో చేరింది. బిహార్‌లో జనతాదళ్‌ ‌యునైటెడ్‌ ‌పార్టీ కొంతకాలం బీజేపీతో కలసి నడచింది. నితీష్‌ ‌కుమార్‌ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయనే బీజేపీకి వ్యతి రేకంగా కూటమిని కూడగట్టే ప్రయత్నంలో కీలకంగా ఉన్నారు. ఒకప్పుడు తనను ఎంతో ద్వేషించిన ఆర్జేడీతో ప్రస్తుతం కలసి ఉన్నారు. బిహార్‌లోనే లోక్‌ ‌జనశక్తి పార్టీ కూడా ఎన్డీయేలో భాగస్వామి. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ ‌చిరకాలం బీజేపీ మిత్రపక్షమే. సాగు సంస్కరణ చట్టాల నేపథ్యంలో ఆ పార్టీ బీజేపీని వీడింది. కేరళలో భారత ధర్మ జనసేన, అస్సాంలో అస్సాం గణపరిషత్‌, ‌బోడో లాండ్‌ ‌పీపుల్స్ ‌ఫ్రంట్‌, ‌నాగాలాండ్‌లో నేషనలిస్ట్ ‌డెమోక్రటిక్‌ ‌పొగ్రసివ్‌ ‌పార్టీ, రాజస్థాన్‌లో రాష్ట్రీయ లోక్‌ ‌తంత్రిక్‌ ‌పార్టీ, ఝార్ఖండ్‌లో ఆల్‌ ‌ఝార్జండ్‌ ‌స్టూడెంట్స్ ‌యూనియన్‌, ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్‌, ‌పుదుచ్చేరిలో ఆల్‌ ఇం‌డియా ఎన్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌, ‌గోవా ఫార్వర్డ్ ‌పార్టీ బీజేపీతో కలసి నడిచాయి. ఇంకొన్ని ఇప్పటికీ వెంట ఉన్నాయి. దేవెగౌడ స్థాపించిన జనతాదళ్‌ (‌సెక్యులర్‌) ఒకప్పుడు ఎన్డీయే భాగస్వామి. ఇప్పుడు బీజేపీ అంటే మండిపడుతున్న మమతా బెనర్జీ కూడా ఒకనాడు బీజేపీ మంత్రి వర్గంలో పనిచేశారు.

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, బీజేపీ కూడా తన పొత్తులను పునః సమీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. 2019 నాటి ఫలితాలు పునరావృతం కావాలని పట్టుదలతో వ్యవహరిస్తోంది  హిందీ రాష్ట్రాలలో బీజేపీకి పట్టుంది. కానీ పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా , మహారాష్ట్ర, బిహార్‌ ‌వంటి రాష్టాల్లో గత ఎన్నికల నాటి ఫలితాలను అందు కోవటానికి సరికొత్త వ్యూహాలు అవసర మవుతాయని భావిస్తోంది.

2014లో బీజేపీ మొత్తం 543 స్థానాల్లో 427 స్థానాల నుంచి పోటీ చేసింది. ఇందులో 282 స్థానాలను గెల్చుకుంది. 21 ఎన్డీఏ పక్షాలు పార్ల మెంటులో భాగస్వామ్యం వహించాయి. 2019లో తనకున్న సీట్లలో కొన్నింటిని బిహార్‌లో జనతాదళ్‌ (‌యునైటెడ్‌)‌కు ఇచ్చింది. 437 సీట్లలో పోటీ చేసి 303 సీట్లు గెలుచుకుంది. తర్వాత రోజుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, శివసేన, జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌ ‌లాంటి పార్టీలు అలయెన్స్ ‌నుంచి పక్కకు తప్పుకున్నాయి. ఘట్బంధన్‌ ‌ధర్మాన్ని పాటించలేదని అవి ఆరోపించాయి. ఇప్పుడు టీడీపీ, అకాలీదళ్‌లు మళ్లీ మైత్రికి సిద్ధమయ్యాయి. పాత మిత్రపక్షాలన్నింటిని కూడగట్టుకోవటానికి బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ ఎన్నికల సంద ర్భంగా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కనిపించింది. త్రిపురలో టిప్రా మోతా పార్టీ బీజేపీ తర్వాత స్థానం లోకి వచ్చింది. మహారాష్ట ఉపఎన్నికల్లో మహావికాస్‌ అగాడీ ఐక్యత వల్ల 28 సంవత్సరాలుగా బీజేపీ ఆధీనంలో ఉన్న స్థానం చేజారింది. మేఘాలయలో సంగ్మా నాయకత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్‌ అలయెన్స్ ‌ప్రభుత్వంలో ఐదేళ్లపాటు భాగస్వామిగా ఉంది. ఎన్నికలకు ముందు తెగతెంపులు చేసుకుని అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను రంగంలో దింపింది. చివరకు సంగ్మా పార్టీ 2018 నాటి 19 స్థానాల నుంచి 26 స్థానాలకు పెరిగింది. అది వేరే విషయం. 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం తన వ్యూహాలను సిద్దం చేస్తోంది.

యూపీ, బిహార్‌లో ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యాయి. యూపీలో ఓం ప్రకాష్‌ ‌రాజ్భర్‌కు చెందిన సుహేల్‌ ‌దేవ్‌ ‌భారతీయ సమాజ్‌ ‌పార్టీ (ఎస్‌ ‌బి ఎస్‌ ‌పి)ను తిరిగి తన ఫోల్డ్‌లోకి తీసుకోవాలని బీజేపీ చూస్తోంది. 2022 యూపీ ఎన్నికల్లో అది సమాజ్‌ ‌వాద్‌ ‌పార్టీ తరపున రంగంలో ఉంది. బిహార్లో వెనకబడిన తరగతులకు చెందిన ఉపేంద్ర కుష్వాహా లాంటి కొందరు నేతలు జేడీయూ నుంచి బయట కొచ్చారు. వారంతా బీజేపీతో కలసి ఎన్నికలకు వెళ్లను న్నారు. మహారాష్టలో షిండే వర్గం శివసేన పక్షం ఇతర వర్గాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరో వైపు ప్రతిపక్షాలు కూడా ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాయి. నితీష్‌ ‌కుమార్‌ ఈ ‌బాధ్యతలను తలకెత్తుకున్నారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, ‌శరద్‌ ‌పవార్‌ ‌వంటి నేతలను కూడగట్టారు. కాంగ్రెస్‌ ‌లేకుండా తమ వంతు ప్రయత్నాలు విజయవంతం కావనే ఉద్దేశ్యంతో, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ ‌గాంధీలతో సంప్రదింపులు జరిపారు. త్వరలో పట్నాలో ప్రతి పక్షాల ఐక్యతా సమావేశానికి ఏర్పాట్లు సాగుతు న్నాయి. ఇలాంటి ప్రయత్నాలు గత సార్వత్రిక ఎన్నికల ముందూ జరిగాయి. ఆ తర్వాత అవి కార్యరూపం దాల్చలేదు. ఈసారి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడాలి.

మరోవైపు ప్రతిపక్షాలు అంతర్గత సంక్షోభాలతో తల్లడిల్లుతున్నాయి. దానితో పాటు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లిక్కర్‌ ‌స్కామ్‌. ‌ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలను కుదిపేస్తోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసోడియా అరెస్టు కావటం, కేసీఆర్‌ ‌కుమార్తై కవితను సీబీఐ విచారిం చటం వంటి పరిణామాలు ఇందులో తీవ్రతను సూచిస్తున్నాయి. శరద్‌ ‌పవార్‌ ‌పార్టీలో నాయకత్వ సమస్య చర్చనీయాంశంగా మారింది. వ్యూహా త్మకంగా పవార్‌ ‌దానికి బ్రేక్‌ ‌వేశారు.

జూన్‌ 10‌వ తేదీన తన కుమార్తె లోక్‌ ‌సభ ఎంపీ సుప్రియా సూలే, మాజీ కేంద్రమంత్రి ప్రఫుల్‌ ‌పటేల్‌లను వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లుగా నియమించారు. సుప్రియా నియామకంతో ఆమె శరద్‌ ‌పవార్‌కు వారసురాలని చెప్పకనే చెప్పినట్టయ్యింది.

సుప్రియా సూలేను ఆ పదవిలో నియమించ టంలో శరద్‌ ‌పవార్‌ ‌చాణక్యాన్ని ప్రదర్శించారు. ఆమెకు ఇతర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర బాధ్యతల్ని అప్పగించారు. అది ప్రస్తుతం అజిత్‌ ‌పవార్‌ అడ్డా. దానితో పాటు ఎన్సీపీ ఛైర్‌ ‌పర్సన్‌గా కూడా నియమించారు. అజిత్‌ ‌పవార్‌కు పార్టీపై పట్టున్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. ఎన్సీపీ ఆశీస్సులతో దానిని అందు కోవటం ఆయనకు సులువు. పార్టీని చీల్చి బీజేపీలో చేరటం వల్ల తక్షణం ఏమైనా ప్రయోజనం లభించ వచ్చేమో గానీ దీర్ఘకాలం దాని ప్రభావం ఉండదు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అజిత్‌ ‌ప్రకటిం చారు. కానీ మహారాష్ట్ర వికాస్‌ అగాడీ నేతల మద్దతును ఉపసంహరించుకుని తమ వర్గం వాళ్లతో బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది.

అనేక ఆరోపణలతో ఎన్సీపీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు గురవుతున్నారు. వాళ్లు పార్టీని వదిలిపెట్టి బీజేపీ పంచన చేరాలని ప్రయత్నిస్తు న్నారన్న ప్రచారం సాగుతోంది. ఆ మధ్య సీనియర్‌ ‌బీజేపీ నేత నారాయణ్‌ ‌రాణె ఒక వ్యాఖ్య చేశారు. అజిత్‌ ‌దాదాపు బీజేపీకి బోర్డర్లో ఉన్నారని వ్యాఖ్య నించారు. ఎప్పుడెప్పుడు అజిత్‌ ఈ ‌నిర్ణయం తీసుకుంటాడా అని బీజేపీ కూడా ఎదురుచూస్తోంది. ఎన్సీపీ నాయకుల్లో చాలా మంది పైన ఆయన పట్టుంది. 2019లో స్వల్పవ్యవధి ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు.

 ప్రతిపక్ష నేతల్లో మమతా బెనర్జీ మునుపట్లా లేరు. ప్రధాని మోదీని గతంలో మాదిరిగా ధాటిగా విమర్శించటం మానుకున్నారు. ప్రతిపక్షపార్టీలను తన అధీనంలోకి తెచ్చుకోవటానికి కేంద్రం సీబీఐ, ఈడీలను వాడుకుంటోందని, అన్ని పార్టీలు కలిసి పోరాడాలని గతంలో ఆమె పిలుపు ఇచ్చి సంచలనం సృష్టించారు.

ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు జరగటాన్ని ఆమె తప్పుపట్టారు. నేతలు పార్టీ మారి బీజేపీలో చేరితే వారి పునీతులయిపోతారా? మురికి తొలగిపోతుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఐక్యత ఒక ఎండమావి. సీపీఎం ఉంటే తాను దూరంగా ఉంటానని మమత హెచ్చరిస్తున్నారు. ఈమె ప్రశ్నకు మళ్లీ ఒక ప్రశ్నతోనే సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. విపక్షాల నుంచి బీజేపీలో చేరితే వెంటనే అతడు పరిశుద్ధుడు అవుతున్నాడని మమత విమర్శ. కానీ బీజేపీ నుంచి లేదా ఎన్డీయే నుంచి బయటపడినవారిని ప్రతిపక్షాలన్నీ అక్కును చేర్చుకుంటున్నాయి. అతడి కాషాయం అక్కడితో వదిలిపోయిందనే కదా! అదెలా సాధ్యం. నితీశ్‌ ‌కుమార్‌ ‌నిన్నటిదాకా ఎన్డీయే భాగస్వామి. కాబట్టి బీజేపీ మీద వచ్చిన ఆరోపణలలో ఆయనకూ భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఆయన ఎన్డీయేను వీడిన క్షణం నుంచే ప్రధాని పదవికి ప్రతిపక్షాల నుంచి అభ్యర్థిగా తయారు కాలేదా?

నరేంద్ర మోదీ మీద వ్యతిరేకత తప్ప, ఓట్ల రాజకీయం తప్ప ప్రతిపక్షాలలో మరొక అంశం ఏదీ కనిపించడం లేదన్న విమర్శ ఇప్పటికీ బలంగానే ఉంది. రాహుల్‌ ‌నాయకత్వం బీజేపీనీ, మోదీనీ ఎదుర్కొనడానికి ఉపయోగపడుతుందా? అన్న అనుమానాలు కూడా బలంగానే ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన మంత్రులను, పార్టీల నాయకులను కూడా ఐక్యత పేరుతో ప్రతిపక్షాలన్నీ కోరస్‌గా సమర్థించడం దేశ ప్రజలను విస్తుపోయే టట్టు చేస్తోంది. మనీష్‌ ‌శిశోదియా దగ్గర నుంచి సెంథిల్‌ ‌బాలాజీ వరకు ఇదే ధోరణి. వీళ్లంతా గుర్తించవలసిన అంశం మోదీ బలం ప్రతిపక్షాల అనైక్యతలో లేదు. భారత ప్రజలకు ఆయన పట్ల ఉన్న సానుకూల దృక్పథంలో ఉంది. ఏమైనా దేవెగౌడ చేసిన వ్యాఖ్యకు రాజకీయ నేపథ్యం ఉంది. భారతదేశంలో బీజేపీయేతర రాజకీయ పక్షాల అవకాశవాదాన్ని తూర్పార పట్టిన వ్యాఖ్య అది. కాసిన్ని పదవులు దొరుకుతాయంటే చాలు మళ్లీ బీజేపీతో కలసి నడవడానికి అవి వెనుకాడవన్న హేళన ఉంది. అన్నిటికీ మించి గడచిన మూడు దశాబ్దాలుగా భారత్‌లో బీజేపీ అజేయశక్తి అన్న సంగతిని గుర్తించాలన్న ధ్వని ఉంది.

–  డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE