ప్రపంచ శాంతి, సుస్థిర అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఏడున్నర దశాబ్దాలకు పూర్వం 1945లో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) తన లక్ష్యసాధనకు ఆ దిశగా అడుగులు వేయడంలో, ప్రస్థానం సాగించడంలో ఏ మేరకు సఫలమైంది? ఐరాసకు అనుబంధంగా నిర్మించుకున్న భద్రతా మండలి, ఇతర ఐరాస అనుబంధ కీలక వేదికలు ఆశించిన లక్ష్యాలను అందుకోవడంలో ఎంతవరకు విజయం సాధించాయి? అంటే స్పష్టమైన సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. విభిన్న కోణాల్లో విశ్లేషణ చేసినప్పుడు సహజంగానే ఐరాస ప్రస్థానంలో మెరుపులు కొన్ని, మరకలు మరికొన్ని దర్శనమిస్తాయి.

ప్రపంచ శాంతి, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, పర్యావరణ ప్రమాణాల పెంపు వంటి ప్రధాన లక్ష్యాలను ప్రామాణికంగా తీసుకుని విశ్లేషించి నప్పుడు.. ఐరాస పట్టాలు తప్పి ప్రయాణం సాగిస్తోందనేదే ప్రముఖంగా చర్చకు వస్తోంది. ముఖ్యంగా ఐరాస ఆవిర్భావం నాటికి, నేటికి ప్రపంచం ఎన్నో మార్పులకు వేదిక అయింది. అప్పటి దాకా పరాయి పాలనలో ఉన్న అనేక లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలు అనంతర కాలంలో స్వత్రంత్ర దేశాలుగా అవతరించాయి. అయితే ఆ దేశాలకు ఐరాసలో సరైన ప్రాతినిథ్యం లభించలేదు. నాడు సభ్యదేశాల సంఖ్య 50 నుంచి నాలుగు రెట్లు పెరిగినా ఆకాశంలో సగం కంటే అధికంగా ఉన్న ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు ఐరాసలో ప్రాతినిథ్యం లభించకపోవడం గమనార్హం.

రెండవ ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడంలో నానాజాతి సమితి విఫలమైన నేపథ్యంలో 1945లో ఆవిర్భవించిన ఐరాస.. గడచిన 75 సంవత్సరాల పైచిలుకు ప్రస్థానంలో కొన్ని విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సేవాకార్యక్రమాల విషయంలో కొంత మెరుగైన ఫలితాలను సాధించింది. అదే సమయంలో అసలు విషయానికి వచ్చేసరికి.. అంతకుమించిన వైఫల్యాలను మూటకట్టుకుందని చెప్పాలి. అందుకే, ప్రస్తుతం ఐరాస ప్రపంచ వేదికలపై ఒక ప్రశ్నగా నిలుస్తోంది, తరచూ చర్చకు వస్తోంది. మారిన, మారుతున్న కాలానికి అనుగుణంగా ఐరాస స్వరూప, స్వభావాల్లో మార్పు చోటుచేసుకోకపోవడం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న లోపంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ వైఫల్యాలే ఐరాసలో సంస్కరణల అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి.

నిజం. ఐరాస, భద్రతామండలిలో సంస్కరణల అవసరం గురించి చాలా కాలంగా చర్చ జరుగు తోంది. ఏడాదికి ఒకసారి జరిగే ఐరాస సర్వసభ్య సమావేశాల్లో సమితి పనితీరుపై ఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే, విభిన్న అంతర్జాతీయ వేదికల నుంచి కూడా ఐరాసలో సంస్కరణల అవసరాన్ని నొక్కి చెప్పే ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మనదేశం మొదటి నుంచీ పరిస్థితులకు అనుగుణంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాల దృష్ట్యా ఐక్యరాజ్య సమితి పునఃనిర్మాణం జరగాలని, అలాగే ఆ సంస్కరణల్లో భద్రతామండలి కూడా భాగం కావాలని ఎప్పటినుంచో కోరుతోంది.

ఇదే క్రమంలో ఇటీవల (మే 21) జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన, జీ- 7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఐరాస, భద్రతా మండలిలో సంస్కరణల అవసరాన్ని ఒకింత ఘాటుగా, మరింత గట్టిగా నొక్కి చెప్పారు. ప్రపంచ దేశాల స్థితిగతులలో వస్తున్న మార్పులను, ప్రస్తుత ప్రపంచ అవసరాలను గుర్తించకుండా గతంలోనే ఉండిపోతే ఐరాస, భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయని మోదీ హెచ్చ రించారు. ఐరాసను తప్పక సంస్కరించాల్సిందే అన్నారు. ప్రపంచశాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకే ఐరాస ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. వేర్వేరు వేదికల నుంచి ప్రపంచశాంతి, సుస్థిరితల గురించి ఎందుకు చర్చించవలపి వస్తోందంటూ విస్మయాన్ని వ్యక్తపరిచారు. పరోక్షంగా ఐరాస వైఫల్యం కారణంగానే ఈ చర్చలకు ఆస్కారం కలుగుతోందని చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాదం, యుద్ధ నివారణ చర్యల గురించి వేర్వేరు వేదికలపై చర్చించవలసిన అవసరం ఏర్పడుతోందంటే ఇక ఐరాస ఉన్నది ఎందుకు? ప్రపంచ శాంతి లక్ష్యంగా ఏర్పడిన ఐరాస ప్రపంచ దేశాల నడుమ ఘర్షణలను ఎందుకు నిరోధించలేకపోతోంది? ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఉగ్రవాదం అనే పదానికే స్పష్టమైన నిర్వచనం ఎందుకు ఇవ్వలేకపోతోంది? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలని, వీటిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రధాని మోదీ.. సభ్య దేశాలకు, వీటో పవర్‌ను గుప్పిట పట్టి ఐరాస ఆశయాలకు తూట్లు పొడుస్తున్న ఐదు దేశాలకు విమర్శతో కూడిన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, ఐరాసలో దక్షిణార్ధ గోళ దేశాల గళం కూడా వినిపించాలని, లేకపోతే ఫలితం లేని చర్చా వేదికగా ఐరాస మిగిలిపోతుందని అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి పాత్రను మదింపు చేసుకోవడంతో పాటు ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్ద గల సమర్థ వేదికగా దానిని తీర్చిదిద్దడానికి ఏం చేయాలనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా సర్వప్రతినిధి సభ (జనరల్‌ అసెంబ్లీ) ఆమోదించిన రాజకీయ ప్రకటనలోనూ నేతలు బహుళ పక్ష భాగస్వామ్యంలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్స పరిస్థితుల్లో అవతరించిన ఐరాస ఘర్షణలు, ఉద్రిక్తతలు లేని నూతన సమాజ అవతరణను లక్ష్యంగా చేసుకున్నది. కాని ఆచరణలో అది దుస్సాధ్యంగానే రుజువవు తున్నది. ఏకాభిప్రాయాన్ని సాధించి, దేశాల మధ్య సామరస్య ఒప్పందాలను కుదిర్చే వేదికగా సమితి వైఫల్యం నిలువెత్తున దర్శనమిస్తున్నది. 2003లో అమెరికా, దాని మిత్ర దేశాలు కలిసి ఇరాక్‌పై జరిపిన యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితి ఖండించిన సంగతి తెలిసిందే. జనవిధ్వంసక ఆయుధాలు తయారు చేస్తున్నదనే రుజువు కాని కారణం మీద సద్దాం హుస్సేన్‌ ఏలుబడిలోని ఇరాక్‌పై జార్జిబుష్‌ ‌నేతృత్వంలో అమెరికా, దాని మిత్రదేశాలు జరిపిన దాడి ఐరాస నియమావళికి విరుద్ధమని, అది అక్రమ యుద్ధమని అప్పటి సమితి ప్రధాన కార్యదర్శి కోఫిఅన్నన్‌ ‌స్వయంగా ప్రకటించారు.

ఐరాస వైఫల్యాల చిట్టా చాలా పెద్దదే. తాజాగా రష్యా – ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని నిరోధించడంలో సమితి సంపూర్ణ వైఫల్యం చెందడం చూశాం. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కొవిడ్‌-19 ‌మహమ్మారి పుట్టుకను నిర్ధారించడంలో ఐరాస అనుంబంధ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‌చేతులెత్తేసిన తీరును కూడా చూశాం. ఈ అన్నిటినీ మించి పెద్దన్నల చేతిలోని ‘వీటో’ అస్త్రానికి సమితి బందీ అయిన తీరు దాని వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస అవసరమా? అనే ప్రశ్న ప్రపంచ, ప్రాంతీయ వేదికలపై వినిపిస్తోంది. ఇందుకు, ఇంతకుముందే అనుకున్నట్లుగా ‘ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్నట్లుగా సమితి సంస్కరణలకు నోచుకోకపోవడం ఒక ప్రధాన కారణం. అలాగే,  వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్యదేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇం‌గ్లాండ్‌లు తమ ప్రయోజనాలు, తమకు అనుకూలంగా ఉండే దేశాల స్వార్థ ప్రయోజనాలకు సమష్టి ప్రయోజనాలను బలిస్తున్న తీరు మరో ప్రధాన కారణం. అందుకే భారతదేశం మొదటి నుంచి శాశ్వత సభ్య దేశాల, తాత్కాలిక సభ్యదేశాల ప్రాతినిధ్య పరిధిని విస్తరించాలని డిమాండ్‌ ‌చేస్తోంది.

భారతదేశానికి ఇంతవరకూ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ ఇవ్వకపోవడం ఓ అంతర్జాతీయ తప్పిదం. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ‌ఫ్రాన్స్ ‌వంటి ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తే అది భారత్‌కే కాకుండా విశ్వశాంతికి ఉపకరిస్తుంది. అంతేకాదు, మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేం దుకు భారత్‌కు అన్ని  అర్హతలు ఉన్నాయి. జనాభాలో భారతదేశం ప్రథమ స్థానానికి చేరింది. భూభాగం విషయానికి వస్తే ప్రస్తుత శాశ్వత సభ్యదేశాల కంటే విశాల దేశం. అలాగే, జీడీపీ, ఆర్థిక సుస్థిరత, వారసత్వ నాగరికత, సాంస్కృతిక భిన్నత్వం, రాజకీయ విధానం, ఐరాస శాంతిపరిరక్షణ కార్యకలాపాలలో భారత్‌  ‌భాగస్వామ్యం ఏ దేశానికి తీసిపోని విధంగా ఉంది. అన్నిటినీ మించి భద్రతా మండలి శాశ్వత సభ్యత బాధ్యతలను స్వీకరించేందుకు భారత్‌ ‌సంసిద్ధతను వ్యక్తపరిచింది. అయితే, సైంధవ పాత్ర పోషిస్తున్న చైనా మాత్రం అడ్డుపుల్లలు వేస్తోంది.

నిజానికి, ఆ ఐదు దేశాలకు ఉన్న ‘వీటో’ అధికారం.. ఐరాస ఆశయాలకు అడ్డుగోడగా నిలుస్తోంది. అందుకే, ఐరాస తీసుకున్న అనేక కీలక నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదు. భద్రతా మండలిలో చర్చించిన కీలక అంశాలపై ఓటింగ్‌ ఉం‌టుంది. దీని ప్రకారమే నిర్ణయాలు అమలుచేసే వీలుంటుంది. ఓటింగ్‌ ‌సందర్భంగా మెజారిటీ సభ్య దేశాలు, తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసినా  అయిదు దేశాలలో ఏ ఒక్కటి తన ‘వీటో’ అధికారాన్ని వినియోగించుకున్నా ఆ తీర్మానం వీగిపోతుంది. సాధారణంగా వీటో అధికారాన్ని వినియోగించే సందర్భాలు ఎందుకు వస్తాయంటే.. అమెరికా, చైనా వంటి శాశ్వతసభ్య దేశాలు తమ జాతీయ ప్రయోజనం దెబ్బతింటుందని భావించినా, లేదా తమ కూటమిలోని దేశ ప్రయోజనం దెబ్బ తింటుందని భావించినా ‘వీటో’ను వినియోగిస్తాయి. అయితే తనకు నచ్చని దేశాన్ని ఇబ్బంది పాలు చేయాలన్నా ఈ అస్త్రం ప్రయోగిస్తున్నాయి.

‘ఆర్థిక సంపన్నమైన రెండు దేశాలు ప్రపంచాన్ని చీలుస్తున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేం’ అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ‌గుటెరస్‌ ‌చేసిన వ్యాఖ్యలు సమితి సదాశయాలకు ఎదురు కానున్న అగ్నిపరీక్ష గురించి హెచ్చరిస్తున్నాయి. ఆయన సూచించినట్టు ప్రపంచమంతటా కాల్పుల విరమణకు భద్రతా మండలి వేదికగా చిత్తశుద్ధితో కూడిన కృషి జరగాలి. అమెరికా, చైనాల మధ్య ఉత్పన్నమైన ప్రచ్ఛన్న యుద్ధానికి తెర దించాలి. అప్పుడే నూతన ప్రపంచ అవతరణకు దారులు పడతాయి. లేని పక్షంలో ప్రపంచం తీవ్రమైన సంక్షోభానికి లోనవుతుంది.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE