– చంద్రశేఖర ఆజాద్‌, 9246573575

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


పది నిమిషాల తర్వాత టీ వచ్చింది. నిజంగా అద్భుతంగా వుంది.

‘‘మీ ఆరోగ్యం ఎలా వుంది?’’

ఆయన నవ్వాడు.

‘‘మూడు పూట్లా షుగర్‌ ‌టెస్ట్ ‌చేసుకుంటున్నాను. అందులోనూ మనం తయారు చేసింది అదే కదా’’.

‘‘కంట్రోల్‌లో వుందా సర్‌’’.

ఆయన అదోలా భుజాలు వూపాడు.

‘‘థర్టీ యియర్స్ ‌నుండి నాతోనే వుంది బుద్ధా… మధ్యలో అందరూ వెళ్లిపోయారు. నన్ను అంటి పెట్టుకుంది ఇదీ, రాజన్‌ ‌మాత్రమే’’ అన్నాడాయన నిర్లిప్తంగా…

‘‘మనం విజయవాడ వెళ్లిపోదాం రామకృష్ణ గారూ’’ అన్నాడు గోవింద్‌.

‘‘అక్కడికా!’’ అన్నాడు.

‘‘ఎంతయినా ఆ ప్రాంతాలన్నీ మీరు తిరిగారు. కొద్దిరోజులు నా దగ్గర వుంటే బాగుంటుంది’’.

‘‘ఇక్కడ ఓ ఎగ్జయిల్‌లా బతుకుతున్నాను. నాతో రాజన్‌ ‌వున్నాడు. మనం అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుందాం బుద్ధా’’.

‘‘అక్కడ మీరు వుంటారని ఎవరికీ తెలియదు. మీరు మన గెస్ట్ ‌హౌస్‌లో వుంటారు. నేను అందుబాటులో వుంటాను. అలాగే మీ పక్కన రిత్విక్‌ ‌వుంటాడు. మీ పనులు చూడటానికి రాజన్‌ ‌మీతోనే వుంటాడు’’.

ఆయన ఆలోచిస్తున్నాడు.

కొద్దిసేపటి తర్వాత అడిగాడు.

‘‘మనం ఈ రోజు బయలుదేరాలా?’’

‘‘మీరు ఎప్పుడంటే అప్పుడు సర్‌’’.

‘‘‌నాకోసారి నెక్లెస్‌ ‌రోడ్‌ని చూడాలనుంది’’ అన్నాడాయన.

‘‘నేను ఆ ఏర్పాట్లు చూస్తాను’’ అన్నాడు బుద్ధ.

ఇద్దరూ హాల్లోకి వచ్చారు.

‘‘రిత్విక్‌…. ‌నువ్వు ఇక్కడ వుంటావా? నేను వారిని తీసుకుని బయటకి వెళ్లివస్తాను. అంతగా అయితే ఏదన్నా బుక్‌ ‌చదువుకో… బయటకి వెళ్లి వస్తానంటే కారు ఎరేంజ్‌ ‌చేస్తాను’’.

‘‘వద్దుసార్‌. ఇక్కడ రాజన్‌ ‌వుంటాడా?’’

‘‘ఊ ఉ….’’

‘‘మీరు వెళ్లిరండి సార్‌. ‌నేను ఇక్కడ వుంటాను’’ అన్నాడు.

సరిగ్గా గంట తర్వాత ఆయన చేతి కర్రతో బయటకు వచ్చాడు. డ్రెస్‌ ‌ఛేంజ్‌ ‌చేసుకున్నాడు. షూస్‌ ‌మెరుస్తున్నాయి. కోటు మరీ కొత్తది కాకపోయినా అదీ హుందాగా వుంది. టై కూడా కట్టుకున్నాడు. ఈ వయసులోనూ ఆయనకు తన బట్టల మీద వున్న ఇంట్రెస్ట్‌కి ముచ్చటగా వుంది.

‘‘రాజన్‌… ‌వంట చేయవలసిన అవసరం లేదు. నేను బయట నుండి ఆర్డర్‌ ‌చేస్తాను’’ అన్నాడు గోవింద్‌.

అతను తలూపాడు.

ఇద్దరూ కిందకు వెళ్తున్నప్పుడు రామకృష్ణ వెనక్కి తిరిగి చిన్నగా నవ్వి తలూపి వెళ్లాడు.

ఎందుకో సంతోషం కలిగింది రిత్విక్‌కి.

‘‘తాతగారు’’ అనుకున్నాడు అప్రయత్నంగా.

రాజన్‌ ‌వెళ్లి ఆ గదిని శుభ్రం చేసాడు. బెడ్‌ ‌మీద చెదిరిన బెడ్‌షీట్‌ని సర్దాడు. దిండు గలీబుని మార్చాడు. రిత్విక్‌ ‌దగ్గరకు వచ్చి ‘‘ఉల్లిపాయ పకోడి చేయమంటావా బాబూ….’’ అన్నాడు.

‘‘మీరు వంట కూడా చేస్తారా?’’

‘‘నేను చేస్తేనే అయ్యగారికి నచ్చుతుంది’’.

‘‘మీరు యిచ్చిన టీ చాలా బాగుంది’’.

‘‘ఉల్లిపాయ పకోడి అంటే పెద్దయ్య గారికి చాలా ఇష్టం. ఇంతకు ముందు అతిథులు ఎవరు వచ్చినా నాతో చేయించేవారు. ఇప్పటికీ అలాంటివి తినవద్దని డాక్టర్లు  చెబుతారు. అయినా ఆయన పట్టించుకోరు’’.

‘‘మీది ఏ ఊరు రాజన్‌ ‌గారూ?’’

‘‘రాయఘడ్‌’’ అనగానే ఆశ్చర్యంగా చూస్తూ…

‘‘నిజమా… ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. మీది ఒడియా భాష అంటే నమ్మలేకపోతున్నాను’’.

‘‘పెద్దయ్యగారు నాకు అక్కడే పరిచయం అయ్యారు. అక్కడ తెలుగు వారు ఎక్కువగా వుండటానికి కారణం ఈ అయ్యగారే. ముఫై ఏళ్లకి పైగా అయింది నేను అయ్యగారి దగ్గర కొచ్చి… అప్పట్నుంచి ఆయనతోనే వుంటున్నాను’’.

‘‘మీ కుటుంబం?’’

‘‘ఒకప్పుడు వుండేది. ఇప్పుడు అయ్యగారే నా కుటుంబం’’ అని రాజన్‌ ‌వంటగదికి వెళ్లాడు.

ఒకప్పుడు వుండేది అని మాత్రం అన్నాడు. ఇప్పుడు లేదా? అంటే రాజన్‌ ‌వెనకాల కూడా ఓ కథ వుందన్న మాట. ఇంకా వివరాలు అడగటం బాగుండదను కున్నాడు. అప్పుడు హారికకు ఫోన్‌ ‌చేసాడు.

‘‘ముంబయ్‌ ‌చేరుకున్నారా?’’

‘‘ఇంతకుముందే  చేరాం. లెటర్స్ ఏమన్నా వచ్చాయా?’’

‘‘ఇప్పటిదాకా అడగలేదేమిటా అనుకున్నాను. ఓ ఉత్తరం వచ్చింది. అది కూడా ఎవరో అభిమాని రాసింది. మీరు ఏ అడ్రస్‌కి పంపమంటే అక్కడికి పంపిస్తాను’’.

‘‘అవసరం లేదు. మేం ఎప్పుడు ఎక్కడ వుంటామో మాకే తెలియదు’’.

‘‘అదే అంటున్నాను. మీరు కొంత కాలం ఇలాంటివన్నీ మరిచిపోవాలి. ఇంకా విశేషాలు ఏంటి?’’

‘‘చెబుతాను. ముందు పాస్‌పోర్ట్ ‌వచ్చిందా?’’

‘‘ఇంకా రాలేదు’’.

‘‘సరే. మేం వచ్చి రెండు గంటలలోపు అవుతుంది. గోవింద్‌ ‌గారు ఓ పెద్దాయనని తీసుకుని బయటకు వెళ్లారు. నేను ఒక్కడ్నే వున్నాను. అయితే నాతో రాజన్‌ ‌గారు వున్నారు’’.

‘‘వారు ఎవరు?’’

‘‘అన్నీ తీరిగ్గా చెబుతాను హారికా… ఉంటాను’’ అని ఫోన్‌ ‌కట్‌ ‌చేసాడు. అరగంట తర్వాత రాజన్‌ ‌పకోడి తీసుకు వచ్చాడు. చూడటానికే బాగున్నాయి. నోరూరింది. నోట్లో పెట్టగానే కరిగిపోయింది. ఇలాంటి రుచి చిన్నప్పుడు ఓ షాపు దగ్గర వుండేది. అప్పుడు కొనుక్కోవటానికి చేతిలో పది పైసలు కూడా వుండేవి కావు.

‘‘చాలా బాగున్నాయి రాజన్‌ ‌గారూ…’’

‘‘నీ పేరు ఏంటి బాబూ?’’

‘‘రిత్విక్‌’’

‘‘‌మొహమాటపడకుండా తినండి. కావాలంటే ఇంకా చేసుకుందాం’’ అన్నాడు. ‘‘ఇంకానా భలేవారే. మీరూ తీసుకోండి’’ అన్నాడు.

………

మార్నింగ్‌ ‌వాక్‌కి ఓ పార్క్ ‌దగ్గరకు తీసుకు వెళ్లాడు గోవింద్‌.

‘‘‌రామకృష్ణ గారు నాకు ఇన్సిఫిరేషన్‌. ఆయన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. ఇప్పుడు ఆయన వుంటున్న ఫ్లాట్‌ ఒకప్పుడు వారిదే. నాకు ముంబయ్‌లో పరిచయం. వారిని నేను ఇంటర్వ్యూ చేయటానికి వచ్చాను. తెలుగు వారికి అప్పట్లో ఆయనంటే ఓ అభిమానం. ఆయనకూ అంతే. తెలుగు వారు కనిపిస్తే చిన్న పిల్లవాడిలా సంతోష పడేవారు. నేను మాసపత్రిక నుండి వార పత్రికనూ మొదలు పెట్టాలనుకున్నప్పుడూ రామకృష్ణ గారిని కలిసాను’’.

రిత్విక్‌కి ఇవన్నీ కొత్త విషయాలు.

‘‘అప్పుడు ఆయన నన్ను అన్ని విషయాలూ అడిగారు. ఇప్పుడు తెలుగులో ఎన్ని వారపత్రికలు వస్తున్నాయి. వాటి సర్క్యులేషన్‌ ఎం‌త? నువ్వు వాటికంటే  భిన్నంగా ఏం ఇవ్వగలుగుతావు అని. మన మాస పత్రికని ఆయనకు రెగ్యులర్‌గా పంపించే వాడిని. ఎన్ని పనులున్నా పూర్తిగా చదివేవారు. అప్పుడప్పుడు చిన్న సూచనలు చేసేవారు. నేను తయారు చేసుకున్న ప్రాజెక్ట్ ‌రిపోర్ట్ ‌వారికి చూపించాను. అది చదివారు. కంటెంట్‌ ‌విషయంలో నా అభిప్రాయాలు చెప్పాను. ప్రశాంతంగా విన్నారు. వారి దగ్గరికి విదేశాల నుండి పత్రికలు వచ్చేవి. నిరంతరం ఆయన దేశాలు తిరుగుతుండేవారు. టెక్నాలజీ అంటే ప్రాణం. నాకు బ్యాంక్‌ ‌లోన్‌ ‌విషయంలో ఆయన చాలా హెల్ప్ ‌చేసారు’’ అని ఓ బెంచ్‌ ‌దగ్గర ఆయన కూర్చున్నాడు.

‘‘మన పత్రిక ప్రారంభంలో ఎన్ని కాపీల్తో మొదలయిందో నీకు తెలుసు అనుకుంటాను’’.

‘‘అవన్నీ చదివాను. నాకు గుర్తున్నాయి సర్‌’’.

‘‘ఆయనకున్న నాలెడ్జ్ అద్భుతం. పది సంవత్సరాలు గడిచాక ఓసారి నన్ను పిలిపించుకున్నారు. నువ్వు ముంబయ్‌లో ఆఫీస్‌ ‌తెరిస్తే బాగుంటుంది అన్నారు. ఎక్కడన్నా ఓ రూమ్‌ ‌తీసుకుంటానన్నాను. అలాకాదు మన ఫ్లాట్‌ ‌వుంది. అది నువ్వు ఉపయోగించుకో… లోకల్‌ ‌యాడ్స్ ‌కంటే కార్పొరేట్‌ ‌యాడ్స్ ‌మీద దృష్టి పెట్టు అన్నారు. తర్వాత నెల రోజులకు నాకు డాక్యుమెంట్స్ ‌పంపించారు. ఈ ఫ్లాట్‌ ‌నా పేరున రిజిస్టర్‌ అయింది’’

రిత్విక్‌ ఆశ్చర్యంగా వింటున్నాడు.

‘‘నేను మళ్లీ రామకృష్ణగారిని కలుసుకున్నాను. ఇదేంటి సర్‌ అన్నాను. మనకి విజన్‌ ‌వుండాలి. రేపు రాబోయే సమస్యలని ఈ రోజు గుర్తించిన వాళ్లు విజయం సాధిస్తారు. నేను ఏ పని చేసినా ఆలోచించే చేస్తాను అన్నారు. నేను డబ్బులు ఇస్తానన్నాను. ఆయన ఒప్పుకోలేదు. కాదని బలవంతం చేస్తే నామమాత్రంగా తీసుకున్నారు. అప్పుడు నాకు ఇవ్వటంలోని ఆనందం ఇంకోసారి తెలిసింది’’.

ఆయన మళ్లీ లేచి నడుస్తున్నాడు.

‘‘మొదటిసారి అది మా అమ్మలో చూసాను. నాన్నలో చూసాను. పది మంది పచ్చగా వుంటే ఇద్దరూ సంతోషపడే వారు రిత్విక్‌! ‌తమ దగ్గరున్న దాంట్లోనే అందరికీ సహాయం చేసేవారు. ‘అందరూ బతకాలి గోవిందూ’ అని మా నాన్న అనేవాడు. అఫ్‌కోర్స్ ‌ముందు నాన్న వెళ్లిపోయాడు. ఒకటే బాధ ఆయనకి… మన వంశానికి వారసుడు లేడు అని’’.

ఇద్దరూ నడుస్తున్నారు నిశ్శబ్దంగా.

‘‘నీకు తెలుసు. నాకు ఇద్దరు అమ్మాయిలు’’ అన్నాడు కొద్ది సేపటి తర్వాత.

‘‘అవును సర్‌’’.

‘‘అక్కడ చిన్న ఆఫీస్‌ ‌వుండేది. అప్పుడప్పుడు రామకృష్ణ గారు ఈ ఫ్లాట్‌కి వచ్చేవారు. తర్వాత తెలిసింది. ఇది ఆయన ముంబయ్‌లో కొనుక్కున్న మొదటి ఫ్లాట్‌ అని’’.

‘‘వండర్‌ఫుల్‌ ‌సర్‌’’ అన్నాడు రిత్విక్‌.

‘‘‌రెండు సంవత్సరాల తర్వాత స్వయంగా విజయవాడ వచ్చారు. అప్పటికే నేను  పీ••క్‌లో వున్నాను. దేశంలోనే ఓ ప్రాంతీయ పత్రిక మొదటి అయిదు స్థానాల్లో వుంది. అందుకు అభినందించటానికి వచ్చి ఓ ప్రపోజల్‌ ‌పెట్టారు. నువ్వు ఎందుకు డెయిలీ పెట్టకూడదు అంటూ!’’

అప్పట్లో ఈ సంస్థ నుండి డెయిలీ రాబోతుందన్న వార్తను చదివి వున్నాడు రిత్విక్‌. ‌చాలామంది అలా జరిగితే బాగుండును అనుకున్నారు. అందులో రిత్విక్‌ ఒకడు.

‘‘ఇంతకు ముందు నేను ఓ పిల్లల పత్రిక పెట్టాలనుకున్నాను. కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. రామకృష్ణ గారు అడిగిన ప్రశ్న నేను నన్నే అడిగాను. ఇప్పటికే చాలా పిల్లల పుస్తకాలు, ఐమీన్‌ ‌పత్రికలు వున్నాయి. చందమామకి మించి నేను ఏం ఇవ్వగలను అని. అంతే డ్రాప్‌ అయ్యాను’’.

‘‘మన సంస్థ నుండి డెయిలీ రాకపోవటానికి కారణం ఏంటి సర్‌?’’ అన్నాడు రిత్విక్‌…

‘‘‌మా అమ్మ నాకు తృప్తి పడటం గురించి చిన్నప్పటి నుంచి చెప్పింది. అలెగ్జాండర్‌ ఓ ‌రాజ్యాన్ని జయించాడు. సంతోషపడ్డాడు. ప్రపంచాన్ని జయిం చాలనుకున్నాడు. ఏం జరిగిందో చరిత్ర చెప్పింది’’.

ఇంతకు ముందు విజయం మరిన్ని విజయాల కోసం పరుగులు తీయిస్తుంది అన్న గోవింద్‌జీ మాటలు రిత్విక్‌కి గుర్తు వచ్చాయి.

‘‘రామకృష్ణ బాగా ఒత్తిడి కూడా చేసారు. ఇలా అనుకుంటే నేను ఇన్ని ఫ్యాక్టరీలు ఎలా పెట్టగలను అన్నారు. నాలో ఓ బలమో, బలహీనతో వుంది రిత్విక్‌. అన్నీ నేను స్వయంగా చూసుకోవాలి. సంస్థ పెరుగుతున్నకొద్దీ మన కంట్రోల్‌ ‌వుండదు. మనం ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఎవరో ఒకరిని నమ్మాలి. ఈ దేశంలో వంద సంవత్సరాలకు పైగా వస్తున్న పత్రికలు వున్నాయి. ఓ సంస్థను నిర్మించి ఇప్పటికీ విజయవంతంగా నడుపుతున్న వారున్నారు…’’ అని ఆగి…

‘‘చాలా గొప్ప సంస్థలు ఇప్పుడు నిన్నటి జ్ఞాపకాలుగా మిగిలాయి. ఫ్యాక్టరీలను నిర్వహించలేక అమ్ముకున్నవారున్నారు. అప్పటి స్థలాలను హోటళ్లుగానో, మాల్స్ ‌గానో మార్చుకున్న వారున్నారు. విజయం ఎప్పుడూ ఒకరి చేతుల్లో వుండదు రిత్విక్‌… అది ప్రకృతి ధర్మం కూడా కాదు’’.

రిత్విక్‌కి గోవింద్‌ ‌బుద్ధ గురించి తెలుసు. ఆయనలో ఇన్ని కోణాల గురించి తెలియదు. పాపులర్‌ ‌రచనలు ప్రచురించే ఈ వ్యక్తిలో ఇంత విశ్లేషకుడు వున్నాడని ఇప్పుడు తెలుస్తూంది.

ఓ రచనను రెండు పేరాలు చదివి తన నాడిని పట్టుకోగల గొప్ప వైద్యుడిలా ఆ క్షణం బుద్ధ కనిపించాడు.

‘‘అందుకే డెయిలీ పెట్టలేదు’’ అని…

‘‘మాటల్లో సమయం తెలియలేదు. మన కోసం పెద్దాయన ఎదురు చూస్తుంటారు’’ అన్నాడు.

* * * * * *

రామకృష్ణ, గోవింద్‌, ‌రాజన్‌, ‌రిత్విక్‌లు విజయవాడ చేరుకున్నారు.

ఇద్దరు విజయవంతమైన, రెండు మహాపర్వతాల మధ్య తను ఉక్కిరి బిక్కిరి అవుతున్న భావన కలిగింది-రిత్విక్‌కి.

ఈ ప్రయాణం నిజంగా బాగుంది. ఇప్పటి వరకూ తనది మధ్య తరగతి కోణం. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రపంచం. కార్పొరేట్‌ ‌కుటుంబాల గురించి, వారి సక్సెస్‌ ‌స్టోరీలు ఎన్నో వస్తుంటాయి. అలాంటివి చదివాడు రిత్విక్‌.

‌తనది చిన్న ప్రపంచం. అందులో ఇద్దరు పిల్లలు, హారిక, ఇద్దరు కోడళ్లు, ఓ మనవరాలు, ఓ మనవడు.

‘‘నాకు మనవడు పుట్టాడు. మీ బ్లెస్సింగ్స్ ‌కావాలి’’ అని ఓ సారి గోవింద్‌కి లేఖ రాసినప్పుడు ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తర్వాత ఓసారి ఫోన్‌లో మాట్లాడే అవకాశం వచ్చింది.

‘‘నీ మనవడు ఎలా వున్నాడు రిత్విక్‌?’’ అన్నారు ముందుగా…

‘‘నీవి రెండు నవలలు నా దగ్గర వున్నాయి కదూ’’ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఈ మధ్య కాలంలో గోవింద్‌ ‌పత్రిక గురించి అంత సీరియస్‌గా పట్టించుకోవటం లేదు. ఇది వరకంతటి స్పీడ్‌ ‌లేదు అని ఓ రచయిత మిత్రుడు అన్నాడు.

ఈ మధ్య ఆయన తరుచూ ప్రయాణాలు చేస్తున్నారు అనే టాక్‌ ‌వచ్చింది. అందుకు కారణం గోవింద్‌ ఆఫీస్‌లో కనిపించకపోవటం. ఎప్పుడు వెళ్లినా ‘‘సర్‌ ‌లేరు. ఊరు వెళ్లారు’’ అని చెప్పటం. ‘‘ఎప్పుడు వస్తారు?’’ అంటే ‘‘మాకు తెలియదు. మీరు వచ్చారని సర్‌కి చెబుతాం’’ అని వారి సమాధానం.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE