– చంద్రశేఖర ఆజాద్‌

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘నేను అంత దూరం ఆలోచించలేదు సర్‌’’.

‘‘‌నీకు హారిక గుర్తు రాలేదా?’’

‘‘ఎందుకు గుర్తురాదు సర్‌? ఇప్పటి వరకు మేం కలిసి వుండని రోజులు చాలా తక్కువ’’

‘‘మీరు ఎప్పుడన్నా తగాదా పడ్డారా?’’

‘‘తగాదాలు లేకుండా కాపురాలు ఎలా చేస్తారు సర్‌?’’.

‘‘‌నువ్వు తిట్టిన తిట్లు అన్నీ హారిక గుర్తు పెట్టుకుంటుందా?’’

‘‘ఎందుకు గుర్తుంచుకోదు స? అలాంటివన్నీ ఎప్పుడో ఒకప్పుడు గుర్తు చేస్తారు కూడా!’’

‘‘అంటే కుటుంబానికి, సమాజానికి మనం తిట్టే తిట్లు, మనం కొట్టిన దెబ్బలే గుర్తుంటాయా?’’

‘‘అవి కొంత మందికి సర్‌. ‌సమాజానికి మన కంట్రిబ్యూషన్‌ ‌ముఖ్యం. మన లోపాలు సెకండరీ అని నేను అనుకుంటాను’’.

‘‘నువ్వు చాలా తక్కువ డ్రింక్‌ ‌చేస్తున్నావు. మత్తులోకి జారితే నీ మనసు లోపలి విషయాలన్నీ బయటకు వస్తాయన్న స్పృహతో చేస్తున్నావా?’’

రిత్విక్‌ ఉలిక్కిపడ్డాడు.

‘‘ఫ్రీగా వుండు రిత్విక్‌. ‌నువ్వు నా ఎంప్లాయ్‌వి కాదు. నా స్నేహితుడిగా ఇక్కడికి వచ్చావు. అలానే వుండు’’.

‘‘మీరు ఈ మాట ఎందుకు అన్నారో నాకు తెలుసు సర్‌. ‌నేను ఎక్కువ డ్రింక్‌ ‌చేస్తే నాలో అసంతృప్తులు బయటకి వస్తాయని మీరు అంటున్నారు. బహుశా మీ మీద అని మీ ఉద్దేశం కావచ్చు. అలాంటిది వున్నప్పుడు నేను ఏమీ దాచుకోలేదు. మీకు ఉత్తరాలు రాస్తూనే వున్నాను. అందుకు కారణం కూడా మీరే….’’

‘‘నేనా?’’

‘‘నా శ్రేయోభిలాషులు కూడా అప్పుడప్పుడు తమ అభిప్రాయాలు చెప్పకపోతే బయట ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుందని ఓసారి అన్నారు. నాకు దీర్ఘమైన ఉత్తరాలు చదవటం ఇష్టం వుండదు అని ఇంకోసారి అన్నారు. అందుకే క్లుప్తంగా అయినా రాస్తుంటాను’’.

అప్పుడు గోవింద్‌ ‌తన గ్లాసులో స్కాచ్‌ ‌వంచుకున్నాడు. నీళ్లు కలుపుకున్నాక సిప్‌ ‌చేసి….

‘‘నేను మేన్‌ ఆఫ్‌ ‌మూడ్స్ ‌కదూ…’’

‘‘అనుకుంటారు. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని గమనించే అవకాశం నాకు రాలేదు’’.

‘‘నా ప్రారంభం గురించి కొంత తెలుసుకుని వుంటావు. ఇది నేను నిర్మించు కున్న ఎంఫైర్‌. అం‌దుకు నేను ఎంత మందిని, ఎన్ని రకాల ఎమోషన్స్‌ని భరిం చి వుంటానో నువ్వు ఇమేజ్‌ ‌చేయగలవనుకుంటాను. మామూలు మనుషులకే రకరకాల మూడ్స్ ‌వుంటాయి. నాకు వుండవా? మానాన్న పెద్దగా చదువుకోలేదు. ఆయనకు గోవిందుడు అంటే ఇష్టం. అందుకే నాపేరు అలా పెట్టాడు. మా అమ్మకి బుద్ధుడు అంటే ఇష్టం. అందుకే నేను గోవింద్‌ ‌బుద్ధ అయ్యాను. రెండు పేర్లున్న నేను ఏ పేరుకు న్యాయం చేసానో తెలియదు’’.

‘‘నేను ఒక్క విషయం చెప్పగలను. తిరుపతి వెంకటేశ్వరుడు ముడుపులు తీసుకుంటాడు. మీరు అందరికీ అన్నీ యిస్తారు. ఇది మధ్యలో వచ్చింది కాదు. మొదటి నుండి లివ్‌ అం‌డ్‌ ‌లెట్‌ ‌లివ్‌ అనేది మీ విధానం. పత్రిక ఎదుగుతున్న కొద్దీ ఆ ఫలాలను పాఠకుల దగ్గర్నుండి మీరు అందరికీ పంచారు’’.

‘‘అది వ్యాపారంలో భాగం కావచ్చు’’.

‘‘అందరూ వ్యాపారాలు చేస్తారు. ఇలా చేయరు. వారికి స్పాన్సర్లు వుంటారు!’’

‘‘ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను రిత్విక్‌. ‌నా జీవితంలో నేను ఓ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాను. అప్పుడు చాలా ఆవేశంలో వున్నాను. అప్పుడు చాలా మంది నాకు ఉత్తరాలు రాసారు. అందులో నువ్వు రాసిన లేఖ వుంది’’.

రిత్విక్‌కి ఆశ్చర్యం… అయిదారు సంవత్సరాల క్రితం జరిగిందది.

‘‘మిగతా వారికంటే భిన్నంగా రాసావు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అప్పటికప్పుడు నీకు ఫోన్‌ ‌చేసి తిట్టాలనుకున్నాను. నీకు ఏం తెలుసని నాకు సలహా ఇస్తున్నావని. ఏం జరిగిందో నీకు తెలియదు కదా! మీరందరూ నాకు దూరంగా వున్నవారే కదా!’’

రిత్విక్‌ ‌ముఖం పాలిపోయింది.

‘‘ఇదే సలహా వారికి ఇవ్వగలవా?’’

‘‘అది సలహా కాదు సర్‌. ‌నా అభిప్రాయం. నాకు కేవలం మీతో పరిచయం వుంది. ఏం జరిగిందో నాకు తెలియకపోవచ్చు. కానీ ఎంత జరిగినా, అందులో సమన్వయం అవసరం అని నాకు అనిపించింది’’.

‘‘నేను మాట్లాడటం ఇంకా పూర్తి కాలేదు రిత్విక్‌. అప్పుడే అనుకున్నాను. ఇంక నీ రచనలను నా పత్రికలో ప్రచురించకూడదని. నీకు నేను ఉత్తరం రాయ కపోవచ్చు. నీతో మాట్లాడకపోవచ్చు. కానీ నా కోపాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసు..’’ అని….

‘‘ఆ తర్వాత అనుకున్నాను. నన్ను సపోర్ట్ ‌చేస్తూ ఉత్తరాలు రాసిన వారికి మాత్రం జరిగింది తెలుసా అని…అవి చదివినప్పుడు నాకు ఎందుకు తృప్తి కలిగింది? ఎవరు ఎందుకు పూజలు చేస్తారో, ప్రశంసలు కురిపిస్తారో, ఉత్తరాలు రాస్తారో తెలుసుకునే స్థితిలో నేను లేనా?అనుకున్నాను. అప్పుడు కూడా నేను నీ మీద అసహనాన్ని అలానే వుంచుకున్నాను. అది గోవింద్‌ ‌బుద్ధలో స్థిరపడుతున్న లక్షణం’’.

రిత్విక్‌ ఆయన్ని చూస్తుండిపోయాడు.

‘‘నాతో జర్నీ మొదలు పెట్టిన వారు, నాకు కంట్రిబ్యూట్‌ ‌చేసిన వారు, నా విజయాల్ని చూసి తట్టుకోలేక నా వెనకాల ఏం మాట్లాడుకుంటారో నాకు తెలుసు. నేను అందర్నీ దూరం చేసుకున్నాను అంటారు. అందులో వారు తమ గురించి ఆలోచించరు. నాకు ఎప్పుడూ పాఠకుడు ముఖ్యం’’.

‘‘నేను అలా రాయటం వెనక మీరున్నారు సర్‌. అది మీ సంపాదకీయాల ప్రేరణతో రాసాను’’ అన్నాడు రిత్విక్‌….

ఆయన కొంచెం సేపు ఆలోచిస్తుండిపోయాడు.

‘‘ఆయినా నువ్వు సంవత్సరానికి ఎన్ని రాయగలవు. ఓ నవల, నాలుగు కథలు. ఇంతకు ముందు వాటిని ప్రచురించాను. మంచి స్పందన వచ్చింది. అయినా.. దటీజ్‌ ‌గోవింద్‌ ‌బుద్ధా’’ అన్నాడు.

‘‘నాకు ఇంకా చాలు సర్‌’’ అన్నాడు రిత్విక్‌.

‘‘అయితే నువ్వు భోజనం చెయ్యి’’.

‘నేను మీరు పూర్తి చేసేంత వరకు వెయిట్‌ ‌చేస్తాను. మీకు సర్వ్ ‌చేసాక నేనూ భోజనం చేస్తాను’’.

‘‘ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను రిత్విక్‌… ‌నువ్వు భోజనం చెయ్యి’’.

‘‘మీరు ఏమీ అనుకోనంటే ఒకటి చెబుతాను. మీ ఆరోగ్యం అంత బాగుండ లేదు అన్నారు…’’ అని ఆగాడు.

‘‘నిజమే. బాగుండటం లేదు. నన్ను చూస్తుంటే నీకు అర్థం అవుతోంది కదా?  నా శారీరక అనారోగ్యం కంటే మానసిక ఆరోగ్యం బాగుండటం లేదు. అయినా…’’ అని ఆగాడు.

‘‘మనం రేపు ముంబయ్‌ ‌వెళ్తున్నాం. నాకు సర్వెంట్‌ ‌సర్వ్ ‌చేస్తాడు. నువ్వు త్వరగా నిద్రపో.. నీ ఆరోగ్యాన్ని చెడగొట్టటం కోసం నిన్ను పిలవలేదు’’ అన్నాడా యన.

అరగంట తర్వాత రిత్విక్‌ ‌తన గదికి వచ్చి తన డైరీ తీసుకున్నాడు.

‘‘మొదటిసారి నేను గోవింద్‌జీతో కలిసి డ్రింక్‌ ‌చేసాను. ఈ రోజు జరిగిన సంభాషణల్లో అనేక కోణాలు అర్థం అవుతున్నాయనిపిస్తోంది. హారికతో ఇప్పుడు చాలా మాట్లాడాలని వుంది. ఇది సమయం కాదు. తను కూడా నిద్రపోయి వుంటుంది. ఇప్పటికీ గోవింద్‌జీ నన్ను ఎందుకు పిలిచారో స్పష్టత లేదు. త్వరలో వస్తుంది అనుకుంటున్నాను’’ అని రాసుకున్నాడు.

—————-

ఉదయం త్వరగానే మెలకువ వచ్చింది.

రిత్విక్‌ ‌బ్రష్‌ ‌చేసాక కాఫీ తాగాడు. మరో అరగంట తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నాడు. పత్రికల హెడ్‌ ‌లైన్స్ ‌చదివాడు. నీట్‌గా షేవ్‌ ‌చేసుకున్నాడు. స్నానం పూర్తి అయ్యాక ఇంటికి ఫోన్‌ ‌చేసాడు.

‘‘ఇప్పుడే నిద్ర లేచారా?’’

‘‘లేదు. చాలా సేపు అయింది’’.

‘‘ఇప్పటికి గుర్తు వచ్చానా!’’ అంది హారిక.

‘‘రాత్రి సర్‌తో డ్రింక్‌ ‌చేసాను’’.

‘‘అందుకు పిలిచారా?’’

‘‘అవును. ఆయనకు ఎవరూ తోడు దొరక్క’’.

ఇద్దరూ నవ్వుకున్నారు.

‘‘ఈ రోజు ముంబయ్‌ ‌వెళ్తున్నాం’’.

‘‘ఎందుకో?’’

‘‘డ్రింక్‌ ‌చేయటానికి మాత్రం కాదు. అయినా ఇలాంటి ప్రశ్నలు నువ్వు అడగకూడదు. ఎందుకో తెలిస్తే నేనే చెబుతాను’’.

‘‘మనం ఇంతకు ముందు ముంబయ్‌ ‌వెళ్లాం. అక్కడి తెలుగు వారు మిమ్మల్ని పిలిచారు. ఆ ప్రయాణం గుర్తు వస్తోంది’’.

‘‘అప్పుడు ట్రైన్‌లో వెళ్లాం. ఇప్పుడు నన్ను ఫ్లైట్‌లో తీసుకు వెళ్తున్నారు’’ చెప్పాడు రిత్విక్‌.

‘‘ఇది ఆరంభమే. ఈ ప్రయాణాలు మిమ్మల్ని ఇంకో దేశానికి కూడా తీసుకు వెళ్లవచ్చు అనుకుంటున్నాను’’.

‘‘ఏదీ మన చేతిలో లేదు హారికా’’ అన్నాడు.

‘‘సరే. మీరు మాట్లాడుతుండండి’’ అంది హారిక. తర్వాత కారు వచ్చింది. గోవింద్‌ ఉల్లాసంగా కనిపించాడు. రాత్రి తాలూకు ప్రభావం ఏమీ కనిపించలేదు.

ఫ్లైట్‌ ‌గాల్లోకి లేస్తున్నప్పుడు విచిత్రమైన అనుభూతి కలిగింది. గోవింద్‌ ‌రిత్విక్‌ని విండో సీట్‌లో కూర్చోబెట్టాడు. ఈ రోజు మేఘాలు దట్టంగా వున్నాయి. వాటి మధ్య ప్రయాణం సరికొత్తగా వుంది. రిత్విక్‌ ఇం‌తకు ముందు రెండుసార్లు విమానయానం చేసాడు.

అప్పుడు పైలట్‌  ‌మాట్లాడటం వినిపించింది. ఇప్పుడు ముఫై వేల కిలోమీటర్ల ఎత్తులో వున్నాం అని.

 ఓ ఆర్టిస్ట్ ‌గోవింద్‌ని గుర్తు పట్టి దగ్గరకు వచ్చాడు.

‘‘మీరు గోవింద్‌ ‌బుద్ధ… అవును కదూ’’.

ఆయన చిరునవ్వు నవ్వాడు.

‘‘మీవి లార్జెస్ట్ ‌సర్క్యులేటెడ్‌ ‌మ్యాగ్జేన్స్. ‌మా సినిమా వాళ్ల మీద మీరు కాస్త దయ చూపించాలి’’.

గోవింద్‌ ‌భ్రుకుటి ముడిపడింది – అదేంటి అన్నట్లుగా…

‘‘మిగతా పత్రికలను అంతగా పట్టించుకోరు. మీరు ఇచ్చే రివ్యూల ప్రభావం సినిమాల మీద పడుతోంది. అలాగే కలెక్షన్ల గురించి కూడా’’.

‘‘ఈమధ్య సినిమాలు వారం రోజులే కదా ఆడేది. మేం వారం తర్వాత ఇస్తున్నాం. అప్పటికే ఆ సినిమాల ఫలితాలు తేలిపోయి వుంటాయి. అయినా సినిమా ప్రజలకు నచ్చితే మేం బాగుందని రాసినా చూడరు. బాగో లేదన్నా చూడకుండా వుండరు’’ అన్నాడు గోవింద్‌.

‘‘‌నిజమే అనుకోండి. మీ పత్రికలో నా గురించి చిన్న ఇంటర్వ్యూ వచ్చినా ధన్యుడ్ని అవుతాను. అది నా కెరీర్‌కి ఫ్లస్‌ అవుతుంది’’.

చిన్నగా నవ్వాడు. అతను నమస్కరించి తన సీట్‌ ‌దగ్గరికి వెళ్లిపోయాడు.

‘‘ఫ్లైట్స్‌లో ఇలాంటి అనుభవాలు చాలా వుంటాయి రిత్విక్‌’’.

‘‘అవును సర్‌’’.

‘‘‌నేను ఎవరితోనూ ఐ విల్‌ ‌బి విత్‌ ‌యు అనలేదు. కొంత మంది నా వెనక గోవింద్‌ ‌వున్నాడని చెప్పుకుంటారు. నేను నీ వెనక వున్నానా రిత్విక్‌?’’ అడిగాడు.

‘‘దానికి ముందు ఇన్‌ ‌కేసాఫ్‌ ‌ఫెయిల్యూర్‌ అన్నారు. నేను పూర్తిగా ఫెయిల్‌ అయ్యాననుకోవటం లేదు సర్‌. ‌కాకపోతే టీ.వీ.కి మారాను. సినిమా నుంచి’’ అంటూ…

‘‘సర్‌ ఓ ‌చిన్నమాట మనుషుల జీవితాల్లో చాలా మార్పును తీసుకు వస్తుంది. నా వెనక ఓ మహాపర్వతం వుందన్న ఫీలింగ్‌ ‌చాలు. ఆ రకంగా ఎప్పుడూ మీరు నా వెనకాల వున్నారు. అఫ్‌కోర్స్ ‌నా ముందు కూడా. మీ శ్రమని నేను ఫాలో అవుతున్నాను. మీరు అంగీకరించక పోవచ్చు. మీరు నా మెంటార్‌’’.

‘‘‌రిత్విక్‌… ‌నేను ఇంకో కోణం గురించి చెబుతాను. ఓ చిన్నమాట మనుషుల జీవితాల్లో అగాథాల్ని సృష్టిస్తుంది. అవునా? కాదా?’’

‘‘నిజమే సర్‌’’ అన్నాడు రిత్విక్‌.

—————-

కారు ఓ అపార్ట్‌మెంట్‌ ‌దగ్గర ఆగింది.

ఇద్దరూ దిగారు. అదేమంత వైభవంగా లేదు. అయినా ముంబయ్‌లో అలాంటి ఫ్లాట్‌ ‌కావాలంటే కనీసం రెండున్నర కోట్లు అవుతుంది అనుకున్నాడు రిత్విక్‌.

‌లిఫ్ట్‌లో అన్నాడు గోవింద్‌.

‘‘‌మనం రామకృష్ణ గారిని కలుస్తున్నాం’’.

ఆయనెవరో అర్థం కాలేదు రిత్విక్‌కి.

డోర్‌ ‌బెల్‌ ‌ప్రెస్‌ ‌చేయగానే ఓ ముసలి వ్యక్తి తలుపు తీసి చేతులు జోడించాడు – గోవింద్‌కి.

‘‘పెద్దాయన నిద్రపోతున్నారా?’’

‘‘లేదు. బాల్కనీలో వున్నారు’’ అన్నాడు.

‘‘రా! రిత్విక్‌’’ అన్నాడు గోవింద్‌.

ఇద్దరూ ఆ గదికి వెళ్లారు.

‘‘రామకృష్ణ సర్‌’’ అని పిలిచాడు. అప్పుడు ఆయన వెనక్కి తిరిగాడు.

దబ్బపండు ఛాయలో మెరిసిపోతున్నాడు. కళ్లజోడు అద్దాలు కాస్త మందంగా వున్నాయి. ఎనభై సంవత్సరాలు వుంటాయేమో అనిపించింది. అతన్ని చూడగానే ఎందుకో తెలీని ఓ గౌరవం కలిగింది. మూర్తీభవించిన అనుభవంలా వున్నాడు.

అతని గతం అంతా వైభవంతో నిండి వుండి వుంటుందని రిత్విక్‌ ‌వూహిం చాడు. ఇంగ్లీష్‌ ‌సినిమాల్లో ఇలాంటి వ్యక్తులను చూసాడు.

‘‘గోవింద్‌… ‌హోటల్లో దిగావా?’’

‘‘లేదు. నేరుగా ఇక్కడికే వచ్చాను’’.

‘‘ఐసీ…’’ అని రిత్విక్‌ని చూసి… ‘‘వీరూ’’ అన్నాడయన.

‘‘రిత్విక్‌….’’

‘‘‌తెలుగు వారేనా?’’

‘‘అవును. సినిమా అంటే ప్యాషన్‌  ‌వుంది’’.

‘‘మీకా… మీ ఫాదర్‌ ‌కా?’’ అన్నాడు రామకృష్ణ.

‘‘మా ఫాదర్‌కి లేదు సర్‌. ‌నా పేరు రుత్విక్‌… అం‌దరూ రిత్విక్‌ అం‌టారు’’.

ఆయన చిన్నగా తలూపాడు. గది లోపలకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు.

‘‘నువ్వు ఎవరినో తీసుకు వస్తానని చెప్పావు. నేను కొన్ని విషయాలు మరిచి పోతున్నాను గోవింద్‌…’’

‘‘‌మీకే అలాంటి ప్రమాదం వచ్చింది’’.

‘‘కూర్చోండి’’ అన్నాడు.

గది విశాలంగానే వుంది. ఇద్దరూ కూర్చున్నారు.

కొద్ది సేపు మాటలు లేవు. ఇంతలో ముసలాయన వచ్చి…

‘‘చాయ్‌ ఇవ్వమంటారా?’’ అని అడిగాడు.

రిత్విక్‌ ‌తటపటాయిస్తుంటే…

‘‘తీసుకురా రాజన్‌’’ అని…

‘‘రిత్విక్‌… ‌టీ తాగవచ్చు. బాగుంటుంది’’ అన్నాడు.

About Author

By editor

Twitter
YOUTUBE