– క్రాంతి

ఇటీవల (మే 22-24) శ్రీనగర్‌లో పర్యాటకంపై జరిగిన జి-20 సమావేశాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని పాకిస్తాన్‌ ‌చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడమే కాదు, మూడు రోజుల సమావేశం విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, విస్తరిస్తున్న పర్యాటక రంగాలను ప్రపంచ దేశాలకు భారత్‌ ‌స్పష్టంగా తెలియజెప్పగలిగింది. 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం ఇది.

పాకిస్తాన్‌, ‌చైనాలకు కశ్మీర్‌లో శాంతి సుస్థిరతలు నెలకొనడం ఎంతమాత్రం ఇష్టం లేదు. సభ్యదేశాలను సమావేశంలో పాల్గొనకుండా దౌత్యమార్గాల్లో పాక్‌ ‌చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. (నిజానికి పాక్‌ ‌జి-20 సభ్యురాలు కూడా కాదు.) మొత్తం 27 దేశాలకు చెందిన 59 మంది ప్రతినిధులు శ్రీనగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఉత్సాహంగా పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న ఇండొనేసియా, యూఏఈ, బంగ్లాదేశ్‌లు పాల్గొనడం విశేషం. ఇండొనేసియా ఇస్లామిక్‌ ‌గ్రూపు దేశాల్లో సభ్యురాలు కూడా! బంగ్లాదేశ్‌ ‌హైకమిషనర్‌ ‌ముస్తాఫిజుర్‌ ‌రహమాన్‌తో పాటు యూఏఈకి చెందిన ఇద్దరు అధికారులు పాల్గొన్నారు. సౌదీ అరేబియా అనధికార ప్రతినిధులను పంపగా, టర్కీ, చైనాలు గైర్హాజరయ్యాయి. భారత్‌ అతిథులుగా ఆహ్వానించిన ఈజిప్ట్ ‌నుంచి అనధికార ప్రతినిధులు హాజరుకాగా ఒమన్‌ ‌తన ప్రతినిధులను పంపలేదు. ఈ సమావేశాన్ని ప్రపంచ మీడియా బాగా కవర్‌ ‌చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి కవరేజీ రావడం వల్ల రానున్న కాలంలో జమ్ము కశ్మీర్‌లో పర్యాటకం మరింత ఊపందుకునే అవకాశ మున్నదని అంచనా. జి-20 సమావేశం విజయ వంతమైన ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి కూడా. 370 అధికరణ ఎత్తివేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో చోటుచేసుకున్న అభివృద్ధిని వివిధ దేశాల ప్రతినిధులు వీక్షించే అవకాశం కలిగిందని ఇటలీకి చెందిన ఫెడ్రికో గిలియానీ ‘ఇన్‌సైడ్‌ ఒవర్‌’ అనే న్యూస్‌ ‌వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలో విలీనం చేయడం వల్ల జమ్ముకశ్మీర్‌కు ఎంతో ప్రయోజనం కలిగిందన్నది స్పష్టమైందంటూ విశ్లేషించడం గమనార్హం. వాషింగ్టన్‌లోని అమెరికన్‌ ఎం‌టర్‌‌ప్రైజ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మైఖేల్‌ ‌రూబిన్‌ ‘‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌జమాయితే ఇస్లామీ ఉగ్రవాదం వల్ల అణచివేతకు గురై, ప్రస్తుతం ఆర్థికంగా దయనీయస్థితిలో కొనసాగుతుంటే, భారత్‌ అధీనంలోని జమ్ముకశ్మీర్‌ ‌ప్రజలు ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు పట్ల ఆశ, స్వేచ్ఛలోని ఆనందాన్ని అనుభ విస్తున్నార’ న్నారు. ఈయన పీఓకేలో, జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు. కేలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌ ‌నగర మేయర్‌ ‌కార్మెన్‌ ‌మోంటెనా జమ్ముకశ్మీర్‌ ‌వ్యాపారాల్లో భాగస్వామ్యం కావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా జి-20 సమావేశం విజయవంతమైన ఫలితమే! జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఫరూఖ్‌ ‌వాణి కశ్మీర్‌లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు.

వాస్తవాలు తెలుసుకుంటున్న ప్రపంచం

370 అధికరణం రద్దుచేసిన తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి చర్యలను అంతర్జాతీయ మీడియా పట్టించుకోలేదు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ‌సమయం దొరికినప్పుడల్లా జమ్ము కశ్మీర్‌ ‌విషయంలో భారత్‌పై విషం చిమ్మేది. హింసా త్మక సంఘటనలు క్రమంగా తగ్గిపోవడం, గ్రామ స్థాయిలో క్రమంగా విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం వాటికి పట్టలేదు. పాకిస్తాన్‌ ‌వెన్నుదన్నుతోనే ఇక్కడి ఉగ్రవాదం పెచ్చరిల్లిందన్న వాస్తవం కూడా వాటి కళ్లకు కనిపించ లేదు. కేవలం సైద్ధాంతిక వైము ఖ్యంతో జమ్ముకశ్మీర్‌ ‌దుస్థితికి కారణం భారత్‌ ‌మాత్రమేనని తప్పుడు విమర్శలు చేయడం నిజంగా ప్రమాదరకరం. ప్రస్తుత జి-20 సమావేశం విజయ వంతం కావడంతో, వ్యాపార, వాణిజ్యాలకు జమ్ము కశ్మీర్‌ అత్యంత అనుకూలమన్న సందేశం ప్రపంచ దేశాలకు అందింది. ముఖ్యంగా ఇప్పటివరకు జరిగింది కేవలం తప్పుడు ప్రచారమన్న సంగతి కూడా ప్రపంచా నికి సుస్పష్టమైంది. ఇప్పటికే కశ్మీర్‌లో ఊపందు కుంటున్న పర్యాటకం, వాణిజ్యాలకు జి-20 దేశాల సమావేశం మరింత చోదకశక్తిని అందించ గలదు.

కశ్మీర్‌లోనే ఎందుకు?

జి-20 సమావేశాలు సాధారణంగా జరిగేవే కదా.. దీనికి ఇంత ప్రచార ఆర్భాటం ఎందుకని కొందరు విమర్శించారు. శ్రీనగర్‌లో పర్యాటక రంగంపై వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌సదస్సును నిర్వహించడాన్ని కూడా తప్పు పడుతున్నారు. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలున్నాయి. 2019 ముందు వరకూ అంతర్జాతీయ సమావేశాలు కశ్మీర్‌లో జరిగిన చరిత్ర లేదు. ప్రపంచంలోనే టాప్‌ 20 ‌దేశాల శిఖరాగ్ర సమావేశం కశ్మీర్‌లో జరగడం చాలా ప్రత్యేకం. జమ్ముకశ్మీర్‌ ‌భారత్‌లో శాశ్వత అంతర్భాగం అని అంతర్జాతీయ ప్రపంచానికి చాటి చెప్పడానికే జి-20 సమావేశాలను ఇక్కడ నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370‌ని రద్దు తర్వాత అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడ్డాయని ప్రపంచానికి చాటేందుకే ఈ సదస్సు నిర్వహించామని ప్రభుత్వ చెప్పింది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందర కశ్మీరాన్ని ప్రపంచానికి చూపించేందుకు ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్‌, ‌చైనాలు భారత్‌ ‌మీద అమలు చేస్తున్న కుట్రలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఆయన కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ‌ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని సమా చారం. పాకిస్తాన్‌, ‌చైనా కశ్మీర్‌పై ఎంత పనిగట్టుకొని దుష్ప్రచారం చేసినా భారత్‌ ‌జి-20 సమావేశాన్ని కశ్మీర్‌లో నిర్వహించి ఆ దేశాల నోళ్లు మూయిస్తోంది. అంతర్జాతీయ సమాజం కూడా ఈ సమావేశంతో కశ్మీర్‌ ‌భారత్‌లోనే అంతర్భాగం అని అంగీకరించి నట్టు అయ్యింది. అందుకే ఈ సమావే శాన్ని భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జి-20 సమావేశం కోసం 60 మందికి పైగా విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ ప్రముఖులు కశ్మీర్‌ అం‌దాలను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పర్యాటక, వాణిజ్య రంగాలపై ఈ సదస్సు సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

బుద్ధి మారని పాకిస్తాన్‌

ఈ ‌సదస్సును పాకిస్తాన్‌ ‌బహిష్కరించగా, చైనా కూడా ఇదే బాట పట్టింది. వివాదాస్పద ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తు న్నట్టు ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్నా పాకిస్తాన్‌ ‌తన బుద్ధిని మార్చుకోవడం లేదు. జి-20 సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను సరిహద్దు దాటించే ప్రయత్నం చేసింది పాక్‌ ‌సైన్యం. దీంతో భారత సరిహద్దు వెంబడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీఓకే)లో ఉన్న నీలం, జీలం, లీపా లోయల వెంట 10-20 మధ్య ఉగ్రవాద గ్రూపులు తిష్టవేసి అదును కోసం వేచి చూశాయి. అయితే ఈ పరిణామాలను భారత్‌ ‌గమనించి, గట్టిగా తిప్పికొట్టింది.

జమ్ముకశ్మీర్‌లో అస్థిరతను, అభద్రతను పెంచేందుకు పాక్‌ ‌కుయుక్తులు పన్నింది. జి-20 సమావేశం విజయవంతమైతే కశ్మీర్‌లో ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన, అశాంతి లేదని అంత ర్జాతీయ సమాజానికి సందేశం వెళ్తుంది. అందుకే ఇది జరగకూడదని పాకిస్తాన్‌ ‌భావించింది. ఇటీవల గోవాలో జరిగిన జి-7 సన్నాహక సమావేశానికి వచ్చిన పాకిస్తాన్‌ ‌విదేశాంగ మంత్రి బిలావల్‌ ‌భుట్టో… జి-20 సమావేశాన్ని ఉద్దేశించి మనసులో ఉన్న అక్కసు బయటపెట్టాడు. అదును చూసి సమాధానం చెబుతామంటూ హెచ్చరించే విధంగా మాట్లాడాడు.దీంతో భారత్‌ ‌మరింత అప్రమత్తమైంది.

దాడుల్ని గట్టిగా తిప్పికొట్టిన భారత దళాలు

పాకిస్తాన్‌ ‌విదేశాంగ మంత్రి బిలావల్‌ ‌భుట్టో భారత్‌ ‌పర్యటన ఖరారైన కొన్ని గంటల్లోనే జమ్ముకశ్మీర్‌లో పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రమూకలు దారుణానికి పాల్పడ్డాయి. జి-20 టూరిజం వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌సమావేశాన్ని వ్యతిరేకించిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ ‌యాంటీ-ఫాసిస్ట్ ‌ఫ్రంట్‌ (‌పీఏఎఫఎఫ్‌) ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకుంది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ ‌ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ ‌యూనిట్‌ (ఆర్‌ఆర్‌యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్ల ఒంట్లో దూసుకు పోయిన 7.62 ఎంఎం తూటాలు చైనాలో తయారై నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటన తర్వాత కూడా ఉగ్రవాదులు చొరబాటు ప్రయ త్నాలు చేశారు. దాన్ని భద్రతా దళాలు సమర్థ వంతంగా తిప్పికొట్టాయి. ఉగ్రవాదులకు సహాయం చేసేందుకు పాక్‌ ‌సైన్యం పంపిన డ్రోన్‌పై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో డ్రోన్‌ ‌తిరిగి పాక్‌లోకి వెళ్లిపోయింది.

మరోవైపు ఈ జి-20 సమావేశాలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్‌ ‌గూఢచార సంస్థ ఇంటర్‌ ‌సర్వీస్‌ ఇం‌టెలిజెన్స్ (ఐఎస్‌ఐ), ఉ‌గ్రవాదులతో కలిసి పన్నిన కుట్ర కూడా బయటపడింది. 26/11 ముంబై దాడుల వంటి మరో దాడికి పథకం తయారు చేసింది. ఏకకాలంలో రెండు మూడు చోట్ల దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని తెలిసింది. గుల్‌మార్గ్‌లోని ఓ ఫైవ్‌ ‌స్టార్‌ ‌హోటల్లో ఉగ్రవాదుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫరూక్‌ అహ్మద్‌ ‌వనీ భద్రతా బలగాలకు చిక్కాడు. ఇతనికి ఐఎస్‌ఐ అధికారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తేలింది. విచారణలో కీలక సమాచారం బయటపడింది.

అడుగడుగునా బందోబస్తు

శ్రీనగర్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సు కోసం జమ్ముకశ్మీర్‌ అం‌తటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్‌ఎస్‌జీ, సీఆర్పీఎఫ్‌, ‌మెరైన్‌ ‌కమాండోలు, సైన్యం, జమ్ముకశ్మీర్‌ ‌పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌ ‌దాల్‌ ‌సరస్సులో మెరైన్‌ ‌కమాండోలు గస్తీ కాశారు. శ్రీనగర్‌ ‌మొత్తాన్ని ‘నో డ్రోన్‌’ ‌జోన్‌గా ప్రకటించారు. కశ్మీర్‌ ‌లోయ ప్రాంతంలో ఎలాంటి పుకార్లు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు.

అక్కడి నాయకులూ తక్కువేం కాదు!

జమ్ముకశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడటం గతంలో ఆ రాష్ట్రాన్ని పాలించిన ప్రాంతీయ పార్టీలకు కూడా నచ్చడం లేదు. ఇలాగైతే తమ పప్పులు ఉడకవని భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద అక్కసు వ్యక్తం చేసేందుకు జి-20ని కూడా ఉపయోగించుకున్నాయి. శ్రీనగర్‌ ‌సదస్సు విజయవంతమైతే ఈ ఘనత అంతా బీజేపీకే పోతుందన్నది వీరి బాధ. అందుకే జి-20 సదస్సును శ్రీనగర్‌ ఏర్పాటు చేయడం ద్వారా జమ్ముకి అన్యాయం చేశారనే విచిత్రమైన వాదన మొదలు పెట్టాడు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా. అంతేకాదు, జి-20 సందర్భంగా శ్రీనగర్‌లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమా లను కూడా ఆయన జీర్ణించుకోలేక పోయాడు. ఇక మరో మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ తీరు ఇంకోలా ఉంది. తాను జి-20కి తాను వ్యతిరేకంగా కాదంటూనే బీజేపీ దాన్ని హైజాక్‌ ‌చేసిందని ఆరోపించారు. చివరకు జి-20 లోగోను కూడా కమలంవలె తయారు చేశారని విమర్శించారు.


సమస్య ఇప్పటిది కాదు!

1971 పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత భారత్‌-‌పాక్‌ల మధ్య సిమ్లా ఒప్పందం, 1972 జులై 2న రెండు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్‌ అధ్యక్షుడు జుల్‌ఫికర్‌ అలీ భుట్టో దీనిపై సంతకాలు చేశారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాజధాని సిమ్లాలో ఈ ఒప్పందం జరగడం వల్ల ఇది సిమ్లా ఒప్పందంగా పేరు పడింది. దీని ప్రకారం భారత్‌, ‌పాక్‌లు తమ సమస్యలను దౌత్యచర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఐక్యరాజ్య సమితి సహా మరే ఇతర దేశ ప్రమేయాన్ని ఈ ఒప్పందం నిరోధిస్తోంది.

ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రదేశాన్ని ‘నియంత్రణ రేఖ’గా గుర్తించడంతో, భారత్‌, ‌పాకిస్తాన్‌లోని యునైటెడ్‌ ‌నేషన్స్ ‌మిలిటరీ అబ్జర్వర్‌ ‌గ్రూప్‌ ‌వల్ల ప్రయోజనం లేదని భారత్‌ ‌వాదించడంలో సహేతుకత ఉంది. 1947లో భారత్‌-‌పాక్‌ల మధ్య జరిగిన యుద్ధంలో ‘కాల్పుల విరమణ’ రేఖవద్ద అతిక్రమణలు జరగకుండా ఉండేందుకు ఈ అబ్జర్వర్‌ ‌గ్రూప్‌ ఏర్పాటుకు రెండు దేశాల సైనిక ప్రతినిధులు 1949 జులై 27న ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే సిమ్లా ఒప్పందం నేపథ్యంలో 1948 నాటి ఐక్యరాజ్య సమితి 39వ తీర్మానానికి, ఏర్పాటైన ఈ గ్రూపునకు విలువ లేకుండా పోయింది. ద్వైపాక్షిక సమస్యలపై మధ్యవర్తి ప్రమేయాన్ని నిరోధించే సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన పాక్‌, ఇప్పుడు మళ్లీ ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని లేవనెత్తడం కేవలం దాని నక్కజిత్తుల వైఖరికి నిదర్శనం.


అభివృద్ధి పథంలో జమ్ముకశ్మీర్‌

శ్రీ‌నగర్‌ ‌నడిబొడ్డున ఉన్న 70 ఏళ్లనాటి ‘పోలో వ్యూ మార్కెట్‌’ ‌కొత్త శోభను సంతరించుకుంది. దాల్‌ ‌లేక్‌ ‌సమీపంలో ఉండే ఈ మార్కెట్‌  ఇప్పుడు సరికొత్త మెరుగులు అద్దుకుని యూరప్‌ ‌దేశాల్లోని వీధులకు తగ్గకుండా ఆకర్షిస్తోంది. జి- 20 సమావేశాలను దృష్ఠిలో పెట్టుకొని సుందరీకరణ పనులు చేపట్టారు. రెసిడెన్సీ రోడ్‌, ‌లాల్‌ ‌చౌక్‌, ఓల్డ్ ‌సిటీల్లోని మార్కెట్‌ల తరహాలోనే పోలో వ్యూ మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేశారు.

అంతేకాదు, అన్ని రంగాల్లో జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో జమ్ముకశ్మీర్‌ 14.64% ఆర్థిక ప్రగతిని నమోదు చేయగా, పన్నుల వసూళ్లు 31% పెరిగాయి. మొత్తం 1.88 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారు. ఇది గత ఏడు దశాబ్దాల కాలంలో అత్యధికం. వీరిలో 20 వేల మంది విదేశీ యాత్రికులు కావడం గమనార్హం. గత ఏడాది పదినెలల కాలంలో జమ్ముకశ్మీర్‌లోకి వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.1547.87 కోట్లు. గత మూడేళ్ల కాలంలో 500 స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. ‘మై యూత్‌ ‌మై ప్రైడ్‌’, ‘‌హర్‌ ‌దిన్‌ ‌ఖేల్‌ ‌హర్‌’, ‘ఏక్‌ ‌కేలియే ఖేల్‌’ ‌కార్యక్రమాల కింద 50 లక్షల మంది యువకులు వివిధ క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. 2,02,749 మంది యువకులకు వివిధ స్వయం ఉపాధి పథకాల కింద సహాయం అందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జి జమ్ము కశ్మీర్‌లో నిర్మితమైంది. వివిధ టన్నెల్స్ ‌నిర్మాణం ద్వారా జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌ల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌ ‌సంస్థ జమ్ముకశ్మీర్‌లో 60 మిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నది. దీనివల్ల ఏడు నుంచి ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైవేలు, మోటార్‌వేల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదం నుంచి బయటపడిన జమ్ముకశ్మీర్‌ ఇప్పుడు సౌభాగ్యంతో కళకళలాడుతోంది.

ఒకప్పుడు ఇస్లామాబాద్‌ ‌నుంచి పిలుపునిస్తే శ్రీనగర్‌ ‌మొదలు లోయలోని మారుమూల ప్రాంతాల వరకూ హర్తాళ్లు జరిగేవి. చిన్న ఘటన జరిగినా దుకాణాలు మూసేవారు. ఇప్పుడు భద్రతా దళాలు ఇచ్చిన ధైర్యంతో వారి వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు. కశ్మీర్‌ ఎం‌తో మారిపోయిందని, ఒకప్పటిలా అలర్లు, బంద్‌లకు పిలుపునిచ్చేవారు, పాటించేవారు లేరని స్థానికులే చెబుతున్నారు.


వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE