జూన్‌ 20 ‌జగన్నాథ రథయాత్ర

జగన్నాథుడు అంటే విశ్వరక్షకుడు. ఆయన కొలువుదీరిన పుణ్యస్థలి పూరిని శ్రీ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి, జగన్నాథపురి, పురు షోత్తమ ధామం అంటారు. ఈ క్షేత్రంలోని దేవదేవతా విగ్రహాలనుంచి ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో ఎన్నో ప్రత్యేకతలు. తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమ లేశుని కీర్తిస్తూ, ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు…’ అన్నారు. అది పూరీనాథుడికీ అన్వయిస్తుంది. ఆయనను శైవులు శివుడిగా, శాక్తేయులు భైరవుడిగా, బౌద్ధులు బుద్ధునిగా, జైనులు ‘తీర్థం’గా అర్చిస్తారు. శంకర భగవత్పాదులు, రామానుజ యతీంద్రులు, మధ్వాచార్యులు తదితర ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. దేశంలో ప్రధాన ఆలయం చుట్టూ పార్వ్శదేవతల ఆలయాలు, వంట శాల, ఆనంద బజార్‌ (‌ప్రసాదాల విక్రయ శాల) ఉండి వీటన్నిటిని ఒక గీత(రేఖ)తో కలిపితే శంఖాకారం వస్తుంది. అందుకే దీనికి ‘శంఖక్షేత్రం’మని పేరు.

మోక్షదాయక క్షేత్రాలలో పూరి ఒకటి. విష్ణు, మత్స్య, వామన, స్కందపురాణాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడి దేవతామూర్తులు బలభద్ర, సుభద్ర జగన్నాథుడు ‘దైవం చెక్కిన దారుశిల్పాలు’. కలపతో రూపొందే మూర్తులు కనుక ‘ప్రకృతి దేవుళ్లు’ అనీ వ్యవహరిస్తారు. వారి విగ్రహాలు మొండి చేతులతో, నడుం వరకే దర్శనమిస్తాయి.

ఇందుకు సంబంధించి వాడుకలో ఉన్న కథనం ప్రకారం, పూరీనాథుడికి నీల మాధవుడు అనీ పేరు. విశ్వావసు అనే శబర నాయకుడు ఈ స్వామికి తొలి పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. గంగ వంశీ యులు స్వామికి ఆలయం నిర్మించారు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహం కాలగర్భంలో కలసిపోగా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయ త్నాలు సాగాయి. ‘సముద్రంలో కొట్టుకు వచ్చే కలపదుంగతో తన మూర్తిని చెక్కించవలసింది’గా ఇంద్రద్యుమ్నుడనే రాజును శ్రీమహావిష్ణువు స్వప్నంలో ఆదేశిస్తారు. ఈ కార్యభారాన్ని స్వీకరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ‘21 రోజలు వరకు తన పనికి ఆటంకం కలిగించవద్ద’ని సూచిస్తారు. అయితే రాజదంపతులు ఉత్సుకతతో పక్షం రోజులకే తలుపులు తెరిపించగా, మూడు ప్రతిమలు అసంపూర్ణంగా కనిపించాయట. శిల్పి జాడలేదు. దాంతో ఆ శిల్పిని సాక్షాత్‌ శ్రీ‌మన్నా రాయణుడిగా భావించిన రాజు తమ పొరపాటునకు చింతించి, ఆ మూర్తులను యథాతథంగా ప్రతిష్ఠించి మందిరం కట్టించారట.

రథత్రయం

ఇతర క్షేత్రాలలో ఊరేగింపుసేవలో దేవ దేవేరు లకు ఒక రథాన్ని ఉపయోగించడం సాధారణం. కానీ పూరిలో అందుకు భిన్నంగా ఏటికేడాది విడివిడిగా కొత్త రథాలు చేయిస్తారు. వీటి తయారీని ఒక యజ్ఞంలా భావిస్తారు. రథయాత్రకు అరవై రోజుల ముందు (వైశాఖ బహుళ విదియ నాడు) వీటి తయారీని ప్రారంభిస్తారు. సేకరించిన కలపను ముక్కలుగా కోసి జగన్నాథ రథం (నందిఘోష్‌)‌ను 832 ముక్కలతో, బలభద్రుడి రథం (తాళధ్వజం)ను 763 ఖండాలు, సుభద్ర రథం (దర్పదళన్‌) 593 ‌ముక్కలతో తయారు చేస్తారు. ఆ మూడు రథాలకు వరుసగా పసుపు, ఆకుపచ్చ, నలుపు ఎరుపు రంగు వస్త్రాలు చుడతారు.

రథయాత్ర వైశిష్ట్యం

సమస్త విశ్వాన్ని గుప్తగతిన బొజ్జలో దాచుకున్న జగన్నాథుడిని విశ్వంలో భాగమైన జీవుడు ప్రత్యక్షంగా చూడలేడట. ప్రతీకగా మాత్రమే దర్శించాలి. ఆ ప్రతీకే జగన్నాథ రథం. ద్వాపరంలోని శ్రీకృష్ణభగ నుడి ఆత్మచైతన్యం జగన్నాథుడి దారుశిల్పంలో నిక్షిప్తమై ఉంటుందని భక్తుల విశ్వాసం.

భక్తకోటిని విశేషంగా ఆకర్షించే ఘోషయాత్ర (రథయాత్ర)లో రథం పగ్గాలు పట్టడానికి భక్తులు పోటీ పడతారు. ఆ పగ్గాలను తాకితేనే జన్మ పునీత మవుతుందని వారి విశ్వాసం.

ఈ రథయాత్రను సోదరి సుభద్రపట్ల కల ప్రేమకు గుర్తుగా చెబుతారు. ఆమెను ఆనంద పరచడమే ఈ రథయాత్ర లక్ష్యమని కథనం. కంస వధకు బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టానికి ఈ యాత్రను చిహ్నంగా పేర్కొంటారు. వారితో పాటు వెళ్లాలనుకున్న సుభద్రాదేవి అభిలాషను ఆ తరువాతే తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని కూడా చెబుతారు.

ఇక, దేవదేవుడికి చేసే సేవలు మానవ జీవిత చక్రాన్ని పోలి ఉంటాయి. ఆయనలోనూ మానవుడిలా ఆకలిదప్పులు, అనారోగ్యం, మమతలు, అభి మానాలు, అలకలు తదితర లౌకిక జీవన ఘట్టాలు కనిపిస్తాయి. రథయాత్రకు పక్షం రోజుల ముందు (జ్యేష్ఠ పూర్ణిమ) చతుర్థ  మూర్తులను (జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) 108 కలశాల పవిత్రజలంతో అభిషేకిస్తారు. దీనిని ‘దేవస్నానం’గా పేర్కొంటారు. ఈ ‘సుదీర్ఘ స్నానం’తో జ్వరం బారిన వారు అదే నాటి రాత్రి ‘చీకటి మందిరానికి చేరగా,అక్కడ దైతాపతులనే సేవాయత్‌లు గోప్యంగా చికిత్స,సేవలు చేస్తారు. పరిమళభరిత పుష్పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలతో ఏడాది పాటు భూమిలో నిక్షిప్తం చేసిన నువ్వుల నూనె వెలికి తీసి స్వామికి లేపనంగా నియోగిస్తారు. దీనిని ‘పుల్లరి తెల్లొ’ అంటారు. రాజవైద్యుడి సూచనమేరకు 11వ రోజున పురుషోత్తముడికి దశమూలికా గుళికలను అర్పించ డంతో ఆయన కోలుకుంటాడు. ఆషాఢ శుద్ధపాడ్యమి నాడు ఆసనాన్ని అధిరోహించి భక్తులను విప్పారిన కళ్లతో వీక్షించి కటాక్షిస్తాడని నమ్మకం. దానినే ‘నేత్రోత్సవం’ అంటారు. ఆ మరునాడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర శ్రీక్షేత్రం నుంచి ‘గుడించా’మందిరానికి చేరి, పెంచిన తల్లి సన్నిధిలో తొమ్మిది రోజులు విడిది చేస్తాడు. ఇంద్రద్యుమ్న మహా రాజు భార్య గుడించాదేవి ప్రధానాలయానికి కొంత దూరంలో మందిరం నిర్మించారు. బలభద్ర, సుభద్ర, జగన్నాథులు వార్షిక రథయాత్ర సందర్భంగా ఆ మందిరంలో ఆతిథ్యం తీసుకోవాలన్నది ఆమె అభిమతంగా చెబుతారు. నాటినుంచి ఆ సంప్ర దాయం కొనసాగుతోంది. ఆ సంద ర్భంగా నిర్వ హించే ‘హీరాపంచమి’ మరో ముఖ్య ఘట్టం ఆలు మగల అలకలు, ప్రేమానురాగాలకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. తానూ యాత్రకు వస్తానన్న మహాలక్ష్మి కోరికను స్వామి మృదువుగా తోసి పుచ్చుతాడు. ‘అన్నా చెల్లెళ్ల యాత్రకు భార్యను తీసుకు వెళ్లడం సాధ్యం కాదంటూ, ఆషాఢ శుద్ధ పంచమి నాటికి శ్రీక్షేత్రం చేరుకుంటానని మాటిస్తాడు.అయితే గడువు దాటిపోవడంలో కినుక వహించిన అమ్మ వారు, ఆ రాత్రికి గుడించా మందిరానికి చేరుకుని, స్వామివారిని తన వెంట రమ్మంటుంది. దశమి వరకు వచ్చేందుకు అవకాశం లేదన్న ఆయన జవాబుతో ఆగ్రహించిన ఆమె జగన్నాథుడితో జగడ మాడి రథాన్ని ధ్వంసం చేస్తుంది. అర్చకులే అమ్మవారి పేరు మీద పాటలతో అభినయించడం అకట్టుకునే దృశ్యం. దశమి నాడు స్వామి శ్రీక్షేత్రానికి తిరిగి రావడాన్నే ‘బహుడా’ యాత్ర అంటారు. అలిగిన అమ్మవారిని ప్రసన్నం చేసుకు నేందుకు మధుర పదార్థం (రసగుల్లాలు) తినిపిస్తాడని చెబుతారు.


అలంకరణలు – దివ్యదర్శనం

జగన్నాథుడిని నిత్యం పట్టువస్త్రాలు,పుష్పాలతో, ఒక్కొక్క వారం ఒక్కొక్క రంగు వస్త్రంతో అలంక రిస్తారు. ఆదివారం ఎరుపు రంగు, సోమవారం తెలుపు,మంగళవారం పంచరంగుల వస్త్రాలు, బుధవారం పచ్చ,గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నలుపు వస్త్రాలతో అలంకరిస్తారు. స్వామికి వివిధ రకాల ఆభరణా లతో నిత్యోత్సవం నిర్వహించినా, ఏటా నాలుగు సందర్భాలలో మాత్రమే (రథయాత్ర-ఆషాఢ శుద్ధ విదియ, విజయదశమి, కార్తిక పౌర్ణమి, ఫాల్గుణ పౌర్ణమి) నిండుగా ఆభరణాలు అలంకరిస్తారు. ఆ ఉత్సవాన్ని ‘సునావేష’ అంటారు. ఏడాదిలో దాదాపు 34 అలంకారాలలో స్వామి కనువిందు చేస్తారు. శ్రీమహావిష్ణువు అవతారాలు దాల్చిన తిథులలో ఆయా అవతారాలలో స్వామి దర్శనం ఇస్తారు. జ్యేష్ఠ పూర్ణిమనాడు స్నానోత్సవం అనంతరం బలరామ జగన్నాథులను గణపతి రూపాలలో అలంకరించడాన్ని ‘గజవేష’ అని,రథయాత్రకు రెండు రోజుల ముందు భక్తులను అనుగ్రహించే దర్శనాన్ని ‘నవ యవ్వన వేష’అని, రథయాత్ర నాటి అలంకరణను ‘సునావేష’అని అంటారు. భాద్రపద బహుళ దశమి నాడు వనభోజి అలంకరణలో (అగ్రజుడు బల దేవునితో గోప బాలునిగా వనభోజనానికి వెళ్లినట్లు), ఆ మరునాడు కాళీయమర్దనుడి అలంకారంలో, కార్తిక సోమవారాలలో హరిహర ఏకతత్త్వానికి ప్రతీకంగా శివకేశవ రూపంలో దర్శనమిస్తారు.


 ప్రసాదం తయారీలోనూ ప్రత్యేకత

జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెలపొయ్యిల మీద మట్టి కుండలలోనే తయారు చేస్తారు.ఒకసారి వాడిని పాత్రను మరోసారి ఉపయోగించరు. ఆ కుండలను కుంభారు గ్రామస్థులే తయారు చేస్తారు. కుండమీద కుండపెట్టి వండినా అన్ని పాత్రలలోని పదార్థం ఒకేలా ఉడకడం విశేషమే. ప్రసాదాల తయారీని శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం. స్వామి వారికి నివేదనకు ముందు సాదా సీదాగా ఉంటే ప్రసాదం, ఆరగింపు తరువాత సువాసన భరితంగా ఉండడం విశేషంగా చెబుతుం టారు. ఆయనకు సమర్పించే అన్న ప్రసాదాన్ని ‘ఓబడా’ అంటారు. ఎందరు భక్తులు ఎప్పుడు వచ్చినా కాదనకుండా, లేదను కుండా అన్నం దొరికేది జగన్నాథధామం. ఆంగ్లేయులు దీనిని ‘వరల్డస్ ‌బిగ్గెస్ట్ ‌హోటల్‌’‌గా అభివర్ణించారు.

సమత జగన్నాథతత్వ్తం

సర్వ మానవ సమానత్వం, లౌకికతత్వ్తం జగ న్నాథుని సిద్ధాంతం. ఆయన సన్నిధిలో దర్శనం, అర్చ నాదులలో హెచ్చుతగ్గులు, ‘మహాప్రసాద’ స్వీకరణలో తేడాలు, అంటూసొంటూ ఉండవు. ఎంగిలి అంటదు. కనుక•నే ‘సర్వం శ్రీ జగన్నాథం’ అనేది వాడుకలోకి వచ్చింది.

జగతి నాలుగు వర్ణముల్‌ ‌సమముచేసి

కుడువ చేసితివౌ!భళా! కుడుచువేళ

యేహ్య మిసుమంతయును లేక సహ్యముగను

శ్రీజగన్నాథ చేసితే చిత్రముగను’

అని వద్దిపర్తి కోనమరాజు కవి కీర్తించారు.

శ్రీక్షేత్రం విశిష్టతలు.

ఈ క్షేత్రాన్ని మహిమలకు, రహస్యాలకు నిల యంగా చెబుతారు. ఆలయ శిఖరంపై ‘పతిత పావన’ పతాకాన్ని ప్రతి నిత్యం మారుస్తారు. ఇది గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంటుంది. గోపురంపై నీలచక్రాన్ని (సుదర్శనం) ఎటునుంచి చూచినా అది మనవైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. గోపురంపై పక్షి సంచారం కనిపించదు. పగటివేళ సముద్రంపై నుంచి భూమికి, సాయంత్రాలు భూమి నుంచి సముద్రానికి గాలి వీచడం సహజం కాగా, ఈ క్షేత్రంలో వాతా వరణం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆలయానికి అత్యంత సమీపంలోనే సముద్రం ఉన్నా ఆలయం లోపలికి సాగరఘోష వినిపించదు.

మూలవిరాట్‌ ఆలయంలో ఉంటే ఉత్సవ మూర్తులు తిరువీధులకు వెళ్లడం ఇతర క్షేత్రాల సంప్ర దాయం కాగా, మూలమూర్తులనే ఊరేగించడం ఈ క్షేత్రంలో అసాధారణాంశం. ఇతర క్షేత్రాలలో తిరువీధులకు వెళ్లిన దేవదేవేరులు వెంటనే ఆలయానికి చేరుకుంటే, సోదరి, సోదరద్వయం రోజుల తరబడి ఆలయం వెలుపల ‘గుడించా’ అతిథి గృహం’లో సేదదీరడం మరో ప్రత్యేకత.

గర్భాలయాన్ని విమాన మండపం, భక్తులు దర్శనానికి నిలిచే చోటును జగమోహ మండపం అనీ అంటారు. దేవదాసీ విధానాన్ని తెలిపే దానిని నాట్యమండపం, స్వామికి హారతినిచ్చే ప్రదేశాన్ని భోగ మండపం అంటారు.  శిఖరం మీది ధ్వజాన్ని పతిత పావన పతాకం అంటారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

About Author

By editor

Twitter
YOUTUBE