– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణలో ఎన్నికల సమరం మొదలయ్యింది. అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రచారపర్వం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆరు నెలలు కూడా సమయం లేకపోవడంతో పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలకు మొదట ఫుల్‌స్టాప్‌ ‌పెట్టడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.

రాష్ట్రంలో ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీతో పాటు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ‌మధ్యే పోటీ నెలకొంది. మూడు పార్టీలూ నువ్వా.. నేనా.. అన్న చందంగానే తమ తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. సభలు, సమావేశాలు, సదస్సులు, బహిరంగ సభలు, రహస్య సమావేశాలు నిర్వహిస్తు న్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్య మంత్రి కేసీఆర్‌.. ఎన్నికల వ్యూహకర్త, పోలింగ్‌ ‌ట్రెండ్‌ను అనుకూలంగా మార్చుకునే చాణక్య ఆలోచనలు కలిగిన నాయకుడు అన్న విషయం రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే తనదైన శైలిలో వ్యూహాలు సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడం, మానసికంగా వాళ్ల ఆలోచనలను ప్రభావితం చేయడం వంటి కార్యాచరణలో దిట్టగా కేసీఆర్‌ను చెప్పుకుంటారు. గడిచిన ఎన్నికల సమయంలో సరిగ్గా ఈ ఆలోచనలు, వ్యూహాలతోనే కేసీఆర్‌ ‌ప్రత్యర్థి పార్టీలకు కనీస అవకాశం కూడా లేకుండా గట్టెక్కారు. అత్యధిక స్థానాలు గెలుచు కున్నారు. ఆ తర్వాత కూడా వివిధ పార్టీల నుంచి గెలిచిన వాళ్లను బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ)లో చేర్చుకున్నారు.

అయితే, కేసీఆర్‌కు ఈసారి ఎన్నికలు మాత్రం సవాల్‌గా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూసినా, బీఆర్‌ఎస్‌గా రూపు మార్చుకున్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చూసినా ఇప్పుడు లేవని అంటున్నారు. గతంలో మాదిరిగా సునాయా సంగా గట్టెక్కే పరిస్థితి లేదని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా కారులో కొట్లాటలే కనిపిస్తు న్నాయి. అటు.. గ్రామీణ స్థాయిలో చూస్తే సర్కారు వ్యవహార శైలిపై నిస్తేజం అలుముకుందంటున్నారు. దీంతో, ఎన్నికల వేళ రసవత్తర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎక్కడ చూసినా బీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిట్టింగులు, కొత్తగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల మధ్య కొట్లాటలు జోరందు కున్నాయి. దీంతో, విపక్షాలతో పోరాడాల్సింది పోయి.. సొంత పార్టీలోనే సర్దుబాట్లు చేయలేక ఇన్‌ఛార్జీలకు తల బొప్పి కడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య వైరాలు ముదురుతున్నాయి. అధిష్టానం ముఖ్యులు చేస్తున్న ప్రకటనలతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ‌తమకే నంటూ కొందరు ఆశావహులు చేసుకుంటున్న ప్రచారం స్థానిక ఎమ్మెల్యేలను ఇరుకున పెడుతోంది. అంతటితో ఆగకుండా సొంతంగా ఎవరికి వారే జనంలోకి వెళుతుండడం.. తమ శైలిలో కార్యక్ర మాలు నిర్వహిస్తుండటంతో ఆశావహులు-సిటింగ్‌ ‌లకు మధ్య కుమ్ములాటలు రోజు రోజుకూ పెరుగు తున్నాయి. ఫలితంగా నియోజకవర్గాల స్థాయిలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో, బీఆర్‌ఎస్‌ ‌నేతలు వర్గాలుగా విడిపోతున్నారు. ఇక, కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు జట్టుకడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాదు.. మంత్రుల సమక్షంలోనే బాహాబాహీకి దిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇంత జరుగుతున్నా బీఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం పెద్దగా స్పందించడం లేదు.

కేసీఆర్‌ ‌సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌లో మెజారిటీ నియోజకవర్గాల్లో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. పటాన్‌చెరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చిట్కుల్‌ ‌సర్పంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. తనకే టికెట్‌ ‌వస్తుందని, పెద్దల ఆశీస్సులున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జహీరాబాద్‌ ‌సిట్టింగ్‌ ఎమ్మెల్యేను అక్కడి నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. అక్కడి నుంచి ఓ కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌టికెట్‌ ఆశిస్తూ నియోజకవర్గంలోకి వస్తున్నారని, దాంతో గ్రూప్‌ ‌రాజకీయాలు వేడెక్కు తున్నాయని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. రామాయం పేట ఎమ్మెల్యేని వ్యతిరేకించే వాళ్లు హైదరాబాద్‌ ‌నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడిని రంగంలోకి దించారు. దీంతో, ఆ ఎమ్మెల్యే తనయుడు నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక, ఆయా వర్గాలు ఎవరికి వాళ్లే సోషల్‌ ‌మీడియా వేదికగా పార్టీ పరువు తీసే స్థాయిలో పరస్పరం పోస్టులు పెట్టడమే కాకుండా దీనిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్న సందర్భాలున్నాయి. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్సీ కూడా మెదక్‌ ‌నుంచే టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తన వర్గాన్ని అక్కడ సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. నర్సాపూర్‌ ‌నియోజకవర్గంలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు, మాజీ మంత్రి అయిన ఓ కార్పొరేషన్‌ ‌చైర్మన్‌కు మధ్య వర్గపోరు కొనసాగుతోంది. మొదటినుంచీ ఈ పరిస్థితి ఉన్నా.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది ఎక్కువయ్యిందంటున్నారు. ఇక, వయోభారంతో బాధపడుతున్న అక్కడి ఎమ్మెల్యేని తప్పించే ఆలోచనలో బీఆర్‌ఎస్‌ ‌నాయకత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. అయితే, అది వాస్తవమేనా, పోటీవర్గం చేస్తున్న ప్రచారమా అన్నది తేలాల్సి ఉంది.

ఖమ్మం జిల్లాలో చూస్తే.. పాలేరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు, అక్కడి స్థానిక మాజీ మంత్రికి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎవరికి వాళ్లే వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజక వర్గానికి చెందిన మాజీ మంత్రి గ్యాప్‌ ‌లేకుండా క్యాడర్‌ను కలిసేందుకు నిత్యం ఏదో ఒక కార్యక్ర మంలో పాల్గొంటున్నారు. ఇక, అటు కొత్తగూడెంలో వర్గ పోరు కూడా తారస్థాయికి చేరింది. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటు తనదేనని ధీమాగా ఉన్నారు. కానీ, ఆయనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. అంతేకాదు.. ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా బాధ్యతల్లో ఉన్న ఓ ఉన్నతాధికారి కూడా సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు తనకే ఉన్నాయని చెబుతున్నారు. యేడాది కాలంగా తన సొంత ట్రస్ట్ ‌పేరుతో సేవా కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వస్తానంటూ బహిరంగ ప్రకటనలు కూడా చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో చూస్తే… జనగామ ఎమ్మెల్యే, స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు ఇద్దరికీ సొంత పార్టీలోనే కుంపట్లు తయారయ్యాయి. జనగామ నియోజకవర్గంపై ఓ ఎమ్మెల్సీ కన్నేశారు. టికెట్‌ ‌ఖాయమని సన్నిహితులకు నమ్మకంగా చెబుతున్నారు. ఇటీవల రజక సంఘం జిల్లా మహాసభకు ఖర్చును ఆ ఎమ్మెల్సీయే భరించారని చెబుతున్నారు. ఇక, జనగామ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనుచరులను కూడా ఆ ఎమ్మెల్సీ రహస్యంగా వెళ్లి కలుస్తున్నారని చెప్పు కుంటున్నారు. స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేకు బదులుగా తన కూతురికి టికెట్‌ ఇప్పించుకోవాలని అదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు పోటీగా ప్రస్తుత ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. అధిష్టానం వద్ద ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ తండ్రి, మాజీ మంత్రి కేసీఆర్‌ ‌దగ్గర పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇక, భూపాలపల్లిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు, మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ అయిన సీనియర్‌ ‌నేత మధ్య టికెట్‌ ‌ఫైట్‌ ‌నడుస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో… ఖానాపూర్‌ ‌మహిళా ఎమ్మెల్యేకు, సొంతపార్టీకే చెందిన ఓ గిరిజన నేతకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరిపోయాయి. ఆయన ఏకంగా ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన మరికొందరు నాయకులతో పాటు.. ఆదిలాబాద్‌ ‌జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌సైతం స్థానిక ఎమ్మెల్యేను పట్టించుకోకుండా సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ రెండు సార్లు గెలిచిన ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇంతమంది కార్యకలాపాలు చేపడుతున్నా అధిష్టానం మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, అదిలాబాద్‌లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాజీ మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టికెట్‌ ‌తనకేనంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. బోథ్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. మాజీ ఎంపీ, నేరడిగొండ మండల జెడ్పీటీసీ ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఆయన పట్ల పార్టీలో, ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌టికెట్‌ ‌కోసం ప్రయత్నిస్తున్నారు. బోధన్‌లో పాగా వేయాలని చూస్తున్న ఎంఐఎం నేతలు అక్కడి బీఆర్‌ఎస్‌ ‌సిటింగ్‌ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటు న్నారని చెబుతున్నారు. కానీ, బీఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం చూసీ చూడనట్లు వదిలేయడం పట్ల స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.

అటు.. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా పరిస్థితి చూస్తే.. సిరిసిల్ల జిల్లా వేములవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు పోటీగా మరో ఇద్దరు సీనియర్‌ ‌నేతలు టికెట్‌ ‌కోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ‌పాల్గొనే సమావేశాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు కాకుండా… ఆయన అసమ్మతి నేత ఒకరికి ప్రాధాన్యం లభిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మంథని నియోజకవర్గంలో టికెట్‌ ఆశిస్తున్న జెడ్పీ చైర్మన్‌, ‌మాజీ జెడ్పీటీసీ వర్గాల మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. సోషల్‌ ‌మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. జగిత్యాలలో జెడ్పీ చైర్‌పర్సన్‌, ‌సిట్టింగ్‌ ఎమ్మెల్యే మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఇవేమీ పట్టించుకోకపోగా.. ఈ అంశంపై మౌనం ప్రదర్శిస్తోంది. అంతేకాదు, కొన్నిచోట్ల హైకమాండే వెనకుండి ప్రోత్సహిస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ‌వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం నెలకొంది. ఈ పరిస్థితులను విపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ ఒడిసిపట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE