వందేభారత్‌ ‌కొత్త రైళ్లు. జూన్‌ ‌నెలాఖరులోగా పట్టాలపైకి. అవీ సెమీ హై స్పీడ్‌ ‌బండ్లు. ఎలక్ట్రిక్‌ ‌మల్టిపుల్‌ ‌యూనిట్‌ అనుసంధానాలు. ‘భారత్‌లో తయారీ’ అనేది ఎంత ప్రభావంతమో మనందరికీ తెలుసు. భారతీయ రైల్వే నిర్వహణలోని ఆ రైలుబండ్లలో పలుచోట్ల మహిళలే చోదకులు. దేశ రాజధాని ఢిల్లీ- పుణ్యక్షేత్రం వారణాసి నడుమ తొలి రైలును జెండా ఊపి ఆరంభించి నాలుగేళ్లు దాటింది. తెలుగు రాష్ట్రాలలోనూ ఆ సేవలు ఎంతగా విస్తరిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. వనితా చోదకురాలు అనగానే, మొట్టమొదటగా మనముందు నిలిచే రూపు సురేఖా యాదవ్‌. ‌దరిదాపు పాతికేళ్ల క్రితం తొలి ‘మహిళల ప్రత్యేక రైలు’ను నడిపింది ఆమె! పుష్కరం కిందట అంతర్జాతీయ వనితా దినోత్సవ సందర్భాన పుణె- ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ ‌మధ్య ‘డెక్కన్‌ ‌క్వీన్‌ ‌ట్రైన్‌’‌కూ తానే సారథి. సర్వసాధారణంగా మహిళా లోకో పైలట్‌ అనడంతోనే, ప్రతివారిలోనూ అప్పటి కప్పుడు ప్రత్యేక ఆసక్తి జత చేరుతుంటుంది. కార్యాలయాల విధుల నిర్వహణకే వారిని పరిమితం చేయరాదన్న పాలకవర్గ స్థిర సంకల్పం ఆ వెంటనే పగ్గాలనూ చేతికిచ్చింది. అతిపెద్ద రవాణా వ్యవస్థ చోదకత్వాన్ని వారికి అప్పగించడం అంటే… వనితల పాత్ర, ప్రాధాన్యాలను విస్తరించినట్లే. సవాళ్లను ఎదుర్కోవడం, సందర్భానుసారం ముందుకు దూసుకెళ్లడం వారికి అలవాటే. దక్షిణ మధ్య రైల్వే సహా అనేకచోట్ల, తెలుగు రాష్ట్రాలలో కూడా రైల్వే లోకో పైలట్‌గా లలనలు ఎంతగా దీక్షాదక్షత కనబరుస్తున్నారంటే….

‘భారతీయ భావి భాగ్య భాను దీప్తి నైతి నేను / భారతీయ నారి నేను, భాగ్య సుధా ధార విస్ఫూర్తిగా వెలిగిదెను’ అనేలా వనితా చోదకత్వం రైల్వేలో వర్థిల్లు తోంది. శారీరక పటుత్వాన్ని మించిన మానసిక దృఢత్వం వారి ఆకాంక్షలను నిత్యమూ ఫలప్రదం చేస్తోంది. సదా అప్రమత్తంగా ఉండటం, మార్గ మధ్యంలో ఎదురయ్యే అవరోధాలను సమర్థంగా దాటుకు వెళ్లడం ఆ లోకో పైలట్ల నిత్య కృత్యాలు. చూపులు సారించి, చెవులు రిక్కించి, సాంకేతిక మార్గదర్శకాలు అనుసరించి, వాటికి తమ సమయస్ఫూర్తినీ జోడించి డ్రైవ్‌ ‌చేయాల్సి ఉంటుంది. గమనం మొదలు గమ్యం చేరేవరకు నిరంతర జాగ్రత్త వహించాల్సిందే. స్థితిగతుల ఆధారంగా ఎప్పటి కప్పుడు ఎక్కడికక్కడ తమవైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. వందలాది ప్రాణాల పరిరక్షణ విధి తమదేనని, అందు•కే ఎంత క్లిష్టత అయినా తమ బాధ్యత ముందు చిన్నదిగా అనిపిస్తుందని వారు అంటుంటారు. లోకో పైలట్‌ ‌సహాయకులుగా వ్యవహరించే వారూ సమర్థతకు పర్యాయంగా ఉంటుంటారు.

వనితారంగ కాంతిరేఖ

సందర్భం ఆధారంగా, సురేఖ అంకితభావాన్ని మనమిక్కడ ప్రస్తావించి తీరాలి. వందేభారత్‌ ‌రైలును నడిపిన ప్రథమ పడతిగా ఆమె మొత్తం ఆసియాలోనే కీర్తిగడించారు. షోలాపూర్‌ – ‌ముంబయిలోని టెర్మినస్‌ ‌నడుమ కూడా పైలట్‌ ‌కర్తవ్యాన్ని విజయ వంతంగా నిర్వర్తించారు. తనది మహారాష్ట్ర ప్రాంతం. విధి నిర్వహణలో భాగంగా ఇదివరకే జాతీయ స్థాయి పురస్కారాలనూ అందుకున్నారు. ముంబై- లఖన్‌వూ బండిని సైతం (స్పెషల్‌) ‌నడిపి శభాష్‌ అనిపించుకున్నారు. ఆమెకి ఇప్పుడు యాభై ఏడేళ్ల పైమాటే. దేశంలోనే తొలి అధీకృత లేడీ లోకోపైలట్‌. ‌స్త్రీ శక్తిని తన ముందు ప్రస్తావిస్తే ‘ఏ1 బోయింగ్‌ను విదేశాలకు తీసుకెళ్లింది మహిళలే కదా! అది విమానయానం. రైల్వే పయనం వేళ ఝాన్సీ – గ్వాలియర్‌ ‌నడుమ స్పెషల్‌ ‌ట్రైన్‌ ఆపరేటింగ్‌, అలాగే ఆన్‌బోర్డ్ ‌నిర్వహణనూ చేపట్టింది నారీమణులే మరి. రైల్వేలో డ్రైవింగ్‌ అం‌టేనే అత్యంత కీలకం. మా అంత నిబద్ధత ఇంకెక్కడా ఉండదు’ అంటూ సంపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచారామె. 1998, 2001, 2002, 2004, 2005, 2011, 2018, 2013 సంవత్సరాలలో సత్కార, అభినందనల పరంపర స్వీకరించారామె.

ఝాన్సీ లక్ష్మీబాయి ప్రేరణతో…

సతారాలో బడి చదువు, అదే ప్రాంతంలో కళాశాల విద్య (పాలిటెక్నిక్‌), ‌మెకానికల్‌ ఇం‌జ నీరింగులో డిప్లొమా… ఇదీ సురేఖ విద్యా నేపథ్యం. భర్తది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం. కుమారులిద్దరూ ఇంజనీర్లు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె రవాణా సారథ్యం దాకా పురోగమించారంటే, అదంతా ఆమె శక్తి యుక్తి. లోకోమోటివ్‌ ‌డ్రైవర్‌గా ఉన్నతి అందుకోవడానికి కారణం – చక్కని నిపుణత. తనకు బాల్యం నుంచీ ప్రేరణ ఝాన్సీలక్ష్మీబాయి. ‘రవి సహస్ర ప్రభాసి చిరత్నరత్న కాంచన మది శిరోగ్రమున మెరసె/సమద శత్రు భయంకరోజ్వల కరాళ కాళి కరవాలమది కరాగ్రమున నొరసె’ అన్నట్లు విజృంభించిన ఝాన్సీలోని సాహసిక ప్రవృత్తి తనకెంతో ఆరాధనీయం. మెడికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌డిప్లొమా చేసిన ఆమె గణితశాస్త్ర అంశాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు, ఉపాధ్యాయ విద్య శిక్షణకూ సంసిద్ధులయ్యారు. అంతలో రైల్వే ఉద్యోగ ప్రకటన చూసి, దరఖాస్తు చేసి, ముంబయిలోని రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు ద్వారా లిఖిత, మౌఖిక పరీక్షలకు హాజరై కృతార్థురాల య్యారు. ఎలక్ట్రికల్‌ ఇం‌జనీరింగ్‌ అనుభవాన్నీ సొంతం చేసుకున్నారు. ధారణ, ఏకాగ్రత, పరిశీలనా సక్తి, గణింపు పరిజ్ఞానం కలగలిసి… దేశ చరిత్రలోనే రికార్డు సాధించేలా చేశాయి. ట్రైనీ అసిస్టెంట్‌, ‌ట్రైన్‌ ‌డ్రైవర్‌, అసిస్టెంట్‌ ‌లోకోమోటివ్‌ ‌డ్రైవర్‌, అటు తర్వాత అసిస్టెంట్‌ ‌డ్రైవర్‌, ‌పూర్తి స్థాయి సారథ్యం; అవన్నీ అయ్యాక మోటరమ్‌ ‌విమెన్‌గా పదోన్నతి – ఆమె ఉద్యోగ ప్రస్థాన మైలురాళ్లు.

ప్రశంసలందిన మహిళాశక్తి

సెంట్రల్‌ ‌రైల్వేకి సంబంధించి, లేడీస్‌ ‌స్పెషల్‌ ‌లోకల్‌ ‌ట్రైన్‌కి మొదటి లోకో పైలట్‌గా సురేఖ ఎంత ఖ్యాతి సంపాదించారు. గడచిన మార్చిలో షోలాపూర్‌ – ‌సీఎస్‌ఎం‌టీ వందేభారత్‌ ‌రైలు బండిని నడిపిన స్త్రీ మూర్తి. అందుకే ‘నారీశక్తి’గా కేంద్ర రైల్వేమంత్రి నుంచి ప్రత్యేక ప్రశంస అందుకున్నారు. అలాగే మరెందరో రైల్వే చోదక మహిళలు. లక్ష్మీదేవి, తనూజ, రమ్య, శ్వేత, ఇలా వివిధ ప్రాంతాలవారు. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్‌ ‌మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ఆరంభించి అదే బండిలో ప్రయాణిం చడం మనలోని ప్రతీ ఒక్కరికీ ఇంకా గుర్తే. ఆ బండిని నడిపిన లేడీ డ్రైవర్‌ ‌సుప్రియ. నిజామాబాద్‌ ‌స్వస్థలం. మరికొందరు మహిళా చోదకులూ హైదరాబాద్‌ ‌మెట్రో రైలు ప్రాజెక్టు విధుల్లో పనిచేస్తున్నారు. మెకానికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌పట్టభద్రు రాలైన సుప్రియ అనంతరం భాగ్యనగరంలో ఎంటెక్‌ ‌చేశారు. ఏడాదిన్నరపైగా కఠోర శిక్షణ దరిమిలా రైలు డ్రైవింగ్‌ ‌బృంద సభ్యురాలయ్యారు. అదేవిధంగా వరంగల్‌ ‌సింధూజ, మహబూబ్‌ ‌నగర్‌ ‌వెన్నెల, మరెందరో లోకో పైలట్లు. తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలోని లోకో పైలట్లలో దాదాపు సగంమంది వరకు వనితలే ఉన్నారు. వరంగల్‌కి చెందిన శ్రావణి ఎలక్ట్రానిక్స్ ఇం‌జినీరింగ్‌ ‌పట్టభద్రురాలు. కమ్యూ నికేషన్స్ ‌రంగ నిపుణురాలు. మరో చోదకురాలు పూజ సైతం ఇప్పటి ఉద్యోగ బాధ్యతలే తనకు సంతృప్తీ సంతోషాలూ ఇస్తున్నాయంటున్నారు.

సాహసోపేత చరిత

రైలుబండ్లు నడపటంలో శిక్షణ అత్యంత కఠినం. ఎంత కష్టమైనా, డ్యూటీలో ఉన్నప్పుడు సగర్వంగా ఉంటుందని పాతికేళ్లయినా నిండని మరో డ్రైవర్‌ ‌ప్రియాంక చెప్తున్నారు. విసుగు అనిపించని కర్తవ్యం ఇదని నవ్య స్వానుభవం. కష్టతర ఉద్యోగమని మొదట్లో భావించిన తల్లిదండ్రులు ఇప్పుడు గర్వంగా ఉందంటున్నారని పావని మనోగతం. లోకో పైలట్లుగానే కాక స్టేషన్‌ ‌కంట్రోలర్‌, ‌ట్రాఫిక్‌ ‌కంట్రోలర్‌, ఇతర బాధ్యతాయుత పనులు చేపట్టేం దుకూ అమ్మాయిలు మరింత ముందుకొస్తున్న శుభతరుణమిది. ఆసక్తి, ఆ శక్తితో నవ్యోత్సాహం చూపుతున్న యువతులు ఇంకా మరెందరికో సమున్నత భవిష్యత్‌ ‌ప్రదాతలు. ‘మహిళా నీ చరితం సాహసేపోతం’ అన్నారందుకే!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE