జూలై 3 గురు పూర్ణిమ

‘అఖండ మండలాకారం వ్యాప్తమ్‌ ‌యేన చరాచరమ్‌

త్పదమ్‌ ‌దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః’

వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నీ అఖండ మండలాకారంలో అనుబంధంతో పెనవేసుకున్నాయి. అంటే ఈ సృష్టిలో వ్యక్తి, సమాజం, ప్రకృతి (పర్వతాలు, నదులు, కొండలు, కోనలు, వృక్ష సంపద) పశుపక్ష్యాదులు  భగవంతుడు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని ఎవరి పాదాల దగ్గర కూర్చొని తెలుసుకొని అనుభూతిని పొందుతున్నామో ఆ గురు చరణాలకు నమస్కరిస్తున్నాము.  ఈ సృష్టి అంతా కూడా ఒకే దైవీశక్తి నుండి ప్రకటిత మయిందనేది సత్యం. ఈ సత్యాన్ని దర్శింప చేసేవారే గురువు.

‘‘అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానంజన శలాకయ

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః’’

అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుతురును ప్రసరింపజేసేవాడే గురువు. ఇది భారతీయ గురు పరంపర. పూజ్యశ్రీ వ్యాస భగవానుడు  మన సమాజానికి ఆది గురువు. ఆషాడ పూర్ణిమను గురుపూర్ణిమ పేరుతో వేలాది సంవత్స రాలుగా మన సమాజం పండుగలా జరుపుకుంటున్నది.

‘‘వ్యాసాయ విష్ణు రూపాయ – వ్యాస రూపాయ విష్ణవే’’ అని విష్ణు సహస్ర నామం చెప్పింది. వ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు.

ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పరిగణిస్తారు. ఇది వేదవ్యాసుని జన్మదినం. ఇతడు పరాశర మహర్షికి, సత్యవతికి, కృష్ణ వర్ణం ( నల్లరంగు)తో ఒక ద్వీపంలో జన్మించాడు. కనుక కృష్ణ ద్వైపాయనుడిగా ఖ్యాతిగాంచాడు. తన తండ్రి పరాశర మహర్షి సంకల్పించి, పోగుచేసిన వేద రాశులను, జ్ఞానాన్ని నిత్య కర్మలలో, క్రతువులలో వాటి వాటి ఉపయోగాన్ని బట్టి ఋగ్‌,‌యజుర్‌, ‌సామ, ఆధర్వణ అను నాలుగు వేదాలుగా ఏర్పరచినందువల్ల వేద వ్యాసుడు అనే పేరుతో సార్థక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ ఆశీస్సులతో, సరస్వతి కటాక్షంతో విఘ్నాధిపతి గణేశుడు రాయగా చతుర్వేదాలలోని సారం ప్రతిబింబించే విధంగా ఘనతకెక్కిన మహా భారత ఇతిహాస కావ్యాన్ని రచింపజేశాడు. అందుకే మహాభారతం పంచమ వేదం అయింది. వీటితోపాటు అష్టాదశ పురాణాలను మరెన్నో పురాణేతిహాసలను ప్రసాదించిన పూజ్యుడు.

గురు అన్న రెండు అక్షరాలలో ‘గు’ అనగా తమస్సు లేదా చీకటి. ‘రు’ అనగా చీకటిని తొలగించే వాడు. గురువు వ్యక్తిలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే జ్యోతితో వెలుగు నింపేవాడు అని అర్థం.

భారతదేశంలో గురుపరంపర అనాదిగా  వస్తున్నది. త్రిమూర్తులు,  నారద ముని నుండి ఈ పరంపర ప్రాంభమైనదని చెప్తూ ఉంటారు. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలలో కూడా ఈ పరంపర కొనసాగింది.

ఆధునికయుగంలో గురుశిష్య పరంపరలోని త్యాగం, సమర్పణను ఆధారంగా తీసుకొని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం ఒక సంస్థగా సంఘటిత సమాజ నిర్మాణం కోసం కాషాయ జెండా (భగవాధ్వజం)ను గురువుగా స్వీకరించింది. ఇది ఒక పవిత్రమైన, వినూత్నమైన పద్ధతి. కాషాయ జెండా మన భారతీయ సంస్కృతిలోని త్యాగం, సమర్పణలకు ప్రతీక. భారతదేశ చరిత్రలోని ఉత్థాన, పతనాలకు సాక్షి. దేశ సౌభాగ్యానికి ఆధారం సంఘటిత సమాజమే. సంఘటిత సమాజానికి ఆధారభూతమైన వాడు సాధారణ వ్యక్తి. అందుకే సర్వసాధారణ వ్యక్తులలో త్యాగం, నిస్వార్థ భావన నిర్మాణం చేసేందుకు  భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించింది సంఘం. ఇదే సృష్టి వికాసానికి ఆధారం.

తేల్‌ ‌జలే బత్తీ జలే – లోగ్‌ ‌కహే దీప్‌ ‌జలే.

నూనె, ఒత్తి మండుతున్నాయి. కాని ఆ కాంతిని చూసేవారు దీపం మాత్రమే వెలుగుతున్నదని అంటుం టారు. ఇది ప్రకృతి నియమం. కాని వాస్తవానికి వెలుతురును ప్రసాదిస్తున్న నూనె, ఒత్తి రెండూ పేరుకు కూడా నోచుకోకుండా సర్వోన్నత సమర్పణాభావాన్ని ఆకళింపు చేసుకొన్నాయి. విత్తనం నుండి చెట్టు మొలకెత్తుతుంది. అది మహా వృక్షంగా విస్తరిస్తుంది. కాయలు, పండ్లు వస్తాయి. అందులోనుండి విత్తనం లభిస్తుంది. ఇందులో విత్తనం మట్టిలో కలిసిపోయి నష్టపోయిందని ఒక దృష్టికోణం. కానీ విత్తనం తనకు తాను సమర్పించుకొని ఒక చెట్టుగా వికసించి తన జీవితాన్ని సార్థకం చేసుకుందని ఇంకో దృష్టికోణం. అసలు సృష్టి అంతా కూడా ఈ సమర్పణ భావం మీదనే ఆధారపడిందని చెప్పవచ్చు. సృష్టిలో చెట్లు చేమలు, సూర్యరశ్మి సహకారంతో మానవ సమాజం అంతా ఉత్పత్తి చేస్తున్న బొగ్గుపులుసు వాయువును తీసుకొని తమ ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. దాని ద్వారా మానవ సమాజానికి అత్యంత అవసరమైన ప్రాణవాయువును అందజేస్తున్నాయి. ఇలాంటి సమర్పణ భావం ప్రతి వ్యక్తిలో నింపడమే గురుపూజ విశిష్టత.

‘శివోభూత్వా, శివం త్యజేత్‌’  ‌శివుడిని పూజించడం అంటే తాను స్వయంగా శివునిగా తయారుకావడమే. గురుపూర్ణిమ రోజున కాషాయ ధ్వజాన్ని పూజిస్తూ ప్రతి వ్యక్తి తన శరీరాన్నీ, బుద్ధినీ, మనస్సునీ, తన సంపూర్ణ సంపత్తిని (తనకు అవసరమైనమేరకు మాత్రమే వాడుకుంటూ మిగిలిన దానిని) సమాజ సేవకు సమర్పణ చేయడమే నిజమైన గురుపూజ. తాను సంపాదించిన శారీరక శక్తికి, బుద్ధిపరమైన శక్తికి, ధనశక్తికి తాను యజమాని కాడు, కానీ కేవలం ధర్మకర్త మాత్రమే అనే భావన ప్రతి హిందువుకి ఉండాలి. అందుకని వ్యక్తి తన నిత్యజీవితంలో త్యాగం, అహంకార సమర్పణయే నిజమైన గురుపూజ.

ఒక స్వామీజీకి ధనికుడైన శిష్యుడు ఉండేవాడు. ఒకసారి ఆ శిష్యుడు స్వామిజీ దగ్గరకు వచ్చి స్వామీజీ! నేను నా ధనాన్ని మొత్తం సమాజానికి దానం చేసేసాను అని అన్నారు. యావత్‌ ‌ధనాన్ని దానం చేశావా? అని ఆశ్చర్యంగా స్వామీజీ అనడంతో వారిని తమ వెంట తీసుకెళ్లి దానం చేసిన తన ఇల్లు, బంగారం మొదలైన ఆస్తినంతా చూపెడుతున్నారు. అపుడు స్వామీజీ ‘‘నిజమే నీ సంపదనంతా దానం చేసావని పదేపదే చెప్పు కొంటున్నావు. దానివలన నీలో నేనే దానం చేసాను అనే భావన పెరిగి సమర్పణ భావం లోపిస్తున్నది. కనుక నేను ఇదంతా దానం చేసాననే భావనను మనసులో నుండి తొలగించుకో. ఎందుకంటే నీకున్న సంపద అంతా భగవంతుడు నీకు ప్రసాదించినదే.  నీవు ఆ సొమ్మును సంపా దించడంలో భగవంతునికి ఒక ఉపకరణంగా మారావు. ఈ భావన తోనే నీకు మోక్షం లభిస్తుంది’’ అని శిష్యునికి ఉద్బోధించారు.

స్వయంసేవకులలో ఈ సమర్పణ గుణాన్ని నిర్మాణం చేయడం ద్వారా సమాజంలో కూడా ఈ భావనను నింపడమే గురుపూజ పరమార్థంగా సంఘం భావిస్తున్నది.

గురుపూజ వలన వ్యక్తి జీవితం సార్థకమవు తుంది. వ్యక్తి సమర్పణ భావన వల్ల సమాజం సంఘటితం అవుతుంది. సంఘటిత సమాజం వలన సత్యం, న్యాయం, ధర్మాలకు రక్షణ చేకూరి మన జాతి శక్తిమంతమవుతుంది. భారతదేశం శక్తిమంతవుతుంది. శక్తిమంతమైన భారతదేశమే ప్రపంచశాంతికి ఆధారం అని యోగి అరవిందులు అన్న మాట ఎప్పటికీ స్మరణీయం. ఆచరణీయం కూడా.

– వి.భాగయ్య, అఖిలభారత కార్యకారిణి సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌

About Author

By editor

Twitter
YOUTUBE