‘నల్లగొండ యోధులు వెలిగించిన జ్యోతి
నలుదిశలా పాకిందిరా, తెలంగాణా
సింహనాదము చేసెరా’ – దాశరథి
యూరప్‌లో 18వ శతాబ్దంలోనే అంతమైన ఫ్యూడల్ వ్యవస్థ హైదరాబాద్ సంస్థానంలో 20వ శతాబ్దం మధ్యవరకూ కొనసాగింది. ఈ దుస్థితిని మందుముల నరసింగరావు ‘ఏబది సంవత్సరాల హైదరాబాద్’ గ్రంథంలో ‘బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో 1885లో అమలులోనికి వచ్చిన స్థానిక స్వపరిపాలన పద్ధతిని హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టాలని ఆంధ్ర మహాసభవారు వేడుకున్నారంటే.. రాజకీయంగా ఇక్కడి ప్రజలు పరిసర రాష్ట్రాల్లో నివసించే ప్రజలకంటే 50 ఏళ్లు వెనుకబడి ఉన్నట్లుగా గమనించవచ్చు’ అన్నారు.
నిజాం పరగణాలలో దేశ్‌ముఖ్‌లు పన్నులు వసూలు చేసే అధికారులు. వారు నిజాంతో సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుంటూ బంజరు భూములను సాగులోనికి తెచ్చారు. 1వ సాలార్‌జంగ్ కాలంలో రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఆ భూములన్నింటిపైనా పట్టాలను పొంది, పెద్ద పెద్ద భూస్వాము లయ్యారు. లక్షల, వేల ఎకరాలకు యజమానులయ్యారు. ఆ భూములను రైతులకు కౌలుకివ్వడం, పెట్టుబడి వారే పెట్టడం, నాగుల పద్ధతిన డబ్బు వడ్డీ కివ్వడం, ‘వెట్టి’ని ప్రోత్సహించడం, సకాలంలో డబ్బుకట్టలేకపోతే గడీల్లోకి పిలిపించి చావగొట్టేవారు.
దేశ్‌ముఖులు నిజాంతో సన్నిహితంగా ఉన్న కారణంగా పోలీసు, రెవెన్యూ అధికారులు వీరి అదుపు ఆజ్ఞల్లోనే పనిచేసేవారు. తద్వారా పటేల్- పట్వారీ వ్యవస్థ బలపడింది. ఆ గ్రామల్లోని ప్రజలందరూ (అన్ని కులాలవారు) గడీలో జీతం లేకుండా వంతుల వారీగా పనిచేయాలి. తరువాత గడీలే రజాకారుల అడ్డాలుగా మారాయి.
విసునూరి రామచంద్రారెడ్డికి లక్షా ఏభయ్ వేల ఎకరాల భూమి ఉంది. ఇతడి గడీ నిర్మాణం 1935లో ప్రారంభమైంది. తన ఆధీనంలోని 60 గ్రామాల బీదా బిక్కీ వంతుల వారిగా నిర్మాణంలో పాల్గొన్నారు. గడీ నిర్మాణం పేరుతో కొన్ని వేల రూపాయలు వసూలు చేశాడు. ఇటుకలు కాల్చడానికి అనేక గ్రామాల్లో చింత, తుమ్మ చెట్లు కొట్టించాడు. గడీ ప్లానర్ వి.వి.రాజు. అలహాబాద్‌లో మోతీలాల్ నెహ్రూ ఆనంద భవనం ప్లానర్ ఆయనే. సూపర్ వైజర్ వల్లూరి బసవరాజులు. పదిగజాలలోతు 3 గజాల వెడల్పు బేస్‌మెంటు తీయించాడు. దానికి సిమెంట్, బండలను ఇంగ్లండ్ నుండి, దర్వాజాలు రంగూన్ నుండి, అద్దాలు బెల్జియం నుండి, స్నానాల గది పెంకులు చైనా నుండి, దీపాలు అమెరికా నుండి తెప్పించాడు. భవన నిర్మాణానికి విదేశాల నుండి వస్తువులు తెప్పించిన మూడో వ్యక్తి రామచంద్రారెడ్డి (మొదటివాడు మోతీలాల్. రెండోవాడు నిజాం). కౌలు పేరుతో వసూలు చేసిన ధాన్యంతో వచ్చిన సొమ్ముతో ఇది కట్టారు.
విసునూరి రామచంద్రారెడ్డి అధీనంలోని ఒక్క కడివెండిలోనే 10 పుట్ల ధాన్యం ఉందనీ, మిగిలిన గ్రామాల్లో పెద్ద మొత్తంలోనే ధాన్యం ఉందనీ, ప్రభుత్వం ఆ ధాన్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆంధ్ర మహాసభ పిలుపునిచ్చింది కూడా. రామ చంద్రారెడ్డి పెద్ద గుమస్తా మిస్కిన్ ఆలీ, కొందరు రౌడీలతో కడివెండి గడీలో మకాం వేశాడు. కోట గోడకు ఒక కన్నం ఉంది. దాని నుంచి బయట ఏం జరుగుతున్నదో చూడవచ్చును. దాదాపు ఇరవై మంది వాలంటీర్లు కోట ముందు నుండి ఊరేగింపు వెళుతూ ఉంటే, ఆ కన్నంలో నుంచే తుపాకీ కాల్చాడు ఆలీ. దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే చనిపోయాడు. దానితో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు తిరగబడి ఉద్యమం ఆరంభించారు.
మొదటి సత్యాగ్రహం తరువాత ఆంధ్ర మహాసభ నాయకత్వం కమ్యునిష్టుల చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే రావి నారాయణరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారు. ఇందుకు జాతీయవాదులు ‘నారాయణ త్రయం’ (కోదాటి నారాయణరావు, కాళోజీ నారాయణరావు, కొమరగిరి నారాయణ రావు) అంగీకరించలేదు. దానితో ఆంధ్ర మహాసభ రెండు ముక్కలైంది. మందుముల మడికొండలో కొత్త ఆంధ్ర మహాసభ ప్రారంభించారు. వీరికి ముదిగొండ సిద్ద వీరరాజలింగం, హయగ్రీవాచారి, పుల్లారెడ్డి, కాంచనపల్లి వెంకటరామారావు, బొమ్మకంటి సత్యనారాయణరావు, ఎన్.కె.రావు (జాతీయవాదులు) జమలాపురం కేశవరావు నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రాబల్యం నుండి సంస్థను బయటకు తీసుకు రాగలి గారు. కమ్యూనిస్టులు ‘ప్రజా ప్రభుత్వం’ నినాదంతో బాధ్యతాయుత ప్రభుత్వానికి దెబ్బకొట్టారు. ముస్లిమ్ మతోన్మాద సంస్థ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుల వాదాన్ని అంగీకరించి హిందూ ముస్లిమ్‌లకు సమాన ప్రాతినిధ్యం ఉన్న జాతీయ ప్రభుత్వం హైదరాబాద్‌లో వెంటనే ఏర్పాటు కావాలనే వాదాన్ని లేవదీశారు. కమ్యూనిస్ట్‌లు సాగిస్తున్న జాతి వ్యతిరేక కార్యక్రమాల మూలంగా స్టేట్ కాంగ్రెస్ ఆంధ్ర మహాసభను విలీనం చేసుకున్నది. దీనివల్ల జాతీయవాదుల ప్రాబల్యం పెరిగింది. ‘జాతీయతను నాశనం చేసి-రష్యా రంగులు మొగాలరుద్ది రైతు కూలీ మంత్రాలు చదివి మాయమాటలు చెప్పే కమ్యూనిస్టుల పంథాలోని పరమ రహస్యం- కుండ బద్దలుకొట్టవలెనోయ్’ అని పాడుతూ జాతీయ వాదులు ఊరూరా ప్రచారం చేశారు.
ఆగస్టు 15,1947న దేశ విభజన జరిగింది. తూర్పు బెంగాల్, పశ్చిమ పంజాబ్‌లలో పెద్ద ఎత్తున హిందూ ముస్లిం మతకల్లోలాలు జరిగాయి. వీటి ప్రభావం హైదరాబాద్ సంస్థానంలో కూడా పడింది. నిజాం రాజ్యం స్వతంత్రంగా ఉంటుందని, భారత్ యూనియన్‌లో చేరటానికి వీలులేదని మజ్లిస్ నాయకత్వం రంకెలు వేస్తున్నది. ఈ స్థితిలో నిజాంను లొంగదీసి సంస్థానాన్ని యూనియన్‌లో చేర్చటానికి నెహ్రూ-పటేల్ కేందప్రభుత్వం ఓ వైపు సంప్రదింపులు చేస్తూనే మరోవైపు స్టేట్ కాంగ్రెసుతో సత్యాగ్రహం చేయించింది. ‘నిజాం సంస్థానం భారత్ యూనియన్‌లో చేరాలి’, ‘నిజాం సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలి’ అనేవి కాంగ్రెసు నినాదాలు. ఆర్య సమాజ్, కాంగ్రెస్ కార్యకర్తలు వేలాదిగా అరెస్టయ్యారు. జైళ్లన్నీ నిండిపోయాయి. రజాకార్ దౌర్జన్యాలు పెచ్చరిల్లి పోయాయి.
సంస్థానం ప్రధానిగా సర్ మీర్జా ఇస్మాయిల్ రాజీనామా చేయగా చతారీ నవాబు ఆ పదవిని చేపట్టారు. ఇతడే కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్‌తో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లారు. ఇక్కడ ఖాసిం రజ్వీ,హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో చేరదని స్వతంత్ర ముస్లిం ర్యాంగా కొనసాగుతుందని ప్రకటించాడు. ఈ లోగా ఢిల్లీలో మౌంట్ బాటెన్ సలహాపై హైదరాబాద్ ప్రతినిధి వర్గం 1947 అక్టోబరులో విలీనం ఒడంబడికకు సంసిద్ధమైంది. ఈ ఒడంబడిక ముసాయిదాను తీసుకుని హైదరాబాద్ ప్రతినిధి వర్గం నిజాం సంతకానికి హైదరాబాద్ వచ్చింది. ఇది తెలిసిన మజ్లిస్ నాయకులు జిన్నా సలహా కోసం పాకిస్తాన్ వెళ్లారు. ఒడంబడిక ముసాయిదాను నిజాం తన వద్దే పెట్టుకున్నాడు. రాత్రి 3 గంటల ప్రాంతంలో మజ్లిస్ కార్యకర్తలు ప్రధానమంత్రి నివాస గృహం ‘షామంజిల్’ (ఇప్పటి రాజ్‌భవన్)పై దాడి చేశారు. హైదరాబాద్ ప్రతినిధి ఢిల్లీ వెళ్లరాదని, అజాద్ హైదరాబాద్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ విధ్వంసం చేశారు. ఈ గుంపుపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ముందుగా నిర్ణయించుకున్న పథకం ప్రకారమే ఈ దాడి జరిగింది. రజ్వీ, రజాకార్ మతోన్మాద దౌర్జన్యానికి ఇది పరాకాష్ట.
అఖిల హైదరాబాద్ విద్యార్ధి యూనియన్‌కు చెందిన సుమారు 2000 మంది విద్యార్ధులు ‘పోరాటాన్ని ప్రారంభించాలి’, ‘నిజాంతో రాజీ వద్దు’ అన్న నినాదాలతో జూలై 1947 ప్రాంతంలో స్వామీ రామానంద ఉన్న ఇంటికి ఊరేగింపుగా వెళ్లారు. ఆయన తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన తరువాత వారు శాంతించారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు, విద్యార్ధులు గ్రామాల్లో ఆంధ్ర మహాసభ, ప్టణాల్లో అఖిల భారత విద్యార్ధి యూనియన్లు, ఇతర కార్మికసంఘాలు విలీన అనుకూల ఉద్యమానికి నాయకత్వం వహించాయి. జాతీయ పతాకాన్ని (మూడు రంగుల జెండా) ఎగురవేసేవారు. ఈ సభలకు మూడు, నాలుగు వేల మంది వరకూ వచ్చిన సందర్భాలున్నాయి. ఆంధ్ర మహాసభ పనిచేస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం అమలు జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టి, అరెస్టు చేయడానికి ప్రయత్నించేవారు. జిల్లా కేంద్రాల్లో వందల సంఖ్యలో హైస్కూల్ విద్యార్థులను సమీకరించి జెండా ఎగురవేసి పోలీసు వచ్చేలోగా తప్పుకునేవారు.
నిజాం ప్రభుత్వం గ్రామాల్లో రజాకార్లను సమీకరించడం ప్రారంభించింది. జాగీరుదార్లు, బంజరుదార్లు, భూస్వాములకు తాలూకా, జిల్లా కేంద్రాల్లో గడీలు ఉండటం వలన రజాకారులు వాటిలో ఉండేవారు. స్థానిక ముస్లిమ్‌లను రజాకార్లు సమీకరించి, శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే స్థానిక ముస్లింలు ముస్లిమేతరులను, గ్రామీణ పేదలను, పట్టణ పేదలను భయపెట్టడం ఆరంభించారు. ఎగరవేసిన జెండాలను దింపించడం, యూనియన్‌లో చేరాలని కోరితే రజాకార్లు విరుచుకుపడతారు, మీరు నష్టపోతారని బెదిరించేవారు.
జనగామ తాలూకాలో విసునూరి రామచంద్రా రెడ్డిని రజాకార్ల కమాండర్‌గా, ప్రధాన నాయకుడుగా నియమించారు. రామచంద్రారెడ్డితోపాటు అతని గూండాలు కూడా రజాకార్లుగా పనిచేశారు. వరంగల్ జిల్లాలో బల్లేపల్లిలో ఒక దేశ్‌ముఖ్, మరొక భూస్వామిని నాయకునిగా ఎంపిక చేసి రజాకార్ నాయకులుగా ప్రకటించారు. సాధారణంగా 99.9 శాతం రజాకారులంతా ముస్లిమ్లే అయినా జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, గ్రామస్థాయిలో అక్కడక్కడ రజాకార్లుగా దేశ్‌ముఖ్‌లు కొనసాగారు. రజాకారులు చేసిన దురాగతాలు చెప్పడానికి కొన్ని వేల పుటలు కావాలి. గ్రామాలను తగులబెట్టడం, దోచుకుపోవడం, స్త్రీలను చెరచడం సర్వసాధారణం. రజాకార్లు వస్తే ప్రతిఘటించేది, లేదా వారికి ఏవీ దొరకకుండా గ్రామాలను ఖాళీ చేసేది. అయినా అనేక సంఘటనలు జరిగాయి. వాటిలో 1946లో జెర్రిపోతుల గూడెం సంఘటన (బేతవోలు గ్రామ శివారు) వంకవంతుల మట్టయ్య అనే పోలీసు పటేల్ రజాకారుల సహాయంతో పోలీసులను తీసుకువచ్చి గ్రామాలపై దాడులు చేయించాడు. వారు 18 మంది స్త్రీలను చెరచారు. కొందరిని కాల్చి వేశారు. తరువాత గ్రామస్తులు అతడిని చంపారు. ఆ క్రమంలోనే రావి నారాయణరెడ్డి ఇల్లు, దేవులపల్లి వెంకటేశ్వరరావు పాక తగులబెట్టారు.ఆ పోరాటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కీలకపాత్రను పోషించింది. సురవరం ప్రతాపరెడ్డి గొల్కొండ పత్రిక ద్వారా, గడియారం రామకృష్ణశర్మ రహస్య రేడియో (భాగ్యనగర్ రేడియో) ప్రసారాల ద్వారా నిజాం నిరంకుశ పాలనపై ప్రజల్లో చైతన్యం నింపారు. మందుముల నరసింగరావు, ముందుముల రామచంద్రరావు, మహిళా ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన బూర్గుల అనంతలక్ష్మి, నందగిరి ఇందిరాదేవి ఈ జిల్లా వారే.
నాగర్ కర్నూలు ప్రాంతంలో అచ్యుతారెడ్డి, ఎద్దుల పుల్లారెడ్డి, జడ్చర్ల ప్రాంతంలో కొత్త కేశవులు, మహాబూబ్ నగర్‌లో ఏగూరి చెన్నప్ప, వారాల నారాయణ, బాలయ్య, అడివప్ప, కొడంగల్ ప్రాతంలో గంగయ్య, ఆత్మకూరు ప్రాతంలో వర్కటం వెంకటరెడ్డి వనపర్తిలో బలరాం గౌడ్ జెండా పండగలో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఏల్కూరి యువకులు వీరి స్ఫూర్తితో 1946లో గ్రామ పెద్ద మహానంది రెడ్డి నాయకత్వంలో కమిటీగా ఏర్పడి పోరాడారు. ఆగస్టు 15, 1947న గ్రామంలో కేశవాచారి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. తరువాత 1947 సెప్టెంబరులో పాగా పుల్లారెడ్డి, డి.కె.సత్యారెడ్డి నాయకత్వంలో బంజర్లలో గల తాటి, ఈత చెట్లను నరికి పోరాడగా వారిని గ్రామ చావిడిలో ఉంచి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. దీనితో ప్రజలు తిరగబడి పోలీసులను తరిమి కొట్టారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆత్మకూరు సంస్థానంలో 2000 మందికి పైగా సత్యాగ్రహం చేసినందుకు నిజాం సైన్యానికి ఆగ్రహం కలిగింది. 1947 సెప్టెంబరు 14న నెలికొండలో కుక్కల కిష్టప్ప తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తే ఆయన్ను అరెస్టు చేయడానికి పోలీసు ప్రయత్నించింది. దాసరిపల్లి బుచ్చారెడ్డి మరికొందరు యువకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో కిష్టప్పను అరెస్టు చేయకుండా పోలీసు వెనుదిరిగింది. మహబూబ్ నగర్ తూర్పు కమాన్ ఓ స్ఫూర్తి కేంద్రం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నిజాం పోలీసులు కట్టుదిట్టంగా కాపలా కాస్తున్నా వారి కళ్లు గప్పి పల్లెర హనుమంతరావు, ఏగూరి చెన్నప్ప, ఇరువింటి లక్ష్మణమూర్తి వారి అనుచరులు మొట్టమొదటి జాతీయ జెండాను కమాన్‌పై ఎగుర వేశారు. పిల్లల్లో ఉద్యమం స్ఫూర్తి నింపడానికి బాలభక్త సమాజాన్ని ఏర్పాటు చేశారు. స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఊరూరా త్రివర్ణ పతాకాలు ఎగురవేస్తూ దేశభక్తిని చాటుతున్న సమయంలో వరంగల్ తూర్పు కోటలో బత్తిని మొగలయ్య గౌడ్ ఆగస్టు 8, 1947న రజాకార్ల దాష్టీకానికి బలయ్యాడు. దానితో వరంగల్‌లో రజాకార్ వ్యతిరేకోద్యమం ఊపందుకుంది.
1947 మే నెలలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రజా సదస్సు నిర్వహించింది. ‘జాయిన్ ఇండియా ఉద్యమం’ చేపట్టాలని ఆ సదస్సులో తీర్మానించారు. జయప్రకాశ్ నారాయణ, ఆచార్య ఎన్.జి.రంగా ఈ ఉద్యమానికి ఊపు నిచ్చారు. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్టారావు సత్యాగ్రహం చేసి అరెస్టు అయ్యారు. ఆగస్టు 7, 1947న ‘జాయిన్ ఇండియా డే’గా ప్రకటించారు. హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించగా రజాకారులు అడ్డుకున్నారు. అయినా 1947 ఆగస్టు 7న స్వామి రామానంద జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబరు 2న పరకాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వచ్చిన ప్రజలపై రజాకార్లు కాల్పులు జరిపి 15 మంది ప్రాణాలను బలిగొన్నారు.
తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభుత్వం, పోలీసులు, రజాకారులు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలు దాన్ని బేఖాతరు చేసి త్రివర్ణ పతాకాన్ని అనేక ప్రాతాల్లో ఎగురవేసి వేడుక చేసుకున్నారు.
– డా।। కాశింశెట్టి సత్యనారాయణ