సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ ఆషాఢ శుద్ధ అష్టమి – 26 జూన్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
‘ఈ వ్యవస్థ మారాలి!’ ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త నోరు విప్పినా మొదట ఉరికే మాట ఇదే. కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఆద్యుడు కారల్‌మార్కస్ అయినప్పటికీ ప్రపంచ దేశాలలో కొన్ని వందల రాజకీయ పక్షాలు, కొన్నివేల మంది నాయకులు దానికి తమదైన భాష్యం చెప్పారు. అందులో వాళ్ల వాళ్ల సౌలభ్యాలు, సౌఖ్యాలు దాగి ఉన్న సంగతి దాచేస్తే దాగనిదే. ఆ సిద్ధాంతం చెప్పేది హింసాయుత పథంలో కార్మిక రాజ్యమే. కానీ కాళ్లు లాగిన కొందరు పార్లమెంటరీ విధానంతోను వ్యవస్థను మార్చే కిటుకులు ఉన్నాయంటూ బయలుదేరారు. కొందరు తుపాకీ గొట్టం నుంచి వచ్చే రాజ్యాధికారం కోసం నిరీక్షిస్తున్నారు. ఆ పార్టీలన్నిటి మీద ఉన్న ఏకాభిప్రాయం- అవి స్థానీయతను మన్నించవు. ఆచరణ అంటే ఎదుటి పక్షంలోని వారిని చంపినంత సులభం కాదన్న సంగతి వారికి తెలియదు. సిద్ధాంతాన్ని మనసా వాచా నమ్మడమంటే ఎదుటివారి నోరు నొక్కినంత సులభం కాదన్న వాస్తవాన్ని పట్టించుకోరు. వేయి పూలు వికసించాలి అంటూనే తాము చేసే హత్యలు, నిర్బంధాలు, నోటికి తాళాలు అంతా శాస్త్రీయమంటారు. అన్నింటికి మించి వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుందన్న చిన్న తర్కాన్ని దశాబ్దాల తరబడి విస్మరిస్తూనే ఉన్నారు. అందుకు కేరళ సీపీఐ(ఎం) పరిణామాలే నిదర్శనం.
ఆ మధ్యన పీకే అనిల్‌కుమార్ అనే ఆయన అత్యంత విలాసవంతమైన మినీ కూపర్ అనే కారును కొనుగోలు చేశారు. దానిని షోరూమ్ నుంచి తన చేతులలోకి తెచ్చుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాలలో సగర్వంగా వెల్లడించారు. దీనితో గగ్గోలు మొదలయింది. రూ. 50 లక్షలు పోసి ఆయన ఎవరో కారు కొంటే అంత గగ్గోలు ఎందుకు? ఎందుకంటే అనిల్‌కుమార్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) నాయకుడు. కేరళ పెట్రోలియం అండ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. అది సీపీఎం అనుబంధ కార్మిక సంఘం. దీనితో ఎర్నాకులం జిల్లా కమిటీ సంఘం బాధ్యతల నుంచి ఆయనకు ఉద్వాసన చెప్పింది. తరువాత ఇంకా హాస్యాస్పదమైన వివరణ ఇచ్చాడాయన. అది ఇండియన్ ఆయిల్ సంస్థ ఉద్యోగి అయిన తన భార్య కొనుక్కున్న కారు తప్ప, తనకు సంబంధం లేదన్నాడు. అనిల్‌కుమార్ మరొక ఘనకార్యం కూడా ఉంది. ఉమా సుధీర్ అనే ఎస్సీ మహిళను కులం పేరుతో ఇతడు వేధించాడు. ఇతడి మీద గతంలోను వసూళ్లకి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే కార్మిక కర్షక రాజ్యం ఏర్పాటులో భాగంగా వాటన్నిటినీ సహించి అధినాయకత్వం అందరి నోళ్లు నొక్కేసింది. పైగా అధిష్టానంలో ఆయన ‘రాజగురువులు’ ఎక్కువగానే ఉన్నారట. అందుకే మీ వ్యక్తిగత జీవితాలు, అందులోని విలాసం ప్రదర్శనకు పెట్టొద్దని, గుట్టుగా సాగించండని చిట్కా ఇచ్చింది పార్టీ. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని సామెత. 2017లో కొడియేరు బాలకృష్ణన్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు మినీ కూపర్‌లోనే ప్రయాణించి కలకలం సృష్టించారు. ఆయన ఆ ఖరీదైన కారులో వచ్చింది పార్టీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి. ఆ కారేమో ఒక బంగారం స్మగ్లర్‌ది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు మరచిపోకండి అంటూ అప్పుడే పార్టీ గొంతు చించుకుంది. సీఐటీయూ తన హద్దులలో ఉంటూ పదే పదే ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటే, సచివాలయంలో హల్‌చల్ చేస్తే ఊరుకో బోమని నిరుడు సెప్టెంబర్‌లోనే సీపీఎం ప్లీనరీ హెచ్చరించ వలసి వచ్చిందంటేనే దాని ప్రతాపం అర్ధమవుతుంది.
ఇదే కార్మిక సంఘం అధ్యక్షుడు సీఎన్ మోహనన్‌ను కూడా పదవి నుంచి తొలగించారు. ఎందుకంటే ఈయన కార్మిక సంఘం అధ్యక్ష పదవి, ఇటు ఎర్నాకులం సీపీఎం జిల్లా శాఖ కార్యదర్శి పదవి కూడా జమిలిగా నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి కదా అంటూ అధ్యక్ష పదవి నుంచి పీకేశారు. అయితే ఇది వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల వేళే ఎందుకు గుర్తుకు వచ్చిం దన్నదే అసలు ప్రశ్న.
రాజకీయ రంగానికీ, కార్మిక రంగానికీ మాత్రమే కాదు, కేరళ క్రీడారంగం మీద కూడా ఎరుపు నీడ పడింది. ఎర్నాకులం జిల్లా క్రీడా మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయమని పీవీ శ్రీనిజన్‌ను పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఎమ్మెల్యే కూడా అయిన శ్రీనిజన్ ఈ మే మాసంలో కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ అండర్ 17 బృందాల కోసం ఎంపిక జరుగుతుంటే అడ్డుకున్నాడు. ఈ జట్లలో ఎంపిక కావాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారంతా ఊసూరుమనిపోయారు. ఇది వివాదాస్పదమైంది. గుర్తించవలసిన అంశం బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు చేసిన అల్లరిలో ఇక్కడ పదోవంతు కూడా ఎందుకు జరగలేదు? ఇంతకీ శ్రీనిజన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తనయుడు. కన్ననూర్ జిల్లాలో మే మాసంలోనే నలుగురు నాయకులని సీపీఎం జిల్లా నాయకత్వం బహిష్కరించింది. వీళ్ల మీద మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. జేవియర్ పాల్, రామ్షా, ఎ. అఖిల్, కె. సాకేశ్ అనే ఆ నలుగురు క్రిప్టో కరెన్సీ ద్వారా సీపీఎం అనుబంధ సంఘాల అధీనంలో ఉన్న సహకార బ్యాంకుల ద్వారా మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. నేటి ఎస్‌ఎఫ్‌ఐ నేతలే రేపటి సీపీఎం నాయకులు కాబట్టి వాళ్లు కూడా ఈ అడ్డుతోవలను వెతకడంలో ప్రతిభ చూపుతున్నారు. నిఖిల్ థామస్ అనే ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు నకిలీ సర్టిఫికెట్లు చూపించి కేరళ స్టేట్ యూనివర్సిటీలో చేరిన సంగతి వెలుగు చూసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కే బంగారం స్మగ్లింగ్‌తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉందని స్వప్నా సురేశ్ అనే యువతి ఆరోపించిన సంగతి దేశానికి తెలుసు. ఎన్ని పాపాలకైనా పాల్పడవచ్చు. ఎన్ని హత్యలైనా చేయించవచ్చు. బీజేపీ, ఆరెస్సెస్‌ల ఫాసిజాన్ని అడ్డుకు తీరతామని అంటే చాలు అవన్నీ ప్రక్షాళన అయిపోతాయి.