సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ ఆషాడ శుద్ధ పాడ్యమి – 19 జూన్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని కలవరపరిచింది. ఇందులో కూడా రాజకీయ ప్రయోజనాన్ని చూడదలిచిన కొన్ని పక్షాల కక్కుర్తి జాతికి జుగుప్స కూడా కలిగించింది. దీని వెనుక కుట్ర కోణం ఉన్నదన్న వాదనను ఎంత వీలైతే అంత అణచిపెట్టడానికి పలువురు చేసిన ప్రయత్నం బయటపడిపో యింది. దేశంలో రైలు ప్రమాదాలు కొత్తకాదు. ఏ ప్రమాదమైనా విషాదకరమై నదే. బాధాకరమైనదే. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా జరిగినవి కొన్నయితే, కుట్రలతో, కూహకాలతో రైళ్లను పడగొట్టి జనహననం చేయాలన్న విషపుటాలోచన కారణంగా సంభవించినవి ఇంకొన్ని.
ఒడిశా బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదాన్ని గమనిస్తే, దాని వెనుక కుట్ర ఉన్నదేమోనని అనుమానించడానికి అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ చెప్పడం చర్విత చర్వణమే. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెనువెంటనే ప్రమాద స్థలికి వచ్చారు. తరువాత ప్రధానమంత్రి మోదీ ఆగమేఘాల మీద వెళ్లి బాధితులను పరామర్శించారు. వైష్ణవ్ మూడు నాలుగు రోజులు అక్కడే ఉండి పునర్నిర్మాణ పనులు చేయించిన తీరు దేశాన్ని ఆనందపరిచింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పక్క రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మాజీ రైల్వేమంత్రి మమతా బెనర్జీ కూడా వెళ్లి సానుభూతి ప్రకటించి వచ్చారు. వీరిలో కుట్ర కోణం గురించి మొదట ప్రస్తావించినవారు మమతా బెనర్జీ. తరువాత రైల్వే మంత్రి కూడా అలాంటి అనుమానాలు ఉన్నాయని నీళ్లు నమలకుండానే చెప్పారు. ఆ శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది కూడా ఆ నేర కోణాన్ని ప్రస్తావించారు. త్రివేది ప్రకటన పట్ల కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఎందుకు భుజాలు తడుముకోవలసి వచ్చిందో అర్ధం కాదు. తన అధికార నివాసాన్ని ఇంకొంత కాలం అట్టే పెట్టుకోవడానికే త్రివేది ఆ ప్రమాదంలో కుట్ర కోణం గురించి మాట్లాడారని జైరామ్ రమేశ్ చెప్పడం సిగ్గుచేటు.
పొరుగుదేశం బుర్ర విషంతో నిండుతున్న కొద్దీ దాని వ్యూహాలు కూడా మాటలకు అందనంత క్రూరంగా మారిపోతున్నాయి. ఆ చర్యలకి వామపక్ష అతివాదులు కూడా చేయూతనిస్తున్నారు. 2017లో నాటి రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు సాక్షాత్తు లోక్‌సభలో ఇచ్చిన ప్రకటన మాటేమిటి? ఆ ప్రకటన అప్పుడే పరగడపు అయింది. అప్పుడే కాన్పూర్ వద్ద జరిగిన ఒక రైలు ప్రమాదం నేపథ్యంలో మంత్రి ఈ విషయం ప్రస్తావించారు. పేలుళ్ల ద్వారా రైలు మార్గాలను ధ్వంసం చేసి ప్రమాదాలు సృష్టించాలన్న, రైల్వే వ్యవస్థకు వెన్నుపోటు పొడవాలన్న నీచబుద్ధి బయటపడిందని ఆయన ప్రకటించారు. పేలుళ్లతో పట్టాలను ధ్వంసం చేయాలన్న ప్రయత్నాలు ఏడు, వెన్నుపోటు ప్రయత్నాలు మూడు బయటపడ్డాయని సభ సాక్షిగానే చెప్పారు.
ఇందోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు నవంబర్ 20, 2016 కాన్పూర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. 150 మంది చనిపోయారు. 150 మంది గాయపడ్డారు. ఆ సంవత్సరం డిసెంబర్ 28న కాన్పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో అదే తరహాలో మరొక రైలు ప్రమాదం జరిగింది. కానీ 2017 జనవరిలో సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల అక్కడే మరొక ప్రమాదం తప్పింది. ఈ వరస ప్రమాదాల గుట్టేమిటో భారత్-నేపాల్ సరిహద్దులలోని అడవులలో దొరికిన రెండు శవాలు బయటపెట్టాయి. ఆ జంట హత్యలకు సంబంధించి తూర్పు చంపారన్ పోలీసులు బుఖారి అనే గ్రామంలో ఉంటున్న మోతీలాల్ పశ్వాన్, ముఖేశ్ యాదవ్, ఉమాశంకర్ పటేల్‌లను అరెస్టు చేశారు. ఈ ముగ్గురే అరుణ్ రామ్, దీపక్ రామ్‌లను చంపి ఆ అడవులలో పడేశారు. ఈ ఇద్దరిదీ లక్ష్మీపూర్ పోఖారియా అనే గ్రామం. ఎలక్ట్రీషియన్లుగా జీవనం సాగిస్తున్న ఈ ఇద్దరినీ ఆ ముగ్గురు ఎందుకు చంపవలసి వచ్చింది? కాంట్రాక్టుకు తీసుకున్న పనిని పూర్తి చేయనందుకే ఆ శిక్ష విధించారట. ఏమిటా ‘కాంట్రాక్ట్’? ఘోర్‌సాహన్ దగ్గర రైల్వే పట్టాలను బాంబులు పెట్టి పేల్చడం. ఇందులో మోతీలాల్ పశ్వాన్ మాజీ నక్సలైట్. చిన్న చిన్న నేరగాళ్లని ఉపయోగించుకుని రైల్వే ప్రమాదాలు ఏ తీరున తాము నిర్వహిస్తున్నామో విచారణలో బయటపెట్టాడు. కథ ఇంతటితో అయిపోలేదు.
ఈ కుట్రలో బ్రజేశ్‌కిశోర్ అనే అణాకాణీ సినీనటుడు కూడా ఒక పాత్ర పోషించాడు. ఇతడికి అదే ప్రాంతంలో ఒక స్టుడియో ఉంది. దుబాయ్‌లో ఉండే నేపాలీయుడు సంషుల్ హుడా కూడా పాలు పంచుకున్నాడు. ఇతడికి దొంగనోట్ల మార్పిడి వ్యాపారం కూడా ఉంది. సంషుల్‌ను వెనుక ఉండి నడిపించేవాడే షఫీ షేక్. ఇతడు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నవాడు. మారుమూల గ్రామాలలో ఉండే సాధారణ ఎలక్ట్రీషియన్ దగ్గర మొదలుపెడితే ఆ తీగ ఐఎస్‌ఐ దగ్గర తేలింది. మరో తాజా ఘటన. ఏప్రిల్ 3వ తేదీన కేరళలో అళప్పుజ-కన్నూర్ మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీలో జరిగినదేమిటి? చిన్న గొడవను ఆసరా చేసుకుని సహ ప్రయాణికుల మీద పెట్రోలు చల్లి నిప్పు అంటించ బోయాడు ఒక దుర్మార్గుడు. ఆ భయంతో నడుస్తున్న రైలు నుంచి కిందకి దూకిన కుటుంబంలో సంవత్సరం బిడ్డ సహా ముగ్గురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. అతడిని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పట్టుకున్నారు. ఇతడి అసలు నివాసం సీఏఏ చట్ట వ్యతిరేక ఆందోళనతో పేరు మోసిన షాహిన్‌బాగ్. పేరు షారుఖ్ షఫీ.
ఎన్ని నేరాలు, ఎంత ఘోరమైన నేరాలు, నీచ కృత్యాలు చేస్తున్నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అలాంటివారికి వత్తాసు పలకడం విజ్ఞత కాదు. ఎంత రాజకీయం చేయగలిగినా మానవత్వం మరచిపోకూడదు. ఇది దేశంలోని విపక్షాలన్నీ ఎంత తొందరగా తెలుసుకుంటే అంతమంచిది. ప్రజల ప్రాణాలు వాళ్లకి కావలసిన ఓట్ల కంటే తక్కువ విలువైనవేనన్న నీచపు బుద్ధి నుంచి బయటపడడం అత్యవసరం.