– క్రాంతి

ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి, మారణహోమం జరగడంతో యావత్‌ ‌భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ కుకీ, నాగా తెగల వారు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వీరిని ఎదుర్కొనేందుకు మైతేయీలు ప్రతిదాడులు ప్రారంభించారు. ఈ అల్లర్లలో సుమారుగా 98 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. సుమారు 1700 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి (జూన్‌ 6 ‌నాటికి). కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.

మైతేయీలను షెడ్యూల్డ్ ‌తెగ (ఎస్టీ)ల్లో చేర్చేం దుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మణిపూర్‌ ‌హైకోర్టు రాష్ట్ట్ర ప్రభుత్వానికి సూచించడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ హోదా అనుభవిస్తున్న తెగలవారు అల్లర్లకు తెగబడ్డారు. కుకీలు కత్తుల తోనూ, నాగాలు ఏకే 47లతోనూ విరుచుకుపడ్డారు. ఈ అల్లర్ల వెనుక వేర్పాటువాదులు కూడా ఉన్నారనేది సుస్పష్టం. మే 3న మొదలైన ఆందోళనలు మరు నాటికే హింసాత్మకంగా మారిపోయాయి. మణిపూర్‌, ‌చురాచాంద్‌పూర్‌, ఇం‌ఫాల్‌ ఈస్ట్, ఇం‌ఫాల్‌ ‌వెస్ట్, ‌బిష్ణుపూర్‌, ‌టెంగ్పోపాల తదితర ప్రాంతాలకు విస్తరించింది. కుకీలు అధికంగా ఉండే ప్రాంతంలో మైతేయీలు స్వల్ప మొత్తంలో జీవిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. కొన్నిచోట్ల మొత్తం గ్రామాలనే తగులబెట్టారు.

అల్లర్లు ప్రారంభం కాగానే అప్రమత్తమైన మణిపూర్‌ .. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి 144 సెక్షన్‌ ‌విధించింది. జిల్లా మెజిస్ట్రేట్లకు ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని అప్పగించింది. ఇంటర్నెట్‌ ‌సేవల్ని నిలిపివేసింది. సైన్యం ఫ్లాగ్‌మార్చ్ ‌నిర్వహించింది. ఆర్మీ డ్రోన్లు, హెలికాప్టర్లు మణిపూర్‌ను జల్లెడ పట్టాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ ‌సింగ్‌ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు స్పందించి పారా మిలటరీ బలగాలను మోహరించి పరిస్థితు లను అదుపులోకి తీసుకొచ్చింది. ఎంతగా పరిస్థితిని చక్కదిద్దినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడ జనజీవనం ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆందోళనాకారులు లోయకు వెళ్లే హైవేను దిగ్బంధం చేయడంతో వస్తుసేవల పంపిణీ నిలిచిపోయింది. మణిపూర్‌లోకి లారీలను నడిపేందుకు డ్రైవర్లు విముఖత ప్రదర్శించడంతో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌సహా పలు నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. ఫలితంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. లీటర్‌ ‌పెట్రోల్‌ను బ్లాక్‌ ‌మార్కెట్‌లో రూ.200 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. అత్యవసర మందులకు కొరత ఏర్పడింది. గతంలో కిలో బియ్యం రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60కి పెరిగింది. కిలో ఉల్లిపాయల ధర రూ.35 నుంచి రూ.70కి చేరుకుంది.

అమిత్‌షా పర్యటనతో కదలిక

మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేం దుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. చురాచంద్‌ ‌పూర్‌ ‌జిల్లాలోని స్థితిగతులను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌, ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. భయభ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పారు. చెప్పుడు మాటలను గానీ, ఎటువంటి వదంతులను గానీ నమ్మవద్దని అన్నారు. మైతేయీ, కుకీ, నాగా వర్గాల వారు తొందరపడొద్దన్నారు. ఈ అల్లర్లకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అమిత్‌ ‌షా మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటిం చారు. జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు ఏ విధమైన పరిహారం అందించాలన్న విషయంపై చర్చించారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించాయి. వారి కుటుంబా లలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పెట్రోల్‌, ‌గ్యాస్‌, ‌రైస్‌, ‌నిత్యావసర వస్తువులకు కొదవ రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కుకీ, మైతీ వర్గాలతో పాటు ఇతర పౌరసమాజ సంస్థలతోనూ తాను మాట్లాడానని, అందరూ శాంతికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లైసెన్సు లేని ఆయుధాలను తక్షణం అప్పగించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమస్యకు మూలమేంటి?

ఈశాన్యంలోని మణిపూర్‌ ‌మన దేశానికే విలువైన రాష్ట్రంగా ప్రఖ్యాతి పొందింది. ఈ రాష్ట్రం భౌగోళికంగా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. లోయ, కొండ ప్రాంతాలని.. రెండు విభాగాలుగా ఉంటుంది. మధ్యలో ఉన్న ఇంఫాల్‌ ‌లోయ ప్రాంతం అత్యంత సారవంతమైనది. కేవలం 10 శాతం ఉన్న ఈ భూ భాగంలో రాష్ట్రంలోని దాదాపు తొంభై శాతం ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా మైతేయీలు (మెయిటీలు). రాష్ట్రంలో వీరి జనాభా దాదాపు 53 శాతం. రాష్ట్రం లోని 60 మంది శాసనసభ్యుల్లో ఇక్కడ నుంచే 40 మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక మిగిలిన కొండప్రాంతాల్లో కుకీ, నాగాలతో పాటు మిజో, జోమీ, హమర్‌ ‌తదితర 30కు పైగా ఆదివాసీ తెగలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలుండగా ఐదు జిల్లాల్లో మైతేయీ తెగవారు అధికంగా ఉన్నారు.  మైతేయీలు లోయ ప్రాంతంలో తప్ప రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం, నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వారికి ఆదివాసీ రిజర్వేషన్లు లేకపోవడంతో కొండ ప్రాంతాల్లో భూములు కొనే సౌలభ్యం లేదు. అయితే కొండ ప్రాంతాల వారు మాత్రం తాము నివసించే ప్రాంతాలతో పాటు లోయలోని భూములను కొనవచ్చు. దీంతో తమను కూడా షెడ్యూల్డ్ ‌తెగలుగా పరిగణించి రిజర్వేషన్లు ఇవ్వాలని మైతేయీలు కోరుతున్నారు. ఇందుకోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. వాస్తవానికి 1948 కన్నా ముందు మైతేయీలను గిరిజనులుగా పరిగణించేవారు. ఆ తర్వాత హోదా తొలగించడంతో సమస్యలు వచ్చాయి. తాము రిజర్వేషన్లు కొత్తగా అడగడం లేదని, గతంలో ఉన్నవాటిని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని మెయిటీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా మూడు తెగల వాళ్లున్నారు. కుకీ, నాగా, మైతేయీ.. వీరితో పాటు కుకీ ఫంగల్‌ అన్న చిన్న తెగ కూడా ఉంది. కుకీ, నాగా తెగల ప్రజలంతా క్రైస్తవులు. వారిని ఎస్టీలుగా పరిగణిస్తు న్నారు. మెజార్టీ తెగ ప్రజలు మైతేయీలు. వీళ్లంతా హిందువులు. ముస్లిం మతంలోకి మారిన వారిని మైతీ పంగల్‌ అం‌టారు. ఈ వివాదాన్ని మతపరమైన అల్లర్లుగా చిత్రీకరిం చేందుకు కొన్ని వర్గాలు ప్రయత్ని స్తున్నాయి. దీంతో సమస్యను మతం కోణంలో చూపించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

కుట్రలో భాగమేనా?

మణిపూర్‌లో మహిళలు, పిల్లలు సహా అమాయక ప్రజలను కవచాలుగా వాడుకొని గ్రామాలపై దాడులు చేయాలన్న వేర్పాటువాదుల కుట్రను సైన్యం బయటపెట్టింది. వేర్పాటువాదల కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థలోకి సైన్యానికి చెందిన ‘స్పియర్‌కోర్‌ ‌కమాండ్‌’ ‌ప్రవేశించి వారి సంభాషణ లను పరిశీలించింది. భద్రతా దళాలను అడ్డుకు నేందుకు అమాయక పౌరులను వాడుకొని మే 27 నాటికి ఓ గ్రామాన్ని ధ్వంసం చేయాలనే కుట్రపై వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో పిల్లలు, మహిళలు మరణిస్తే.. సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని భావించారు. అంతేకాదు, ఆ వేర్పాటువాదుల వద్ద తగినన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న అస్థిరతను వాడుకుని చాలా వేర్పాటువాద సంస్థలు ప్రజలను భయభ్రాంతుల్ని చేయాలని ప్రయత్నిస్తు న్నాయి. భారత సైన్యం కొందరు వేర్పాటువాదులను అరెస్టుచేసింది కూడా.

కోర్టు ఆదేశంతో..

మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర గిరిజన శాఖకు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించ డంతో మణిపూర్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. మెయిటీలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని గిరిజన తెగలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ముఖ్యంగా కుకీ, నాగాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మైతేయీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందన్నది వారి వాదన. కొన్ని వారాల ముందు చురచంద్ర పూర్‌లో సీఎం బీరెన్‌సింగ్‌ ‌పర్యటనకు వ్యతిరేకంగా అక్కడ గిరిజన సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆయన సమావేశ ప్రాంగణానికి నిప్పు పెట్టాయి. మైతేయీల రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి ఈ జిల్లానే కేంద్ర స్థానం కావడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలను రిజర్వ్ ‌ప్రాంతాలుగా ప్రకటించ డంతో కొండలపై నివాస మున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పునరావాసం కల్పించకుండా తమను తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు. దీనికి తోడు రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో నిరసనలు ఘర్షణ రూపం దాల్చాయి. మణిపూర్‌ ఆల్‌ ‌ట్రైబల్‌ ‌స్టూడెంట్స్ ‌యూనియన్‌ (ఏటీఎం ఎస్‌యూ) పిలుపు తర్వాత అల్లర్లు తీవ్రమయ్యాయి

వలసల సంగతేంటి?

మయన్మార్‌లో జరుగుతున్న అల్లర్లతో మణిపూర్‌ ‌లోకి అనేక మంది మయన్మార్‌ ‌వాసులు ఆశ్రయం కోసం వచ్చారు. అలాగే బంగ్లాదేశ్‌ ‌నుంచి కూడా చాలా కాలంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల మంది వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్‌ ‌కుకీలు సైతం రాష్ట్రానికి వస్తున్నారని మైతేయీలు ఆరోపిస్తున్నారు. వీరి రాకను అడ్డుకోవడంతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలతో చర్చించి సమస్యకు పరిష్కారం దిశగా ప్రయత్నిస్తే మేలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. వాస్తవానికి మైతేయీలకు కుకీ, నాగాలకు మధ్య గత పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు లేవు. మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలను మహానాగాలింలో చేర్చాలని నాగా సంస్థలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. నాగాలకు, కుకీలకు మధ్య కూడా వైరం ఉంది. అయితే మైతేయీలకు రిజర్వేషన్‌ అం‌శంపై రెండు వర్గాలు కలసిపోయాయి.

విదేశీ శక్తుల హస్తం

మణిపూర్‌ ‌కొండ ప్రాంతాల్లో కుకీలు, నాగాలు దశాబ్దాలుగా గంజాయి సాగు చేస్తూ బంగ్లాదేశ్‌, ‌పాకిస్తాన్‌ ‌దేశాలకు పంపిస్తూ అక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్లకు అమ్ముతున్నారు. ఐఎస్‌ఐకి డబ్బులు సమకూరే మార్గాలలో మణిపూర్‌లో కుకీలు ఉంటున్న అడవులు ఒక మార్గం. మరోవైపు బంగ్లాదేశ్‌, ‌బర్మా నుంచి వచ్చే కుకీలకు నకిలీ ఆధార్‌ ‌కార్డులు సమ కూరుస్తున్నారు. విదేశీ శక్తులు అటవీ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో మణిపూర్‌ ‌ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాదక ద్రవ్యాలపైన పోరాటంలో భాగంగా ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ అవలంబిస్తున్న కఠిన వైఖరి ఈ వర్గాలకు మింగుడు పడటం లేదు.

40 మంది తిరుగుబాటుదారుల హతం

మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్న సమయం లోనే 40 మంది వేర్పాటు వాదులను హతమార్చినట్లు ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ ‌ప్రకటించారు. ఆయన తిరుగుబాటుదారులను ఉగ్రవాదులతో పోల్చారు.

‘వారు సాధారణ పౌరులపై దాడికి దిగుతున్నారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇండియన్‌ ఆర్మీ, ఇతర భద్రతా బలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. వాళ్లని కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేం.

వాళ్లంతా ఉగ్రవాదులు. నిరాయుధులైన సాధారణ ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారు’ అని వివరించారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE