– జమలాపురపు విఠల్‌రావు
ధర్మశాలలో ‘‘చైనా వ్యవహారశైలి, మారుతున్న ప్రపంచ క్రమం’’ అనే అంశంపై జూన్ 8 నుంచి 10వ తేదీ వరకు చర్చలు జరిగాయి. ఈ మూడు రోజుల సమావేశాన్ని టిబెట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్; సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (సి.టి.ఎ) ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. చైనా వ్యవహారాలకు సంబంధించి 50 మంది మేధావులు పాల్గొన్న ఈ సమావేశం మీడియా దృష్టిని పెద్దగా ఆకర్షించ లేదు.
ప్రారంభ సమావేశంలో సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (టిబెట్ అజ్ఞాత ప్రభుత్వం) అధ్యక్షుడు సికియాంగ్ పంపా సెరింగ్‌తో పాటు చైనా అణచి వేతకు గురవుతున్న వివిధ జాతుల ప్రతినిధులు పాల్గొన్నారు. సిడ్నీ (ఆస్ట్రేలియా) కేంద్రంగా పనిచేస్తున్న ఫెడరేషన్ ఫర్ డెమోక్రటిక్ ఛైనా (ఎఫ్‌డీసీ) ఛిన్ జిన్ అధ్యక్షత వహించారు. చైనా అంతర్గత రాజకీయాల గతిశీలత, విదేశీ వ్యవహారాలపై వీరు తమ చర్చల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. తైవాన్, హాంకాంగ్, ఇన్నర్ మంగోలియా, యూఘిర్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం చైనా అణచివేత విధానాలపై పోరాటానికి ఉమ్మడిగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.
ముఖ్యంగా దౌత్యపరంగా చైనాకు వ్యతిరేక కూటమి ఏర్పాటు అవసరమన్న సంగతిని సికియాం గ్ పంపా సెరింగ్ గుర్తు చేశారు. ప్రస్తుతం రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ, ప్రపంచశాంతికి నిజమైన ప్రమాదం చైనాతోనే పొంచి ఉన్నదని వక్తలు అభిప్రాయపడ్డారు. మంగోల్స్, తూర్పు తుర్కిస్తాన్, మంచూ, హాంకాగ్, తైవాన్, టిబెటన్ ప్రజలు చైనా దాష్టీకానికి బలవుతున్నారని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా చైనా తన అణచివేత విధానాలను మానుకోకపోతే, బాధిత శక్తులన్నీ ఏకమై విరుచుకుపడటం ఖాయమని కూడా పేర్కొంది.
ఏమిటీ సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్?
సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (టిబెట్ అజ్ఞాత ప్రభుత్వం-సీటీఏ)ను 1959లో దలైలామా ఏర్పాటు చేశారు. ఇది భారత్‌లోని ధర్మశాల కేంద్రంగా పని చేస్తుంది. 1960, సెప్టెంబర్ 2వ తేదీన టిబెట్ అజ్ఞాత ప్రభుత్వం దలైలామా నుంచి నియామక పత్రాన్ని పొందింది. ఏటా ఇదే తేదీన టిబెటన్లు ప్రజాస్వామ్య దినాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగానే 2022, సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా టిబెటన్లు 62వ టిబెటన్ ప్రజాస్వామ్య దినాన్ని పాటించారు. టిబెట్ ప్రజల స్వేచ్ఛ, టిబెట్ శరణార్థుల పునరావాసంపై ప్రధానంగా ఇది దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ దిశగానే కార్యకలాపాలు నిర్వ హిస్తుంది. సీటీఏ ప్రధానంగా చైనా చేతిలో ధ్వంస మవుతున్న టిబెట్ సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతోంది. టిబెట్ భాషలోనే మీడియాను నిర్వ హించడం, టిబెటన్ తిరుగుబాటు దినం (1959, మార్చి10) నాడు సెలవు పాటించడం, టిబెట్ జాతీయగీతం ‘గ్యాల్లు’ను ప్రవేశపెట్టడం, టిబెట్ అజ్ఞాత పోరాటం కోసం హాలీవుడ్ చిత్రాలను ఉపయోగించుకోవడం వంటివి కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సి.టి.ఎ.ను ప్రపంచంలోని ఏదేశం గుర్తించలేదు. 1991లో అప్పటి యు.ఎస్. అధ్యక్షులు జార్జ్‌బుష్… దలైలామా, ఆయన పాలనా యంత్రాంగాన్ని టిబెట్‌కు నిజమైన ప్రతినిధులుగా, ‘టిబెట్‌ను ఆక్రమిత ప్రాంతంగా’ గుర్తిస్తూ ఒక కాంగ్రెస్ చట్టంపై సంతకం చేశారు. అయితే బరాక్ ఒబామా, సి.టి.ఎ.కు మధ్యేమార్గాన్ని ప్రతిపాదించ డమే కాకుండా దలైలామాను నాలుగుసార్లు కలుసుకున్నారు కూడా. ఇక మనదేశం విషయానికి వస్తే దలైలామాకు ఆశ్రయం కల్పించడంతో పాటు సెంట్రల్ టిబెట్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి దేశంలో 45 సెటిల్‌మెంట్స్‌ను నిర్మించింది. టిబెటన్ రీ-సెటిల్‌మెంట్ అండ్ హాబిలిటేషన్ (టీఆర్‌ఆర్) కార్యక్రమం 1966లో ప్రారంభమైంది. ఈ సెటిల్ మెంట్‌లు దక్షిణ భారతదేశం, డార్జిలింగ్, సిక్కిం ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని అధికారికంగా ‘రక్షిత ప్రాంతాలు’గా ప్రకటించడంతో, వీటిల్లోకి ప్రవేశించా లంటే అనుమతి తప్పనిసరి. సిటీఏకు వివిధ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి విరాళాల రూపంలో నిధులు అందుతుంటాయి. సీటీఏ అధ్యక్షుడిని అజ్ఞాతంలో ఉన్న టిబెటన్లు నేరుగా ఎన్ను కుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు సికియాంగ్ పంపా సెరింగ్. ఈయన పదవీకాలం ఐదేళ్లు. ఈ అజ్ఞాత ప్రభుత్వ పార్లమెంట్‌లో మొత్తం 45మంది సభ్యు లుంటారు. మంత్రివర్గాన్ని ‘కషగ్’ అని పిలుస్తారు. ప్రస్తుతం సీటీఏకు ప్రపంచ వ్యాప్తంగా 13 నగరాల్లో కార్యాలయాలున్నాయి. అవి బ్రెజిల్, కాన్‌బెర్రా, జెనీవా, ఖాట్మండు, లండన్, మాస్కో, న్యూఢిల్లీ, ప్యారిస్, ప్రిటోరియా, సావ్ పావ్‌లో, తైపీ, టోక్యో, వాషింగ్టన్.
డీఎన్‌ఏ నమూనాల సేకరణపై వ్యతిరేకత
టిబెట్‌లో పెద్ద ఎత్తున ప్రజల నుంచి చైనా డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నట్టు హ్యూమన్‌రైట్స్ వాచ్ 2022 సెప్టెంబర్‌లోనివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా కిండర్‌గార్డెన్ పిల్లలు, స్థానికుల నుంచి ఈ నమూనాలను సేకరించిందని, సీటీఏ అనుమతి లేకుండానే చైనా ఒక పద్ధతి ప్రకారం ఈ చర్యకు పాల్పడుతున్నదని ఆరోపించింది. పాఠశాలల్లో విద్యార్థులకు మాండరిన్ భాషను తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం బయో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నదంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. టిబెట్‌లో మతస్వాతంత్య్రాన్ని ఉక్కుపాదంతో అణచి వేయడాన్ని, చిన్నపిల్లల్ని తల్లిదండ్రుల నుంచి, రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి ఒక పద్ధతి ప్రకారం వేరుచేయడంపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ చెక్ రిప బ్లిక్‌కు చెందిన సెనెట్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్, సైన్స్, కల్చర్, హ్యూమన్ రైట్స్ అండ్ పిటిషన్స్ 2023 మే 30న ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. చైనా టిబెట్ ప్రజల డీఎన్‌ఏ నమూనాలను సేకరించడాన్ని స్విస్ పార్లమెంటరీ గ్రూపు మే 25న తప్పు పట్టింది. స్పెయిన్‌కు చెందిన 29 మంది సెనెటర్లు మొట్టమొదటిసారి 2023, ఫిబ్రవరి 21న ఇంటర్ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ టిబెట్‌ను ఏర్పాటు చేశారు. టిబెట్‌లో మానవ హక్కులను గౌరవించడం, టిబెట్ సమస్యకు పరిష్కారం వంటి అంశాలపై ఈ ఇంటర్ పార్లమెంటరీ గ్రూప్ పనిచేస్తుంది.
సాంస్కృతిక విధ్వంసం
టిబెట్ బౌద్ధులు దలైలామా, పంచన్‌లామాలను సూర్యచంద్రులుగా పరిగణిస్తారు. ఆధ్యాత్మికంగా వీరిని తండ్రీకొడుకలుగా ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలోనే 1995, మే 17న దలైలామా గెడ్యున్ చోయ్‌క్యీ న్యీమాను 11వ పంచన్ లామాగా, ప్రస్తుత దలైలామా ప్రకటించారు. విచిత్రంగా ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకు ఆ బాలుడు కుటుంబం సహా, లహరీ కౌంటీలోని స్వగృహం నుంచి అదృశ్య మయ్యారు. ఇప్పటివరకు వారి జాడ తెలియలేదు.
ఈ ఎంపిక పక్రియలో పాల్గొన్న బౌద్ధ సన్యాసులు, 10వ పంచన్‌లామా జీక్యుబ్ తుల్‌కూ కూడా జాడ లేకుండాపోయారు. ఈ ఎంపిక పక్రియలో సహకరిస్తామన్న చైనా కమ్యూనిస్టు పార్టీ మాట తప్పి, సొంతంగా గ్యాయిన్‌కైన్ నోబు అనే బాలుడిని పంచన్ లామాగా ప్రకటించింది. ఇతను కూడా లహరి కౌటీకి చెందినవాడే. ప్రస్తుతం టిబెట్ బౌద్ధానికి ఇతనే చైనా అధికారిక పంచన్‌లామా! నిజానికి పంచన్‌లామా ముఖ్యంగా తాషిలుంపో మోనాస్టరీకి అధిపతిగా ఉంటారు.
ఇక దలైలామా విషయానికి వస్తే టిబెట్ ఆధ్యాత్మిక, మతపరమైన అంశాల్లో చైనా జోక్యాన్ని నిరసిస్తూ జపాన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ వరల్డ్ ఫెడరేషన్ (జెబీసీడబ్ల్యుఎఫ్), 2023, జనవరి 1న ఒక ప్రకటన విడుదల చేసింది.14వ దలైలామా వారసుడిని ఎన్నుకునే హక్కు టిబెటన్లకు మాత్రమే ఉండాలని స్పష్టంచేసింది. ప్రస్తుత దలైలామా వయస్సు 87 సంవత్సరాలు (2022, జులై 6నాటికి 87వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు). ఈ నేపథ్యంలో ఆయన వారసుడి ఎంపిక విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సమయంలో జపాన్ బౌద్ధ సంఘాలు పైవిధంగా ప్రకటించడం గమనార్హం. కానీ చైనా ప్రమేయంతో టిబెట్ సంస్కృతి ‘‘మరణ ప్రస్థానం’’ నిదానంగా కొనసాగుతుండటం ప్రస్తుత విషాదం.
చైనా పట్ల ఎందుకు వ్యతిరేకత?
ప్రపంచ దేశాల్లో చైనాపట్ల వ్యతిరేకత వ్యక్తం కావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వ విధానాలే. అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన, అనుచిత వాణిజ్య విధానాలు, సెన్సార్‌షిప్, హింస, సైనిక విస్తరణ, ప్రతి విషయంలో రాజకీయ ప్రమేయం, చారిత్రక సామ్రాజ్యవాద పోకడలు ప్రధాన కారణం. చైనా ప్రభుత్వ తిరోగమన విధానాలు, చుట్టుపక్కల దేశాలతో విరోధాన్ని తెచ్చిపెట్టడమే కాదు, శత్రువులను పెంచుతున్నాయి. పాశ్చాత్య మీడియా తనకు వ్యతిరేకంగా రాసే రాతలను ‘సైనోఫోబియా’ అని చైనా పేర్కొంటుంది. చైనా ప్రభుత్వ విధానాలు ఆ దేశాన్ని తిరుగులేని ఆర్థికశక్తిగా మలచిందంటూ వాదించే వారు అమెరికా ఇందుకు ప్రధాన కారణమన్న సత్యాన్ని గుర్తించాలి. చౌకధరకే శ్రామికశక్తి లభిస్తుందన్న కారణంగా అమెరికా అప్పట్లో తన దేశంలోని యూరప్ దేశాల సంస్థలను ప్రోత్సహించడంతో అవి అక్కడ పరిశ్రమలను స్థాపించాయి. ఫలితంగా నేడు చైనా ప్రపంచ ‘తయారీహబ్’గా రూపొందింది. ఆర్థికంగా బలపడిన చైనా తన దాష్టీకాన్ని ప్రదర్శిస్తూ, కుతంత్రాలను అమలుచేస్తోంది. 1940 ప్రాంతంలో హంగరీ కమ్యూనిస్టు పార్టీ నియంత మట్యాస్ రకోసీ ‘‘సలామీ స్లైస్’’ విధానంలో అధికారంలో ఉన్న ‘స్మాల్ హోల్డర్స్’ పార్టీని క్రమక్రమంగా ధ్వంసం చేసి దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇప్పుడు చైనా కూడా ఇతర దేశాలను కబళించడానికి ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.
హాంకాంగ్ నుంచి భారత్ వరకు
హాంకాంగ్ 1997, జూలై 1న చైనా పాలనలోకి వచ్చింది. అప్పటికి 156 సంవత్సరాలపాటు అది బ్రిటిష్ కాలనీగా కొనసాగింది. విచిత్రంగా చైనా పాలనలోకి వచ్చినప్పటికీ ఎక్కువ మంది ప్రజలు తమను హాంకాంగ్ పౌరులుగానే పరిగణించడం గమనార్హం. 2014లో హాంకాంగ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో 42.3% మంది ప్రజలు తమను హాంకాంగ్ పౌరులుగానే చెప్పుకున్నారు. కేవలం 17.8%మంది మాత్రమే తమను చైనీయులుగా పేర్కొన్నారు. చైనా అనుసరిస్తున్న అణచివేత విధానాలు, చైనా ప్రధాన భూభాగానికి చెందిన ప్రజల ఆధిపత్య ధోరణి, మీడియా అణచివేత విధానాలు 32 నుంచి 35శాతం వరకు హాంకాంగ్ ప్రజల్లో చైనాపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని హాంకాంగ్ యూనివర్సిటీ సర్వే పేర్కొంది. ఇక తైవాన్ విషయానికి వస్తే సివిల్‌వార్ తర్వాత, తైవాన్‌ను ఆక్రమించుకుంటామని పీపుల్స్ రిపబ్లిక్ చైనా బెదిరించడంతో తైవాన్ ఎదురు తిరిగింది. ప్రస్తుతం తైవాన్‌లో 20 ఏళ్ల యువత ఎవరికీ చైనాతో కలిసిపోవడం ఇష్టం లేదు. తాము ‘తైవానీయులు’గానే గుర్తింపు పొందడానికి ఇష్టపడుతున్నారు. చైనాతో వ్యతిరేకతకు ఇక్కడ చోటుచేసుకున్న ‘సన్‌ఫ్లవర్ ఉద్యమమే’ గొప్ప ఉదాహరణ. తైవాన్‌కు చెందిన ప్రముఖ ప్రజాస్వామ్య కార్యకర్త, రాజకీయవేత్త పెంగ్‌మింగ్ మిన్ ప్రకారం, చైనా ప్రధాన భూభా గానికి చెందిన ప్రజలు ‘అనాగరికులు’, ‘వెనుక బడినవారు’గా చాలామంది తైవాన్ ప్రజల నిశ్చితాభి ప్రాయం. తైవాన్ మెయిన్‌ల్యాండ్ ఎఫైర్స్ కౌన్సిల్ 2020లో నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది తైవాన్ ప్రజలు, చైనా తమతో అమిత్ర వైఖరినే అనుసరిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనా అధీనంలోఉన్న ఇన్నర్ మంగోలియా ప్రజల్లో చైనా అంటే తీవ్ర వ్యతిరేక భావం ఉంది. ఈ నేపథ్యంలో మంగోలియన్ జాతీయవాదులు, నియో- నాజీయిస్టులు, చైనాపట్ల తీవ్ర శత్రువైఖరి ప్రదర్శిస్తున్నారు. 2011లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మంగోలియన్ జాతీయుల హత్య చివరకు ఇన్నర్ మంగోలియాలో కల్లోలానికి దారితీసింది. సంప్రదాయికంగా మంగోలియన్లకు చైనా అంటే పడదు. చైనా తన సహజప్రవృత్తిని అనుసరించి మంగోలియా సార్వభౌమత్వాన్ని అణచివేస్తుండటం అక్కడి ప్రజల్లోని కొన్ని వర్గాలకు ఎంత మాత్రం కొరుకుడుపడటంలేదు. 1949లో జిన్‌జియాంగ్ ప్రాంతాన్ని చైనా తన అధీనంలోకి తీసుకున్న తర్వాత, హాన్ చైనీయులు, స్థానిక తుర్కిష్ జాతి ప్రజలైన యూఘిర్ల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇది చివరకు 1997లో ఘుల్జా సంఘటన, తర్వాత 2009లో ఉరుమ్‌ఖీ అల్లర్లు, 2014లో కున్‌మింగ్ దాడులు ఈ ప్రాంతాన్ని కుదిపేశాయి. ఆ తర్వాత చైనా ఈ ప్రాంతంలో అణచివేత చర్యలను కఠినంగా అమలుచేసి ‘రీ-ఎడ్యుకేషన్’ క్యాంపులు నిర్వహిస్తోంది. ఇక టిబెట్ విషయానికి వస్తే, పీపుల్స్ రిపబ్లిక్ చైనా టిబెట్‌ను పూర్తిగా ఆక్రమించు కోలేకపోయినా, ‘టిబెట్ ఆటోనామస్ రీజియన్’ పేరుతో కలిపేసుకుంది. 14వ దలైలామా, మావోజెడాంగ్‌ల మధ్య 14 అంశాలతో కూడిన శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై ఇద్దరూ సంతకాలు చేశారు. శాంతియుతంగా టిబెట్ విముక్తి కలిగించడమన్నది ఈ ఒప్పందం సారాంశం. కానీ చైనా ఈ ఒప్పందాన్ని ఖాతరు చేయకపోవడం 1959లో టిబెటన్ల తిరుగుబాటుకు దారితీసింది. దీన్ని సమర్థంగా చైనా అణచివేయడంతో దలైలామా భారత్‌కు పారిపోయారు. 1987- 89, 2008లో కూడా టిబెట్‌లో ఆందోళనలు చెలరేగాయి. అయితే ఈసారి ‘హన్’, ‘హుయ్’ చైనీయులకు వ్యతిరేకంగా వీరు ఘర్షణలకు దిగారు. వీటిని చైనా ప్రభుత్వం అణచివేసి, టిబెట్‌ను సైన్యంతో నింపేసింది. బౌద్ధ సన్యాసులు స్వాతంత్య్రం కోసం ఆత్మాహుతులు చేసుకుంటున్నా చైనా పాలకుల మనసు కరగడం లేదు. సింగపూర్, మలేసియా, కంబోడియా, ఫిలిప్పైన్స్, ఇండొనేసియా, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లో కూడా చైనా వ్యతిరేకత బలీయంగా ఉంది. 1960లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రచురించిన పుస్తకంలో భూటాన్‌లోని చాలా ప్రాంతాలు చైనాకు చెందినవేనని పేర్కొంది. అంతేకాదు భూటాన్ ‘టిబెట్ ఉమ్మడి కుటుంబానికి’ చెందినదని కూడా సిద్ధాంతీకరించింది. అందువల్ల ఇవన్నీ కలిపేసి ‘ఐక్య కమ్యూనిస్టు సిద్ధాంతాలను’ బోధించాలని కూడా పేర్కొంది. దీనికి స్పందనగా చైనాతో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను భూటాన్ రద్దు చేసుకుంది. ఇటీవలి కాలంలో మళ్లీ రెండు దేశాలు సంబంధాలను తిరిగి ప్రారం భించాలనుకున్నా, భూటాన్‌లో భారత్ పలుకుబడి బలీయంగా ఉండటంతో సాధ్యం కావడం లేదు. ఇక భారత్ చైనా సంబంధాలగురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 2020లో గాల్వాన్ సంఘటన తర్వాత, జైపూర్‌కు చెందిన ఒక కంపెనీ ‘రిమూవ్ చైనా యాప్స్’ పేరుతో ఒక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో విడుదల చేస్తే కేవలం రెండు వారాల్లోనే 5మిలియన్ల డౌన్‌లోడ్లు జరిగాయి. భారత్‌లో చైనా వ్యతిరేకతకు ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ అవసరం లేదు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్