– వేణు మరీదు
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
అడవి అంతా అగ్గిపూవులనే మోదుగుపూల మేనిఛాయతో ఇప్పపూల కమ్మటి తియ్యటి గుబాళింపుతో నవవధువులా ఎంతో సింగారంతో మెరుస్తుంది.
నింగిపై నారింజరంగు వెలుతురును తుడిపేసి రాత్రి తన నల్లరంగుల్ని మెల్లగా అలుకుతుంది.
అవ్వమ్మ తన చన్నులకు వేలాడుతూ వాటిని గుద్దిగుద్ది పాలు తాగుతూ తన పొట్టమీదుగా క్రిందికి జారుతున్న యిద్దరు చంటి బిడ్డల్ని పైకి లాక్కుం టుంది. ఆమెకు పద్నాలుగో కాన్పులో కలిగిన చక్కని కవలలు వాళ్లిద్దరు.
‘ఎంత ఆకలి ఈ ఇద్దరిది! వీళ్లు దంతాలు పెంచుకుని మాంసానికి మరిగినాక మిగతావాళ్లకు ఒక్క కీలుబొక్క గూడ మిగల్చరేమో!’ అని అనుకుంటూ వాళ్ల నెత్తిమీద ముద్దులు పెట్టుకుంది.
తన బిడ్డల్లో మూడోవాడికీ, ఏడోవాడికీ అంతే ఆకలి. వాళ్లిద్దరూ యింతే. మాంసానికి మరగక ముందు సమున్నత శిఖరాగ్రాలపై అర్ధరాత్రి వేళల్లో పడి కాల్చే పిడుగుల్లా తన రొమ్ములపై బడి చివరి బొట్టు వరకూ పాలు జుర్రుకునేవాళ్లు. ‘అందుకే మాంసానికి జేజేలు. అదే గనుక లేకుంటే ఈ పిల్లలు జీవితాంతం తన పాలిండ్లకే వేలాడుతుంటారు కాబోలు!’ అని అనుకుంటూ నెగడు దగ్గరకొచ్చి కూర్చొని ఆదియ్య కోసం నిరీక్షించసాగింది. చిక్కని గులాబీరంగు జ్వాలలతో భగభగమండుతున్న సండ్రకొయ్యల నెగడు చుట్టూ పుల్లలతో, చెకుముకి రాళ్లతో ఆడుకుంటున్న పిల్లల దేహాలు బ్లడ్ మూన్స్ లా ప్రకాశిస్తున్నాయి.
ఆదియ్య అల్లంత దూరంలో కనపడగానే పిల్లలంతా తూనీగల్లా ఎగురుతూ అతనికి ఎదు రెళ్లారు. అవ్వమ్మ లేచి రొమ్ముల మీదున్న కవల శిశువుల్ని రాతిబండ మీద ఆకుల పక్కపై పడుకోబెట్టి వచ్చి నెగడులోకి రెండు బాగా ఎండిన సండ్ర పుల్లలులాగి సిద్ధంగా నిలబడి ఉంది.
ఆదియ్య అవ్వమ్మను చూస్తూ సంతృప్తిగా నవ్వుతూ రెండు వెదురు కర్రలకు పొడుచుకొని వచ్చిన దుప్పిని భుజాల మీద నుండి దింపి, నెగడు పక్కన పడేసి గుహ పక్కనే రాతిగుంటలో నీళ్లు తాగొచ్చి అలసట తీర్చుకుంటున్నాడు.
అవ్వమ్మ పదునైన కొస కలిగి చిన్న శంఖంలా ఉన్న రాతి ఆయుధంతో ఒడుపుగా దుప్పితలను వేరు చేసింది. చకచకా తోలు తీసేసింది. దుప్పిని నెగడు అంచులో కణకణమండే నాలుగు కొరకాసులు, నిప్పులు కొన్ని బైటకి లాగి కాల్చుతుంటే పిల్లలంతా ఆకలి కళ్లతో ఆమె చుట్టూ మూగారు. దుప్పితలను కూడా ఒక గట్టి పొడవాటి కర్రకు గుచ్చి కాల్చ సాగింది.
ఆదియ్య పెద్దపెద్ద ఆకులు కోసుకొచ్చి నెగడు పక్కనే చాపలా పేర్చాడు. ఒక గంట ఆగి అవ్వమ్మ లేత సిందూరం రంగులోకి చక్కగా నిప్పులపై ఉడికిన దుప్పిని బయటకు లాగి పేర్చిన ఆకులపై పెట్టింది. కొంచెం చల్లారినాక తను కాల్చిన దుప్పి తలకాయ పైన అక్కడక్కడా కవురెక్కిన తోలు తొలగించి, ప్రేమగా నవ్వుతూ అదియ్య చేతిలో పెట్టింది. తర్వాత తను కూర్చొని చిన్న రేకులాంటి ఇసిరెతో చక్కగా కాలిన దుప్పి మాంసాన్ని కొంచెం కొంచెంగా చీల్చి యిస్తుంటే పిల్లలంతా చుట్టూ కూర్చొని లొట్టలేసుకుంటూ, ఒకరినొకరు ఊరించు కుంటూ వేడి వేడి మాంసం యిష్టంగా తింటున్నారు.
‘‘అవ్వా….’’ ఏడోవాడు ఏడ్చాడు బిగ్గరగా.
‘‘ఏంటి నాయనా….?’’ ఆదుర్దాగా అడిగింది అవ్వమ్మ.
‘‘నాకది కావాలి!’’ అంటూ తండ్రి కొరుక్కు తింటున్న దుప్పి తలవైపు చూపించాడు వాడు.
‘‘రా బిడ్డా రా ……’’ అంటూ తండ్రి పిలవగానే వాడు తింటున్న ముక్కను మట్టిలో పడేసి తండ్రి ఒళ్లోకెళ్లి కూర్చొని ఆయన చిన్న చిన్న ముక్కల్ని కొరికి పెడుతుంటే దుప్పి తలమాంసంను ఇష్టంగా నమలసాగాడు.
పిల్లలంతా అలా ఎంతో సఖ్యంగా ఐక్యంగా కూర్చొని ఎంతో సంతోషం, సంతృప్తి నిండిన కళ్లతో ఒకరినొకరు చూసుకుంటూ, వాళ్ల పాలబుగ్గలకు అంటిన మాంసపు చమురు నెగడు వెలుగుల్లో తళతళా మెరుస్తుండగా ఆ లేతదుప్పి మాంసం భుజిస్తూ ఉండటాన్ని చూస్తున్న అవ్వమ్మకు, ఆదియ్యకు ఎంతో సంబురంగా ఉంది.
సకల రుతువుల్లో ఆ అడవి పచ్చగా ఉండాలని, అక్కడ వేల వన్యజీవులు నిత్యం వర్థిల్లాలని ఆదియ్య, అవ్వమ్మ అష్టదిక్కుల వైపూ తిరిగి అప్పటికింకా రూపు దాల్చని అమూర్త దేవరలకు మొక్కున్నారు. తమ బిడ్డలంతా అలా సఖ్యంగా ఐక్యంగా ఉంటూ, పుష్టిగా తింటూ ఎదగాలని వంగి వనానికి మొక్కుతూ ప్రార్థించుకున్నారు. అంతా సుష్టుగా తిన్న తర్వాత తమ పిల్లలందర్ని గుహలోకి చేర్చి అందరూ హాయిగా చల్లగా నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ కవలపాపలు గురకపెట్టి నిద్రిస్తున్న అవ్వమ్మ రొమ్ములపైకి ఎగబాకి చ్.. చ్చ్.. చ్చ్ మంటూ పాలుగుంజటం మొదలుపెట్టారు.
అప్పటికింకా తయారుకాని అమూర్త దేవతలకు అవ్వమ్మ అదియ్య ఎంత మొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. మూడేళ్ల దారుణ అనావృష్టి వల్ల అడవి ఎండింది. వాగులు కుంటలు నెర్రెల నోళ్లు తెరిచాయి. నీటి బుగ్గలన్నీ ఇంకిపోయాయి. చాలాకాలం పాటు ఒక్క పువ్వూ పూయలేదు. ఒక్క పండూ రాలలేదు. కుందేళ్ల నుండి సింహాల వరకూ, నెమళ్ల నుండి తాబేళ్ల వరకూ వన్యజీవులన్నీ దాహంతో ఆర్తిగా అరిచాయి. ఒక్కొక్క జంతువూ అడవినొదిలిపెట్టి అనంత దూరాలకు వలసెళ్లిపోసాగాయి. మిగిలినవేమో అడవిలోనే ఎండకు మాడి మరణించాయి.
అడవిలో అకాల,అనూహ్య క్షామానికి ఆదియ్య,అవ్వమ్మలు కుదేలయ్యారు. దుప్పులు, కణుజుల సంగతేమోగానీ కుందేళ్లు కూడా కరవైనాయి. ఆధునికునికైనా, ఆదిమజాతివానికైనా దీర్ఘకాల ఆకలి ఘోరకలే కదా! పిల్లల డొక్కలెండి పోయాయి. ఎక్కడో దూరంగా ఒక చోట కొండరాళ్ల మధ్య చిన్నచెలమి నుండి చుక్కలు చుక్కలుగా ఊరే కొద్ది నీటిని ఆకు దొప్పల్లో పట్టి తెచ్చి దాహం తీరుస్తున్నాడు ఆదియ్య. పిల్లలు ఆకలి తాళలేక ఆకులలమలు తినటం మొదలుపెట్టారు. ఒక రోజు మూడోవాడు, నాలుగో వాడు క్షుద్బాధ భరించలేక చెట్ల కింద పడివున్న ముష్టికాయలు తిని మరణిం చారు. దాంతో భీతి చెందిన ఆదియ్య అవ్వమ్మలు వెదురు పుల్లలతో, ఆకులు, నారలతో కావిళ్లు అల్లి వాటిలో పిల్లలను కూర్చోబెట్టుకుని హుటాహుటిన ఆ ఆడవిని వదలపెట్టి గమ్యం తెలియని బహుదూర గమనానికి సిద్ధమయ్యారు.
* * * * * *
అడవి నిండుతనాన్ని ఆలంబనంగా జీవించే వారిని మైదానపు నగ్నత్వం వికర్షిస్తుంది. అడవిది సుందర సకలవర్ణ శోభిత ఆచ్ఛాదనం. మైదానానిది విసుగు పుట్టించే ఏకరీతి మృదుత్వం!
ఆడవి దాటి ఓ సుదూర మైదానం చేరిన ఆదియ్య, అవ్వమ్మలకు మైదానంలో ఏ రుచి ఏ రంగు నచ్చలేదు. తమ వనజీవనంలో చల్లటి నల్లటి నీడల్లో సుఖ సుషుప్తులు ఆస్వాదించిన వారికి మైదానపు ఏకరూపు చూసి విసుగు పుట్టేది. ఐనా తప్పదు కదా! తమ పిలగాళ్లకు కాయోగడుసో పెట్టి బతికించుకుని మళ్లీ వానలు పడి క్షామం తొలగిన తర్వాత అడవికి మరలుదామని నిశ్చయించుకున్నారు.
అడవిలో అనూహ్యంగా ఏర్పడిన క్షామం వలన కొండగుహల్లో నివసిస్తూ ఉన్న తమలాంటి వనవాసులు చాలా సంఖ్యలో ఆ విశాల మైదానంలో అక్కడక్కడా చెట్లకొమ్మలు, మండలతో గుడిసెల్లాంటివి వేసుకొని జీవిస్తున్నారు. ఆదియ్య కూడా ఒక చిన్న నీటి కుంటకు సమీపంలో అలాంటి గుడిసె వేసుకొని తన సహచరిని, పిల్లల్ని అందులోకి తరలించాడు.
ఆవాసం అమరింది గానీ ఆహారం దొరికేలా లేదు. ఆదియ్యకు ఎక్కడ చూసినా ఎలుకలేగానీ ఎనుములు కనపడనే లేదు. దుంపలేగానీ దుప్పుల జాడనే లేదు.
ఆదియ్యకు పిల్లల ఆకలి తీర్చటం రోజువారీ విషమ పరీక్ష అయింది. వేసవిలో నీరెండి తన మధ్యలో అక్కడక్కడా బురద గుంటలతో, మిగతా అంతా నెర్రెలతో వానకోసం, వరదకోసం ఎదురు చూస్తున్న నదిఒడ్డు పొడుగునా మైళ్ల దూరంపాటు బారుగా పరుచుకున్న పొదల్లోని కుందేళ్లను వేటాడి తెచ్చి అవ్వమ్మకిస్తే తాటికమ్మలో, రెల్లుదుబ్బులో రాజేసి ఆ మంటలో వాటిని కమ్మగా కాల్చి పెట్టేది. కుందేళ్లు దొరకనిరోజు తాబేళు, అవీ దొరకనప్పుడు కప్పలు లేదా మండ్రగబ్బలు. ఆ కప్పలూ దొరకని రోజుల్లో ఆకలి తిప్పలు… ఏది దొరికినా సమంగా సంతోషంగా పంచేది ఆ తల్లి. సౌఖ్యంగా ఐఖ్యంగా ఆరగించేవారు ఆ పిల్లలు. ఆదియ్య అవ్వమ్మలు అడవిని మాత్రం మర్చిపోలేక పోతున్నారు. గతించిన నాటి వనస్మృతులను తీయగా నెమరువేసుకుంటూ రోజులు నెట్టుకొస్తుంటే పిల్లలు మాత్రం అడవిని పూర్తిగా మర్చిపోయారు. సువిశాల మైదానంలో వెండిని పిండిజేసి బారుగా పోసినట్లున్న ఇసుక మృత్తికలు, తుదిలేనట్లుగా నది అంచుల పరచుకొని ఉన్న మెత్తటి ఒండ్రుమట్టి దిబ్బలు ఆ పిల్లలకు ఆటస్థలాలయ్యాయి. తల్లి పెట్టింది తింటూ రేయింబవళ్లు వెన్నెల మైదానంపై ఏవేవో వింత వింత కొత్త కొత్త ఆటల్లో మునిగితేలేవారు.
కొంతకాలమాగి అడవిని కాటేసిన క్షామమే మైదానాన్నీ కబళించింది. అక్కడా వాన మాయ మయ్యింది. సమస్త క్షేత్రం నిర్జలమైంది. ఒళ్ళంతా యాసిడ్ దాడికి •గురైన పడతిదేహంలా మైదానం వికారంగా పొక్కులు దేలినట్లు కన్పిస్తుంది. కుందేళ్ల కోసం వెతుకుతూ ఎక్కడో దూరంగా కొండవాలులో ఒక సన్నటి నీటి చెలమిని చూసాడు ఆదియ్య. రోజూ అక్కడికి మండే ఎండలో నడిచొచ్చి ఆకుల దొప్పల్లో, ఎండుకాయల బుర్రల్లో నీళ్లు తీసుకొచ్చి అందరి దాహం తీరుస్తున్నాడు. ఆ చుట్టు పక్కల తమలాగే కొత్తగా గుడిసెలేసుకుని జీవిస్తున్న మిగతా పూర్వ వనవాసులకు ఆ గుప్త ‘జలనిధి’ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడేవాడు!
కరువు ఉధృతమైంది. ఎండి నెర్రెలిచ్చిన బురద కుంటల్లో నుండి తాబేళ్లు, ఎండ్రకాయలూ అదృశ్య మయ్యాయి. ఇక కలుగుల్లో ఎలుకలే గతి. ఆదియ్య పట్టి తెచ్చిన ఎలుకల్ని గుట్టగా పోసి, తోకలు తలలు గిల్లి తీసి వాటిని చితుకు పుల్లల మంటలో కాల్చి పెడుతుంటే ఆవురావురుమంటూ ఆరగించేవాళ్లు పిల్లలు. అయితే ఆ ఎలుకల మాంసం తిని పొట్ట సహించక ఒకరిద్దరు పిల్లలు డోక్కున్నారు. ఇక మైదానం అంతా ఒకటే పారుకుంటున్నారు ఆరోవాడు, ఏడోవాడు!
అవ్వమ్మ మళ్లీ నీళ్లుపోసుకుంది-పదిహేనవ కాన్పు కోసం! ఆమె రొమ్ముల్లో పాలచుక్కలూ కరువై కవలబిడ్డల్లో ఒకడు ఒకనాడు ప్రాణాలొదిలాడు. మిగిలిన రెండోవాడూ శుష్కించి ఎముకలగూడ య్యాడు. అదియ్య, అవ్వమ్మలు దుఃఖిస్తూ ఆర్తిగా మళ్లీ ఆకాశం వైపుగా చేతులెత్తి ఇంకా ‘రుపుదాల్చని’ దేవరలకు తమ బిడ్డలను క్షామం నుండి కాపాడమని ప్రార్థించారు.
ఒకనాడు ఆదియ్య చూలాలైన తన సహచరికి ఆ ఎలుకల. కప్పల కూడు కాకుండా ఏదైనా మంచి తిండి పెట్టాలని, కనీసం ఒక్క పూటన్నా ఆమె కడుపు నిండుగా తృప్తిగా తింటుంటే చూడాలని ఎంతగానో ఆశించి నది సమీపాన కొండవాలుల్లోకి బయలు దేరాడు. అన్ని తావులలో ఆణువణువూ ఆశగా గాలించాడు. సందెపొద్దుల వరకు ప్రతి పుట్టాగుట్టా వెతికాడు. తాము కాల్చుకొని రుచిగా తినగలిగిన ఒక్క జీవి దొరకలేదు. దాంతో ఆదియ్య ఉస్సురు మన్నాడు.
ఇంతలో భోరున అకాల వర్షం మొదలైంది. వర్షం మోసుకొచ్చిన చల్లటి ఈదురుగాలి ఒక్కసారే తాకటంతో ఎప్పటినుండో కాగికాగివున్న కొండలు పులకరించిపోతున్నట్లుగా ఊగసాగాయి. ఆ క్షణం వరకూ నిర్జీవంగా నిలిచి మృతదేహాల్లా ఉన్న మోడుబారిన చెట్లు చైతన్యంతో ఊగుతూ, గుట్టల శరీరాలపై నిక్కబొడుచుకున్న రోమాల్లా నిలబడ్డాయి. వేళగాని వేళలో, రుతువు గాని రుతువులో దాడి చేస్తున్న ఆ వానకు విస్మయం చెందాడు అదియ్య. ఐతే ఇక నుండి తమకు నీటి కరువు ఉండదనే ఆనందం ఆ వర్షభీతిని దాచింది. వానకు తడుస్తూ వణుకుతూ గుట్టపైన ఒక బండరాళ్ల కలుగులోకి దూరుతూ తలెత్తి దూరంగా చూసాడు.
సుదూరంగా మైదానం తనపై పడుతున్న ఆ శీతల వర్షానికి పులకరించి తనను తాను హర్షంతో వరదమయం చేసుకుంటూ ఉన్నది. ఆ కొండకు ఆవల ఉన్న నది ఎన్నో రోజులు ప్రయాణించి దాహంతో సొమ్మ సిల్లబోతూ ఒక్కసారిగా కళ్లముందు ఒయాసిస్సు కనిపిస్తే అందులోకి దూకి మరీ దాహం తీర్చుకునే ఎడారి బేహారిలా తన దాహార్తిని తీర్చు కుంటుంది. ఐతే ఈ వాన అడవిలో కూడా యిలాగే కురిసి ఉండొచ్చు. అవ్వమ్మను, పిల్లల్ని తీసుకుని త్వరలో అడవికి తరలిపోవాలని అనుకున్నాడు! అది సరే … అవ్వమ్మ ఈ అకాల వర్షానికి అక్కడ పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో ఏమో? అసలే తను గర్భిణి. తమ గుడిసె సహా తన వాళ్లంతా ఆ వెల్లువకి బలయ్యేఉంటారని దిగులుపడుతూ అక్కడే గాఢ నిద్రలోకి ఒరిగిపోయాడు ఆదియ్య.
తెల్లవారే ‘గుర్ గుర్’ మనే రొద చెవులకు తాకేసరికి ఆదియ్య దిగ్గున లేచి చూసుకుంటే భళ్లున తెల్లారింది. రాత్రి కలుగులోంచి బయటకు వచ్చి చూస్తే దిగువ చిన్నలోయలాంటిచోట అడవి పంది ఒకటి ఈని ఉన్నది. పిల్లల్ని నాకుతూ గురగుర శబ్దాలు చేస్తుందది. ‘హమ్మనీ … ఇన్నాళ్లూ కనపడకుండా ఎక్కడ నక్కావే!’ అనుకుంటూ సద్దు చేయకుండా భద్రంగా అక్కడినుండి జరిగి మైదానం వైపు నడక సాగించాడు. తల్లి పొట్టచుట్టూ పాకుతున్న ఆ వన్యజీవి పిల్లల్ని చూడగానే అవ్వమ్మ, తన బిడ్డలు గుర్తొచ్చారు ఆదియ్యకు.
దీర్ఘకాలం శుష్కమై, నిర్జలమై ఉంటూ ఒక్కసారిగా తడిసిన ఆ క్షేత్రమంతా విడుదల చేస్తున్న తియ్యటి మట్టి గుబాళింపును ఆస్వాదిస్తూ నీరెండలో చెట్టూ పుట్టా దాటుకుని ముందుకు సాగుతున్నాడు ఆదియ్య. ముందుకు నడుస్తున్న కొద్దీ తన బిడ్డల్ని చూసుకోవాలనే ఆదుర్దా హెచ్చిస్తుంది అతనిలో.
ఆదియ్య మైదానానికి సమీపంలో ఉండగా ముందురోజు కురిసిన జడివానకు కొత్తకుండలా నిండివున్న ఒక నీటికుంట ఒడ్డున ఏపుగా పెరిగిన గడ్డిపొదల అంచుల్లో చాలా బారులు తీరి ఎన్నో రకాల వందల పక్షులు గుంపులు గుంపులుగా నేలవాలి ఏవో మేస్తున్నాయి. ఆదియ్య మహా ఆసక్తిగా ‘అవి ఏమి తింటున్నాయో’…. అని అనుకుంటూ దగ్గరికెళ్ళి పరిశీలించసాగాడు.
ఆ పక్షులన్నీ ఆ నీరెండకు చిరు స్వర్ణపుష్పాల్లా మెరుస్తున్న ఏవో ధాన్యపు గింజల్ని మేస్తున్నాయి. కొన్ని చిన్న పిట్టలు రాత్రి గాలిదుమారానికి రాలి, వానకు తడిసి ఉబ్బిన ఆ గింజల్ని తమ ముక్కులతో పొడుస్తుంటే గడ్డి పూవుల్లాంటి మెతుకులు బైట పడుతున్నాయి. వాటిని అవి ఎంతో ఇష్టంగా మేస్తు న్నాయి. ఆదియ్య తడిసి ఉబ్బిన ఆ ధాన్యపు గింజల్ని ఓ గుప్పెడు యేరి నోట్లో పోసుకొని నమిలాడు.
‘‘అబ్బ! ఎంత కమ్మగా ఉన్నాయి!’’ అని ఇంకో గుప్పెడు తీసుకొని బుక్క సాగాడు. కాల్చిన కమురు వాసనల మాంసపు మదపు రుచి మాత్రమే తెలిసిన ఆదియ్య జిహ్వకు ఆ గింజల రుచి అమృతతుల్యంగా అన్పించింది. ఐతే ఒక్కటే చిక్కు! ఆ ధాన్యపు గింజల్ని నములుతుంటే వాటి పైపొట్టు దవడలకు గుచ్చు కుంటుంది. ఐనా బాగా నమిలి నమిలి తీయటి పిండి గుజ్జును మింగి పొట్టు ముద్దను ఊసాడు.
తినటానికి ఏ ప్రాణీ దొరకనపుడు వాటితోనే పిల్లల ఆకలిని తీర్చవచ్చని ఇసుక రాకుండా జాగ్రత్తగా మరిన్ని గింజల్ని యేరుకుని తన మొలతోలులో కట్టుకుని మైదానంలో తాముండే ప్రదేశంవైపు వడివడిగా నడుస్తూ చేరుకున్నాడు.
ఆదియ్యకు అవ్వమ్మ కన్పించలేదు. పిల్లల జాడకూడా లేదు. తమ గుడెసె కూలిపోయి కప్పువిడిపోయి అల్లంత దూరంలో ఒక వర్రెలో పడిపోయి ఉంది. ఆదియ్య వ్యాకులత నిండిన గొంతు కతో పెద్దగా పిలుస్తూ తన వారిని వెదుక్కుంటూ దగ్గర్లోని చిన్న అడవితోపులోకి వెళ్లి చూసాడు. అక్కడ చెట్ల తొర్రల్లో ఉన్న పిల్లలంతా అతడ్ని చూసి
‘‘బా…. బా….. బాపు వచ్చిండు’’ అంటూ క్రిందికి దూక సాగారు. ఆ పక్కనే కొద్ది దూరంలో ఓ కట్టెపుల్లతో గొయ్యి తవ్వుతూ కన్పించింది అవ్వమ్మ. పక్కనే ఇసుకపై రెండో కవలశిశువు శుష్కించిపోయిన మృతదేహం. ఆదియ్యను చూడగానే భోరుమని రోదిస్తూ ఉరుకొచ్చి అతణ్ణి గట్టిగా చుట్టుకుపోయింది అవ్వమ్మ.
‘‘నా గుండెల్లో పాలెండిపోయాయి కదయ్యా… ఆకలి, చలి మన బిడ్డను…’’
ఆదియ్య దుఃఖాన్ని దిగమింగుకుంటూనే ఆమెను ఓదార్చాడు. పిల్లలకు యిదంతా పట్టదు. ఆట, ఆకలి మాత్రమే తెలిసిన ఆ పసివాళ్లకు చావు కేవలం అపుడపుడూ తటస్తించే ఓ ఉదంతం మాత్రమే!
కవల శిశువు విగతదేహాన్ని ఖననం చేసి, అంతకు ముందు తమ గుడిసెవున్న చోటుకివచ్చి కూర్చొన్నారు అంతా. ఆ తుఫానురాత్రి తమ పిల్ల లందర్ని అలా చెట్లతొర్రల్లోఉంచి రక్షించినందుకు ఆదియ్య అవ్వమ్మను ఎంతో మెచ్చుకోలుగా చూస్తూ తన మొలతోలు మూట విప్పాడు. అందులో తడికి ఉబ్బివున్న ధాన్యపు గింజల్ని ఆకలి కళ్లతో తనవైపే చూస్తున్న పిల్లలకు తలా పిడికెడు చేతుల్లో పోసాడు. అవ్వమ్మకూ కొన్ని గింజలు పోసి, తనూ ఓ పిడికెడు నోట్లో పోసుకొని తనలా నమలమని, పొట్టు పిప్పిని చివరికి ఊసెయ్యమని సైగలతోనే వివరిం చాడు.
పెద్దోడు నములుతూ గట్టిగా అరిచాడు.
‘‘అయ్యో …… ఇవి చాలా బాగున్నాయ్ ……యింకా పెట్టు!’’
‘‘మాక్కూడా అయ్యా …..’’ అంటూ మిగతా వాళ్లు చేతులు చాపారు. అదియ్య మిగిలిన గింజల్ని తలా కొంచెం పంచాడు.
తొమ్మిదోవాడు గింజలగుజ్జు యిష్టంగా మింగుతూ, పిప్పి ఊస్తూ తల్లి ఒడిలోకి చేరి గోముగా అంటున్నాడు ‘‘అవ్వా …… నాకు రోజు ఇదే కావాలి. ఆ ఎలికలు చెడ కంపు!’’
ఆరోవాడు, ఏడోవాడు కూడా అదే అరిచారు.
‘‘అవునవ్వా ఆ ఎలికలు, మండ్రగబ్బలు తినలేం! చూసావుగా అవ్వా నువ్వు. రాత్రంతా ఆ చెట్టు తొర్రంతా పారినాం…’’ అంటూ వాళ్ల తల్లి భుజాలపైకి చేరారు.
మిగతా పిల్లలూ ఆ గింజలే కావాలని బృందగానంలా అరిచారు.
‘‘పిల్లలంతా తెగ యిష్టపడుతున్నారు. ఎక్కడి నుండి తెచ్చావయ్యా వీటిని?’’ తనూ వాటిని ప్రీతిగా నములుతూ అడిగింది అవ్వమ్మ.
‘‘గుట్టదిగినాక … మైదానం మొదట్లో నీటి కుంట వొడ్డున ఎత్తైన గట్టి దుబ్బుల మధ్య అవ్వమ్మా…. పిట్టలు యిష్టంగా మేస్తంటే కొన్ని ఏరుకొచ్చానే’’.
‘‘రేపు మనం మళ్లీ అక్కడికెళ్ళి ఇంకా పట్టుకొద్దాం… పిల్లలకు ఏది నచ్చుతుందో మనమూ అదే తిందామయ్యా!… రోజూ అంత దూరం పోవటం కష్టమైతే మరిన్ని గింజల్ని తీసుకొచ్చి ఇక్కడే చల్లుదాం….’’.
‘‘అబ్బ! ఎంత మంచి ఆలోచన నీది అవ్వమ్మా! సరే అలాగే చేద్దాం. రా యిక. నాలుగు కొమ్మలు లాక్కొచ్చి ఇంకో గుడిసె వేసుకుందా… రా… పైకి లే’’ అంటూ ఆదియ్య ఆమెను ఉత్సాహపరిచాడు.
పిల్లలంతా మెత్తటి చల్లటి యిసుక తిన్నెలపై మళ్లీ ఆటకు బయల్దేరారు
* * * * * *
‘‘అవ్వా….’’
‘‘అయ్యా…..’’
‘‘బువ్వ!’’
‘‘ఉమ్మగిల్తంది. పెడతా ఆగు బిడ్డా.’’
చేతిలో చిన్న మట్టిగిన్నెతో పొయ్యి ముందు నిల్చున్న ఆ చిన్నారి అవ్వమ్మకు ‘పందొమ్మిదో’ మనవ రాలు. అవ్వమ్మకిప్పుడు నూట ఆరో యేడు. యింకా ఉక్కు ముక్కలా ఉంది. ఆ అతి పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఆమెదే యింకా పెత్తనం!
పెద్ద రాళ్ల పొయ్యిపై గంగాళం అంత మట్టి పాత్రలో కుతకుత ఉడుకుతూ అంచుకుపైన పొంగుతూ కమ్మని తియ్యని గంజి వాసనను చుట్టూ వెదజల్లుతుంది వరి అన్నం. దానివైపే మధ్య మధ్యలో చూస్తూ, గుటకలు మింగుతూ ఇంటి చుట్టూ ఒండ్రు ఇసుకలో దొర్లుతూ ఆడుకుంటున్నారు ఓ పాతికమందికిపైగా చిన్నారులు.
ఒకవైపు ఇంటి ముందు ఈ రోజుకి అన్నం ఉడుకుతుంటే ఇంటి లోపల మధ్యలో నలుగురు కోడళ్లు రెండు వడ్లగుంటల్లో రేపటికి వడ్లు దంపు తున్నారు.
ఇంతలో పాలపిట్టలా ఒక చిన్నారి రివ్వున లోపలికి దూసుకొచ్చి కిలకిలా నవ్వుతూ రెండు పిడికిళ్ల నిండా బియ్యం అందుకుని వేగంగా బయటకు ఉరికింది.
బయట రాతిగోడపై వాలివున్న పిచుకల ముందు వాటిని పోసి మళ్లీ ఆటకు పరిగెత్తింది.
‘‘ఏయ్ పిల్లా ఎందుకే ‘మన’ తిండిగింజలన్నీ ఆ ‘పాడు’ పిట్టలకేసి ఆగంచేస్తావ్? బుద్ధిలేనిదానా!’’ – లోపలినుండి కోపంగా మొత్తుకుంటుంది. ఆ అమ్మాయి పెద్దమ్మ.
రాతిగోడపై ఆ పాప తమకు పోసిన గింజల్ని తినబోతూ పక్షులు మోరలెత్తి ఆ మాటలన్న ఆమెవైపు, తనవైపు చిరుకోపంతో, వెటకారంతో చూసినట్లుగా అనిపించింది బైటకూర్చొని రేపటివంటకు కట్టెపుల్లలు సిద్ధం చేస్తున్న ఆదియ్యకు.
ఇంతలో ‘‘ర్రేయ్ రాండ్రా… అవ్వ బువ్వ పెడ తంది… రావాలోచ్ రావాలి!’’ అంటూ కీచు గొంతుకతో ఒక బక్క పిల్లవాడు పొయ్యి దగ్గర నుండి కేకవేసాడు.
పిల్లల గుంపంతా పొయ్యి వైపు కేకలేస్తూ కదిలింది.
అప్పుడే మాటలొస్తున్న అవ్వమ్మ ముదిమనవ రాళ్లలో ఒకతైన చిన్నారి బుజ్జిపాప చిరు అడుగులతో అవ్వమ్మనుచేరి లేతపిందెల్లాంటి తన ఎడమ చేతి వేళ్లతో అవ్వమ్మ చేతిని వెచ్చగా స్పృశిస్తూ, తన కుడి చేతిని ముందుకు బారుగా చాపుతూ ముద్దుగా అడుగుతుంది ‘ అవ్వా …. బువ్వ పెట్టవా!’’
(వేల గడ్డిజాతులనుండి ధాన్యాన్ని వేరుచేసి, సాగుచేసి మనకు
‘‘బువ్వ’’ను ప్రసాదించిన పురాయుగ మానవులకు ప్రణామాలు.)