సనాతన ధర్మ సూత్రాల ఆధారంగా హిందూ ధార్మిక గ్రంథాలను ప్రచురిస్తూ, సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలలో మార్పునకు దోహదం చేసిన గోరఖ్‌పూర్ గీతా ప్రెస్ 2021 గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైంది. ప్రధాని నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల సంఘం ఆ పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. అహింసా మార్గంలో, గాంధీజీ విధానాలతో గీతాప్రెస్ గొప్ప సామాజిక మార్పునకు దోహదం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గడచిన వందేళ్లుగా సాంస్కృతిక, సామాజిక రంగాలలో పరివర్తనకు గీతాప్రెస్ చేసిన సేవ అమోఘమైనదని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ పురస్కారం పేరుతో కోటీ రూపాయలు నగదు అందిస్తారు. అయితే తాము నగదు స్వీకరించబోమని పురస్కారాన్ని మాత్రమే అందుకుంటామని నిర్వాహకులు చెప్పారు.
ప్రపంచంలోనే హిందూ ధార్మిక గ్రంథాలను ప్రచురించే అతి పెద్ద సంస్థ గీతా ప్రెస్. ఇది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ కేంద్రంగా పని చేస్తున్నది. జయ్‌దయాళ్ గోయెంకా, ఘనశ్యామ్‌దాస్ జలాన్, హనుమాన్‌ప్రసాద్ పోద్దార్ అనేవారు ఏప్రిల్ 29, 1923న ప్రచురణాలయాన్ని స్థాపించారు. సనాతన ధర్మ ప్రచారానికి అనుగుణంగా గ్రంథాలను అచ్చువేసే లక్ష్యంతోనే ఈ సంస్థను నిర్మించారు. వీరిలో గీతాప్రెస్ వెలువరించే ‘కల్యాణ్’ పత్రికకు హనుమాన్ ప్రసాద్ పోద్దార్ జీవితకాల సంపాదకులుగా పనిచేశారు. గీతాప్రెస్ కార్యా లయంలో 3500 రాతప్రతులు ఉన్నాయి.
గ్రంథ ప్రచురణలో గీతా ప్రెస్ అరుదైన రికార్డును సాధించిందనే చెప్పాలి. ఆ సంస్థ 41.7 కోట్ల పుస్తకాలు ప్రచురించింది. హిందీతో పాటు మరాఠీ, గుజరాతీ, ఒడియా, సంస్కృతం, తెలుగు, కన్నడ, నేపాలీ, ఇంగ్లిష్, బెంగాలీ, తమిళం, అస్సామీస్, మలయాళం వంటి 14 భాషలలో కూడా పుస్తకాలు వెలువరిస్తున్నది. 16.21 కోట్ల శ్రీమద్ భగవద్గీత ప్రతులను గీతాప్రెస్ అచ్చువేయడం కూడా చరిత్రాత్మకమే. 11.73 తులసీదాస్ కృతులు, పురాణాలు, ఉపనిషద్ వ్యాఖ్యల మీద పుస్తకాలు మరో 2.68 కోట్ల ప్రతులు ప్రచురించింది. మరొక దిగ్భ్రాంతి కలిగించే అంశం గీతాప్రెస్ తన ప్రచురణల కోసం విరాళాలు అడగదు. వ్యాపార ప్రకటనలు తీసుకుని డబ్బు వసూలు చేయదు. ప్రజలు, కొన్ని సంస్థలు ఆ ఆర్థిక భారాన్ని స్వచ్ఛం దంగా మోస్తున్నాయి. అలాగే అచ్చు పనికి కావలసిన అన్ని వస్తువులను ఆయా సంస్థలు లాభాపేక్ష లేకుండా గీతా ప్రెస్‌కు అందిస్తుంటాయి. ఒక ట్రస్ట్ ఈ వ్యవహా రాలను చూసుకుంటుంది. వేతనాల విషయంలో వివాదం చెలరేగి 2014 డిసెంబర్‌లో గీతా ప్రెస్ సమ్మె జరిగింది. ఆ సందర్భంలో ముగ్గురు ఉద్యోగు లను విధుల నుంచి తొలగించారు. తరువాత చర్చలతో సమ్మె విరమించి, తొలగించిన ముగ్గురిని కూడా తిరిగి విధులలోకి తీసుకున్నారు. ఆ కారణంగా మూడు వారాలు పని నిలిచిపోయింది. వందేళ్ల చరిత్రలో అంతకాలం కార్యాలయం మూసివేయడం అదే మొదటిసారి.
శ్రీమద్ భగవద్గీత, రామచరిత మానస్, రామాయణం, పురాణాలు, ఉపనిషత్తులతో పాటు పలు ఆధ్యాత్మిక, ధార్మిక గ్రంథాలను గీతా ప్రెస్ వెలువరిస్తూ ఉంటుంది. బాలలలో ధర్మం పట్ల అవగాహన పెరగడానికి కూడా కొన్ని పుస్తకాలు వెలువరించింది. కేవలం పిల్లల కోసం ఈ సంస్థ 11 కోట్ల పుస్తకాలు ప్రచురించింది. ‘కల్యాణ్’ అనే మాసపత్రికను కూడా గీతా ప్రెస్ నిర్వహిస్తున్నది. ఈ పత్రిక కూడా ధర్మం, ఆధ్యాత్మికత, యోగా, విజ్ఞానం వంటి అంశాలతో వెలువడుతున్నది.
గాంధీ శాంతి పురస్కారాన్ని 1995లో నెలకొల్పారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఈ పేరుతో గుర్తు చేయడం కేంద్ర ప్రభుత్వం ఆశయం. ఈ పురస్కార గ్రహీతలు భారతీయులై ఉండాలన్న నియమం లేదు. కోటి రూపాయల నగదు, సన్మానం, స్మరణిక గ్రహీతలకు అందిస్తారు. ఇంతవరకు ఈ పురస్కారం ఇస్రో, రామకృష్ణ మిషన్, వివేకానంద కేంద్ర, అక్షయపాత్ర, ఎకాల్ అభియాన్ ట్రస్ట్, సులభ్ ఇంటర్నేషనల్ అందుకున్నాయి. 2019లో ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ అల్ సయీద్‌ను ఈ పురస్కారం వరించింది. 2020లో బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబూర్ రెహమాన్‌ను మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
ఇలా ఉండగా హిందూ ధార్మిక గ్రంథాలు వెలువరించే గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం అందించాలన్న న్యాయ నిర్ణేతల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. అయితే మొదట కాంగ్రెస్ తమ ప్రశ్నకు సమాధానం చెప్పాలని బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీయా కాదా అన్న సంగతి తేల్చాలని బీజేపీ కోరింది. భగవద్గీతతో కాంగ్రెస్‌కు సమస్య ఉంది కాబట్టే, గీతా ప్రెస్‌తో ఆ పార్టీకి పేచీ ఉన్నదని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి విమర్శించారు. గీతా ప్రెస్ వ్యవస్థాపకులలో ఒకరైన పోద్దార్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని గోవింద్ వల్లభ్ పంత్ సిఫారసు చేసిన సంగతిని కూడా మీనాక్షి గుర్తు చేశారు. పోద్దార్ అంటరానితనాన్ని తీవ్రంగా నిరసించారు. అందుకేనా కాంగ్రెస్ ఆయనను వ్యతిరేకిస్తున్నది అని లేఖి వ్యంగ్యంగా ప్రశ్నించారు. గాంధీ శాంతి పురస్కారం గీతా ప్రెస్‌కు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని ముస్లిం లీగ్‌ను సెక్యులర్ పార్టీ అన్నవాళ్లు తప్ప, వేరెవరూ విమర్శించలేదని మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. కాగా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గీతా ప్రెస్‌ను అభినందించారు.
ఈ పురస్కారం గురించిన ప్రకటన జూన్ 18న వెలువడింది. ఈ ఎంపిక అత్యంత అసంబద్దంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాంరమేశ్ వ్యాఖ్యానించారు. యథాప్రకారం తమ నోటి దురుసును ప్రదర్శిస్తూ, ఈ పురస్కారం ఎంపిక సావర్కర్, గాడ్సేలను ఎంపిక చేసినట్టు ఉందని జైరామ్ అన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయాన్ని మరొక కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్‌కృష్ణం కొట్టి పారేశారు. గీతాప్రెస్‌ను పురస్కా రానికి ఎంపిక చేసినందుకు విమర్శలు కురిపించడ మంటే అది హిందూ వ్యతిరేకతకు పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. ఉన్నత స్థానాలలో ఉన్నవారు స్థాయి మరచి మాట్లాడితే అది చిరకాలం చెరిగిపోదని ఆయన హెచ్చరించారు. రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గేలను ఉద్దేశించి ప్రమోద్ ఈ మేరకు ట్వీట్ చేశారు.