ఒడిశా ఘోర ఉదంతం జరిగి రెండు వారాలు గడుస్తోంది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌లూప్‌ ‌లైన్‌లోకి ప్రవేశించి అక్కడున్న గుడ్స్ ‌రైలును ఢీ కొట్టడం, ఆ ట్రాక్‌పై వెళ్లే బెంగళూరు -హౌరా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌సైతం ప్రమాదంలో చిక్కుకోవడం ఊహకందని ఉత్పాతం. తాజా సమాచారం ప్రకారం మరణించిన వారి సంఖ్య 289. 1100వరకూ గాయపడ్డారు. ప్రస్తుతం 800 మందికిపైగా కాళ్లు, చేతులు విరిగి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 88 మృతదేహాలను ఇంకా గుర్తించాలి.

ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్నకు పూర్తి సమాధానం దొరకాలంటే రైల్వేశాఖ అంతర్గత దర్యాప్తుతో పాటు సీబీఐ విచారణ పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే. ఈ కేసులో బహనగ బజార్‌ ‌స్టేషన్‌ ‌మాస్టర్‌ ‌సహా ఐదుగురు రైల్వో ఉద్యోగులను విచారిస్తున్నారు.

ప్రస్తుతం సిగ్నలింగ్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగి ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నాడు. ఐదుగురు ఉద్యోగులు ప్రస్తుతం తమ విధులను నిర్వర్తిస్తున్నారని, రైల్వే సేఫ్టీ కమిషన్‌ ‌రూపొందించిన ప్రమాద దర్యాప్తు నివేదికపై భవిష్యత్‌ ‌కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. సిస్టమ్‌ ‌మాన్యువల్‌ ‌ట్యాంపరింగ్‌, ఆటోమేటెడ్‌ ‌సిగ్నలింగ్‌ ‌సిస్టమ్‌ ఇం‌టర్‌ ‌లాకింగ్‌ ‌సిస్టమ్‌లో లోపమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రమాద బాధితుల్లో 709 మందికి ఇప్పటికే పరిహారం అందింది. సీబీఐ బాహనగా రైల్వే స్టేషన్‌ను సీల్‌ ‌చేసి, లాగ్‌ ‌బుక్‌, ‌రిలే ప్యానెల్‌, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ స్టేషన్‌లో ఎలాంటి ప్యాసింజర్‌, ‌గుడ్స్ ‌రైళ్లు ఆగవని వెల్లడించింది. ఆ స్టేషన్‌ ‌మీదుగా రోజూ దాదాపు 170 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

ప్రమాద కారణమిదేనా?

ప్రాథమిక సమాచారం ప్రకారం రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణం ‘ఎలక్ట్రానిక్‌ ఇం‌టర్‌ ‌లాకింగ్‌’‌లో మార్పులు చేయడం.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌ప్రమాదం జరిగిన రెండో రోజునే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. దీనికి బాధ్యులను కూడా గుర్తించామన్నారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌ ‌దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. ఇంటర్‌లాకింగ్‌ అం‌టే, ఒకే రైలు మార్గం మీద ఏకకాలంలో రెండు రైళ్లు రాకుండా చూస్తూ పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్‌ ‌వ్యవస్థ. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తనిఖీల్లో తేలేవరకు రైలుకు సిగ్నల్స్ ఇవ్వకుండా ఆపి ఉంచుతుంది. ఇంటర్‌ ‌లాకింగ్‌ ‌వ్యవస్థ వినియోగంలోకి వచ్చాక రైళ్లు ఢీ కొనడాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. దీంతోపాటు రైల్వే ఆపరేషన్లలో భద్రత మరింత బలోపేతం అయింది. రైళ్ల కదలికల పర్యవేక్షణ, నియంత్రణకు ఈ వ్యవస్థ ఎలక్ట్రానిక్‌ ‌కంట్రోల్‌ ‌వ్యవస్థ. కంప్యూటర్లను వినియోగించుకొంటుంది. గతంలో మాన్యూవల్‌ ఇం‌టర్‌లాకింగ్‌ ‌వ్యవస్థను ఎలక్ట్రానిక్‌ ఇం‌టర్‌లాకింగ్‌ ‌వ్యవస్థతో భర్తీ చేశారు.

అశ్విని వైష్ణవ్‌కి ప్రశంసలు

ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే మొత్తం సహాయక కార్యక్రమాలు ముగించి మళ్లీ ట్రాక్‌ ‌మీద రైళ్లను పరుగెత్తించారు. ఇది రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్‌ ఉన్నారు కాబట్టే సాధ్యమైంది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా రైల్వే మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌ ‌వినిపించడం సర్వసాధారణం. బాలాసోర్‌ ‌ఘటన జరగగానే అదే జరిగింది. కానీ వైష్ణవ్‌ ‌తీరు విమర్శకుల నోళ్లు మూయించింది. ప్రమాదం జరిగిన కొద్ది సమయంలోనే వైష్ణవ్‌ ‌ఘటనా స్థలికి చేరుకు న్నారు. అప్పటికి ఒడిశా సీఎం నవీన్‌ ‌పట్నాయక్‌ ‌కూడా చేరుకోలేదు. తెల్లవారు ఝామునే చేరుకుని ప్రమాద తీవ్రతను గమనించి సహాయక చర్యలను పర్యవేక్షించడం మొదలుపెట్టారు.

వైష్ణవ్‌ ‌ప్రధానంగా మూడు అంశాల మీద దృష్టి పెట్టారు. సాధ్యమైనంత మేర మరణాలను తగ్గించడం, బాధితులకు మెరుగైన చికిత్స అందిం చడం, వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టడం. 51 గంటల్లోనే మంత్రి నాయకత్వంలో రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి.ఇక్కడ విపత్తుల నిర్వహణపై వైష్ణవ్‌కు ఉన్న అవగాహన, అనుభవం ఉపయోగపడినాయి. వైష్ణవ్‌ ‌గతంలో బాలాసోర్‌ ‌జిల్లాకు కలెక్టర్‌గా పనిచేశారు. 1999 నాటి భారీ తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవం అయనకు ఉంది.

బాధితులను వేగంగా ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స అందేలా చూసేందుకు మంత్రి గట్టి ఆదేశాలు ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్‌ను కటక్‌ ‌హాస్పిటల్‌కు, డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌హెల్త్‌ను భువనేశ్వర్‌ ‌హాస్పిటల్‌కు పంపించారు. నాలుగు కెమెరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. సహాయక కార్యక్రమాల తీరును ఆ కెమెరాల సాయంతో సీనియర్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పురోగతిని మంత్రికి అందించారు. 2,300 మంది సిబ్బంది, రైల్వే శాఖ నుంచి ఎనిమిది బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.

సేవలో స్వయంసేవకులు

దేశంలో ఎక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినా సేవ, సాయం అందించడంలో ముందుండేది స్వయంసేవకులే. బాలాసోర్‌ ‌రైలు ప్రమాద ఘటన లోనూ స్వయంసేవకులు వేగంగా స్పందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, ‌విశ్వహిందూ పరిషత్‌, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌కు చెందిన వెయ్యి మందికి పైగా కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేశారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఒక్క ప్రాణం కూడా పోకుండా రక్షించడమే లక్ష్యంగా కొద్ది గంటల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

కొంతమంది కార్యకర్తలు బాలాసోర్‌ ఆస్పత్రిలో ఉండి, మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపించడంలో అంబులెన్స్ ‌డ్రైవర్లకు, ఆస్పత్రి సిబ్బందికి సహాయం చేస్తున్నారు. పట్టణంలోని ఇతర ఆస్పత్రుల్లో మృతదేహాలను మార్చురీకి తరలిస్తున్నారు. బస్టాండ్లలో, చౌక్‌లలో, ఆహారం, నీరు, ప్రథమ చికిత్స, ఫోన్‌ ‌సౌకర్యం కల్పించేలా కార్యకర్తలు చూశారు. సంఘ, ఏబీవీపీ అధికారిక సోషల్‌ ‌మీడియా ఖాతాల నుండి హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌లను జారీ చేశారు. వారు బ్లడ్‌ ‌బ్యాంక్‌, ‌రక్త సేకరణ కోసం నంబర్లను కూడా జారీ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి వారికి రక్తదానం కోసం 2000 కాల్స్ ‌వచ్చాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో వెయ్యి యూనిట్ల రక్తాన్ని అందించామని, 700 యూనిట్ల రక్తం తదుపరి ఉపయోగం కోసం సురక్షితంగా ఉందని వారు తెలిపారు.

బాలాసోర్‌ ఆసుపత్రిలో తమ బంధువులు, కుటుంబ సభ్యులను గుర్తించడంలో 600మంది కార్యకర్తలు ప్రజలకు సహాయం చేస్తున్నారనీ, బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ ‌చేసుకునేందుకు వీలుగా టెలిఫోన్‌ ‌సౌకర్యం, మొబైల్‌ ‌సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఏబీవీపీ సీనియర్‌ ‌కార్యకర్త లక్ష్మి చెప్పారు.

సరిద్దిద్దు కోవాల్సిన లోపాలెన్నో..

‘వందలాదిమంది ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ దశాబ్దంలోనే ఇది అతి పెద్ద ప్రమాదం.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బాలాసోర్‌ ‌ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించడంతో పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ప్రయాణీకులను పరామర్శించారు ప్రధాని.

ఇంటర్‌ ‌లాకింగ్‌లోని సాఫ్ట్ ‌వేర్‌ ‌లేదా హార్డ్ ‌వేర్‌ ‌పనిచేయడంలో సంభవించే లోపం వల్ల కూడా రైళ్లకు సూచించవలసిన లూప్‌లైన్‌, ‌మెయిన్‌ ‌లైన్‌ ఎం‌పికలో గందరగోళానికి అవకాశం ఉంది. అంటే సిగ్నల్‌ ఒకటై, స్విచ్‌ ఆపరేషన్‌ ‌వేరైతే ఈ ప్రమాదానికి ఆస్కారం ఉంది. సిగ్నలింగ్‌ ‌వ్యవస్థ నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాల గురించి, వైఫల్యాల గురించీ, రైళ్ల రాకపోకలను తెలియజేసే గుర్తులను సూచించే సరైన పద్ధతుల గురించి రైలు బయలుదేరిన తరువాత, రైలు వెళ్లే దిశను మార్చవలసి వస్తే ఆ మార్పును సూచించే గుర్తును తెలిపే విధానం గురించీ స్పష్టంగా ఉంది. కానీ నిర్దిష్టమైన సిగ్నల్స్‌ను అనుసరిస్తూ లోపాల్ని తక్షణం సవరించకపోతే దుర్ఘటనలు అనివార్యమవుతాయి.

 రైల్వే సిగ్నల్స్ ‌నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఆ ఉన్నతాధికారి హెచ్చరించారు. అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్‌’, ‌పార్లమెంటరీ స్టాండింగ్‌ ‌కమిటీ నివేదికలు ఇప్పటికే హెచ్చరిం చాయి. రైల్వే సిగ్నల్స్ ‌నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండక పోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉంది.

రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్‌’ ‌రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్‌ ‌మార్గాల్లో కాపలా లేని లెవెల్‌ ‌క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు.. మంత్రులు రాజీనామాలు చేయాలని, కాదు కాదు… కింది తరగతి రైల్వే ఉద్యోగుల్ని, కార్మికుల్ని శిక్షించాలని వాదోపవాదాలకు దిగడం కూడా విషాదమే! సిగ్నలింగ్‌ ‌వ్యవస్థ పకడ్బందీగా లేనందున జరుగుతున్న ఈ వరస రైలు దుర్ఘటనల నివారణకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అక్కరకు రావడం లేదు. సిబ్బందికి ఇచ్చే శిక్షణలో కూడా లోపం ఉందని పలువురు రైల్వే అధికారులు అంటున్నారు. ఈలోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు కింది తరగతి రైల్వే ఉద్యోగుల్నీ, కార్మికుల్నీ శిక్షించే మార్గాలను వెతకడానికి ప్రయత్నించడం సమంజసం కాదు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న కేటాయింపులతో పోలిస్తే ఇప్పుడు రైల్వే కేటాయింపులు అయిదు రెట్ల వరకూ పెరిగిన మాట వాస్తవమే అయినా… దానికి తగినట్టు సదుపాయాలు పెరుగు తున్న దాఖలా గానీ, మెరుగైన బోగీలు తెస్తున్న తీరు గానీ కనబడటం లేదు. రైళ్లను ఎక్కువగా వినియోగించేది సామాన్యులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పౌరులు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న కోరమండల్‌, ‌యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల మృతుల్లో ఎక్కువ మంది వలస వెళ్లక తప్పని బడుగుజీవులే కావటం యాదృచ్ఛికం కాదు

దారుణ ప్రమాదాలు

1995 ఆగస్టు 20: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు సమీపంలోని ఫిరోజాబాద్‌లో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌-‌కాళింది ఎక్స్‌ప్రెస్‌లు డీకొని 350 మంది చనిపోయారు.

1999 ఆగస్టు 2: పశ్చిమ బెంగాల్‌లోని గైసాల్‌ ‌వద్ద అవధ్‌-అస్సాం ఎక్స్‌ప్రెస్‌ను బ్రహ్మ పుత్ర మెయిల్‌ ‌డీకొని 285 మంది మరణించారు.

1998 నవంబరు 26:  పంజాబ్‌లోని ఖన్నాలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను జమ్మూతావి-సియాల్దా ఎక్స్‌ప్రెస్‌ ‌డీ కొట్టింది.212 మంది మరణించారు.

2016 నవంబరు 20: ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌కాన్పుర్‌ ‌సమీపంలోని పుఖరాయన్‌ ‌వద్ద ఇందోర్‌-‌రాజేంద్రనగర్‌ ‌రైలు పట్టాలు తప్పింది.152 మంది చనిపోయారు.

(ఇవి కొన్ని మాత్రమే..)

– క్రాంతి

About Author

By editor

Twitter
YOUTUBE