– యం. సూర్య ప్రసాదరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘‘హలో… హలో… పెద్దోడా… హలో…’’

మా ఆవిడ సెల్ఫోన్లో కుస్తీ పడుతోంది… అవతల నుండి సమాధానం రావడం లేదు.

‘‘హలో… హలో… చిన్నోడా… హలో…’’

మా రెండవ వాడితోనైనా మాట్లాడాలని తాపత్రయ పడుతోంది.

‘‘ఇద్దరి ఫోన్లూ ఎంగేజ్లో ఉన్నాయి గదూ!’’

పేపర్‌ ‌చదువుతున్న వాడినల్లా … తల ఎత్తి చూచాను!

‘‘అవునండీ! ఇద్దరి ఫోన్లూ పలకడం లేదు…’’ దిగులుగా అంది.

‘‘ఇద్దరూ బిజీగా ఉండి ఉంటార్లే… అమ్మ ‘మిస్సింగ్‌ ‌కాల్స్’ ‌చూచి వాళ్లే ఫోన్‌ ‌చేస్తారులే! స్పీకర్‌ ఆన్‌ ‌చేసి ఉంచు’’.

 ‘‘ఇద్దరితో మాట్లాడి రెండు రోజులైంది. ఆదివారం గదా!’’ ఆశగా అంది.

‘‘ఆదివారం నాడయినా… ఇద్దరికీ తీరిక దొరకాలిగా… భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులే! ఆదివారం నాడే ఆటవిడుపు… వాళ్లే ఫోన్‌ ‌చేస్తారులే! దిగులు పడకు….’’ సముదాయించాను.

‘‘నాన్నగారూ….’’ స్పీకర్లోంచి వాయిస్‌ ‌వినిపించింది.

‘‘పెద్దవాడి గొంతులా ఉందండీ…’’ ఆలోచనగా అంది.

‘‘వాడు ఎప్పుడైనా… ‘నాన్నగారూ’ అని పిలిచాడా! ‘డాడీ’ అనడం తప్ప…’’ ‘‘నేను నాన్నగారూ! సతీష్‌ను. ఇంజనీరింగ్‌ ‌రెండో సంవత్సరం చదువుతున్నా!’’ ‘‘బాగున్నావురా!’’ ఆప్యాయంగా అడిగాను. సతీష్‌ ‌క్షణంలో జ్ఞాపకమొచ్చాడు. ‘‘జ్యోతి కూడా ఇక్కడే వుంది నాన్నగారూ!’’

‘‘నాన్నగారూ! బాగున్నారా!’’ జ్యోతి కంఠం వెంటనే వినిపించింది.

‘‘ఇక్కడ నేను, అమ్మగారూ బాగున్నామురా! మీరెలా ఉన్నారు? అన్నట్లు… కరుణ, విమల, రాజేష్‌, ‌నవీన్‌, ‌మహేష్‌ ‌వగైరా… వగైరా… మన వారంతా…. నాకు ఉత్సాహం వచ్చేసింది.

‘‘అంతా బాగానే ఉన్నాం నాన్నగారూ…మీ చలువ వల్లే’’ ఆనందం వాళ్ల గొంతుల్లో తాండవమాడుతోంది.

‘‘నాదేముందర్రా! మేమంతా కలిసి ప్రయత్నించాం. మీరూ సహకరించారు… ఓ ఆధారం చూపించాం! అది అందుకొని మల్లెతీగలా అల్లుకొని, ఎగబాకి ఇంత వారయ్యారు. నేను నిమిత్త మాత్రుడనే’’ .

‘‘మీవల్లనే కదా… నాన్నగారూ! మేం బాలకార్మిక వ్యవస్థ నుంచి బయటపడిందీ.. నిర్బంధ విద్యాపథకం ద్వారా విద్యావంతులమైందీ….’’

వాళ్లు ఫోన్లో ఒకరి తరువాత ఒకరు చెప్పుకుపోతూనే ఉన్నారు.

‘‘నిజమేనండీ…. మీరు మమేకమై నిజాయతీగా ఆ యజ్ఞాన్ని నిర్వహించబట్టే గదండీ ఇన్ని మంచి ఫలితాలు వచ్చాయి…’’ నా భార్య ఆరాధనా పూర్వకంగా అంటోంది.

‘మాఊళ్లో బాలకార్మికులు లేరు’ అనే బోర్డు ఆ ఊరు ముందు స్థాపించడంతో మా మూడు నెలల బృహత్తర కార్యక్రమం ప్రారంభమైంది.

‘‘మాస్టారూ! మేం తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో మీరు పాల్గొనాలి! మూడు నెలల పాటు మీరు మాతో ఉండాలి! మీ సహాయ సహకారాలు కావాలి. ఇందుకు మేడమ్‌ ‌గారు అంగీకరించాలి!’’ కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ఆఫీసర్‌ ‌మాధవరావు రిక్వెస్ట్ ‌చేశాడు.

‘‘తప్పకుండా పాల్గొంటాను మాధవ్‌! ‌రిటైర్మెంట్‌కు ఆరు నెలల టైమ్‌ ఉం‌ది. ఈ సమయంలో ఇటువంటి సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టమనుకుంటాను’’ నా భార్య వైపు చూచాను.

‘‘మా పిల్లలంతా సెటిలయ్యారు. మాస్టారికి ఈ ముప్పై అయిదేళ్ల సర్వీసులో ఎందరో ఆఫీసర్లు పరిచయమున్నారు. వారి సేవలను వినియోగించుకో మాధవ్‌!’’ ‌నా శ్రీమతి ఉచిత సలహా ఇచ్చింది!

మాధవరావుతో మా పరిచయం ఈనాటిది కాదు. అతడు మా పెద్ద అబ్బాయి క్లాస్‌మేట్‌.

‘‘ఏమిటి కార్యక్రమం?’’ శ్రీమతి అంగీకారం లభించిన తరువాత అడిగాను.

‘‘మనం ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి! బాల కార్మిక వ్యవస్థ నుంచి గ్రామానికి విముక్తి కలిగిం చాలి! విద్యాహక్కు చట్టాన్ని విజయవంతం చేయాలి! ఆరు నుండి పధ్నాలుగేళ్లలోపు బాలకార్మికుల్ని బడిబాట పట్టించాలి! వాళ్లను విద్యా వంతులను చేయాలి!’’ ఇంకా అనేక సామాజిక కార్యక్రమా లున్నాయి’’ మాధవరావు వివరించాడు.

ఇంటికి కావలసిన మూడు నెలల సరంజామా అంతా సమకూర్చి మాధవరావు వెంట సూట్‌కేసుతో బయలుదేరాను. మాతో మరో ముగ్గురు ఔత్సా హికులు ఒకరు తరువాత వచ్చి కలిసిపోయారు.

‘‘మీ పిల్లల్ని బడిలో చేర్పించండి’ అర్ధించాము!

‘‘మాకు తిండి ఎవరు పెడతారు?’’ ప్రశ్న ఎదురైంది.

‘‘మీ పిల్లల్ని బాలకార్మికులుగా మార్చకండి’’ ప్రార్థించాము!

‘‘ఈ అవిటోళ్లకి అన్నం ఎవరు ఇస్తారు?’’

‘‘మీ పిల్లల్ని విద్యావంతుల్ని చేస్తాం!’’ హామీ ఇచ్చాము.

‘‘మాకు గంజినీళ్లు ఎవరు పోస్తారు?’’

అన్ని సమస్యలే! సమాధానం ఇవ్వలేని ప్రశ్నలే!

అక్షరాస్యత గురించి ప్రచారం చేశాం. వయోజన విద్య అవసరాన్ని వివరించాం. పిల్లల్ని పనిలో పెట్టుకొంటే ఎంత పెద్ద తప్పో, చట్టరీత్యా ఎటువంటి శిక్ష వేయవచ్చునో పోస్టర్ల ద్వారా ప్రచారం చేయించాం. దండోరాలు వేయించాం. గ్రామసభలు పెట్టించాం. హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు మొదలైన కళా రూపాల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాలతో వారి దృష్టిని ఆకర్షించాం. చెప్పాల్సిన విషయాలను గుండెలకు హత్తుకునేలా ప్రదర్శించాం.

అయినా మా ప్రచారం బూడిదలో పోసిన పన్నీరైంది.

‘‘అమ్మా! మమ్మల్ని చదివించరూ! అయ్యా! మమ్మల్ని చదివించరూ!’ అంటూ

కొందరు బాలకార్మికుల చేత వీధివీధినా ప్రదర్శనలు ఇప్పించాం.

మా కష్టానికి తగిన స్పందన రాలేదు. మమ్మల్ని చూడగానే జనం పారిపోయే వారు. ఎదురుపడి నోటికొచ్చినట్లు తిట్టేవారు.

పిల్లల్ని పని మానిపించమంటే కొట్టడానికి వచ్చేవారు.

‘‘కిం కర్తవ్యమ్‌?’’ ‌మాధవరావు తల పట్టుకున్నాడు.

‘‘మాధవ్‌! ఈ ‌సమస్యలకన్నింటికీ మూలం ఆర్థిక స్థితిగతులు. రెక్కాడితే గాని డొక్కాడని జనం. పిల్లల్ని బడికి పంపించే స్థిమితం లేదు. తలకు మించిన అప్పులున్నట్లున్నాయి! వాళ్లను ఆర్థికంగా ఆదుకోగలిగితే..మనం అనుకున్న పని సాధించగలుగుతాం’’ సాలోచనగా అన్నాను.

‘‘కానీ… సమస్యలు చాలా ఉన్నాయి మాస్టారూ!’’ బ్యాంక్‌ ఉద్యోగి రాజేష్‌ అం‌టే…

‘‘అన్ని సమస్యలను మనం పరిష్కరించగలుగుతామా!’’ పంచాయతీ ఉద్యోగి పరమేశం అన్నాడు. ‘‘కొన్నయినా పరిష్కరిస్తేనే గమ్యం చేరగలుగుతాం’’ యూత్‌ ‌కో ఆర్డినేటర్‌ ‌యుగంధర్‌ అన్నాడు. ‘‘ఇది ఒక బహుముఖ వ్యూహం!’’ ఇంతలో నా ఆలోచనలు ఓ రూపుదిద్దుకున్నాయి.

‘‘ఎలా మాస్టారూ?’’ టీచర్‌ ‌పురుషోత్తమ్‌ అడిగాడు.

‘‘ఎక్కువ మంది బాలకార్మికులను బడికి పంపిన వాళ్లకు ఉచితంగా కుళాయి కనెక్షన్‌ ఇప్పిస్తామందాం’’

 ‘‘బావుంది మాస్టారూ!’’ మాధవ్‌ ‌సంతోషం వ్యక్తం చేశాడు.

‘‘ఇంకా చెబుతాను. వృద్ధాప్యపు పెన్షన్లు ఇప్పించుదాం. బడికి వెళ్లే పిల్లలకు ప్రోత్సాహకాలు ఇప్పిద్దాం! ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంచుదాం! గ్రామ సభలలో ప్రతిజ్ఞలు చేయించుదాం!’’… చేయవలసిన కార్యక్రమాలను వివరించా. మరునాడే ఆరుగురం త్రికరణ శుద్ధిగా కార్యాచరణ ప్రారంభిం చాం.

రాళ్లను కొట్టే వడ్డెర కుటుంబాలలో వయసుకు మించిన పనిచేసే పిల్లల కష్టనష్టాలను వివరించాం. బడిలో చేర్పిస్తే…వాళ్ల బతుకులు ఎలా బాగుపడు తాయో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశాల్లో వివరించాం. పిల్లలను బడికి పం పిన వారికి పావలా వడ్డీకి రుణం ఇప్పిస్తామని ప్రతిపాదన పెట్టాం.

శుక్రవారం మత ప్రార్థనల తరువాత మత పెద్దలనందరినీ సమావేశ పరచి వారితో చర్చించి పిల్లలను బడికి పంపుతామని ‘అల్లా’ సాక్షిగా ప్రమాణం చేయించాం.

బీడీ ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిలను బడికి పంపుతామని ప్రమాణం చేయించాం. రైతులతో నేలతల్లి సాక్షిగా ప్రమాణం చేయించాం.

‘‘ఇంతటితో సరిపోదు. పిల్లల్ని బడికి పంపించే వాళ్లకు రచ్చబండ సాక్షిగా సన్మానం చేద్దాము’’ ప్రపోజల్‌ ‌పెట్టాను.

మరునాడే గ్రామసభలో సైకిల్‌ ‌షాపు యజమాని తన కొడుకును పని మాని పిస్తానని ప్రకటించాడు.

వెంటనే పూలమాలతో సన్మానించాం.

ఆ పాజిటివ్‌ ‌దృక్పథ•ం పని చేసింది.

సన్మానం అందుకుంటున్న వారి సంఖ్య దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పోయింది.

అనాథలు నివాసముంటున్న ఓ గుడిసె ముందు మా కార్యక్రమం ఆగిపోయింది. ‘‘వీరిని దత్తత తీసుకొని ఎవరైనా చదివిస్తే బావుంటుంది’’ ప్రపోజల్‌ ‌పెట్టాను.

మేం వీళ్లకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పిస్తాం. కావలసిన పుస్తకాలు యిచ్చి మీరు చదివిస్తారా!’’ గ్రామసభలో గ్రామపెద్దలు ప్రతిపాదించారు.

వాళ్లు పదిహేనుమంది అనాథ•లు…

సతీష్‌, ‌జ్యోతి, కరుణ, విమల, రాజేష్‌, ‌నవీన్‌, ‌మహేష్‌ ‌వగైరా… వగైరా…

పుట్టుకతోనే తల్లి వదలి వేసిన కొందరు…

యాక్సిడెంట్‌లో అయిన వాళ్లంతా పోగా.. మిగిలిన వాళ్లు కొందరు…

తల్లిని తండ్రి చంపి జైలుకెళ్తే మిగిలిన వాళ్లు మరి కొందరు…

అక్రమ సంబంధం కలిగిన తండ్రిని చంపించి తల్లి జైలు కెళ్లగా అనాథ•లైన వాళ్లు కొందరు…

తుఫాను భీభత్సం తరువాత మిగిలిన వాళ్లు మరి కొందరు…

అందరూ అందంగా, ఆరోగ్యంగా చింపిరి చింపిరి గుడ్డల్లో ముత్యాల వంటి బిడ్డల్లా… శాపవశాత్తు గంధర్వలోకం నుండి భూలోకానికి వచ్చి పడిన దేవదూతల్లా ఉన్నారు… పరిశీలిస్తుంటే…!

‘‘వీళ్లను ఎన్రోల్‌ ‌చేసుకోవాలంటే… ఒక ప్రాబ్లెమ్‌ ‌వస్తుంది మాస్టారూ!’’

మాధవరావు సాలోచనగా అన్నాడు.

ఏమిటన్నట్లుగా ప్రశ్నార్ధకంగా చూచాను.

‘‘వీళ్ల దరఖాస్తు ఫారాలను పూర్తి చేస్తాము. వీళ్లకు తండ్రిగా, సంరక్షకుడిగా ఒకరిపేరు రాయాలి…! వారు సంతకం పెట్టాలి.. అడ్రస్‌ ‌వివరాలు ఇవ్వాలి’’

‘‘ఎవరి పేరయినా రాయవచ్చునా?’’ నేను అడిగాను.

‘‘రాయవచ్చనుకోండి..వాళ్లు సంతకం పెట్టాలిగా..’’ అందరి వైపూ పరిశీలనగా చూచాను! నిశ్శబ్దంగా ఉన్నారు. భావరహితంగా చూస్తున్నారు.

‘‘అందరికీ తండ్రిగా నాపేరు, అడ్రస్‌ ‌రాయి. నేనే సంతకాలు చేస్తాను..’’ నిశ్చయంగా అన్నాను.

‘‘మాస్టారూ!’’ మాధవరావు ఆశ్చర్యపోయాడు.

‘‘నిజమే మాధవరావ్‌! ‌నాపిల్లలు ముగ్గురు కాదు. వీళ్ళతో కలిపి పద్దెనిమిది మంది!’’ సంతోషంగా అన్నాను. అక్కడితో నాబాధ్యత పెంచుకున్నాను. తెలిసిన అధికారులందరి సహాయ సహకారాలతో పిల్లల్ని బడిలో చేర్పించి, బడిబాట పట్టించాం. బాలకార్మిక వ్యవస్థను రూపుమాప గలిగాం.

మా మూడు నెలల ప్రాజెక్ట్ ‌పూర్తయింది.

విజయోత్సవ సభ ప్రారంభమైంది. ప్రాజెక్ట్ ‌డైరెక్టర్‌ అధ్యక్షతన జిల్లా, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.

‘‘ఇది ప్రభుత్వ పథకం కాదు. ఇది ప్రజల పథ•కం. ఈ పథకంలో డ్వాక్రా గ్రూపుల సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలూ చురుకుగా పాల్గొన్నారు. యువజన సంఘాలు, యూత్‌ ‌సర్వీస్‌ ‌సభ్యులూ, అనేక స్వచ్ఛంద సంస్థలూ తోడ్పాటు వల్లనే ఈ పథకం విజయవంత మైంది. ఇది మా గొప్పతనం కాదు.’’ ఒక్కొక్కరం అనుభవాలు వివరించాం.

‘‘ప్రజలే ఇన్ఫార్మర్‌ ‌వ్యవస్థ ఏర్పరచుకున్నారు. బాలకార్మికులు ఎవరైనా కనిపిస్తే అధికారులకు క్షణాల్లో సమాచారం అందించే వారు. అవసర మైనప్పుడు పోలీసు వ్యవస్థ ఎంతో ఉపయోగ పడింది.’’

‘‘రైతుల• పొలాల్లో బోరుబావులు వేయించుకోవ డాని ఇక బ్యాంకుల నుండి సకాలంలో రుణాలు ఇప్పించాం.’’

‘‘చిన్నగూడు కట్టుకోవడానికి ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకునే తరుణం లో కొందరికి గృహనిర్మాణ పథ•కం కింద ఇళ్లు కట్టించి ఇప్పించాం’’

‘‘పి.హెచ్‌.‌సి కేంద్రాన్ని నెలకొల్పి అనారోగ్యం బారిన పడిన గ్రామస్థులందరికీ ‘బీమా’ పధకంతో అరోగ్యప్రదానం చేయించాం.’’

‘‘వడ్డీ వ్యాపారస్తులకు నయాన్నో, భయాన్నో నచ్చచెప్పి, అధిక వడ్డీ తగ్గించి అప్పులను తగ్గించి, రద్దు చేయించి అప్పులపాలైన కుటుంబాలకు ధైర్యం కల్పించాం. ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ ‌విజయసాధనలో ఉయోగపడ్డాయని మనవి చేస్తున్నాం’’ ప్రాజెక్ట్ ‌సఫల మైనందులకు మాధవరావు సంతోషం ప్రకటించాడు.

‘‘ఇదొక మహాయజ్ఞం! ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న వారంతా మహానీయులే! ఈ మహా యజ్ఞంలోని రుత్విక్కులందరికీ అభినందనలు చెబుతున్నాను.’’ అధ్యక్షుల వారు ఆనందం వ్యక్తపరచారు.

 ‘‘ఇందులో వడ్డీవ్యాపారస్తులపైనగానీ, భూస్వాములపైన గానీ ఒక కేసు పెట్టలేదు. ఒక్క పైసా జరిమానా విధించలేదు…’’ జీపీడీవో వివరణ ఇచ్చారు.

‘‘రవాణాలేని ఈ ప్రాంతానికి రహదారులు వేయించాం. మంచినీటి సదు పాయం కల్పించాం!’’ తహసిల్దార్‌ ‌చెప్పారు.

‘‘ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి హైస్కూలు స్థాయి వరకు విద్యావ్యవస్థను ఈ ఊరికి రప్పించాము!’’ యం.ఇ.వో ఉన్నత చదువు కోసం ఏర్పరచిన సదుపాయాలు వివరించారు.

‘‘వ్యాపారుల ఇళ్ల ముందు ధర్నాలు చేశాము. వారిని సామాజికంగా బహి ష్కరించాం! విముక్తి చెందిన బాలకార్మికుల చేత యజమానులకు దండలు వేయించాం..’’ జ్ఞాపకాల సుడులు తిరుగుతూనే ఉన్నాయి.

‘‘అన్నీ ఒక ఎత్తైతే.. మనం వచ్చే ముందు ఆ అనాథ పిల్లలంతా మీ కాళ్లను చుట్టేసి ‘నాన్నగారూ.. నాన్నగారూ..’’ అంటూ బావురుమనడం నా జీవితంలో మరచిపోలేని కలచి వేసే సంఘటన..’’ శ్రీమతి మాటల్తో ఇహంలోకి వచ్చేశాను.. ‘‘డాడీ.. డాడీ.. డాడీ..!’’ ఓ ఫోన్లోంచి మావాడి గొంతు వినిపించింది.

‘‘డాడీ.. డాడీ.. కంటే.. నాన్నగారూ! బాగుంది గదండీ!!’’

శ్రీమతి ఆత్మీయంగా అంటుంటే.. ఔనని తన్మయంగా తలూపాను.

About Author

By editor

Twitter
YOUTUBE