సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌జ్యేష్ఠ శుద్ధ నవమి – 29 మే 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ప్రభుత్వ నిర్ణయాలనూ, విధానాలనూ విపక్షాలు విమర్శించవచ్చు. అది వాటి కర్తవ్యం. కానీ విమర్శలో విజ్ఞత లోపిస్తే, ప్రభుత్వ నిర్ణయాల మీద కాకుండా, ఎవరి మీదనో వ్యక్తిగత కక్షతో నిందలు మాత్రమే కురిపిస్తే అవి నేరుగా చెత్తబుట్టలోకే పోతాయి. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ప్రారంభిస్తున్నారు. అంటే జాతికి అంకితం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీద విపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న విమర్శలు చెత్తబుట్టలో చేరడానికి మాత్రమే అర్హమైనవి. ఏ విధంగా చూసినా కొత్త భవనం అవసరం కనిపిస్తూనే ఉంది. పాత పార్లమెంట్‌ ‌భవనం తొమ్మిదిన్నర దశాబ్దాల నాటిది. పైగా బ్రిటిష్‌ ‌కట్టడం. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారత్‌ ‌సాధించిన స్వయం సమృద్ధికి ప్రతీకగా కొత్త పార్లమెంట్‌ ‌భవంతిని చూడాలని ప్రధాని చాలాకాలం క్రితమే చెప్పారు. అలాగే ఆ పాత భవనం నేటి అవసరాలను తీర్చలేకపోతున్నది కూడా. 1921లో ప్రారంభమైన దాని నిర్మాణం 1927కు పూర్తి కాగా, నాటి గవర్నర్‌ ‌జనరల్‌ ఇర్విన్‌ ‌ప్రారంభించాడు. ఇప్పుడు పాత భవనం ఒక వస్తు ప్రదర్శనశాలగా ఉండిపోతుంది.

కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం గురించి కాంగ్రెస్‌ ‌పార్టీ, దాని నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు లంఘించుకున్నారు. వారికి రెండు అభ్యంతరాలు. మొదటిది పార్లమెంట్‌ ‌భవంతిని ప్రారంభించవలసినది రాష్ట్రపతి తప్ప, ప్రధాని కాదు అంటున్నారు. రెండో విమర్శ వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌జయంతి రోజున ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడం. రాష్ట్రీయ జనతాదళ్‌, ‌మజ్లిస్‌ ‌పార్టీ కూడా ప్రధాని పార్లమెంట్‌ ‌భవనాన్ని ప్రారంభించడం గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవన్నీ నరేంద్ర మోదీ మీద వ్యక్తిగత ద్వేషంతో చేస్తున్న విమర్శ వలెనే ఉన్నాయని ఇప్పటికే చాలామంది విశ్లేషకులు అభిప్రాయానికి వచ్చారు. అయినా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద విపక్షాలకి హఠాత్తుగా ఇంత గౌరవం ఎలా వచ్చిందన్నది ప్రశ్న. ఆమె గిరిజన మహిళ అయినప్పటికీ పోటీ పెట్టి, దేశమంతా తిరిగి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ముర్ము పదవీ స్వీకారం చేసిన తరువాత ఇంతవరకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి మర్యాద పూర్వకంగా కలవని నాయకులే ప్రతిపక్షాలలో ఎక్కువ. ఇప్పుడు మాత్రం రాజ్యాంగంలో 79వ ఆర్టికల్‌ ‌గుర్తుకు వచ్చింది. పార్లమెంట్‌కు రాష్ట్రపతి అధినేత అని ఆ ఆర్టికల్‌ ‌చెబుతున్న సంగతి వాస్తవమే కావచ్చు. కానీ ప్రధాని ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి. పూర్తి ప్రజాప్రాతినిధ్యంతో ఆవిర్భవించే లోక్‌సభకు నాయకుడు. వాస్తవంగా అధికార బాధ్యతను నిర్వర్తించే వ్యక్తి ప్రధాని మాత్రమే. ఇవన్నీ ఉండగా రాష్ట్రపతిని తక్కువ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ విమర్శించడం అర్ధరహితం. అసలు కొత్త పార్లమెంట్‌ ‌భవనం ఆలోచనే మోదీ సరదాలలో ఒకటి మాత్రమేనని కూడా ఆ పార్టీ అత్యంత బాధ్యతారహితంగా విమర్శకు దిగింది. కానీ నిజం ఏమిటి? దేశ రాజధానిలో ఆ చరిత్రాత్మక ప్రాంతాన్ని సెంట్రల్‌ ‌విస్టా అభివృద్ధి పథకం పేరుతో తీర్చిదిద్దాలనీ, అందులో భాగంగా చేపట్టే కట్టడాలన్నీ భారత్‌ ‌సాధించిన ఘనతను ప్రతిబింబించేవిగా ఉండాలనీ ప్రధాని ఆశించారు. అందులో భాగమే పార్లమెంట్‌ ‌కొత్త భవనం. అందుకు తగ్గట్టే నిర్మాణం పూర్తి చేసుకున్నది.

ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది పార్లమెంట్‌ ‌భవనం. భారతదేశం పురోగమన దిశగా వేసిన అడుగులను చూపుతూనే, సంస్కృతీ సంప్రదాయాల పునాది మీద నిర్మితమైనదే ఆ కొత్త భవనం. ఇక్కడే బీజేపీ, నరేంద్ర మోదీ ఘనత కనిపిస్తుంది. పాత భవనానికి పక్కనే నిర్మించిన ఈ భవనంలో దానికంటే సౌకర్యాలు ఎన్నో రెట్లు ఎక్కువ. ఎంతో విస్తృతమైనవి. వాస్తుశిల్పి బిమల్‌ ‌పటేల్‌ ‌నాయకత్వంలో టాటా ప్రాజెక్ట్ ‌లిమిటెడ్‌ ‌దీనిని రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసింది. సెంట్రల్‌ ‌విస్టా ప్రాజెక్టును రూ. 20,000 కోట్లతో ప్రారంభించగా, అందులో రూ. 970 కోట్లు పార్లమెంట్‌ ‌భవంతికి వెచ్చించారు. లోక్‌సభ ప్రాంగణంలో 888 మంది ఆసీనులు కావచ్చు. పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశానికి కూడా ఇది సరిపోతుంది. రాజ్యసభలో 384 మంది కూర్చోవచ్చు. అంటే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. ప్రత్యక్షంగా రెండువేల మంది, పరోక్షంగా తొమ్మిదివేల మంది కార్మికులు నిర్మాణంలో పాలు పంచుకున్నారు. భారతీయ కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు కూడా సేవలు అందించారు.

ఇంతటి ఉత్కృష్టమైన, ప్రత్యేకతలు కలిగిన భవంతిని, అందునా పార్లమెంట్‌ ‌భవంతిని ఏదో ఒక ప్రత్యేక సందర్భంలోనే ప్రారంభిస్తారు. ఇదేమీ అనూహ్యం కాదు. అది సావర్కర్‌ ‌జయంతి కావడం ముదావహమే. పైగా అంతటి త్యాగమూర్తికి స్వతంత్ర భారతదేశంలో దక్కిన గౌరవం అంతంత మాత్రమే. ఆ లోటును ప్రధాని మోదీ తీరుస్తున్నారు. ఇది ఆయనకు సరైన నివాళి కూడా. స్వాతంత్య్ర సమరయోధులను ఏనాడూ సరిగ్గా గౌరవించని కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ ‌గాంధీకి ఈ నిర్ణయం నచ్చనిది అందుకే.

పాత పార్లమెంట్‌ ‌భవంతి ఎన్నో ముఖ్య ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. బాబూభాయ్‌ ‌పటేల్‌, ‌నెహ్రూ, పటేల్‌, అం‌బేడ్కర్‌, ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ, ఓపీ త్యాగీ, రామ్‌మనోహర్‌ ‌లోహియా, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, నందా, ఇందిర, మొరార్జీ, అటల్‌ ‌బిహారీ వాజపేయి, ఎల్‌కే అద్వాణి, చంద్రశేఖర్‌, ‌వైబీ చవాన్‌, ‌హిరేన్‌ ‌ముఖర్జీ, ఎంసీ చాగ్లా వంటి ఎందరో పార్లమెంటేరియన్లను చూసింది. కొత్త భవనం కూడా అలాంటి పెద్దలను తయారు చేయగలదని, అందుకు స్ఫూర్తి శిఖరంగా ఆవిర్భవిస్తుందని ఆశిద్దాం.

About Author

By editor

Twitter
YOUTUBE