– పాలంకి సత్య
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
అనేక రాజ్యాలలో నివసించిన కాలంలో, అప్పుడు ప్రయాణాలలో జరిగిన పొరపాట్లకూ, తప్పనిసరై చేసిన అపరాధాలకూ ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్న తరువాత వరాహమిహిరుడు విక్రమాదిత్య చక్రవర్తిని దర్శించాడు. తాను నేర్చుకున్న విద్యల గురించి నిండు సభలో సంక్షిప్తంగా చెప్పి, తాను రచించిన పంచ సిద్ధాంతిక గ్రంథాన్ని సార్వభౌముని ముందుంచాడు. ఆ గ్రంథాన్ని భూర్జపత్రాలపై రాసేందుకు లేఖకులను నియమించిన తర్వాత విక్రముడు మిహిరుని తన వెంట ప్రాసాదానికి తీసికొని వెళ్లాడు.
స్నేహితుల మధ్య అనేక విషయాల మీద సంభాషణ జరిగింది. మిహిరుడు తాను చదివిన గ్రీక్, రోమ్, ఈజిప్టు చరిత్రలను విక్రమునకు చెప్పాడు. పిరమిడ్ల గురించి విన్న విక్రమాదిత్యుడు వరాహమిహిరుని వలెనే స్పందించాడు.
‘‘వ్యక్తి మరణించినా ఆత్మ శరీరాన్ని వీడదా? ఆ సిద్ధాంతం నిజమని అంగీకరించెదము గాక! కానీ అటువంటి ఆత్మకై విశాలమైన, ఎత్తైన కట్టడాలా? అందుకోసం నరబలులా? ఏలికలలో అంతటి స్వార్థ పరులుంటారా? మరణించిన వారిని పూజించేందుకు పురోహితులా? ఇదేమి సంస్కృతి?’’
‘‘నేను కూడా నీవనుకున్నట్టే అనుకున్నాను. భగవంతుడిని పూజించడం, ఆలయాలు నిర్మించడం ధర్మం. విద్య కోసం వెళ్లినాను కానీ మ్లేచ్ఛుల మధ్య, అనార్యుల మధ్య నివసించడం కష్టమని అనేక సందర్భాలలో అనిపించింది’’.
‘‘అనాగరిక జీవనం నుండి ప్రజలను రక్షించడం నా కర్తవ్యంగా భావించి, దేవాలయాలూ, విద్యాల యాలూ నిర్మించాను’’ అంటూ విక్రముడు తాను ఎడారి ప్రాంతంలో ప్రజల కోసం కల్పించిన సౌకర్యాల గురించి వివరించాడు.
‘‘ఆ సమయంలో నీవు నా వెంట ఉంటే బాగుండు ననుకున్నాను. ఆలయ నిర్మాణానికీ లింగ ప్రతిష్టకూ ముహూర్తం నీవు నిర్ణయించి ఉంటే నాకు తృప్తిగా ఉండేది’’.
‘‘అదేమి మాట? శాస్త్రజ్ఞులెందరో నీతో ఉన్నారు కదా!’’
మిహిరుని మాటలతో తృప్తి చెందని విక్రముడు ఆలయ నిర్మాణ ముహూర్తం చెప్పి, ముహూర్తబలం ఎంతటిదో అడిగాడు. మిహిరుడు ఆలయమెక్కడ ఉన్నదో తెలుసుకుని, లెక్కలు కట్టి, బాగానే ఉన్నదన్నాడు.
‘‘విక్రమా! నేను కొంత శాస్త్రజ్ఞానం కలిగిన వాడనే కానీ సర్వజ్ఞుడను కాను. భవిష్యత్తును కొంతవరకే దర్శించగలను. సూర్యోదయం అన్ని చోట్లా ఒకేసారి జరగదు. ఆ విషయం తెలియకనో, లేక మరిచిపోయో ముహూర్తం ఉజ్జయినిలో సూర్యో దయ సమయమాధారంగా నిర్ణయించినారు.’’
‘‘అందువలన….’’
‘‘ఆరు లేదా ఏడువందల సంవత్సరాల వరకూ అక్కడ దేవతా పూజలు జరగగలవు. ఆపైన దేవు డొక్కడే అని చెప్పి, ఆ దేవునకు ఒక పేరు పెట్టి ఆరాధించే ధర్మం ఉద్భవిస్తుంది. ఆ దేవుని పేరనే అక్కడ ప్రార్ధన జరుగగలదు. నీవు ప్రతిష్టించిన లింగం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉండగలదు’’.
‘‘ఏ రూపంలో ఆరాధించినా పరమాత్మకే చేరు తుందని భరతభూమి వాసుల నమ్మకం. భగవన్నిర్ణయం ఎలా ఉంటే అట్లే అగును గాక’’ అని విక్రమాదిత్యుడు మహాకాళుని ఆలయం వైపు తిరిగి నమస్కరించాడు.
********
వరాహమిహిరునికి సమయం చక్కగా గడచిపోతోంది. నూతన గ్రంథ రచనలో, ముందు రాసిన వాటికి మెరుగులు దిద్దడంలో లీనమైన అతని వద్దకు కుమారుడు పృథుయశస్సు వచ్చి నమస్కరించి, ‘‘నాన్నగారూ! ఎవరైనా మరణించినప్పుడు మొదటి సంవత్సరం మాత్రమే నెలకొకసారి పితృదేవతార్చన ఎందుకు చేస్తామో తెలుసునా?’’ అని అడిగాడు.
పుత్రుని చూసి ముచ్చట పడిన వరాహ మిహిరుడు ‘‘నువ్వే చెప్పు!’’ అన్నాడు.
‘‘పితృదేవతలు ఒక సంవత్సరం పాటు చంద్రలోకంలో ఉంటారు. చంద్రుని గమనిస్తే ఒక కుందేలు ఎల్లవేళలా కన్పిస్తుంది. ఎందుకంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే సమయమూ, భూమి చుట్టూ తిరిగే సమయమూ ఒక్కటే. చంద్ర భ్రమణం ఒక నెల కాబట్టి, చంద్రునికి ఒక దినం భూమిపై నెలతో సమానం. మనం ప్రతిదినం భుజించినట్లే పితృదేవతలకు కూడా ప్రతిదినం ఆహారమర్పించాలి. అంటే నెలకొకసారి పితృదేవతార్చన చేస్తే సరిపోతుంది.’’
‘‘ఈ విషయాలు ఎవరు నేర్పించారు తండ్రీ!’’
‘‘అమ్మ నేర్పించింది. అమ్మకు అన్ని విద్యలూ తెలుసు!’’ అంటూ వెళ్లిపోయాడు.
అక్కడే నిలబడిన ఖనా ‘‘తండ్రిగారికి ప్రపంచమంతటికీ విజ్ఞానబోధ చేయడానికి ఉన్న ఆసక్తి కుమారుడికి బోధించటంలో లేదు’’ అన్నది.
‘‘నీకు మాత్రమే నేర్పవలసినది రచిస్తున్నాను. వచ్చి చూడు!’’ అని దగ్గరకు పిలిచి రాస్తున్న శ్లోకం చూపించాడు.
‘‘ఇదివరలో రచించిన దానికి మెరుగులు దిద్దినట్లున్నది.’’
‘‘మన ప్రేమైక జీవితానికి కూడా మెరుగులు దిద్దుతునే ఉన్నాను కదా!’’ అన్నాడతడు. ఖనా సిగ్గు, కోపం, ప్రేమ సమపాళ్లలో ప్రదర్శించింది.
********
విక్రముని కోరికపై వరాహమిహిరుడు రాజ ప్రాసాదానికి వెళ్లాడు. భటుడు దారి చూపగా లోనికి వెళ్లి స్నేహితుని వద్ద కూర్చున్నాడు.
‘‘నేపాల రాజ్యం నుండి వార్త వచ్చింది. నేను అక్కడకు రెండుసార్లు వెళ్లాను. మొదటిది దిగ్విజయ యాత్రా సంరంభంలో జరిగింది. పసిబాలుడు మానదేవుడు చిత్రంగా సంధి కోరాడు. అతనిపై కలిగిన సోదర భావంతో అతని ఆహ్వానం అంగీకరించి మరొకసారి వెళ్లాను. నా రాకను పురస్కరించుకుని నేను నేపాలంలో అడుగుపెట్టిన రోజునుంచి కాల గణనను జరుప నిశ్చయించానని అతడు వార్త పంపినాడు. ఈ విషయమై నీ అభిప్రాయ మేమి?’’
‘‘కలియుగాది నుండి కానీ, ధర్మరాజు పట్టాభిషేకం నుండి కానీ కాలగణన జరిగేది. ఆ తర్వాత అనేకమంది రాజులు, రాజవంశాలు తమ పేరును చిరస్థాయిగా నిలబెట్టు కొనడానికి తమ కాలం నుండి కాలగణనచేయమని ఆదేశించారు. రోమ్ నగర నిర్మాణ సమయమే రోమ్ వాసుల కాలగణనకు ఆరంభం.’’
‘‘నీవు కలి యుగాది నుండి కానీ, యుధిష్టిరుని పట్టాభిషేకం నుండి కాని కాలగణన నీ గ్రంథాలలో చేయ లేదు కదా!’’
‘‘నా కాలగణన ఆంధ్ర శాతవాహన చక్రవర్తి మేఖస్వాతి పట్టం కట్టుకున్న రోజు నుండి చేశాను. కానీ ఆ శకం నేటికీ తక్కువమంది వాడుతు న్నారు. నీ పేరున ఉన్న శకం శాశ్వతం కావడానికి నీవు శకకర్త యుధిష్టిరుని ఉద్దేశించి పూజలు చేయడం మంచిది’’.
‘‘ఆ పూజ పాండవ రాజధాని ఇందప్రస్థంలోనే జరుగుగాక. నేడే సన్నాహాలు ప్రారంభిస్తాను’’.
(విక్రమ శకం క్రీస్తుపూర్వం 57వ సంవత్సరంలో ప్రారంభమైనదని అందరకూ తెలుసు. చక్రవర్తికి నిజ అనే భార్య ద్వారా కలిగిన పుత్రుడు ప్రతిష్టాన రాజ్యానికి దత్తుడైనాడు. నిజకూ విక్రమునికీ ప్రపాత్రుడైన శాలివాహనుని పేర ఆరంభమైన శకం దక్షిణ భారతంలో ప్రసిద్ధం. అదే జాతీయశకం)
********
జూలియస్ సీజర్‌కు క్లియోపాత్రా మీద వ్యామోహం తీరకముందే అతనికి రోమ్ నుండి సంకేతాలు చేరినాయి. చిరకాలం రాజధానిని వదలి ఉండటం శ్రేయోదాయకం కాదు. తప్పనిసరి పరిస్థితులలో రోమ్‌కు తిరిగి వచ్చిన సీజర్ తాను ఈజిప్టులో సాధించిన విజయాలకు గుర్తుగా ఉత్సవాలు జరపాలని నిర్ణయించాడు. ప్రత్యేకంగా ఏం చేయాలని ఆలోచిస్తూండగానే అతనికి వెర్సింజి టోరిక్స్ గుర్తుకు వచ్చాడు. తాను గాలియాను జయించే ప్రయత్నంలో ఉన్నప్పుడు వెర్సింజిటోరిక్స్ అన్ని తెగల సైనికులనూ సమీకరించి తనపై యుద్ధం ప్రారంభించాడు. తాను సామాన్య ప్రజలను ఊచకోత కోయిస్తూ ఉండగా అతడు భరించలేక లొంగి పోయాడు. ప్రస్తుతం కారాగారంలో ఉన్న వెర్సింజి టోరిక్స్ విజయోత్సవంలో భాగమగుగాక. సీజర్ పెదవులపై నవ్వు కదలాడింది.
చెరసాలలో ఉన్న వెర్సింజిటోరిక్స్‌ను నగర మంతా తిప్పి, అందరూ చూస్తూ ఉండగానే శిరచ్ఛేదం చేశారు. దీనితో తాను రెండు విషయాలను జన సమూహాలకు తెలియచెప్పానని సీజర్ అనుకున్నాడు. శత్రుశేషం అనే పదం సీజర్ నిఘంటువులో లేదు. ప్రభువు తన విజయం గురించి ఆలోచించాలి కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమనుకొనరాదు. అలా ఆలోచిస్తే వెర్సింజిటోరిక్స్‌కి పట్టిన గతి ఎంతటి వీరునికైనా తప్పదు.
కానీ ప్రభువు తలచినట్లుగా ప్రజలు తలచలేదు. జన సమూహంలో అసంతృప్తి మొదలయింది. రోమ్‌లో అనేక వందల సంవత్సరాలుగా ప్రజాపాలన సాగుతున్నది. నేడు నియంత పాలన మొదలు కావడమే కాదు ప్రజా సంక్షేమం వెనుక పడింది. ఈ నియంతృత్వాన్ని కొనసాగనీయరాదు.
అనేక సమావేశాలు జరిగాయి. సీజర్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా చంపాలో నిర్ణయమైంది. పాలనా మందిరంలో వరుసగా అనేకులు కత్తితో పొడిచారు. చివరగా పొడిచినది మార్కస్ బ్రూటస్.
సీజర్ ఆశ్చర్యంగానూ, ఆవేదనతోనూ చూశాడు. ఈతడు తన పుత్రుడు కాదా? తన పుత్రుడేనని ఇతనికి తెలియదా? తెలిసి కూడా తనను చంపడానికి పూనుకున్నాడా?
మరణించే జూలియస్ సీజర్ నోట వచ్చిన చివర మాటలు ‘‘బ్రూటస్, నువ్వు కూడా…
ఏమనదల్చుకున్నాడు సీజర్?
‘‘బ్రూటస్, నువ్వు కూడా నన్ను చంప సమకట్టావా?’’ అన్న ఆశ్చర్యమా? లేక, ‘‘బ్రూటస్, నువ్వు కూడా నావలెనే హత్యకు గురి అవుతావు’’ అన్న శాపమా?
ఎవరికి ఎరుక?
********
పూజకు ఇందప్రస్థంలో సర్వం సన్నద్ధమైనదన్న వార్త వచ్చిన తర్వాత విక్రమాదిత్యుడు తన పట్టమహిషితో, సంతానంతో, పరివారంతో తరలి వెళ్లినాడు. ముందుగా యోగమాయాదేవి దర్శనం కోసం వీరలక్ష్మీదేవితో కలసి వెళ్లి, దేవిని పూజించి, వెలుపలకు వచ్చి, ఉపస్థితుడైనాడు.
‘‘వీరా! చాలా ఏళ్లకు ముందు ఈ చెట్టు క్రింద కూర్చుని ఉండగా నా పాదాల వద్ద అశోక పుష్పాలు పడినాయి. శిరసు మీద పారిజాతాలు వర్షించాయి. ఎలా జరిగిందో! ఆ రహస్యమేమో నేటికీ తెలియలేదు.’’
విక్రమునిపై అలక ప్రదర్శిస్తూ అతని ప్రియసతి ‘‘నాలో నిద్రాణమైన స్త్రీత్వాన్ని మేలు కొలిపి, మీ దాసిగా చేసికొన్నారు. లేకపోతే నేనే భరత ఖండమంతటికీ ఏలికనై ఉందునేమో! వీరవిద్యలనూ, రాజనీతినీ నేర్చిన దానను’’ అన్నది.
‘‘నీవు దాసివా? నా ఏలికవు. భరతభూమికీ ఏలికవే’’
‘‘మాటలలో మిమ్ము మించగలనా?’’
పురోహితుడు, పండితులు వచ్చి చక్రవర్తికి యాగారంభ సమయమైందని తెలిపారు. మూడు రోజులు యజ్ఞయాగాలు జరిగాయి. సార్వభౌముడు అనేక దానాలు చేశాడు. వివిధ రాజ్యాల నుండి రాజులూ, సామంతులూ సామాన్య జనులూ వచ్చి, యాగం తిలకించి, సంతోషించారు.
********
యాగానంతరం విక్రమాదిత్యుడు వరాహ మిహిరునితో కలసి యోగ మాయాదేవి మందిర సమీపంలో నిర్మించిన స్తంభం వద్దకు వెళ్లాడు. ఇరువురి కుటుంబ సభ్యులూ వెంట ఉన్నారు.
‘‘ధర్మరాజు మందిరమీస్థలంలోనే ఉండేదని జనశ్రుతి. అందుకు ఆయనకు గుర్తుగా ఇక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించారు. అధర్మం మీద ధర్మం జయిస్తుందనడానికి ఈ స్తంభమే తార్కాణంగా నిలబెట్టాలని ఆకాంక్ష’’.
వాస్తు శిల్పులు స్తంభం గురించి వివరాలు తెలిపారు. ‘‘చక్రవర్తులు విజయ స్తంభాన్ని నిర్మించమని మాత్రమే ఆదేశించలేదు. అది ఖగోళ శాస్త్రజ్ఞులకు ఉపయుక్తంగా ఉండాని ఆజ్ఞాపించారు. ఏడు అంతస్తులతో ఈ కట్టడమున్నది. ఏడు అంతస్తులు వారంలోని ఏడు రోజులకు ప్రతీక. పైవరకూ ఎక్కడానికి మూడు వందల అరవై మెట్లున్నాయి. సంవత్సరానికి పన్నెండు నెలలు, నెలకు ముప్పది తిథులు. అనగా ఏడాదికి మూడువందల అరువది తిథులు. అదే సంఖ్యలో మెట్లు ఉన్నాయి. ప్రతి అంతస్తులోనూ వివిధ రాశులను వివిధ సమయాలలో గమనించే ఏర్పాట్లు చేశారు. స్తంభం చుట్టూ ఇరువది ఏడు నక్షత్రాల కోసం దేవాలయాలు నిర్మించారు’’ అంటూ వివరించారు.
విక్రముడు వరాహమిహిరుని వంక చూసి ‘‘నా మిత్రునికిది చిరు కానుక. ఈ స్తంభం వద్ద శాస్త్రవేత్తల కోసం నివాస గృహాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం నీ పేరనే మిహిరావళి అని అంటారు’’ అన్నాడు.
(నేడు దేశ రాజధానిలో మెహ్రౌలి అని పిలుచుకునే ప్రాంతం ఇదే. కుతుబ్‌మినార్ భారతీయ కట్టడమని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు)
మిహిరుని ముఖంలో కృతజ్ఞతా, ఆనందం కలిసి నాట్యమాడేయి. విక్రమాదిత్యుడు ‘‘ఈ కట్టడం కోసం వివిధ రాజ్యాల నుండి శిల్పులు వచ్చారు. పారసీక దేశం నుండి ప్రత్యేకంగా కొందరిని రప్పించాం. ఎత్తైన కట్టడాల నిర్మాణంలో వారు సిద్దహస్తులని నీకు చెప్పనక్కరలేదు. వారి అధిపతి వాస్తు శాస్త్రమే కాదు, ఖగోళశాస్త్రం కూడా అభ్యసించినారట. ఆ వ్యక్తి ఒక స్త్రీ కావడమే విశేషం’’ అని చెప్పి భటుని పిలిచి ఆమెను రప్పించాడు.
మిహిరుడు ఆనందాశ్చర్యాలతో ‘‘హెలీనా, నీవా?’’ అన్నాడు.
‘‘వింతగా ఉన్నదా?’’
‘‘వింత ఏముంది? పిరమిడ్ల నిర్మాణ రహస్యం తెలిసినదానవు. ఆర్కిమెడిస్ వంశస్థురాలవు. నీకు ఈ పని సులభమే’’.
‘‘పారసీక దేశంలో మీ గురువులింట నాకు ఆశ్రయం కల్పించినారు. ఆయన నన్ను పుత్రికవలె ఆదరించడమే కాదు, శిష్యురాలిగా స్వీకరించి ఖగోళశాస్త్రం నేర్పినారు. భరతఖండ చక్రవర్తి పారసీక రాజును శిల్పులను పంపమని కోరినప్పుడు నేను రావడానికి అవకాశం దొరికింది’’.
వరాహమిహిరుడు విక్రమాదిత్యునితో తనకు హెలీనాతో పరిచయమెలా జరిగిందో చెప్పి, ఆపైన ఖనాను పిలిచి ఆమెకు హెలీనాను చూపించాడు.
‘‘నీ గురించి వినడమే. ఈనాడు చూడగలిగాను’’ అంటూ ఖనా హెలీనాకు చిరకాల మిత్రురాలిని వలె కౌగిలించుకుంది.
యవన, పారసీక, సంస్కృత భాషలు మూడింటి లోనూ సంభాషిస్తున్న తన ప్రియసతినీ, ప్రాణ మిత్రురాలినీ చూసి వరాహమిహిరుడు ఆనందించాడు.
********
వైశాఖ పూర్ణిమ.. వేసవి మొదలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. విక్రమాదిత్య, వరాహమిహిరులు రాత్రి మొదటి జాములో విజయ స్తంభం మీదకు వెళ్లారు. చక్రవర్తి ఆజ్ఞపై భటులు క్రిందనే ఉండి పోయారు.
పున్నమి నాటి చంద్రుడు వెండి వెలుగులను కురిపిస్తున్నాడు. దూరాన ఉన్న నది పైనుండి చల్లని గాలి వీస్తున్నది. ప్రకృతి రమణీయతను చూసి ఆనందిస్తూ మిత్రులు కొంతసేపు ఉండిపోయారు.
రాజులకు ఎల్లవేళలా రాచకార్యాలు మనసులో మెదలుతూనే ఉంటాయి. ఆనాడు ఉదయం చారుడు తెచ్చిన వార్త గుర్తుకు వచ్చిన విక్రముడు ‘‘నేడు రోమ్ నుండి వార్తహరుడు వచ్చినాడు. జూలియస్ సీజర్ నియంతృత్వం భరించలేని ప్రజలు తిరగబడి హత్య చేసినారట. అతనిని చంపినవారిలో అతని అక్రమ సంతానం సైతమున్నదట’’ అన్నాడు.
మిహిరుడు ‘‘ప్రభువు ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడాలి తప్ప వారి నుంచి పన్నులు స్వీకరించడమే తమ పని అనుకొనరాదు. జయించిన రాజ్యాలలో దోపిడీ చేయరాదు. అక్కడ ప్రజలను మట్ట పెట్టరాదు. వ్యభిచారం నిషిద్ధమని మరువరాదు. అర్ధకామాలకు ఇచ్చిన విలువ సీజర్ ధర్మానికి ఇవ్వలేదు’’.
‘‘ధర్మమే జయిస్తుందన్న దానికి ఇది ఒక తార్కాణమేమో!’’ అన్న విక్రముడు ఒక క్షణమాగి, ‘‘కవికుల గురువు కాళిదాసు రఘువంశ రాజులను పరిచయం చేస్తూ, యశసే విజిగీఘాణాం, ప్రజాయై గృహమేధినాం అని వర్ణించారు. జైత్రయాత్ర కీర్తి కోసమే, వివాహమన్నది సంతాన ప్రాప్తికే అని పాలకులు మరువరాదు’’ అన్నాడు.
‘‘నీవంటి ప్రభువు భరతభూమి అదృష్టం’’.
‘‘నాదేముంది! కర్తవ్య పాలన చేస్తున్నాను. అంతే’’ అన్న విక్రముడు మాట మార్చి ‘‘పున్నమి చంద్రుడు విశాఖా నక్షత్రంతో కలసి శోభిస్తున్నాడు’’ అన్నాడు.
మిహిరుడు ‘‘విశాఖ నక్షత్రానికి పూర్వనామం రాధ. అందుకే విశాఖ లేదా రాధ అనే నక్షత్రానికి తర్వాత నక్షత్రం అనూరాధ. విశాఖ అన్న పేరెలా వచ్చిందో తెలుసా? విషు బిందువు ఆ నక్షత్రంలో ఉండేది. వృత్తాన్ని సమానంగా రెండుగా విడగొట్టడం చేతనే విదళిత శాఖ లేదా విశాఖ అన్న పేరు వచ్చింది. విషు చలము…’’ అంటూ చెప్తున్న మిహిరునితో విక్రముడు పరిహాస పూర్వకంగా’’ ఇప్పుడు కూడా శాస్త్ర చర్చేనా?’’ అన్నాడు.
‘‘నీవు పరరాజ్య విషయాలు మాట్లాడలేదా?’’
ఇరువురూ నవ్వుకున్నారు.
‘‘మిహిరా, నీవంటి శాస్త్ర విజ్ఞానవేత్త నా స్నేహితుడు కావడం నా అదృష్టం.’’
‘‘విక్రమా! నీవంటి ప్రజాపాలకుడు నా మిత్రుడు కావడం నా పూర్వజన్మ సుకృతం.’’
అప్రయత్నంగా ఇరువురూ ఆలింగనం చేసికొన్నారు. ఇరువరిలో ఒక్కటే ఆకాంక్ష.
భరతఖండ శాస్త్ర విజ్ఞానం నలుదిశలా వ్యాపించు గాక!
భరతభూమి ధర్మజ్యోతి సర్వవేళలా వెలుగు చుండుగాక!
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
(సమాప్తం)