– పాలంకి సత్య
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
‘‘విద్య పట్ల నీకున్న శ్రద్ధ నన్ను ఆనంద పరుస్తున్నది. ప్రయాణంలోనే చదువుకొనవచ్చును. ప్రయాణం కూడా నదిలో పడవ మీదనే కాబట్టి నీకు పాఠం చెప్పడం కూడా సులభమే’’ అన్నారు గ్రీకు గురువుగారు.
మిహిరుడు తాము వెళ్లబోయే ప్రాంతపు వివరాలు తెలుసుకున్నాడు. ఇంటికి వెళ్లి హెలీనాకు చెప్పి, మరునాటి నుంచి కొన్ని రోజుల పాటు తానుండనని చెప్పాడు.
‘‘మీరు వెళుతున్న చోటుకి దగ్గరలోనే ఈజిప్టు పాలకుల సమాధులున్నాయి. మీ గురువులు వారి పని చూసుకుంటున్న సమయంలో మీరు వాటిని దర్శించవచ్చును. ఈజిప్టువాసులు వాటి గురించి రాయవలసి వస్తే మేర్ అని రాస్తారు.’’
ఈజిప్టు వారి భాష వేరు, గ్రీకు భాష వేరు. మిహిరుడు మేర్ అని పలకడం నేర్చుకున్నాడు.
‘‘మీకు కష్టం కాదు. గ్రీకు భాషలో పిరమిడ్లు అనే పిలిచే ఆ కట్టడాల దగ్గర నిత్యపూజల కోసం పురోహితులు కూడా ఉంటారు. వారిలో కొందరికి గ్రీకు భాషతో పరిచయముండవచ్చును. కొంత ధనమిచ్చినట్టయితే వారు మీకు అక్కడి విశేషాలన్నీ చూపించి, వివరించి చెప్పగలరు’’ అంది.
—————
ఉత్తర వాహిని అయిన నైలు నదిలో ఎగువకు ప్రయాణించడం మిహిరుడికి ఆహ్లాదకరంగా ఉంది. పడవ దిగిన తర్వాత గురువు నగరములోనికి దారి తీయగా, పడవ సరంగు మిహిరుని పిరమిడ్ల వద్దకు తీసికొని వెళ్లాడు.ఆ కట్టడాల ఎత్తూ, వైశాల్యమూ చూసిన మిహిరునికి కళ్లు తిరిగినట్లనిపించింది. మరణించిన వారి కోసం ఇంతటి మహోన్నత భవన సముదాయమా? అనిపించింది.
అనేక రసాయనాలతో, నూనెలతో మరణించిన పాలకుని శరీరం నశించిపోకుండా చేసి, ఒకరాతి పెట్టెలో ఉంచారు. మరణించిన తరువాత కూడా అతని ఉపయోగం కోసం వస్త్రాలు, నగలు, ఆహార పదార్ధాలు ఆ పెట్టెలలోనే ఉంచుతారు. ఒకవైపు చిన్న దేవాలయం వంటిది ఉన్నది. తానక్కడ ఆరాధన చేస్తాననీ, తనను ‘క’ పురోహితుడంటారనీ పూజారి తెలిపాడు.
‘క’ అన్నమాటకు అర్థమేమిటి?’’
‘‘మానవుడు మరణించినా ఆత్మ మరణించదు. ఆత్మను మేము ‘క’ అని అంటాము. శరీరం అనిత్యమైనా ఆత్మ నిత్యం. అందుకే మానవుడు మరణించినా ‘క’ జీవించి ఉంటుంది. ఆ ‘క’ కోసం ఏర్పాటు చేయాలి కదా! అందుకే ‘క’ కోసం మృతుల శరీరాలను జాగ్రత్త పరచి, నివసించడానికి భవనం, ఆహార, వస్త్ర, ఆభరణాలూ సమకూర్చడం సంప్రదాయం. కానీ ఇది రాజ్యాధినేతలకూ, సంపన్నులకూ మాత్రమే సాధ్యమైన పని.’’
‘‘మిగిలిన ‘క’ల మాటేమిటి?’’ అని మిహిరుడడిగే లోగానే పూజారి ‘‘ఆహార, వస్త్రాభరణాలే కాదు. వారికి సేవకులు కూడా అవసరమే కదా! దేవతలను పూజించి, నియమబద్ధంగా పరిచారికులను బలి ఇచ్చి నట్టయితే, రాజులు మరణాంతరం కూడా సుఖంగా జీవించగలరు. మహారాజు జీవించి ఉన్నప్పుడే తన మరణానంతర జీవితానికి కావలసిన ఏర్పాటు చేసి కొనేవారు. వంశపారంపర్యంగా ఆరాధన చేసేందుకు మా వంటి వారిని నియమించేవారు’’.
పూజారి ఇంకా వివరంగా చెప్పసాగాడు. కానీ వరాహమిహిరుని బుర్రకు అవేమీ ఎక్కలేదు. ఆత్మ నిత్యమనే వారు, ఆత్మ లేదనేవారు, ఆత్మ మార్పు చెందుతుందనేవారు ఉన్నారు. ఆత్మ శరీరాన్నే అంటి పెట్టుకుని ఉంటుందనే ధర్మం కూడా ఉన్నదా? ఉండవచ్చును! ఎవరి నమ్మకం వారిది. కానీ ఆత్మకు సౌకర్యాలు కల్పించడానికి నరబలులా? భరత ఖండంలో నరబలి అక్కడక్కడ, అప్పుడప్పుడు జరుగుతుందని వినికిడి. కానీ అది తామస పూజా భాగమే కానీ సర్వులకూ సమ్మతమైనది కాదు. అందునా మహారాజు తన ప్రయోజనం కోసం సేవకులను బలి చేయడమా? భారతీయ పాలకు లెన్నటికీ ఈ అకార్యానికి పాల్పడరు. అందునా తన మిత్రుడు, విక్రమాదిత్యుడు… మిహిరుని ఆలోచనలు తన స్నేహితునిపైకి, తన జననీ, జనకులపైకి, ఆపైన తన ప్రియసతి ఖనా పైకి, చివరగా కుమారుడు పృథుయశస్సు పైకి పోయి, పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం దగ్గర నిలిచి పోయినాయి.
——————
విక్రమాదిత్యుడు రాచకార్యాలు ముగించి, ఆపైన కవిత్వ శ్రవణం చేసి, మందిరానికి తిరిగి వచ్చాడు. పట్టమహిషి ఎదురొచ్చి, అర్ఘ్యపాద్యములిచ్చి లోనికి తీసికొని వెళ్లింది.
‘‘మహాప్రభువులు మహదానందంగా ఉన్నారు!’’
‘‘రాజు తన మనసులోని భావాలను ముఖం మీద కనిపించనివ్వ రాదన్నది రాజనీతి. నీ దగ్గర మాత్రం ఆ రాజనీతిని పాటించడంలో అశక్తుణ్ణి వీరా!’’
‘‘ఆ మాటకేమి కానీ, ప్రభువుల సంతోషానికి కారణమేమిటి?’’
‘‘నీవే!’’
‘‘నేనా? అయితే కృతార్థురాలిని. ఏ విధంగా మీకు ఆనందమీయగలిగినాను’’?
‘‘ఘటకర్పురుడనే కవిని నా ఆస్థానానికి సంపాదించినావు!’’
‘‘మీరు ఉత్తమ రత్నపరీక్షకులు. అతడు రచించిన సందేశ కావ్యం మీకు పంపిన తర్వాత అతనిని ఆస్థాన కవిగా నియమించమని మీరు వార్త పంపినారు. ఉజ్జయినికి తిరిగివచ్చిన తర్వాత కవి కులగురువు చేత ప్రియుడు ప్రేయసికి పంపిన సందేశమే ఇతివృత్తంగా కావ్యం రచింపజేసినారు. నేను పంపినది చిన్న గ్రంథం. మీరు రాయించినది మహాగ్రంథం.
‘‘నీ కోసం నేను అనుభవించిన విరహం అంత ఎక్కువ కదా మరి!’’
వీర పరిహాస సూచకంగా నవ్వి, ఒక్కక్షణ మాగి, ‘‘ప్రభువుల ఆస్థానం రత్నాలతో కూర్చిన హారం వంటిది’’ అన్నది.
‘‘మహావజ్రం దగ్గర లేదు కదా!’’
‘‘అదేమిమాట?’’
‘‘వరహామిహిరుడు గుర్తుకు వచ్చినాడు. కవిత్వమేమి! ఖగోళ శాస్త్రమేమి! రత్నపరీక్ష ఏమి! వాతావరణ సూచన ఏమి! అతనికి రాని విద్య లేదు.’’
—————
అలెక్సాండ్రియాలో జూలియస్ సీజర్ తన ప్రేయసి క్లియోపాత్రా ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. ఒకవైపున మధువు నిండిన పాత్రలున్నాయి.
‘‘ఇక్కడ రాచకార్యం పూర్తయినప్పటికీ మీరు రోమ్‌కు తిరుగు ప్రయాణం కట్టకపోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నదట’’ అన్నది క్లియోపాత్రా. నిజానికి ఆశ్చర్యం కన్నా అసంతృప్తి ఎక్కువగా ఉన్నదని ఆమెకు గూఢచారులు నివేదించారు. ఆ మాటను ఆమె బహిరంగంగా చెప్పదల్చుకోలేదు.
‘‘నిన్ను వదలిపోలేను’’.
‘‘అదేమిమాట? రోమ్‌లో నన్ను మించిన వారు మీకు లేరా ఏమి?’’
జూలియస్ సీజర్ మనసులో భార్య కల్పూ ర్నీయా, చిరకాల ప్రేయసి సెర్విలియా, మరెందరో మగువలు మెదిలారు. కానీ కొత్తగా లభించిన పుష్పాన్ని మరికొంత కాలం ఆఘ్రాణించకుండా అతడు అలెక్సాండ్రియాను వదల దల్చుకోలేదు.
జూలియస్ సీజర్ అలెక్సాండ్రియాలోనే తిష్ట వేయడం పౌరులకు కొంత అసంతృప్తిని కలిగించిన మాట వాస్తవమే. మరొక పక్క క్లియోపాత్రా సోదరుడు టోలమీ ఆగ్రహం తారస్థాయికి చేరింది. తమ ఇద్దరికీ సమాన రాజ్యాధి కారం ఉండాలని ఒప్పందం. మాటే అన్ని వ్యవహారాలలోనూ కానీ క్లియోపాత్రా చెల్లుబాటు అవుతోంది. పరిస్థితి చేజారిపోకమునపే తాను రాజ్యం, సంసార విషయంలో పట్టు సంపా దించుకోవాలి. ఇదివరలో ఒకసారి చేసిన ప్రయత్నం విఫలమైంది. తాను బందీగా చిక్కినాడు. ఇప్పుడు నావికాదళంతో దండెత్తడమే మార్గం.
టోలమీ అలెక్సాండ్రియాను వదలి సైన్య సమీకరణ పని ప్రారంభించాడు.
——————-
పిరమిడ్లను చూసి తిరిగివచ్చిన మిహిరుని ఎదుర్కొని లోపలకు తీసికొని వెళ్లిన హెలీనా ‘‘ప్రయాణం సుఖంగా జరిగిందా?’’ అని కుశల మడిగింది. నైలు నదిలో పడవ ప్రయాణం ఆనంద దాయకంగా ఉన్నదని మిహిరుడన్నాడు.
‘‘పిరమిడ్లు ఎలా ఉన్నాయి?’’
‘‘బాగున్నాయి!’’ ముక్తసరిగా సమాధానమిచ్చాడు. తన మనసులో మెదిలిన భావాలు ఆమెతో అతడు పంచుకొనదల్చుకొనలేదు. ఆమె అభిప్రాయాలు ఏమిటో! అనవసర వాదములేల?
‘‘మీ ముఖకవళికలను బట్టి ఆ యాత్ర మీకు తృప్తినివ్వలేదని అనిపిస్తున్నది’’.
తన ముఖం మీద భావాలు అంత స్పష్టంగా వ్యక్తమవుతున్నాయా? కావచ్చు! తానేమి భూపాల కుడా ఏమి, హృదయం తెలియనివ్వకుండా దాచగలిగేందుకు?!
‘‘యాత్ర నచ్చిందో లేదో చెప్పలేను కానీ కట్ట డాలు ఆశ్చర్యపరిచాయి. అంత ఎత్తైన, విశాలమైన నిర్మాణలెలా చేశారో!’’.
‘‘వింత ఏముంది? యంత్ర సహాయంతో చేసి నారట. మానవ మేధకు లొంగనిదేమున్నది? గనులలో రాళ్లను తవ్వి తీసి, నదిలో పడవలలో తీసికొని వచ్చేవారట. ఒడ్డున చేర్చిన రాళ్లను ఒక్కొక్క దానిని చిన్న ఉయ్యాల వంటి యంత్రంలో ఉంచే వారట. ఒకొక్క ఉయ్యాలనూ ఇరువది మంది లాగేవారట. ఇసుక మీద యంత్రం కదలడం కష్టం. నేలమీద బంకమన్ను పరచి, నీటితో తడిపి, నునుపుగా, గట్టిగా చేసి, లాగుతూ కావలసిన చోటుకు చేర్చేవారట’’.
మిహిరునిలో కుతూహలం పెరిగింది.
‘‘మరి రాళ్లను అంత ఎత్తుకు చేర్చడమెలా’’?
‘‘పిరమిడ్లపైన ఉన్న చిత్రాలను పరిశీలిస్తే మీకు సులువుగా అర్థమయ్యేది. నేను బొమ్మ గీసి తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను’’ అంటూ హెలీనా లోపలకు వెళ్లి పేపిరస్ కాగితం, కుంచెలు తెచ్చి చిత్రం గీసింది.
‘‘ఇదిగో చూడండి! ఇది వరుసగా కట్టిన మెట్లు. జలయంత్ర సహాయంతో మెట్లను వరుసగా పైకి పోయేటట్టు చేయవచ్చును. ఒక్కొక్క మెట్టు క్రింద నిలబడ్డ బానిసలు ఒక్కొక్క రాతిని ఉంచుతారు. మెట్లు వరసగా ఒకదానిపైన ఒకటి అమరిపోతాయి. అన్నిటికన్నా పై మెట్టు మీద ఉన్న రాయి మీద నిలిచిన శ్రామికులు లాగుతారు. శీఘ్రంగా రాళ్లన్నీ పైకి చేరగలవు. ఈజిప్టులో శాస్త్ర విజ్ఞానం రెండు, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉన్నత శిఖరాలను అందుకుంది. ఆ తర్వాత కాలంలో వారు వెనుక బడ్డారు. గ్రీకులు ముందుకు నడిచారు.’’
వరాహమిహిరుని కోరికపై హెలీనా జలయంత్ర సహాయంతో మెట్ల కదలికను మరొకసారి వివరించింది.
(పిరమిడ్ల నిర్మాణంలో రాళ్లను పైకి తీసికొని వెళ్లడానికి హైడ్రో పవర్‌తో కదిలే ఎస్కలేటర్లు ఉపయోగించారని నేటి శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు)
హెలీనా జ్ఞానానికీ, ఆమె బోధనాశక్తికీ ముగ్ధుడైన మిహిరుడు ‘‘నీకింత పరిజ్ఞానం ఎలా వచ్చింది?’’ అన్నాడు.
‘‘ఇలా అడగడం ఇది రెండవసారి. నేను పరి చారికను కనుకనే ఈ ప్రశ్న అడుగుతున్నారా?’’
‘‘నా మనసులో ఆ ఊహలేనేలేదు. నీకు బోధించిన గురువులను గురించి తెలుసుకోవాలని అనిపించింది.’’
‘‘ప్రస్తుల ఈజిప్టు మహారాణి క్లియోపాత్రాకు నేను సహాధ్యాయిని’’.
‘‘నిజమా?’’ ఆశ్చర్యంగా అడిగాడు మిహిరుడు.
‘‘విషయమంతా తెలిస్తే మీరు ఆశ్చర్యపడరు. నేను క్లియోపాత్రా బాల్యసఖిని. చెలికత్తెను, పరిచారికను. ఆమె తండ్రి ఆమె కోసం గురువులను నియమించినప్పుడు నన్ను ఆమెతో పాటు ఉండ వలసినదిగా ఆజ్ఞాపించారు. శిక్షణ ఆమెకు, శిక్ష నాకు’’.
‘‘అనగా?’’
‘‘రాకుమారి పాఠం సరిగా నేర్చుకొనకపోయినా, తప్పుగా నేర్చుకొన్నా గురువులు నన్ను శిక్షించేవారు. అదృష్టవశాత్తు రాకుమారి తెలివైనది. నాకు శిక్షి పడే సందర్భాలు ఎక్కువగా లేవు. కానీ ఆమెతో పాటు చదువుకునే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం.
మిహిరుడికి కళ్లు తిరిగినంత పనయింది. ఇదెక్కడి ధర్మం? చనిపోయిన రాజుల కోసం నరబలి, రాజవంశీయుల తప్పులకు సేవకులకు శిక్షలు. మ్లేచ్ఛుల రాజ్యానికి రావడమే పొరపాటు అనిపిస్తున్నది అతడికి.
‘‘ఇంత సాధారణ విషయానికే అంత తత్తరపాటు ఎందుకు? క్లియోపాత్రా కంటే నాకే విద్య బాగా ఒంటబట్టిందనుకుంటున్నాను. అలా అని రాకుమా రిని కించపరచటం లేదు. ఈజిప్టుని జయించిన నాటి నుంచీ పాలకులెవరూ నేర్వని ఈజిప్టు భాషను సైతమామె నేర్చుకున్నది’’.
‘‘నీ గురించి సంగతులు నాకు ఈనాటి వరకూ తెలియవు’’.
‘‘తెలిసికొనవలసినంత గొప్ప చరిత్ర ఏముంది?’’
‘‘హెలీనా’’ అని ఇంటి యజమానురాలు పాంపేయా పిలవడంతో ఆమె లోనికి వెళ్లిపోయింది. ఎన్నడూ లేనిది మిహిరుని ఆలోచనలలో ఆనాడు హెలీనా అగ్రస్థానంలో నిలిచింది.
—————
వరహామిహిరుని యవన ఖగోళ శాస్త్ర అధ్యయనం పూర్తయింది. గురువుకు మరికొంత ధనం సమర్పించి, బాబిలాను నగరం వరకు వెళ్లడానికి ఒక వాహనం ఏర్పాటు చేసికొని, ఇంటికి వచ్చినాడు. దారిలో ఏనాడూ లేనంతగా సైనికులు పహారా కాస్తున్నారు. లోపలికి ప్రవేశించిన్పటికీ పాంపేయా కన్పించలేదు. హెలీనాతో తాను భరత భూమికి తిరిగిపోతున్నానని చెబుతూ ఉంటే కంఠం గద్గదితమైంది. హెలీనా కంటనీరు తిరిగింది. ఆమె కన్నీరు ఆపుకుని, ‘‘మీకు శుభమగుగాక. నా అంధకారబంధుర జీవితంలో వెలిగిన ఏకైక కాంతిరేఖ మీరే’’ అన్నది.
ఆమెను అనునయించాలని అతడనుకుంటూ ఉండగనే పాంపేయా వచ్చింది. ఆనాడెందుకో ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నది.
‘‘ఈనాడు నా జీవితంలో మరువలేని రోజు. నా చిన్నపాటి స్నేహితుడు సెరిలియస్ కనిపించినాడు. రోమ్ సైన్యంలో పనిచేస్తున్నాడని తెలుసు కానీ అలెక్సాండ్రియా వచ్చాడని తెలియదు. నన్ను గుర్తించి, మాటలాడి, నన్ను భార్యగా స్వీకరించ గలనన్నాడు. నేను అంగీకరించాను. రోమ్‌కు తిరిగివెళ్లిన వెంటనే మా వివాహం జరుగగలదు’’ అని ఒక్కక్షణమాగి ‘‘హెలీనా, నీవును నా వెంట రావచ్చును’’ అని అన్నది.
హెలీనా మౌనం వహించింది.
‘‘రోమ్ నగరంలో మీ గ్రీకులకు కొదువలేదు. ఇక్కడ నీకు రక్షణ కల్పించేవారు ఎవరు? ఆలోచించుకో’’ అని పాంపేయా లోనికి వెళ్లింది.
మిహిరుడు ప్రశ్నార్ధకంగా హెలీనా వంక చూశాడు. ఆమె కూడా మాటాడకుండానే లోనికి వెళ్లిపోయింది.
—————
ఆనాటి సాయంత్రం పాంపేయా తనకు కాబోయే భర్త దగ్గరకి వెళ్లింది. హెలీనా మిహిరునితో ‘‘నీకింత విద్య ఎట్లు వచ్చినది? అని అడిగినారు కదా’’ అన్నది.
‘‘క్లియోపాత్రాతో కలిసి చదువుకోవడం వల్ల అని చెప్పావు’’. విజ్ఞాన శాస్త్రజ్ఞానం వంశ పారంపర్యంగా వచ్చిన విద్య. ఆర్కిమిడీస్ పేరు ఏనాడైనా విన్నారా?’’
‘‘బాబిలాను నగరంలోని వ్రేలాడే పూలతోటలకు ఆర్కిమిడిస్ మరమేకు అనే సాధనం ద్వారానే నీటిని పంపుతారని తెలిసింది’’.
‘‘ఆ మరమేకు మాత్రమే కాదు. అనేక వస్తువులను ఆయన కనుగొన్నారు. అనేక భౌతికశాస్త్ర సూత్రాలను ఆవిష్కరించారు. నేను ఆయనకు ఆరో తరం వారసురాలిని.’’
‘‘హెలీనా’’ అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న మిహిరునితో ఆమె అన్నది. ‘‘మా పూర్వీకులు నివసించిన ద్వీపాన్ని రోమ్ పాలకులు జయించారు. అందరినీ బందీలుగా చేస్తున్న సమయంలో సైనికు డొకడు శాస్త్రాధ్యయనంలో మునిగి ఉన్న ఆర్కి మిడిస్‌ను లేచి రమ్మన్నాడు. ఆయనకు ఆ మాట వినిపించలేదు. సైనికుడా మహాశాస్త్రవేత్తను చంపివేసి నాడట’’ అంటూ ఉండగానే హెలీనా కంట కన్నీరు ఉబికింది.