అమెరికా వారిలో ఈ మధ్యకాలంలో ఒక వింత మాట వినిపిస్తు న్నదట. మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంటే, అవతలి వారు, ఆడపిల్లనేనా అని సందేహ నివృత్తి చేసుకునేవారట. అలాగే అమ్మాయిల విషయం కూడా అంతేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు పాశ్చాత్య సమాజం నుంచి సంప్రదాయా లకు నెలవైన భారతీయ సమాజంలోకి ఆ తంతును తేవాలని కొందరు ఆరాట పడుతున్నారు. కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా.. మగవాడితో మగవాడి పెళ్లి… స్త్రీని స్త్రీ పెళ్లి చేసుకోవడం.. ఇందుకు ఉద్యమం..ఈ విషయమై సుప్రీంకోర్టులో పెద్ద చర్చ!
ఇదో దౌర్భాగ్యం!
సుప్రీంకోర్టులో సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వ్యాజ్యం మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. విషయం అదే- సేమ్‌సెక్స్ మ్యారేజీ. అసలు పెళ్లి అంటే ఏమిటంటా! అదేమిటో అన్నీ మతాలూ ఒక్కటే చెబుతాయి. స్త్రీ పురుషుల మధ్య పవిత్ర బంధం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19, 21, 25 అధికరణాల మేరకు పెళ్లిని లింగ భేదాన్ని బట్టి కాకుండా, ప్రాథమిక హక్కుగా పరిగణించమని ఈ కేసులో వాదిస్తున్నారు. అంటే పురుషులు కావాలంటే పురుషుడిని చేసుకునే హక్కు ఉండాలి. అలాగే స్త్రీ విషయంలో కూడా. అందుకు మార్గాన్ని సుగమం చేస్తూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954, హిందూ వివాహ చట్టం 1955, వివాహ చట్టం, 1969లలోని అంశాలను సవరించ వలసినదిగా కోరుతున్నారు. ఈ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్.కె. పాల్, జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ పి.ఎస్.నరసింహ సభ్యులు. ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం, Commissioner for protect of chois of rights. కేసుకు అనుకూలంగా ఉన్నారు. ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటి కూడా మద్దతు ప్రకటించింది.
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముస్లిం సంస్థలు దీనిని పూర్తిగా వ్యతిరేకించాయి. ‘‘ప్రజలు దీనినొక వింతగా చూస్తున్నారు. వివాహం అంటే అన్ని మతాలవారు ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు. పెండ్లి అంటే స్త్రీ, పురుషులు మధ్య పవిత్రబంధం. హిందువులకైతే అదొక విడదీయరాని బంధం. ఏ మత గ్రంథాలలోను సేమ్‌సెక్స్ మధ్య పెండ్లి గురించి ప్రస్తావించలేదు. ఇది ఊహాకు అందని విషయం.
అయినా, ఈ విషయం మీద అత్యున్నత న్యాయస్థానం స్పందించి ఈ విడ్డూరమైన వాదనలు, అవి చేస్తున్న సంఘాలతో ఎందుకు కాలయాపన చేస్తున్నదో తెలియదు. ఇది కుట్రపూరితమైన వ్యాజ్యం. ఇలాంటి వాటితో అత్యున్నత న్యాయస్థానం, న్యాయవాదుల విలువైన సమయం వృధా అవుతోంది. దేశంలో పరిష్కారం కోసం ఎన్నో కేసులు ఎదురు చూస్తున్నప్పటికీ ఇలాంటి కేసులను ఇంత వేగంగా విచారించడం అంటే ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు? సుప్రీంకోర్టులో 20-30 సంవత్సరాలుగా చాలా కేసులు నానుతున్నాయి. ఆ కాలయాపనతో న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతున్నది.
మెకాలే ఇంగ్లిష్ న్యాయవ్యవస్థనే ఇప్పటికీ మనవారు అనుసరిస్తున్నారు. ఆ వ్యవహారంలో నిజ నిర్ధారణకు తావులేదు. ఆ వ్యవస్థలో తీర్పు వచ్చాక కూడా అది నిజమో అబద్ధమో చెప్పలేం. ఏదైనా కావచ్చు. అలాంటి పాశ్చాత్య భావాలను నమ్ముకుంటే అది ఇలాంటి వికృత రూపాలకు దారితీస్తుంది.
భారతదేశం, సంస్కృతి పురాతనమైనవి. అందులోని వివాహ వ్యవస్థను పటిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. అదేవిధంగా ఇతర మతస్థులు కూడా భావిస్తున్నారు. అలాంటి వ్యవస్థలో ఇలాంటి వక్రబుద్ధి జనిత విచిత్ర వాదనలు ఏమిటని, వాటిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమేమిటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరొక వింత పోకడ కూడా వినిపిస్తున్నది. భారతదేశ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరు చేసిన వాదనలనైనా ఆలకించే సహనం కలిగి ఉందంటారు కదా అంటున్నారు కొందరు. ఇదొక విపరీత అభిప్రాయం. ఒకటి నిజం, లింగభేదం లేకుండా వివాహం చేసుకోవడం గురించి పురాతన భారతీయులు ఊహించి ఉండరు.
లింగభేదం లేని పెళ్లి గురించి న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకొనగలవా? అసలు చట్ట నిర్మాణం అనేది పార్లమెంటు పరిధిలోనిది కదా అని ఇంకొందరు చెబుతున్నారు. నిజానికి ఈ అంశం అటు న్యాయవ్యవస్థ పరిధిలోకి గానీ, ఇటు పార్లమెంటు పరిధిలోగానీ కచ్చితంగా రాదు. మన రాజ్యాంగం అన్ని విషయాలను వివరించలేదు. చాలా అంశాల మీద అది మౌనంగానే ఉండిపోయింది.
స్త్రీని స్త్రీ అనే అంటాం. పురుషుడిని, పురుషుడనే అంటాం. ఈ విభజనను తెలియచేయడానికి ఒక చట్టమంటూ ఏదీ అవసరంలేదు. కానీ దీని మీద సర్వోన్నత న్యాయస్థానం వాదోపవాదాలు వింటున్నది. అందుకే అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్యకాలంలో పరిధులను మించి వ్యవహ రిస్తున్నదన్న అభిప్రాయం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం మన జాతీయ భాష హిందీ. ఐతే హిందీలో ప్రసంగించడానికీ, వాదోపవాదాలు జరపడానికీ అత్యున్నత న్యాయస్థానం అంగీకరించడం లేదు. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధం?
సేమ్‌సెక్స్.. పదే, పదే దీనిని సంబోధించడమే అసభ్యంగా ఉంది. ఆ పదానికి భారతీయ భాషలలో సందర్భోచితంగా అనేక పదాలు, పర్యాయపదాలు కూడా ఉన్నాయి. సంభోగం, లైంగిక సంబంధం, సహవాసం, సాంగత్యం అలాంటి పదాలే. ఆంగ్లభాషలో అన్నింటికి కలిపి ఒకే పదం. ఆంగ్లం ఇపుడిపుడే పరిణితి చెందుతోంది.
ఈ అంశంలో ఆర్‌ఎస్‌ఎస్ తన అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పింది. పెండ్లి అనేది స్త్రీ- పురుషుల మధ్య జరిగేదేనని ఆ సంస్థ వెల్లడించింది. అది హిందూ సంస్కృతిలో ఒక సంస్కారం. కుటుంబ వ్యవస్థకు సంబంధించినది. ఒక విధంగా చెప్పాలంటే ఇది హోమో సెక్సువల్ గారడిలా కనిపిస్తున్నది. ఆస్తి వ్యవహారం కూడా ఉన్నది. ఒక పురుషుడు మరొక పురుషునికి ఆస్తి సంక్రమింపచేయాలని అనుకుంటే, ఇప్పటి చట్టం ప్రకారం – అమ్మకం, దానం వగైరాలు రాత పూర్వకంగా రిజిష్టరు చేయాలి. అయితే దీనిని వివాహంగా పరిగణిస్తే అలాంటి రాత పూర్వక పత్రాలు అవసరంలేదు. అది వారసత్వ రీత్యా సంక్రమిస్తుంది. ఈ సౌకర్యం కోసమే ఈ వాదనను తెరపైకి తెస్తున్నారు. ఏది ఏమైనా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి వివాదాన్ని మొదటనే త్రుంచివేసి ఉండవలసింది.
– ఎం. సుందరరామిరెడ్డి, అడ్వకేట్