సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ వైశాఖ బహుళ తదియ – 08 మే 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
దేశ విభజన తరువాత జరిగిన నెహ్రూ-లియాఖత్ ఒప్పందంతో ఇవాళ్టి కాంగ్రెస్‌కు సంబంధం లేదా? అలాంటి ఒక ఒప్పందం జరిగిందని ఆ పార్టీకి గుర్తుందా? ప్రథమ ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ ప్రథమ ప్రధాని లియాఖత్ ఆలీ మధ్య ఢిల్లీలో జరిగిన ఆ అవగాహన ప్రకారం పాకిస్తాన్ మైనారిటీలు భారతదేశానికి శరణార్థులుగా వస్తే ఇక్కడి ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి పౌరసత్వం ఇవ్వాలి. పునరావాసానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడో విస్మరించింది. అది కూడా కావాలనే. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చేవారంతా హిందువులు. వీరిని ఆదుకుంటే ఇక్కడి పాకిస్తాన్ భక్తులకు, ముస్లిం మతోన్మాదులకు, మైనారిటీ ఓటర్లకు నచ్చదు. కాంగ్రెస్ ఓటుబ్యాంక్ వీరే కదా! అందుకే ఆ ఒప్పందం మీద నెహ్రూ చేవ్రాలు ఉన్నా ఇవాళ్టి కాంగ్రెస్ ఖాతరు చేయడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణే జోధ్‌పూర్ దగ్గర ఏప్రిల్ 24న జరిగిన హిందూ శరణార్థుల ఇళ్ల కూల్చివేత.
‘మమ్మల్ని పాకిస్తాన్ నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. ఇక్కడ (రాజస్తాన్) జరిగింది కూడా అదే. మా ఇళ్లు కూల్చేశారు.’ జోధ్‌పూర్‌ని ఆనుకుని ఉన్న చౌఖా గ్రామంలో జరిగిన ఇళ్ల కూల్చివేత సమయంలో ఒక నిస్సహాయ హిందువు గుండె నుంచి ఉబికిన ఆక్రోశమిది. ఇది ఆ ఒక్క హిందువు బాధ మాత్రమే కాదు. జోధ్‌పూర్ డెవలప్‌మెంట్ అధారిటీ కూల్చేసిన దాదాపు 70 ఇళ్ల వారి సమష్టి ఆక్రోశం కూడా. వారి పిల్లల, తల్లుల ఆవేదన. వీరంతా పాకిస్తాన్ నుంచి ప్రాణాలరచేత పట్టుకుని రాజస్తాన్ చేరినవారే. కూల్చేసిన వాటిలో కొన్ని పక్కా ఇళ్లు కాగా, ఇంకొన్ని గుడిసెలు. ఇళ్లు కూలుస్తుంటే స్త్రీలు, పిల్లలు ఆర్తనాదాలు చేశారు. జరుగుతున్న బీభత్సాన్ని చూసి స్పృహ కోల్పోయిన మహిళను చూపిస్తూ మాకు భారతదేశంలో కూడా ఇదే దుస్థితి తప్పడం లేదు అంటూ ఒక యువకుడు వాపోవడం ఆలోచించవలసిన విషయమే. నడి వేసవిలో కూలిపోతున్న గూళ్లను చూసుకుని వారంతా కన్నీరు మున్నీరు కావడంలో ఆశ్చర్యం లేదు. బయటపడేసిన సామగ్రితో మంచాలను నిలబెట్టి దాని నీడకు పిల్లలు చేరిన దృశ్యాలు ఎందరిని కదిలించాయో తెలియదు.
చౌఖా గ్రామంలోని రాజీవ్‌నగర్‌లో అక్రమంగా నివసిస్తున్న ఈ కుటుంబాల వాళ్లకి ముందే నోటీసులు ఇచ్చామని జోధ్‌పూర్ డెవలప్‌మెంట్ అధారిటీ చెబుతోంది. అక్కడ బీ, సీ సెక్టర్లలో ఇలాంటి నివాసాలను కూల్చి వేసి 400 బిఘాల (ఒక బిఘా అంటే 6.19 ఎకరాలు)ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం చట్ట విరుద్ధమే.కాదనలేం. కానీ ఇక్కడ గమనించవలసిన అధికార యంత్రాంగపు దారుణ వైఫల్యం ఉంది. కొన్ని వర్గాల మాదిరిగా వాళ్లంతా రాత్రికి రాత్రికి గుడిసెలు వేసి, తరువాత అటువైపు అధికారులు రావడానికి కూడా భయపడే వాతావరణాన్ని కల్పించిన వారు కాదు. పాకిస్తాన్ నుంచి ప్రాణభయంతో వచ్చిన వారంతా ఆ గ్రామంలో ఆ భూమి కొన్నారు. ఒక్కొక్క స్థలానికి రూ. 75,000 నుంచి రూ. 2 లక్షలు చెల్లించారు. ఆ తరువాతే ఇళ్లు, గూళ్లు కట్టుకున్నారు. అదంతా ల్యాండ్ మాఫియా చేసిన దగా. తమ గోడును కలెక్టర్‌కు విన్నవించుకున్నప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి.
ఇళ్ల కూల్చివేత మీద స్థానిక బీజేపీ నాయకుల అభిప్రాయం గమనించదగినది. నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పడాన్ని బీజేపీ ఖండిస్తున్నది. హిందూ శరణార్థులే లక్ష్యంగా రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కూల్చివేత నిర్వహించిందని బీజేపీ నేత, హిందూ శరణార్థుల సంక్షేమ సంఘం నీమికెత్తం (ఎన్జీవో) సహ వ్యవస్థాపకుడు జయ్ అహుజా ఆరోపించారు. ఈ కూల్చివేత విషయంలో ఎలాంటి చట్టబద్ధమైన నిబంధనలను అనుసరించలేదని కూడా ఆయన చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు కల్పించవలసిన సదుపాయాలు కల్పించడం సంగతి అటుంచితే, వారికి నిలువ నీడ లేకుండా చేసింది రాజస్తాన్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా పథకం ప్రకారం జరిగిందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. హిందూ శరణార్థుల మీద కక్షతోనే జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ముస్లిం మతోన్మాది మొయినుల్ హక్ మొదట ఈ ప్రాంతం, ఇక్కడ హిందువులు నిర్మించుకున్న ఇళ్ల గురించి వార్తలు ప్రచురించాడు. వాటిని నిఘా వ్యవస్థ స్థానిక శాఖ నిజమని నిర్ధారించింది. అలా ఆ దొంగ జర్నలిస్ట్, స్థానిక నిఘా వ్యవస్థ కుమ్మక్కయి పూర్వాపరాలు పట్టించుకోకుండా ఈ దారుణానికి బాటలు వేశారు.
దేశాధికారానికి ఇంతకాలం దూరంగా ఉండిపోవడం కాంగ్రెస్ పార్టీకి పిచ్చెక్కిస్తున్నది. అధికారం అందని ద్రాక్షలా మారడంతో పాత ముస్లిం మైనారిటీ బుజ్జగింపు ధోరణికి అదనంగా ఆ పార్టీ హిందూ వ్యతిరేక విధానాన్ని నమ్మడం ఆరంభించింది. రొహింగ్యాలకు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు ఈ దేశంలోనే ఆశ్రయం కల్పించాలనీ, మానవతా దృక్పథంతో వ్యవహ రించాలనీ కడవల కొద్దీ కన్నీళ్లు కార్చే హక్కుల కార్యకర్తలకీ, ఉదారవాదులకీ, కాంగ్రెస్ నేతలకీ హిందూ శరణార్థుల అవస్థలు కాస్త కూడా పట్టవెందుకని? కోర్టులు కూడా స్యూమోటోలని మరచిపోతాయెందుకని? ఢిల్లీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే అడ్డు పడిన కాంగ్రెస్ నేతలకు, కమ్యూనిస్టులకు, ఆప్ నాయకులకు జోధ్‌పూర్‌లో హిందువుల గోడు పట్టలేదేమి? ఇదే ప్రశ్నకు మీడియా కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అసాంఘిక శక్తుల ఇళ్లు, అందులోను అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేస్తుంటే రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సహాయులైన హిందూ కాందిశీకుల ఇళ్లను నేలమట్టం చేసింది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులకు హక్కులు ఉండవా? ఉండకూడదా? ఇప్పటికైనా ఈ అంశం గురించి ఐక్యంగా ఆలోచిద్దాం!