– జంధ్యాల శరత్‌బాబు

ఇది 65 ఏళ్లనాటి ప్రచురిత కథా వివరం. పేరు ‘అభిమాన సినీతార’. అప్పట్లో ప్రయాణం రైల్లోనే. ఓ జంట అందులో వెళ్తుంటారు. గమ్యం చేరినంత వరకు ఏం జరిగిందన్నదే కథాంశం. పత్రికలో రెండు పేజీలుగా వచ్చిన ఆ రచన నాడు సాహితీవేత్తలు, కళాకారుల్లో ఆసక్తి రగిలించింది! ఆ దంపతుల్లోని మహిళను చలనచిత్ర కథానాయికగా భావించి, అనేక మంది రైల్వేస్టేషన్‌కి చేరుకుంటారు. అంతా కిక్కిరిసిపోతుంది. కొద్దిసేపటికీ, అదే ఫస్ట్‌క్లాస్‌ ‌కంపార్టు మెంటు చుట్టూ ఇసకవేస్తే రాలనంతగా జనం గుమికూడతారు. ఆ ఇద్దరూ బోగీ తలుపు దగ్గరికి వచ్చి తమకు కనిపించేదాకా ఊరుకోరెవరూ. అంతలో భర్త – ‘ఈమె మీరనుకుంటున్న హీరోయిన్‌ ‌కాదు. మా ఇద్దరి పేర్లూ ఫలానా’ అని ప్రకటిస్తాడు. అదే సమయంలో కొంత దూరంగా స్టేషనుకు మూలవైపు నుంచి పూల అలంకరణ కారు కనిపిస్తుంది. అందులోని లౌడ్‌స్పీకర్‌ ‌నుంచి ఏం వినవచ్చిందన్నదే ఈ రచనలో కొసమెరుపు. కథ ఎత్తుగడ ‘రైలు నెమ్మదిగా పోతోంది’ ముగింపు ‘క్షణంలో స్టేషన్‌ ‌ఖాళీ అయింది’. ఆ రెండు సందర్భాల మధ్య కథను మలుపుతిప్పిన తీరు ఎంతో ఉత్సుకత కలిగిస్తుంది. ఇంతటి ఉత్సాహం, అక్షర సంబంధ సంచలనం పెంచిన రచయిత్రి పవని నిర్మల ప్రభావతి. సౌందర్య సామరస్యాలను రచనల్లో చిత్రీకరించిన ఆమె తదుపరి క్రమంలో ఆధ్యాత్మిక లహరి వైపు పయనించడమే అత్యంత విశేషం! తన సంస్మృతి ఈ నెల రెండో అర్థ భాగంలో, ఇదే సందర్భాన – సరికొత్తగా ఇది… నాటి కథాంశాల ప్రత్యేక సమీక్ష.

సరిగ్గా అర్ధ్థ శతాబ్ది కిందటి రచన గురించి ఇప్పుడు సమీక్షించుకుందాం. మనస్తత్వాలు, పంజరకీరాలు పేర్లతో రెండు చిన్నపాటి నవలికలు ఆ పుస్తకంలో ఉన్నాయి. వీటిలో ముందుగా ‘మనస్తత్వాలు’ నవలా నాయిక రుక్మిణి గురించి విశేషంగా ప్రస్తావించాల్సిందే. తనలో సమయస్ఫూర్తి, గడుసుతనం రెండూ సమపాళ్లలో ఉంటాయి. ‘ప్రేమలో విశ్వాసం లేకపోవడమేం? బోలెడంత ఉంది. ప్రేమనూ విశ్వసిస్తాను. అంతకంటే ఎక్కువగా సంప్రదాయాలనీ గౌరవిస్తాను’ అంటుంది ఒక సందర్భంలో. అందుకే ఆమెను కుటుంబీకులు ఆత్మరక్షణ బాగా తెలిసిన పిల్లగా గుర్తిస్తారు. అవసరమైతే ఎంత సాహసమైనా చేయగల సబల అనీ నిర్ధారించుకుంటారు. పంజరకీరాలు నాయకురాలు ఊర్మిళ. తనది కూడా ప్రశ్నించే స్వభావమే. తనదైన లోకం తప్ప మరేదీ తెలియని భర్తను ఒక సమయంలో నిలదీస్తుంది. ‘ఇక్కడ ఓ పనిమనిషికున్న విలువ కూడా లేదు నాకు. పంజరంలోని చిలకకున్న స్వేచ్ఛ అయినా నాకు లేదు’ అంటుంది గొంతు పెంచి. బాధ్యతారాహిత్యంగా జీవితం గడపటంలోనే నాకు ఆనందం ఉంది అంటున్న అతడిని సూటిగా, ధాటిగా అడుగుతుంది. ఏమని? ‘మీకంటూ సొంత ఆలోచనలూ ఆశయాలూ పద్ధతులూ లేవా? ఈ పంజరపు బతుకే, ఓ విధమైన బానిసతత్వమే మీకు హాయిగా అనిపిస్తోందా?’ అంటూ దులిపేస్తుంది. ‘ఈ జీవితానికి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేద’న్న అతగాడి తీరుకు మొదట నివ్వెరపోతుంది. ఇంట్లో తన స్థానం ఏమిటని, విలువ ఎంతవరకు ఉంటుందని మధనపడుతుంది. మొత్తంమీద ఇంట్లో వాళ్లంతా అవకాశవాదులు. ఎవరి స్వార్థం వారిది. అందరూ కలిసి తన చుట్టూరా అందమైన చట్రం బిగించేశారని ధ్రువపరచుకుంటుంది. తనవైన అన్ని యోచనలూ పంజరంలో పక్షుల్లా మారాయని గ్రహించేస్తోంది. ‘డియర్‌ ఊర్మిళా! ఎలా ఉన్నావ్‌? ‌సంసార సాగరంలో మునిగి తేలుతున్నావా? నీ స్నేహితురాలు గుర్తుందా? ఒక్కసారి ఇక్కడికి రా. నా ఇంద్రధనుస్సు లాంటి జీవితాన్ని నీకు పరిచయం చేస్తా’ అంటూ వచ్చిన ఉత్తరాన్ని అందుకుంటుంది. అటు తర్వాత కథ ఎన్నెన్ని మలుపులు తిరిగిందో రచయిత్రి కలానికే తెలుసు.

అతివల మనోగతాలు

స్త్రీ, పాలఘాటు పిల్ల, మండోదరి మళ్లీ పుట్టింది, అనామిక, ఆశాకిరణం వంటి రచనలెన్నో పవని కలం నుంచి వెలువడి వనితల అంతరంగ తరంగాలకు అద్దం పట్టాయి. స్థితిగతుల ప్రభావం వల్లనే సమాజంలోని కొంతమంది అతివలు చైతన్య రాహిత్యతత్వాన్ని ఆశ్రయిస్తున్నారన్నది ఆమె పరిశీలన. సంఘం మారిందని, మారుతోందనీ అంటున్నాం. మరి ఇప్పుడు కూడా దుస్థితి తప్పడం లేదంటే, స్త్రీలకు అవే అనుభవాలు ఎదురుకాక తప్పనిస్థితి అంటే ఇంకేమనాలి? అందరూ ఆశిస్తున్న మార్పులకు అసలు అర్థం ఏమిటని తన నవలలో చర్చించా రామె. ‘చైతన్య రాహిత్యంలో స్త్రీ’ అని పేరు పెట్టారు. ఇందులోని నాయికామణి కమల. పైకి ఎదగాలని, ఆకాశం అందుకోవాలనీ ఆశయంలేని బతుకుల్ని చూసి ‘ఔరా’ అనుకుంటుంది. చైతన్య వంతంగా సాగిపోవాలని ఊహసైతం రానివారిని చూసి నివ్వెరపోతుంటుంది. అటువంటి చేతనారహిత మనస్తత్వాలు తనకైతే బొత్తిగా నచ్చవు. ‘మాకు తెలుసు మనుషుల విలువ. అందుకు మనం ఎంత త్యాగం చేయాలో కూడా బాగానే తెలుసు’ అంటాడు భర్త. మరి నేను రుషినో, మరెవరినో అని నువ్వు నవ్వినా నాకేమీ బాధ ఉండదంటాడు. అప్పుడు అంటుంది కమల.

‘ఈ మధ్య ఏవో ఊహలు తలలో పరిగెడు తున్నాయి. చిన్ని చిన్ని కథలు బుర్రలో మెదులు తున్నాయి. అవి రాయాలనిపిస్తోంది. రాస్తాను. రాసి పత్రికలకు పంపిస్తాను. కలం పేరు ‘అహల్య.’

రాసుకో, కానీ, పేరు మరేదైనా?

ఊహు, నాకు ఆ పేరే నచ్చింది.

అలా అని కాగితాల మీద అక్షరాలను పేరుస్తుందామె. అనంతరం ఆ కలమే కలల కథలు సృష్టిస్తుంది పరంపరగా.ఒకరోజున తనకో ఉత్తరం అందుతుంది. ‘మీరు రచనలు చేయండి. కానీ…’ అని ఉంటుంది అందులో. ఆ లేఖా రచయిత ఇచ్చిన సలహా ఏమిటన్నది పవని కల విన్యాసంతో ఆనాడే పలు విధాల కదం తొక్కింది.

కరుణార్ద్ర హృదయిని

స్త్రీ హృదయ ఆర్ద్రతకు దర్పణం ‘అనాథ’ కథ. తన బిడ్డకోసం అమ్మ ఏమైనా ఎంతైనా చేస్తుందన్నది సారాంశం. సర్వస్వాన్నీ సంతోషంతో త్యజించే మాతృహృదయాన్ని ఇందులో రచయిత్రి ఆవిష్క రించారు. అటువంటిది బిడ్డనే విడనాడాల్సిన పరిస్థితి కన్నతల్లికి ఏర్పడితే? అందుకు బలమైన కారణం ఉంటుందంటారామె. మరి, తల్లి విడిచిన బిడ్డ గతి ఏమిటన్నది ఆ అక్షరాలు ప్రతిఫలించాయి. ఉదాహరణను చూద్దాం.

‘తుళ్లిపడ్డాను, మంచుకింద ఏదో చప్పుడైంది. తొంగి చూశాను. ఎవరో పాప ఈ ఆస్పత్రిలో దోగాడుతూ మంచం దగ్గర తిరుగుతోంది. నా ఆలోచనల మత్తు వదిలి పోయింది. ఎవరీపాప? ఇక్కడికెలా వచ్చింది? ఈ వార్డులో అసలు బిడ్డల తల్లులు ఉండటానికే వీల్లేదు. మరి ఎక్కడిదీ అమ్మాయి?

మెల్లగా ఆ పాపను మంచం కింద నుంచి పైకి తీసుకున్నాను. సుమారు రెండేళ్లుంటాయి. భయంగా చూస్తోంది నావైపు. తనకు మాటలు కూడా రానట్లుంది. పాపనెత్తుకుని సిస్టర్‌ ‌దగ్గరికెళ్లాను. ‘ఈ పాప ఎవరో నా మంచం దగ్గరికొచ్చింది.’

‘అదా! ఇంకా ఏమో అనుకున్నాను. దీనికి నిద్రరాదు. తెల్లవార్లూ ఇలాగే తిరుగుతుంటుంది. ఇలా తే… ఆయాలకు ఇచ్చి వస్తాను.’ అంటూ విసురుగా నా చేతిలోంచి పాపను లాక్కెళ్లిపోయింది సిస్టర్‌!

‌మరోరోజు ఆస్పత్రిలోని నర్సుల్లో కొంతమంది కసిరేసరికి పాప ఏడుస్తుంటుంది.

అమ్మా! అంటోంది ఆ బిడ్డ. అమ్మలేని ఆ పాపకు అమ్మా అనడం ఒక్కటే తెలుసు. అమ్మెవరో ఏం తెలుసు?

తల్లికే బరువైన బిడ్డ. అందరికీ బరువే.

ఇంకెవరూ తనను చేరదీయరు. అనాథగా చూస్తారు.

తల్లిదండ్రులు లేని పిల్ల. తల్లికి పనికిరాని పిల్ల.

ఇలా కొనసాగుతున్నకొద్దీ, రచన మన గుండెల్ని పిండేస్తుంది. మెదడును గట్టిగా బిగబట్టి పట్టేస్తుంది. మదిని మూగవేదనలో ముంచేస్తుంది.

రచయిత్రి అంతరంగ ఘోష

అడుగడుగునా దయార్ద్రత. ఆలోచనల మథనం. ఒంగోలు ప్రాంతంలో పుట్టి, చిన్ననాటనే కలం చేపట్టి, పలు కథల సంపుటాలు, నవలలు తదితర రచనలు కొనసాగిస్తూ వచ్చారు పవని. అవి ఎదలో ముళ్లు నాటుతాయి. రాలిన పూలును కంటికి కనిపించేలా చేస్తాయి. శేష ప్రశ్నలుగా అనిపిస్తాయి. శిథిలాల నుంచి శిఖరాలకు చేరిన జీవితాలనూ మనకు చూపుతాయి. జీవిత సంధ్యా సమయాన్ని దర్శింప చేస్తాయి. నవ్వుతున్న నాగరితను, దృష్టిపథంలో నిలుపుతాయి. ఉదయకిరణాలు, సప్తవర్ణాలతోపాటు శాపగ్రస్తులను, శలభాలనూ ముందు నిలుపుతాయి. జరిగిన, జరుగుతున్న కథలే అవి.

‘సమాంతర రేఖలు’ రచన మరింత విభిన్నం. బట్టల షాపులో ఖరీదు చేస్తున్న లలితమ్మకు కొద్దిదూరంలో ఓ యువతి చిరునవ్వుతో కనిపించి. ‘మేడమ్‌! ‌నన్ను మీరు గుర్తు పట్టకున్నా, వెయ్యి మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తించ గలను. మెడమీద పడకుండా, మరీ మీదమీదకు కాకుండా, ఆరు పిన్నులతో అందంగా అమర్చి ఉండే మీ జుట్టుముడి మిమ్మల్ని పట్టిస్తుంది’ అంటుంది.

మాటామంతీ అయ్యాక, కొన్ని పరిణామాలు గడిచాక, అదే మేడమ్‌ ‌రాసిన ఉత్తరం ఎన్ని జ్ఞాపకాల తెరలను స్పర్శించిందో వెల్లడించారు రచయిత్రి. ఆ యువతి, సంబంధిం చిన వ్యక్తి గురించి ఆలోచనలు చేయడం కథను మరెంతో రక్తికట్టిస్తుంది. తనకు ఆ ఇద్దరూ రెండు కళ్లు. ఆ రెండు కళ్లకూ మధ్య ఉన్న తను ముక్కులాంటిది. ఈ ముక్కే మధ్యన లేకుంటే, రెండు కళ్లూ కలిసి ముఖాన్నే రూపుమార్చి ఉండేవని అనుకుంటుంది లలితమ్మ. రెండు సమాంతర రేఖలని ఎడంగా ఉండడమే మేలయిందని భావిస్తుంది. ఈ విధమైన భిన్న కథాంశాలు, వైవిధ్య ఇతివృత్తాలు తెలుగు సాహితీ రంగానికి గట్టిదన్నుగా నిలిచాయి. పవని నిర్మల ప్రభావతి కోవలోనే మరికొందరు రచయిత్రులు తీర్చిదిద్దిన పాత్రలు నాటికీ నేటికీ మనలో ఆలోచనల విస్తృతికి దోహదపడుతూనే ఉన్నాయి. ఆ రీత్యా చూసినప్పుడు, మహిళామణుల కలాలు ఎంత పదునుదేలి ఉన్నాయో మనకు ఇట్టే అవగత మవుతుంది.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE