– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్ని యథేచ్ఛగా దోచేస్తోంది. మైనింగ్‌ ‌మాఫియా పేట్రేగిపోతోంది. రాష్ట్రంలోని 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మట్టి, గ్రావెల్‌, ‌బాక్సైట్‌, ‌లేటరైట్‌, ఇసుక, బెరైటీస్‌, ‌లైంస్టోన్‌ను అక్రమంగా కొల్లగొడుతున్నారు. నదీ తీరాలు, వాగులున్న చోట ఇసుకను, కొండలు, గుట్టలున్న చోట మట్టిని, గనులున్న చోట ఖనిజాలను ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. ప్రతి జిల్లాలో వేల కోట్ల విలువైన సంపదను తరలించుకుపోయారు. వైసీపీ ముఠా అవినీతిపై బీజేపీ ఈ నెల 5 నుంచి ఛార్జిషీట్లు వేసి వారి బాగోతాన్ని ఎండగట్టి ప్రజాక్షేత్రంలో వారిని దోషులుగా నిలబెడుతోంది.

ఆ పార్టీ నేతలు పెద్దాపురం సమీపంలోని రామేశ్వరం మెట్ట వద్ద భారీ ఎత్తున తవ్వకాలు జరిపి వందల కోట్ల విలువైన మట్టిని తరలించుకోపోయి నట్లు ఆరోపణలు వచ్చాయి. రామేశ్వరం పేట మెట్ట సర్వే నెంబరు 1 నుంచి 90 వరకు ఉన్న 828 ఎకరాల ఈ కొండల్లో ఇప్పటికే 425 ఎకరాల్లో అడ్డగోలుగా మట్టి, గ్రావెల్‌ ‌తవ్వేసి రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకు విక్రయించేశారని కలెక్టరుకు లిఖిత పూర్వక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ కడప జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్‌ ‌తరహాలో కొండలన్నీ మాయమైపోయి లోయలు కనిపిస్తు న్నాయి. మొదట్లో పేదల ఇళ్లస్థలాల చదునుకు ఇక్కడి నుంచి తాత్కాలిక పర్మిట్లు కేటాయించగా, అవన్నీ గత ఏడాది ప్రారంభంలోనే ముగిసినా, ఆ ముసుగులో ఇప్పటికీ రేయింబవళ్లు మట్టి, గ్రావెల్‌ ‌తవ్వి కాకినాడ, చుట్టుపక్క ప్రాంతాలకు రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకు విక్రయస్తూ కోట్లు గడిస్తున్నా రనేది ఫిర్యాదు.

అనుమతులు లేకుండా తవ్వి, తరలించుకు పోయిన మట్టి, గ్రావెల్‌ ‌విలువ రూ.550 కోట్లకుపైగా ఉందని, దీనిపై ప్రభుత్వానికి రూ.60 కోట్ల వరకు రాయల్టీ రావలసి ఉన్నా రూపాయి ఆదాయం కూడా రావడం లేదని ఫిర్యాదు దారులు చెబుతున్నారు. ఇక్కడి అక్రమాలపై స్పందించి మట్టి తవ్వకాలు జరగకుండా గత కలెక్టర్‌ ‌మురళీధర్‌రెడ్డి రామేశ్వరం మెట్టలోని కొండలపై మొక్కలు నాటారని, వాటిని కూడా నరికేశారన్నారు. ఇక్కడి కొండలపై లక్షల సంఖ్యలో జీడి, మామిడి, టేకు చెట్లను ఎస్సీ కులస్తులు పెంచారని, వారికి మాయమాటలు చెప్పి ఆ భూముల్లోను మట్టి, గ్రావెల్‌ ‌తవ్వేస్తున్నారని ఆరోపించారు. గనులశాఖ ఇక్కడకు వచ్చి సర్వే చేసి ఎన్ని కోట్ల క్యుబిక్‌ ‌మీటర్ల మట్టి అక్రమంగా తరలి వేయడంపై అంచనా వేయాలని ఇదివరకు నిర్ణయిం చింది. కానీ సిబ్బంది కొరత సాకుతో ఆ పని చేయలేదు. ఇప్పటికే ఇక్కడ సాగుతున్న అరాచకాల వలన వందలాది వన్య ప్రాణులు తరలిపోయాయి. ఈ అక్రమాల గురించి స్థానిక రెవెన్యూ, అటవీ, గనులశాఖ వారికి తెలుసు కానీ వైసీపీ నేతలకు భయపడి మౌనంగా అక్రమాలను చూస్తు కూర్చున్నారని ఫిర్యాదు. తూర్పు గోదావరి జిల్లా కడియంలో ప్రకృతి అందాలకు మారుపేరైన వేమగిరి కొండలనూ చెరువులుగా మార్చారు. పట్టిసీమ కుడిగట్టు కాలువ బండ్‌ ‌మట్టిని మింగేసి కాల్వ గట్టును బలహీనం చేస్తున్నారు. ఆవ భూములు, మడ అడవులు విధ్వంసం చేశారు.

విశాఖ మన్యంలో..

విశాఖ మన్యంలో రూ. 15 వేల కోట్ల విలువైన బాక్సైట్‌ ‌దోపిడీకి వైవీ సుబ్బారెడ్డి కుట్ర పన్నారని ఆరోపణ. లేటరైట్‌ ‌ముసుగులో అడ్డగోలుగా తవ్వకాలకు ప్రణాళిక వేశారంటున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్‌ ‌దోపిడీకి ప్రభుత్వమే రహదారి నిర్మించిందనేది విమర్శ. రికార్డు స్థాయిలో 24 రోజుల వ్యవధిలో అటవీ ప్రాంతంలో 14 కిలోమీటర్ల మేర 30 అడుగుల రోడ్డు నిర్మించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. భారీ వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు 10 వేల చెట్లను నరికేశారు. 250 మంది జనాభా ఉన్న మారుమూల ప్రాంతానికి రవాణ సౌకర్యం కోసం ఇదంతా చేశామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరం. ఇందంతా 15 వేల కోట్ల బాక్సైట్‌ ‌దోపిడీ కోసమే అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రుషికొండకు బోడిగుండు

విశాఖ నగరంలోని చారిత్రక రుషికొండను సీఆర్‌జడ్‌ ‌నిబంధనలను ఉల్లంఘించి అడ్డగోలుగా తవ్వేయడంపై ఎన్‌జీటీ మొట్టికాయలు వేసినా వైసీపీ ముఠా రుషికొండను మింగేసింది. ఇక్కడ గతంలో 6 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక శాఖకు చెందిన రిసార్టులు ఉన్నాయి. అయితే పర్యాటక శాఖ వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించేందుకు సిద్ధమైంది. కొండను మొత్తం తవ్వేసి బోడిగుండు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ భారీ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసి విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. పాత రిసార్టులను కూల్చేసి కొత్తవి ఎందుకు నిర్మిస్తున్నారనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. దీంతో ఫిర్యాదుదారులు కోర్టును ఆశ్రయించారు. పాత రిసార్టులు ఉన్న ఈ కొండ ప్రాంతంలో ఆరు ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు పర్యాటక శాఖను ఆదేశించినా 20 ఎకరాను తవ్వినట్లు ఆరోపణలు వచ్చాయి. అమరావతిని కాదని ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు, అందుకు అవసరమైన భవనాల కోసం ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది.

కర్నూలులో దారుణం..

కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం రవ్వలకొండను సైతం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అక్రమంగా తవ్వుకుని కోట్లు కొల్లకొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రవ్వలకొండ గుహలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు 450 ఏళ్ల క్రితం 12 ఏళ్లు తపస్సు చేసి కాలజ్ఞానం రాశారు. అలాంటి పరమ పవిత్రమైన రవ్వలకొండను సైతం వైసీపీ మాఫియా ఇస్టానుసారంగా తవ్వేస్తోందని కర్నూలు జిల్లాకు చెందిన విశ్వబ్రాహ్మణ నేతలు ఆరో పిస్తున్నారు. బనగానపల్లె మండలం భానుముక్కల గ్రామంలోని అన్‌ ‌సర్వేయ్‌డ్‌ ‌హిల్‌ ‌బ్లాక్‌లో ప్రభుత్వ అధీనంలోని 3.002 హెక్టార్లలో ఓ క్వారీ ఉంది. సంబంధిత 3.002 హెక్టార్లతో పాటు ఆనుకుని ఉన్న రవ్వలకొండలోని ఎక్స్‌టెన్షన్‌ 1.910 ‌హెక్టార్లనూ తవ్వేస్తున్నారు. రవ్వలకొండలోని గుహలకు 500 మీటర్ల దూరంలోపు మైనింగ్‌ ‌జరప కూడదన్న నిబంధనలను అక్రమార్కులు తుంగలో తొక్కుతున్నారు. భారీగా ఎక్స్‌వేటర్లను మోహరించి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు.

పశ్చిమ గోదావరిలో..

పోలవరం కుడికాలువ ప్రాంతంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కొత్తూరు రిజర్వు ఫారెస్టు ప్రాంతం, పోలవరం కుడికాలువ ప్రాంతాల్లో కోట్ల విలువైన గ్రావెల్‌ అ‌క్రమంగా తరలిపోతోంది. కొత్తూరు రిజర్వు ఫారెస్టుతో పాటు చుట్టుపక్కల 750 ఎకరాల్లో సుమారు రూ. వెయ్యి కోట్ల విలువైన గ్రావెల్‌ను తరలిస్తున్నారని హైకోర్టులో పిటిషన్‌ ‌వేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లోనూ ఫిర్యాదు నమోదైంది. దీనిపై ముగ్గురు సభ్యుల బృందం ఇటీవల రెండు విడతలుగా ఈ ప్రాంతాన్ని పరిశీలించింది.

ప్రతిచోట 10 నుంచి 15 అడుగుల లోతున మట్టిని తవ్వేశారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో అటవీ, రెవిన్యూ, నీటిపారుదల శాఖల భూములున్నాయి. తవ్వకాలు జరపాలంటే ఎన్విరాన్‌మెంట్‌, ‌పొల్యూషన్‌, అటవీశాఖ, ఇరిగేషన్‌, ‌రెవెన్యూ శాఖల అనుమతులు కావాలి. ఇవేమీ లేకుండానే మట్టి మాఫియా యథేచ్ఛగా తవ్వేసి మట్టిని తరలించేస్తున్నారు. ఎన్జీటీ బృందం రెండోసారి పర్యటనకు వచ్చినపుడు ఈ మాఫియా రెచ్చిపోయింది. తవ్వకాలు జరిగే ప్రాంతాలకు ఎన్జీటీ బృందం వెళ్లకుండా రోడ్డును అడ్డంగా తవ్వేశారు. ముళ్లకంచెలు అడ్డుపెట్టారు. అయినా కిలోమీటర్ల వరకు అధికారులు కాలినడకన వెళ్లి పరిశీలించారు. దీని వెనక వైసీపీ నాయకత్వం ఉందనేది ఫిర్యాదుదారుల అరోపణ. మంత్రిస్థాయి వ్యక్తులే దీనిని నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంత జరిగినా ఏ ప్రభుత్వ శాఖ కూడా చర్యలు తీసుకోడానికి ముందుకు రావడం లేదు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా కొండపల్లి కొండ రిజర్వ్ ‌ఫారెస్ట్‌ను సైతం వదలలేదు. కొండపల్లి రిజర్వ్ ‌దగ్గర స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌ అనుచరులు, బంధువులు అక్రమంగా గ్రావెల్‌ ‌తరలిస్తూ కోట్లు గడిస్తున్నారనేది ఆరోపణ. కొండపల్లి కపిలవాయి సత్రం దేవాలయ భూముల్లోనూ ఎటువంటి అనుమతులు లేకుండా 30 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారట. ఈ అక్రమ గ్రావెల్‌ ‌తవ్వకాలు పరిశీలించేందుకు వెళ్లినవారిపై వైసీపీ ప్రేరేపిత రౌడీలు దాడులు చేయడం తెలిసిందే. పైగా ఎదురు కేసులు పెట్టారు. విజయవాడ రూరల్‌ ‌మండలం జక్కంపూడి షాబాద్‌లో ఇప్పటికే కోట్లు విలువచేసే అక్రమ తవ్వకాలు జరిగాయని సమాచారం.

గుడివాడలో ఎమ్మెల్యే నాని అనుచరులు యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చెరువులను పూడ్చి ఆక్రమించుకుంటున్నారని, బెదిరించి స్థలాలు లాగేసుకుంటున్నారని ఫిర్యాదులొచ్చాయి. గుడివాడ మండలం, మోటూరు గ్రామంలో జరిగిన అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించు కోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసర ప్రాంతాల్లో గనుల అక్రమ తవ్వకాలు, చిన్న తరహా ఖనిజాలను వెలికితీయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.

నెల్లూరులో..

నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో మాజీ మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌నేతృత్వంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అండదండలతో లక్షలాది క్యూబిక్‌ ‌మీటర్ల గ్రావెల్‌ అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. మైనింగ్‌ ‌మాఫియా వందలాది ప్రొక్లైన్లతో గ్రావెల్‌ను, ఇసుకను తవ్వి టిప్పర్‌లలో తరలించుకుపోవడంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే సర్వేపల్లి రిజర్వాయర్‌ ‌భద్రత ప్రమాదంలో పడింది. అంతేకాదు, ఈ జిల్లాలో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రివేళల్లో తెల్లరాయి తవ్వకాలను చేపట్టి తరలిస్తున్న అక్రమార్కులను వరికుంటపాడు మండలం ధర్మవరం గ్రామస్తులు రెడ్‌ ‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కడపలో..

జిల్లాలోని చలమారెడ్డి పల్లెలో కొండను పూర్తిగా మాయం చేశారు. మైదుకూరు మండలం శెట్టివారి పల్లె సమీపంలో అతి పెద్ద కొండను నిలువునా తవ్వేస్తున్నారు. వీరపునాయునిపల్లె మండలంలో కొండలను తవ్వేస్తూ మట్టిని కమలాపురం, కడప నగరానికి తరలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంట సమీపంలోని తెల్లకొండను భారీ యంత్రాలతో అక్రమంగా తవ్వేస్తున్నారు. కడప- రేణిగుంట జాతీయ రహదారికి సమీపంలో గుండ్లూరు కొండను తవ్వేశారు. రాజంపేట మండలం అప్పరాజుపేట పంచాయితీ హత్యరాల సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రాజంపేట మండలం ఎస్‌.‌రాజంపేట జంగాలపల్లెలో మట్టి క్వారీలు నడుస్తున్నాయి.

అన్ని చోట్ల ఇదే పరిస్థితి..

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పీర్లకొండను అనుమతులకు మించి తవ్వేశారంటున్నారు. విజయ నగరం నెల్లిమర్లలో పచ్చని కొండలను తవ్వేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో పెద్దఎత్తున మట్టి దోపిడీ జరుగుతోంది.

వ్యాసకర్త: ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE