హైదరాబాద్ నగరంలోనే టివోలీ థియేటర్‌లో మే 16న, అంటే విడుదలైన రోజునే ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూశాను. ఇప్పుడు తీసినదే అయినా ఆ సినిమా, అందులోని సనివేశాలు, కథ నన్ను 1947, 1948 నాటి నిజాం పాలనాకాలపు చేదుజ్ఞాపకాల దగ్గరకు చేర్చాయి. రజాకార్ల దురాగతాలు, రక్తపాతం, వాటి మధ్య హిందువుల నిస్సహాయత గుర్తుకు వచ్చాయి. నవ వధువు వంటి భార్యతో కలసి జట్కాబండిలో వస్తున్న మరాఠీ హిందూ యువకుడు రజాకార్ల తుపాకీ గుండుకు నిష్కారణంగా బలి కావడం అందరికీ తెలుసు. నగ్నంగా పదుగురి ముందు బతుకమ్మలాడిన మహిళల ముఖాలలో తాండవించిన దీనత్వం ఎలాంటిదో ఇప్పటికీ ఊహించగలను. సజీవ దహనాలు, చంపి బావులలోకి విసరడాలు.. అదంతా పెద్ద పీడకల. ది కేరళ స్టోరీ అన్ని సినిమాల వంటిది కాదు. ఐఎస్‌ఐఎస్, దాని బంట్లు చేస్తున్న భయంకరమైన కుట్రల గురించి వాస్తవిక ఆధారాలతో నిర్మించిన చిత్రం. ఏమిటా కుట్ర! హిందూ, క్రైస్తవ యువతుల మెదళ్ల నిండా విషం నింపి ఉగ్రవాదం లోకి నెట్టే కుట్ర. ఉగ్రవాదులుగానే కాదు, సెక్స్ స్లేవ్స్‌గా కూడా మార్చేస్తున్న కుట్రను కూడా బహిర్గతం చేశారు. ఒక ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి దారుణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటేనే ఒకరకమైన దుఃఖం కలుగుతుంది. భయం ఆవహి స్తుంది. అదికూడా నూరు శాతం అక్షరాస్యత సాధించి నట్టు చెప్పుకునే కేరళలో ఇలాంటివి జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమానవీయ కుట్ర వల్ల ఆ యువతుల జీవితాలు ధ్వంసం కావడమే కాదు, వారి కుటుంబాలు సైతం కునారిల్లిపోతున్నాయి.
మత విశ్వాసం వ్యక్తిగతమైనదని చెప్పుకుంటాం. కానీ దానిని యువతరం మెదళ్లను విషతుల్యం చేయడానికి మాత్రం అనుమతించకూడదు. ఈ చిత్రంలో దృశ్యీకరించిన లోతైన వాస్తవాలు నన్ను చాలా కదిలించాయి. నన్ను చిన్నతనం నుంచి ఇప్పటికీ వెంటాడుతున్న రజాకార్ అకృత్యాలను మళ్లీ కళ్ల ముందు నిలిపాయి. ఆ దారుణోదంతా లకు వేదికలుగా ఉన్న 1947,48 సంవత్సరాల లోకి నేను వెళ్లినట్టే అనిపించింది.
జూన్ 12,1946న నిజాం నవాబు జారీ చేసిన ‘ఫర్మానా’ సంగతి గుర్తుండే ఉంటుంది. ‘సార్వ భౌమత్వం కలిగిన స్వతంత్ర రాజ్యానికి పాలకునిగా ఉండడానికి నాకు హక్కు ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను నా సంస్థానాన్ని ఎట్టి పరిస్థితులలోను భారత ప్రభుత్వానికి అప్పగించను’ అన్నదే దాని సారాంశం. నిజాం మత మౌఢ్యంతో ఉండేవాడు. నియంత. అంతులేని దురాశపరుడు. ప్రపంచ కోటీశ్వరులలో ఒకడు కూడా. హిందువులను అణచివేయడానికి ఇత్తేహాదుల్ ముస్లిమీన్‌కు చెందిన రజాకార్లను ఉసిగొలిపాడు. రజాకారులు సాగించిన దురాగతాలు ఎంత దారుణమైనవో సెప్టెంబర్ 18, 1949 నాటి ‘ఆంధ్రపత్రిక’ తన సంపాదకీయంలో పేర్కొన్నది. ‘హైదరాబాద్ విమోచన’ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచిక అది. ఆ సంచిక సంపాదకీయంలోని కొన్ని మాటలు ఇవి: ‘నైజాం సంస్థానమున ఆనాడు అధికారము చెలాయించుచున్న లాయఖాలీ ప్రభుత్వా దరణ ప్రోత్సాహములతో విశృంఖలముగ విజృం భించిన దుండగుల క్రూరకృత్యములకు, కాశిం రజ్వీ నాయకత్వమున ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థ సాగించిన ధన,మాన, ప్రాణాపహరణ కాండకు తాళలేక, స్వగృహములను తమ సర్వస్వమును వదిలివేసి సంస్థాన ప్రజలు వేలాదిగా భారత యూనియన్ భూభాగములకు తలదాచుకొనుటకై వచ్చివేసిరి. సంస్థాన జనాభాలో దాదాపు నూటికి 90 వంతులుగా వున్న హిందువులకే ఆ సంస్థానమున నిలువ నీడ లేకపోయెను.’
అప్పుడు నేను తొమ్మదేళ్ల బాలుడిని. మా ఊరు జంగంపల్లి నుంచి ఆరుమైళ్ల దూరంలోని కామారెడ్డికి చదువు కోసం వెళ్లాను. మా క్లాస్ టీచర్ ఒక రజాకార్ నాయకుడు. వెంకటనరసయ్య అనే గురువు తప్ప మిగిలిన ఉపాధ్యాయులంతా ముస్లింలే. నా క్లాస్‌మేట్ ఒకడు ఉండేవాడు. ముస్లింల అబ్బాయి. అందరినీ భయపెట్టేవాడు. వెంట ఒక బాకు తెచ్చి, బల్ల మీద పెట్టేవాడు. అడిగేవారు లేరు. ఉపాధ్యాయులకూ ధైర్యం లేదు. ప్రధానోపాధ్యా యులకు ఫిర్యాదు చేసినా దండగ. రజాకార్ల చేతిలో అగచాట్లకు గురైన స్త్రీపురుషులు కామారెడ్డి పట్టణంలోకూడా ఉండేవారు. అవన్నీ కథలు కథలుగా చెప్పుకునేవారు. కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసేవారు కాదు. ఎందుకంటే పోలీసులు, రజాకార్లు, అధికార యంత్రాంగం పరస్పరం అల్లుకు పోయి ఉండేవారు. రజాకార్లు దుకాణదారుల నుంచి, హోటళ్ల యజమానుల నుంచి, వ్యాపారుల నుంచి డబ్బు గుంజేవారు. ఒకసారి ఒక దుకాణదారు దేశభక్తి గీతం పాడినందుకు రజాకార్ల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.
ఇంకొక సంగతి కూడా నిరంతరం గుర్తుకు వస్తూ ఉంటుంది. నేను మా పిన్నితో కలసి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. ఆ ఊరి పేరు పోసానిపేట. రైలులో తలమాడల నుంచి ఉప్పలవాయి దాకా వెళ్లాం. ఆ స్టేషన్‌లోనే తుపాకులు పట్టుకున్న కొందరు గూండాలు మా ఇద్దరిని చుట్టుముట్టారు. మమ్మల్ని తీసుకువెళ్లడానికి ఎడ్లబండితో ఇద్దరు మనుషులు వచ్చేదాకా మమ్మల్ని నానా మాటలు అన్నారు. అంటే అసలు శాంతిభద్రతలు అన్న మాటే లేదు.
అలవోకగా హత్యలు చేసేవారు రజాకారులు. ఇది నిజామాబాద్‌లో జరిగింది. మహారాష్ట్ర యువకుడు ఒకరు భార్యతో కలసి జట్కాబండి మీద వస్తున్నాడు. ఒక టీ దుకాణం దగ్గర కూర్చున్న రజాకార్‌తో పక్కన ఉన్నవాడు అన్నాడు, ఆ కుర్రవాడిని చంపితే నీకు టీ ఇప్పిస్తాను అని. అంతే ఆ రజాకార్ కాల్చేశాడు. ఆ రజాకార్ అప్పటికే పెద్ద నేరగాడు. కాబట్టి సెప్టెంబర్ 18, 1948 తరువాత వీడిని రక్షించేందుకు ముస్లిం పోలీసులే జైలుకు పంపారు. కానీ పట్టణవాసులు జైలు మీద దాడి చేసి అతడిని వెతికి పట్టి చంపేశారు. విమోచన తరువాత మా క్లాస్ టీచర్ ఆచూకీ కూడా తెలియలేదు. ఇతడు కూడా కొంతకాలం అజ్ఞాతం తరువాత కామారెడ్డి రైల్వేస్టేషన్ దగ్గర కనిపించాడు. స్థానికులు దేహశుద్ధి చేశారు. ఆ రోజులన్నీ మరపునకు వచ్చేవి కావు.
చాలాకాలం ఇదేదో నిజాం సంస్థానం, భారత్‌కే పరిమితమనుకున్నాను. కానీ ఎక్కడ ఉన్నా అదే మనస్తత్త్వం. నా జీవితంలో ఇస్లాం మతోన్మాదానికి సంబంధించి ఇతర అనుభవాలను కూడా ఎదుర్కొన్నాను. ఈ దేశంలో తరతరాలుగా నివసిస్తున్న చాలామంది తాము భారతీయులమని చెప్పుకొనడానికి నిరాకరించడం గమనించాను. నేను అమెరికాలోని బ్రూక్లిన్ (న్యూయార్క్)లో న్యూరోసర్జరీ చేస్తుండగా ఎదురైన 1965 నాటి ఒక అనుభవాన్ని ఉదహరిస్తాను. మాతో పాటు ఒక ఇండియన్ ముస్లిం డాక్టర్ చదివేవాడు. అతడు పాకిస్తాన్‌కు పెద్ద మద్దతుదారుడు. గూఢచారి అని కూడా అనిపిస్తూ ఉండేది. ఇతడే కాదు, చాలామంది ఇండియన్ ముస్లింల నివాసం ఇదే అయినా, విధేయత మాత్రం పాకిస్తాన్‌కే ఉండేది. తాము అరబ్‌లమనీ, ఎమెన్‌లమనీ చెప్పుకునేవారు. ముస్లిం దేశాల పట్లనే వారి విధేయత. ఇంకొకటి అక్కడే మైమోనిడీస్ ఆసుపత్రిలో జరిగింది. ఆ కాలంలో వైద్య విద్య కోసం న్యూయార్క్‌కు చాలా తక్కువ మంది విదేశీయులు వచ్చేవారు. అక్కడ పరిచయమైన ఒక నికరాగ్వా దేశీయుడితో నేను కొంచెం స్నేహంగా ఉండేవాడిని. ఒకరోజు, అతడు వచ్చీరావడంతోనే హిందువులని చాలా అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టాడు. నాకు చాలా చిరాకనిపించింది. తరువాత కఫేటేరియాలో కలసినప్పుడు భారతదేశంలో ముస్లింల మీద దాడులు జరిగిపోతున్నాయంటూ కొన్ని విషయాలు చెప్పాడు. ఆ కట్టుకథలకి విస్తుపోయాను. ఇవన్నీ ఇతడికి ఎవరు చెబుతున్నారోనన్న ప్రశ్న వచ్చింది. వేరే ఎవరో కాదు, భారత్ నుంచి వచ్చి రెండో సంవత్సరం పేథాలజి చదువుతున్న మరొక డాక్టరే ఇవన్నీ అతడికి చెబుతున్నాడు. ఆ డాక్టర్ అండమాన్ నుంచి వచ్చాడు. అండమాన్ నికోబార్‌కు మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక సీటు రిజర్వు చేస్తారు. అలా అక్కడ మెడిసిన్ చేశాడు. అతడి తండ్రి బ్రిగేడియర్ ర్యాంక్ సైనికాధికారి. తరుచు పాకిస్తాన్ దౌత్య కార్యాలయా నికి వెళ్లేవాడు. ఇతర దేశాలకు కూడా వెళ్లి వస్తూ ఉండేవాడు.
తరువాత ఆ నికరాగ్వా మిత్రుడుని కూర్చోబెట్టి వాస్తవాలు చెప్పాను. అప్పుడు మన రాష్ట్రపతి ఒక ముస్లిం (జకీర్ హుసేన్). ఇది చెప్పాను. అమెరికాలో భారత రాయబారి ఒక ముస్లిం (ఎంసీ చాగ్లా). ఐక్య రాజ్యసమితిలో భారత బృందానికి నాయకుడు కూడా మహమ్మదీయుడే. ఇవీ చెప్పాను. అప్పుడే నీ పాకిస్తానీ మిత్రుడిని ఈ ప్రశ్నలు అడగు అని కూడా నికారాగ్వా దేశీయుడికి చెప్పాను. భారతదేశం నుంచి అమెరికా వచ్చి వైద్య విద్య చదువుతున్న భారతీయ ముస్లింలు డజన్ల కొద్దీ కనిపిస్తారు. నీ పాకిస్తాన్ నుంచి అమెరికా వచ్చి చదువుకుంటున్న ఒక్క హిందూ విద్యార్థిని చూపించగలవా? భారతదేశంలో ఎంతమంది ముస్లింలు సమున్నత స్థానాలకు వెళ్లారో నేను చెప్పాను. అలాగే పాకిస్తాన్‌లో ఉన్నత స్థానంలో ఉన్న ఒక్క హిందువును చూపించగలవా?
నికరాగ్వా మిత్రుడి గాథ చిత్రమైనది. కొంచెం దీనమైనది కూడా. అతడు తనను తాను ముస్లింనని చెప్పుకునేవాడు. అతడి తల్లి నికారాగ్వా నౌకా శ్రయంలో నివసించిన ఒక పడుపుగత్తె. ఒక పాకిస్తానీ నావికుడు కొద్దికాలం ఆమెతో ఉన్నాడు. ఫలితంగానే ఇతడు పుట్టాడు. ఇతడు పుట్టాక తల్లీకొడుకులు ఇద్దరూ కూడా ఆ పాకిస్తానీని చూడలేదు. బొంబాయి నుంచి అతడు ఒక్క ఉత్తరం మాత్రం రాశాడు. ఎందుకో తెలియదు, ఆ రోజుల్లో మహమ్మదీయుడి నని చెప్పుకోవడం, ఇస్లాం స్వీకరించడం అమెరికాలో తరుచూ కనిపిస్తూ ఉండేవి. కాసియస్ క్లే అనేవాడు అమెరికాలోనే ఖ్యాతి గాంచిన హెవీవెయిట్ బాక్సర్. టీవీ చానళ్లలో బాగా ప్రాచుర్యం ఉండేది. అతడు మతం మార్చుకుని మహమ్మదాలీ అని పేరు పెట్టుకున్నాడు. ఆ కాలంలోనే చాలామంది నల్లవారు ఇస్లాం తీసుకు న్నారు. తన తండ్రిని ఏనాడూ చూడకపోయినా, తన తల్లితండ్రులకు వివాహం కాకున్నా నా నికారాగ్వా మిత్రుడు తాను ముస్లింనని చెప్పుకునేవాడు.
అండమాన్ నుంచి భారతీయ ముస్లిం డాక్టర్ సంగతి కూడా కొంచెం తెలుసుకుందాం. ఇతడు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు ఉన్నత విద్యనభ్యసించేవాడు. ఆ స్థాయిలో లబ్ధి పొందాడు. ఇతడి తండ్రి కూడా భారతదేశంలో పెద్ద ఉద్యోగి. కానీ నిరంతరం భారతదేశం మీద విషం చిలకరిస్తూ ఉండేవాడు. అండమాన్ డాక్టర్ విధేయత ఏనాడూ భారతదేశం పట్ల లేదు. అంతా పాకిస్తాన్‌కే. ఇంకా విస్తుగొలిపే సంఘటన కూడా నాకు తారసిల్లింది. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ వద్ద ఆరేళ్లు కార్యదర్శిగా పనిచేశాడు. ఆయనకీ నాకూ కూడా మిత్రుడైన వ్యక్తి ద్వారా మేమిద్దరం కలుసుకున్నాం. ఆ సమయంలో అసఫ్ జాహిల ప్రస్తావన వచ్చింది. అతడు వెంటనే ‘హమ్‌తో అరబ్ హై’ (నేను కూడా అరబ్బునే) అన్నాడు. చిత్రం ఏమిటంటే ఇతడి కుటుంబం కొన్ని తరాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడింది. ఇతడు పుట్టినప్పుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అభినందిస్తూ, తనను కలుసుకోవలసిందని అతడి తండ్రికి లేఖ రాశాడు. 1935లో ఇతడిని మరాఠ్వాడాలో ఒక జిల్లాకు కలెక్టర్‌గా నియమించినప్పుడు నిజాంకు రూ. 5000 సమర్పించుకున్నాడు. వేయి రూపాయలు, అంతకు మించి వేతనం ఉన్న ఉద్యోగం ఇచ్చినప్పుడు నిజాం ఏ విధంగా డబ్బు వసూలు చేసేవాడో నరేంద్ర లూథర్ తన పుస్తకంలో వివరంగా ఇచ్చారు. జగిత్యాలకు చెందిన నా మిత్రుడి తండ్రి అనుభవం వేరొకటి. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదివారు. పదివేల రూపాయలు పోసి న్యాయమూర్తి పదవిని కొనుకున్నారు. కానీ హిందువు కాబట్టి ముస్లిం చట్టాలు తెలియవు అనే సాకుతో తరువాత ఆ పదవికి నిరాకరించారు. బదులుగా తహసీల్దార్ పదవి ఇస్తామన్నారు. అది ఈయన నిరాకరించారు.
నా జ్ఞాపకాలలో ఎప్పటికీ ఉండిపోయే మరొక ఘటన ఉంది. అతడొక గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు. వెన్నెముక సమస్యకు సంబంధించి అతడికి సీడీఆర్‌లో నేనే శస్త్ర చికిత్స చేశాను. 1950 దశకంలో హైదరా బాద్ పోలీసు శాఖ నుంచి తయారైన ఫుట్‌బాల్ బృందానికి దేశంలోనే ఖ్యాతి ఉండేది. వారికి చాలా పతకాలు, స్మరణికలు వచ్చాయి. మీరు హైదరాబాద్ గర్వించదగ్గ ఆటగాడు అని నేను ఆయనను ప్రశంసించాను. కానీ హైదరాబాద్ అన్నమాట ఆయనకు రుచించలేదు. నేను ఎమెన్ వాడిని. అలాగే పిలిపించుకోవడమే నాకు ఇష్టం అన్నాడు.
చివరిగా మళ్లీ ది కేరళ స్టోరీ దగ్గరికి వస్తాను. ఈ సినిమా అంతా తప్పక చూడాలి. ముఖ్యంగా యువతులు. ఇప్పుడు అంతా అంటున్న లవ్ జిహాద్‌కు బలయ్యే ప్రమాదం ఉన్న ప్రతి యువతి ఈ సినిమా చూడాలని నేను చెబుతున్నాను.
– డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్, అపోలో