మే1 అన్నవరం సత్యదేవుని కల్యాణోత్సవం
సత్యదేవుని సందర్శనం, ఆయన వ్రతం ఆచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి, సుఖశాంతులు కలుగుతాయని, సకల అభీష్ట సిద్ధికి సత్యనారాయణ వ్రతం సర్వోత్కృష్టమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఈ వ్రతానికి మూలాధార కథావస్తువు స్కంద పురాణంలో ఉంది. ఆపన్నులకు అన్ని వరాలను అనుగ్రహించే సత్యనాథుడు కొలువైన దివ్యధామానికి ‘అనన్యవరం’ అని పేరని, కాలక్రమంలో అది ‘అన్నవరం’ గా స్థిరపడిందని చెబుతారు. ఎన్ని వ్రతాలు ఉన్నా తెలుగువారికి సత్య వ్రతమంటే సత్యనారాయణవ్రతమే. లింగ, సామాజిక, ఆర్థిక భేదాలకు అతీతంగా నారాయణ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
కలి ప్రభావంతో జనులు సత్యధర్మాలను వీడి ప్రవర్తిస్తున్న సమయంలో నారద మహర్షి వినతి మేరకు శ్రీహరి సత్యసంధాతగా, సత్యస్ఫూర్తి ప్రదాతగా సత్యనారాయణమూర్తిగా ఆవిర్భవించాడని పురాణ కథనం. స్కందపురాణంలోని రేవా ఖండంలో అయిదు అధ్యాయాలతో ఈ వ్రతకథ ఉంది. శుభ శోభనాదుల సందర్భాలలో, మనసు కలత చెంది నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించడం తెలుగు వారికి ఆనవాయితీగా మారింది. అలా అయన ‘వ్రతాధి ష్ఠాన’ దైవంగా అర్చనలు అందుకుంటున్నారు. వ్రత సమయంలో అయిదు అధ్యాయాలకుగాను ప్రతి అధ్యాయం ముగిసిన వెంటనే నారికేళం (కొబ్బరి) నైవేద్యం పెట్టడం పరిపాటి. అలాగే గోధుమ పిండితో చేసిన ప్రత్యేక వంటకాన్ని అయిదు భాగాలుగా చేసి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇతర వ్రతాలు ముగిసిన తరువాత నైవేద్యం పెడితే, ఇక్కడ ఒక్కొక్క అధ్యాయం ముగింపులో నైవేద్యం పెట్టడం మరో ప్రత్యేకత.
సత్యం అంటే కేవలం నిజం చెప్పడమే కాదని, లోకంలోని పరమార్థాన్ని గ్రహించడం, రుజు మార్గంలో జీవించడం కూడానని పెద్దల మాట. సాధారణ మాటలో చెప్పాలంటే ఇచ్చినమాటకు,చేసిన సంకల్పానికి కట్టుబడడం. సత్యనారాయణ వ్రత అధ్యాయాలూ అదే చెబుతున్నాయి. ఈ కథలలో ఆధ్యాత్మికతతోపాటు సామాజిక హితవూ కనిపిస్తుంది. ఉదాహరణకు చేసే పనిలో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. అందుకు భిన్నంగా అశ్రద్ధ, మొక్కుబడితనం, అనిష్ఠ వల్ల ఫలితం ఉండదని (స్వామికి ఆగ్రహం కలుగు తుంది) మూడు, నాలుగు అధ్యాయాలలోని వర్తకుడి కథ వెల్లడిస్తోంది. భగవంతుడి దృష్టిలో అంతా సమానమే. అయితే పామరులు / పేదలు చేసే వ్రతాన్ని చిన్న చూపు చూసిన రాజు పతనమవుతాడని చెప్పే అయిదవ అధ్యాయం పూజకు పేద,ధనిక భేదంలేదన్న సందేశానిస్తోంది.
నేటి ఆంధప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం క్షేత్రం స్థలపురాణం ప్రకారం, పర్వత శ్రేష్ఠుడు మేరువు భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేసి భద్రుడు, రత్నకుడు అనే పుత్రులను పొందింది. ఆ తనుయులిద్దరూ విష్ణువు కోసం తపస్సు చేసి ఒకరు శ్రీరామచంద్రమూర్తికి నెలవైన భదాద్రి (భద్రుడు)గా, ఇంకొకరు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి కొలువు దీరిన రత్నగిరి (రత్నాచలం)గా మారారు. పంపానదీ తీరంలోని రత్నాచలం ద్వాపరయుగంలో నారద మహర్షి తపోస్థలిగా ఖ్యాతి పొందింది. అక్కడ ఆయన ‘నారాయణ’ మంత్రజపంతో తపస్సు చేశాడని, రత్నగిరీం ద్రుడు ఆయనను స్తుతించగా, ‘శ్రీహరి మహానారాయణ యంత్రా లంకృతుడై, బ్రహ్మ, మహేశ్వర శక్తుల మేలు కలయికతో సత్యనారాయణస్వామిగా నీ ఈ శిఖరంపై అవతరించి, భక్తకోటిని అనుగ్రహిస్తాడు’ అని నారదుడు పలికాడు. తన మాట నిజం కావాలన్న ధ్యేయంతో ‘మానవులు కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లతో సతమతమవు తున్నారు. వారిని ఈతి బాధలు వేధిస్తున్నాయి. భూలో•కంలో సుఖశాంతులు నెలకొనే మార్గం చెప్పండి’ అని దేవదేవుడిని కోరినప్పుడు శ్రీసత్యనారాయణ వ్రత మహాత్మ్యం గురించి ఆయన వివరించినట్లు ఐతిహ్యం.
రత్నగిరిపై త్రిమూర్త్యాత్మకంగా అవతరించిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ మూర్తి, అక్కడికి సమీపంలోని గోరస దివాణం (కర్ణంపూడి సంస్థానం) జమీందారు ఇనుగంటి వెంకట రామారాయణిం, ఈరంకి ప్రకాశరావు అనే భక్తుడికి ఏక•కాలంలో కలలో కనిపించి, తాను రత్నగిరిపై వెలుస్తున్నానని, తన విగ్రహాన్ని వెలికితీసి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, అర్చించాలని కోరాడట. వారిద్దరు స్థానికులతో కలసి గాలించగా, అంకుడు చెట్టు మొదట్లో అనంత లక్ష్మీసమేత సత్యదేవుడి విగ్రహాలు కనిపించాయి. అక్కడే తాత్కాలికంగా పందిరి వేసి ఖర నామ సంవత్సర శ్రావణ శుక్ల విదియ (ఆగస్టు 5, 1891) నాడు విగ్రహాలను ప్రతిష్ఠించి, ఆ తర్వాత (1934) నేటి ప్రధాన ఆలయం నిర్మించారు. బదరీక్షేత్రం నుంచి తెచ్చిన మహా వైకుంఠ నారాయణ మంత్రం కింది అంతస్తు నేలమాళిగలో ప్రతిష్ఠితమైంది. నవవిధ గాయత్రీ మంత్రాలు, అష్టాక్షరీ మంత్రంతో 24 వృత్తాల నారాయణ మంత్రయుక్త గర్భాలయాన్నే మహావిష్ణు రూపంగా కొలుస్తారు. రథం ఆకారంలో రెండతస్తులుగా నిర్మితమైన ఆలయంలోని పై అంతస్తులో వామభాగాన అనంతలక్ష్మీ సత్యవతితో, దక్షిణ భాగాన సదాశివుడితో సత్యదేవుడు కొలువు తీరాడు. కింది అంతస్తులో విష్ణు పంచాయతనం మహాయంత్రం సహితంగా వినాయక, సూర్యనారా యణ, బాలత్రిపుర సుందరి సాక్షాత్కరిస్తారు. శ్రీసీతా రామచంద్రస్వామి క్షేత్ర పాకుడిగా ఉండడం విశేషం. సత్యనాథుడి కల్యాణోత్సవానికి రామచంద్రుడు పెళ్లి పెద్దగా వ్యవహరిస్తే, భదాద్రినాథుడి కల్యాణానికి రత్నాద్రి అధిపతి ఆ కార్యం నిర్వర్తిస్తాడని చెబుతారు. ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి వారం పాటు వార్షిక కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఏకాదశినాడు స్వామికి కల్యాణం నిర్వహిస్తారు..
సాధారణంగా ఆలయాలలో ప్రధానంగా వైష్ణవ క్షేత్రాలలో పులిహోర,దద్ద్యోజనం, చక్కెర పొంగలి, లడ్డులాంటివి ప్రసాదంగా వినియోగిస్తారు. కానీ అన్నవరంలో అందుకు భిన్నం. స్వచ్ఛమైన నెయ్యి, గోధుమ రవ్వ, యాలకులతో చేసే ప్రసాదాన్ని విస్తారాకులో కట్టి ఇస్తారు. దూర ప్రాంతాల నుంచి భక్తుల కోసం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా బంగీ ప్రసాదం (గట్టి ప్రసాదం) తయారు చేస్తున్నారు. ఆ ప్రసాదం నాణ్యత భద్రతా ప్రమాణాల విషయంలో ఐఎస్‌ఓ గుర్తింపు కూడా పొందింది.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్