– వారణాసి భానుమూర్తిరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

అర్ధరాత్రి అయినా ఇంకా నిద్ర రాలేదు పరంధామయ్యకు.

నిద్ర వచ్చిందంటే వింత గానీ , నిద్ర పట్టక పోవడం అనేది  మామూలు విషయమే  ఈ వయసులో!

హాల్లో జీరో లైట్‌ ‌బల్బు  వెలుగుతోంది గుడ్డిగుడ్డిగా తన జీవితంలాగే!

ఫాన్‌  ‌గాలికి కిర్రు కిర్రుమని శబ్దం చేస్తు న్నాయి కొక్కీలు లేని కిటికీ తలుపులు. ఒక్కొక్కసారి గాలికి శబ్దం చేసుకొంటూ  ముందుకూ వెనక్కు కొట్టుకొంటున్నాయి. కిటికీ చెక్క తలుపుల్లాగా తన గుండె ఎన్నోసార్లు బలంగా వేగంగా కొట్టుకొంటూ  ఊగిసలాడుతోంది.

 లేచి కిటికీ తలుపులు వేద్దామనుకొంటాడు . కానీ ఓపిక ఏదీ?

దుమ్ము పట్టి, యాభై  ఏళ్ల  నుంచి తనతో సహవాసం చేస్తూ కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూ తిరుగుతున్న ఫ్యాను రెక్కల శబ్దం  తన రెక్కలుడిగిన వృద్ధ్యాపాన్ని పదేపదే గుర్తుకు తెస్తుంది. బేరింగులు చెడిపోయిన ఫ్యాను చేసే వింత శబ్దం వింటూ నిద్ర పోవడం తనకు అలవాటే! తను సావిత్రిని పెళ్లి చేసుకొన్న రోజుల్లో తెచ్చుకొన్న ఓరియంట్‌ ‌ఫ్యాన్‌ అది. ఇంత కాలమైనా ఇంకా మూలుగుతూ పని చేస్తోంది.

ఈ ఇంటిని తను కష్టపడి ఊరవతల  కట్టించుకొన్నాడు. లక్ష రూపాయల వ్యయంతో  ఈ రెండు రూముల ఇల్లు కట్టించి యాభై ఏళ్లు  దాటింది. తనకు ముసలి వయసు వచ్చినట్లుగా ఈ ఇల్లు ఆలనాపాలనా లేక  పాతబడి పోయింది. ఇంటికి సున్నాలు కొట్టించింది  పాతిక సంవత్సరాల క్రితం పెద్దోడి పెళ్లి కోసం. ఆ పెళ్లికి  పైన ఒక రూము వేయించాడు తను. పిల్లలు వస్తే హాయిగా వుంటారని.

పెద్దోడు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి పాతికేళ్లు  దాటింది. ఇంతవరకూ వాడి మొహం తను చూడనే లేదు. ఎక్కడున్నాడో ఏమో! కనీసం ఫోన్‌ ‌కూడా చెయ్యడు. ఎక్కడున్నాడో గూడా తెలీదు.

చిన్నోడయినా ఇంటి పట్టున ఉండి హైదరాబాదులో ఉద్యోగం చేసుకుం టాడనుకొంటే రష్యన్‌ అమ్మాయిని పెళ్లి  చేసుకొని ఆ దేశానికి  వెళ్లిపోయాడు.  ఇంతవరకూ రాలేదు. ఎలా ఉన్నావని అడిగిన పాపాన పోలేదు.

పొరలు పొరలుగా వస్తున్న దగ్గు. దగ్గుతో పాటు కఫం గళ్లలు గళ్లలుగా ఛాతిని ఆక్రమిస్తోంది. లేచి వాష్‌ ‌రూము కెళ్లి శుభ్రం చేసుకొందామన్నా ఓపిక లేదు.  ఒక మగ్‌ ‌పక్కన బెట్టుకొని అందులోకి గళ్లను  ఉమ్ముతున్నాడు.   దగ్గు వచ్చిందంటే  ఒకసారిగా వదలదు. పది నిమిషాలు ప్రాణాలు తోడేస్తుంది.

సిగరెట్‌ ‌కోసం పెట్టె వెదికాడు. అరవై ఏళ్ల  నుంచి సిగరెట్‌ ‌కాల్చడం అలవాటు అయింది. ఆ అలవాటు మానలేక పోతున్నాడు. ఈ ధూమపానం వల్లనే ఈరోజు అనారోగ్యం  పాలయ్యాడు. లంగ్స్ ‌బాగా డామేజి అయిపొయ్యా యని డాక్టర్‌ ‌చెప్పాడు.

దగ్గు ఈసారి ఆగడం లేదు. లేచి మంచినీళ్లు తాగి పరుపు మీద పడుకొన్నాడు. అతని ఇంకి పోయిన కళ్ల నుండి సన్నని కన్నీటి బొట్లు  పక్కకు జారి దిండు మీద పడ్డాయి.

పరంధామయ్య గతంలోకి జారుకొన్నాడు.

——————-

‘నాన్నా!’

పెద్ద కొడుకు మౌళి పిలిచాడు.

‘నేను బి టెక్‌ ‌పాస్‌  అయ్యాను గదా? మరి నన్నేమి చెయ్యమంటారు?’

‘ఏదైనా ఉద్యోగం చూసుకో ! ప్రైవేటు కంపెనీలోనో, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలోనో చేరు. నేను గూడా బీఎస్సీ అవుతూనే ఒక ప్రైవేటు కంపెనీలో కెమిస్ట్‌గా జాయిన్‌ అయ్యాను’

‘నాకు ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు’ అన్నాడు మౌళి.

‘నేను పెద్ద చదువులు చదివించలేనురా! ఏదో ఈ ప్రైవేటు  ఉద్యోగంతో  ఇలా నెట్టుకొస్తున్నాను’

‘నేను ఎం.ఎస్‌. ‌చేయాలనుకున్నాను. అమెరికా యూనివర్సిటీలకు అప్లయి చేశాను. మీరు కొంచెం సపోర్ట్ ‌చెయ్యండి’ అన్నాడు మౌళి.

‘‘నా ఆర్థిక పరిస్థితి నీకు తెలీనది గాదు మౌళి! ఫారిన్‌ ‌పోవాలంటే పది లక్షలు అయినా గావాలి. అంత డబ్బు ఎలా సర్దను? ఇక నీ తమ్ముడు గూడా బి.ఫార్మసీలో చేరుతానంటున్నాడు. నువ్వు జాబ్‌లో చేరితే మంచిదని నా అభిప్రాయం.’’ అన్నాడు పరంధామయ్య.

ఒక్కసారిగా చేతిలోని  సర్టిఫికెట్లు, మార్కస్ ‌మెమో, అమెరికన్‌ ‌యూనివర్సిటీకి చెందిన ఆఫర్‌ ‌లెటర్లు అన్నీ విసిరి కొట్టి  బయటకు వెళ్లి పోయాడు మౌళి కోపంగా.

పరంధామయ్య గుండె బలంగా కొట్టుకొనింది. తన శ్రీమతి సావిత్రి తనని పొదివి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది.

 సిగరెట్‌ ‌తీసి కాలుస్తూ బలంగా రింగులు రింగులు వదలుతున్నాడు. తన సమస్యలు  అలాగే తనని ఆ పొగలాగా  ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

——————-

తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోని  పిల్లల ఈ వింత మానసిక పరిస్థితికి , ఈ అనుచిత ప్రవర్తనకు  కారణం ఎవ్వరు?

తల్లిదండ్రుల పెంపకమా? అతి గారాబమా? అడిగినవన్నీ కొనిచ్చి , కష్టపడే మనస్తత్వాన్ని నేర్పించక పోవడమా? కష్టాలను , సమస్యలను  ఎదురొడ్డే  ధైర్యాన్ని , ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించక పోవడమా? బతకడానికి  పిల్లలకి లౌకిక విద్యల్ని నేర్పిస్తున్నాం గానీ మనిషిగా జీవించడానికి నైతిక సూత్రాలను నేర్పించడం లేదు. అందుకే తల్లిదండ్రులు బాధ్యత వహించాలి.

పిల్లలు ఇద్దర్నీ కష్టం తెలీకుండా పెంచాడు. మంచి స్కూల్స్‌లో ఫీజు ఎక్కువయినా కట్టి చదివించాడు. సావిత్రి నల్లపూసల గొలుసు కావాలని అడిగినా కొనివ్వలేక పోయాడు. ఇప్పుడు ఇంత అప్పుచేసి మౌళిని అమెరికా పంపడం కత్తి మీద సాములా ఉంది తనకి. అయినా మౌళి అర్థం చేసుకొనే పరిస్థితిలో లేడు.

అర్థం కాని పరంధామయ్య అచేతనంగా ఆలోచనలో పడి పోయాడు.

——————-

‘‘ మౌళీ !’’

‘‘నాన్నగారు! ‘‘

‘‘అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకో ! పి.ఎఫ్‌.‌లోన్‌ ‌కి అప్లయి చేశాను. అలాగే బాంకులోనుకు గూడా ట్రై చేస్తున్నాను’’ అన్నాడు పరంధామయ్య.

మౌళి ఆనందానికి అవధుల్లేవు. తన తండ్రి ఎలా ఫండ్స్ అరేంజ్‌ ‌చేస్తున్నాడు ? ఎలా ఆ రుణాన్ని తీర్చగలడు? అన్న ధ్యాస లేకుండా మూడు నెలల్లో పెట్టె బేడా సర్దుకొని అమెరికా చెక్కేశాడు పెద్ద కొడుకు మౌళి.

అలా వెళ్లిన పుత్రరత్నం పాతిక సంవత్సరాలు అయినా నాన్నను పలకరించిన పాపాన పోలేదు.

చిన్న కొడుకు బి.ఫార్మసీ అయిపోతూనే రష్యా వెళ్లిపోయాడు. అక్కడి  అమ్మాయిని పెళ్లి చేసుకొని  తల్లినీ, తండ్రినీ  పట్టించుకొన్న పాపాన పోలేదు.

——————-

‘‘ సావిత్రీ’’

‘‘పిల్లలకు రెక్కలొస్తే దూరంగా వెళ్లి పోతారు. మరి ఈ వృద్ధ పక్షులకు దిక్కెవ్వరు?’’

‘‘ మీకు నేను. నాకు మీరు’’అన్నది సావిత్రి.

‘‘ఈ అసమర్థుని జీవనయాత్రలో నిన్ను సంతోష పెట్టిందే లేదు. దానికి  తోడు మన పుత్రరత్నాలు మనకు చేసిన అన్యాయం నన్ను  దహించి  వేస్తోంది’’

‘‘పిల్లలు ఫారిన్‌లో  ఎక్కడో హాయిగానే ఉంటారు.  వారి గురించి బెంగ పడడం మానెయ్యండి’’ అంది సావిత్రి.

‘‘ఇలాంటి దౌర్భాగ్యుల్ని  కన్నతల్లి దండ్రులుగా మనం ముందు జన్మలో  ఏదో పాపం చేసి ఉంటాము. అందుకే మనకీ శిక్ష విధించాడు దేవుడు’’.

‘‘అలాంటి మాటలు అనకండి. విశ్రాంతి తీసుకోండి’’ సావిత్రి అనున యింపుగా ఓదార్చింది.

కొన్ని రోజుల తరువాత అనారోగ్య సమస్యలు కారణంగా సావిత్రి గూడా పరంధామయ్యను ఒంటరి వాడ్ని చేసి వదలి వెళ్లిపోయింది. సావిత్రి లేని లోటు పరంధామయ్యను చాలా కృంగ దీసింది.

కనీసం బాధల్ని చెప్పుకోవడానికి గూడా ఎవరూ లేరు. ఈ లోకంలో జన సంబంధాలన్నీ ధన సంబంధాలేనా?

ప్రైవేటు ఉద్యోగంలో రిటైర్‌ అయిన తనకి రెండు వేల రూపాయలు ఫ్యామిలీ  పెన్షన్‌ ‌తప్ప ఇంకో ఆదాయం లేదు. ఇప్పుడు తనకు ఆ  ఇల్లు మరో ఆధారం లేదు. సావిత్రి పోయినప్పటి నుండీ ఎంతో కాలంగా తన ఇంటిలో పని చేస్తున్న రాజమ్మ ఇంటి పనులు చేసి వెడుతుంది. తన జీవితం  నిస్సారమై ఇలా ముగుస్తుందని  అనుకోలేదు పరంధామయ్య.

——————-

ఇప్పుడు ఆ ఇంటిలో పరంధామయ్య ఒక్కడే!

అనుబంధాలు, ఆప్యాయతలు లేని ఆ ఇల్లు కళా విహీనంగా ఉంది.

ఇంటి నిండా బూజు. అక్కడక్కడా ఎలుకలు, దోమలు  బొద్దింకలు పారాడుతున్నాయి.

దుమ్ము ధూళితో నిండిపోయిన ఒక టీవీ , ప్రక్కనే ఒక  చార్జింగ్‌ ‌లేక ఆగిపోయిన పాత మొబైల్‌ ‌ఫోన్‌. ‌కీ ఇవ్వని టేబుల్‌  ‌క్లాక్‌లో ముళ్లు తిరగడం ఎప్పుడో మానేశాయి.

తెల్లవారింది. రాత్రంతా ఆలోచనలతో సతమతమై పోయిన పరంధామయ్య ఇంకా లేవనే లేదు.

ఇంటి పని చెయ్యడానికి  ఉదయం రాజమ్మ  వచ్చింది.

‘‘అయ్యగారూ!’’ కళ్లు తేలవేసి, నోటినుండి నురుగు•  తల వాల్చేసిన పరంధామయ్యను  చూసి రాజమ్మ  భయపడింది.

యాభై ఏళ్లుగా అదే ఇంటిలో జీవచ్ఛవంలా బతికిన పరంధామయ్య భౌతిక కాయాన్ని  పట్టుకొని చిన్న పిల్లలా ఏడుస్తోంది రాజమ్మ.

About Author

By editor

Twitter
YOUTUBE