పీవీఆర్‌ ‌సోమయాజులు

మార్గదర్శక్‌ అఖిల భారతీయ వనవాసీ కల్యాణ అశ్రమ్‌

జూన్‌ 2 ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం

‘హైందవీ స్వరాజ్యం’.. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలో కనిపించే విశిష్ట అంశం. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా 349 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని రాయఘడ్‌లో జరిగిన శివాజీ మహారాజ్‌ ‌పట్టాభిషేకాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అది ఇప్పటికి హిందూ సమాజానికి ప్రేరణ కలిగిస్తున్నది కాబట్టే స్మరించుకుంటున్నాం.

శివాజీ యశస్సును కోరుకోలేదు. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య అనుకున్న లక్ష్యాన్ని సాధించాడాయన. తల్లి అందించిన సంస్కారం, సమర్థ రామదాసుల వారు ఇచ్చిన ఆధ్యాత్మిక బలం, దాదాజీ కొండదేవ్‌ ఇచ్చిన శారీరక శిక్షణ, మార్గ దర్శనం, బాజీ ప్రభుదేశ్‌ ‌పాండే, యాశాజీ కంక్‌, ‌తానాజీ మాల్‌సురే లాంటి అనుయాయుల అండదండా ఆయనకు ఉపకరించాయి. వీటన్నిటి ఫలితమే హైందవీ స్వరాజ్య నిర్మాణం. సచ్చీలం, అనుశాసనం, స్వప్రయోజనం, బంధుప్రీతి లేక పోవడం వంటి నియమాలు ఉన్నవారు ఎటువంటి క్లిష్ట పరిస్థితులోనైనా శూన్యం నుండి బ్రహ్మాండం సృష్టించగలరని చెప్పేందుకు చరిత్రలో కనిపించే గొప్ప ఉదాహరణ శివాజీ.

నాటి దేశ పరిస్థితులు

భారతదేశంలో చాలాభాగం మొగలాయిల పాలనకు కిందికి పోయి అప్పటికి 145 ఏళ్లు. 300 సంవత్సరాలు అప్రతిహతంగా సాగిన విజయనగర సామ్రాజ్యం పతనమైంది. డక్కన్‌లోని బహమనీ రాజ్యం మూడు ముక్కలైంది.1) అహమ్మద్‌నగర్‌ ‌నిజాం షాహి 2) గోల్కొండ కుతుబ్‌ ‌షాహీ 3) బీజపూర్‌ ఆదిల్‌ ‌షాహీలు పాలిస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి బీజాపూర్‌ ‌సుల్తాన్లు, మొగలులు కూడా యుద్ధాలు చేస్తున్న కాలం. ఉత్తర భారత రాజపుత్రులు నిరాశ నిస్పృహాలలో కూరుకుపోయారు. బీజాపూర్‌ ‌వాళ్లు, మొగలులు- ఏ ముస్లిం పాలకుల లక్ష్యమైనా ఈ దేశం మీద రాజకీయ సార్వభౌమత్వం సాధించడమే. ఇంకా, దేశాన్ని ఇస్లాం సంఖ్యాధిక్య దేశంగా మార్చడం. హిందూ సంస్కృతిని, హిందూ పరంపరలను కూకటివేళ్లతో పెకలించి, హిందూ స్వాభిమానం పైన దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు అందులో భాగమే. అవి నిరంతరం సాగుతూ ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లో సంస్కృతిని రక్షిస్తూ హిందువులలో స్వాభిమానం నిర్మాణం చేయవలసిన ఒక చారిత్రక ఆవశ్యకత కనపించింది. దానిని పూరించ టానికా అన్నట్లు ఫిబ్రవరి 19, 1630న (శాలివాహన శకం 1551. శుక్ల నామ సంవత్సరం ఫాల్గుణ మాసం) జిజాబాయి, శహాజీ దంపతులకు శివనేరి దుర్గంలో శివాజీ జన్మించాడు.

శివాజీకి ప్రేరణ ఎవరు ?

దురాక్రమణదారుల బారినుంచి హిందూధర్మాన్ని రక్షించాలన్న తపనతో ఉన్న ఒక యోధునిగా శివాజీని నాటి పరిస్థితులు తీర్చిదిద్దాయి. అందులో ఆయన సంకల్పం కూడా ఉంది. అటు జిజాబాయి, దాదాజీ కొండ దేవ్‌ల ప్రభావం, ఇటు సమర్ధ రామదాసుల వారి ధార్మిక జాతీయత శివాజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. సంత్‌ ఏకనాథ్‌ ‌సలహా మేరకు శివాజీ సమర్థ రామదాసస్వామిని కలవటం, వారి శిష్యునిగా మారడం సంభవించింది. రామదాసస్వామి శివాజీకి మార్గదర్శనం చేయటమే కాదు, సమాజంలో దైవభక్తిని దేశభక్తిని, నిర్మాణం చేయటానికి నిరంతరం సంచరిస్తూ ఉండేవారు. సమాజం జాగృతం కాకుండా పరివర్తన సాధ్యం కాదు. విజయనగర సామ్రాజ్యం ఉత్థానపతనాలలో స్వామి కొన్ని పాఠాలను గ్రహించారు. విజయనగర సామ్రాజ్య శిథిలాలను చూసేందుకు, అక్కడి పరిస్థితులు అవగాహన కోసం స్వామి హంపి వెళ్లార••. ఆ సామ్రాజ్య పతన కారణాలను, అందుకు దోహదం చేసిన పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. స్వామి ప్రతిష్టించిన హనుమాన్‌ ‌దేవాలయం ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తుంది. అటువంటి వారి మార్గదర్శనం శివాజీకి లభించింది. ఆ మార్గదర్శనం నుంచి శివాజీ ఏం గ్రహించాడు? హిందూ ధర్మరక్షణ అవసరం. హిందువులలో స్వాభిమాన నిర్మాణం.

శివాజీ లక్ష్యం ఏమిటి?

సింధునది పుట్టిన దగ్గర నుండి కావేరినది దక్షిణతీరం వరకు ఉన్న భూమి మన మాతృభూమి అని శివాజీ గర్జించేవాడు. ఆయన శాసనాలలో కూడా ఇది కనపడు తుంది. ఆయన నిరూపించిన అంశాలు ఇవి: పరాభవాల పాలైన హిందువులు తమ జాతిని పునర్నిర్మాణం చేసుకోగలరు. స్వరాజ్యం స్థాపించుకోగలరు. యుద్ధాలలో శత్రువులను నిర్మూలించగలరు. తమను తాము రక్షించు కోగలరు. సాహిత్యం, కళ, విద్యలను పోషించగలరు. వాణి జ్యాన్ని అభివృద్ధి చేయగలరు. సముద్ర మార్గంలోనూ వాణిజ్యం చేసుకోగలరు. పదాతి దళాలే కాదు, నావికా సైన్యాలు నిర్మించుకోగలరు. సముద్ర యుద్ధాలలో విజయం సాధించగలరు. హిందువు సర్వసమర్థుడిగా స్వాభిమానంతో జీవించే విధంగా రూపొందేందుకు అవసరమైన ఒక ఆదర్శాన్ని చూపించేందుకు శివాజీ ప్రజల ముందు, సైన్యం ముందు ఒకే లక్ష్యం ఉంచాడు. అదే ‘హైందవీ స్వరాజ్‌’.

‌శివాజీ తన లక్ష్యసాధనకు 14 సంవత్సరాల వయసు నుండి యుద్ధాలు ప్రారంభించాడు. అదిల్‌ ‌షాహి అధీనంలో ఉన్న తోరణ దుర్గాన్ని తన యువ సైన్యంతో అవలీలగా జయించాడు. అక్కడ దొరికిన నిధితో తోరణ దుర్గానికి తూర్పుగా ఐదు మైళ్ల దూరంలోని లోహధా కొండ మీద కొత్త దుర్గాన్ని నిర్మించాడు. అదే శివాజీకి భవిష్యత్తులో రాజధాని ఉపయోగపడిన రాయఘడ్‌ ‌కోట.

శివాజీ యుద్ధ వ్యూహాలు, ఎత్తుగడలు

శివాజీ ఎటువంటి శత్రువుతో ఎట్లా వ్యవహరించాలో చూపించాడు. బీజాపూర్‌ ‌సుల్తాన్‌ ‌తన తండ్రిని నిర్బంధించినప్పుడు, విడిపించుకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడలు, చేసిన యుద్ధం స్ఫూర్తినిస్తాయి. అప్పటికి శివాజీ వయసు 19 సంవత్సరాలు. తన లక్ష్యాన్ని సాధించే ఎత్తుగడతో మొగలు పాదుషాకు సంధి ప్రస్తావన పంపినట్లు బీజాపూర్‌ ‌సుల్తాన్‌కు సందేశం పంపాడు. దానితో భయపడిన బీజాపూర్‌ ‌సుల్తాన్‌ ‌శహజీని విడుదల చేశాడు. ఇది శివాజీ అద్భుత విజయం. మరొక అద్భుత విజయం అఫ్జల్‌ఖాన్‌ ‌వధ. అఫ్జల్‌కు భయపడుతున్నట్లు, సంధికి సిద్ధపడుతున్నట్లు వాతావరణం సృష్టించి అతడిని తన అనుకూలమైన సమయంలో, అనుకూల స్థలానికి రప్పించి మట్టు పెట్టాడు. శివాజీ పన్హాల్‌ఘడ్‌ ‌నుంచి విశాల్‌ఘడ్‌కు తప్పించుకుని పోయే సమయంలో బాజీ ప్రభువు దేశ్‌ ‌పాండే చూపిన అద్భుత ధైర్యం, పరాక్రమం, బలిదానం స్మరణీయమైనవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఔరంగజేబు ఎత్తుగడలను వమ్ము చేయడం ఔరంగజేబ్‌ ‌నిర్బంధం నుండి బయటపడటానికి వ్యూహం పన్నటంలో అసలు జయసింగ్‌కు శివాజీ ఎటువంటి సందేశం ఇచ్చాడు? దానితో జయసింగ్‌ ‌కంగు తిని ఔరంగజేబుతో శివాజీని ఢిల్లీకి ఆహ్వానించేట్లుగా చేశాడు.

శివాజీని కట్టడి చేయడానికి జయసింగ్‌ని పంపాడు ఔరంగజేబు. శివాజీ జయసింగ్‌కు ఉత్తరం రాశాడు. నీవు నేను కలిస్తే భారతదేశం ఇస్లాం పాలన నుండి స్వరాజ్యం సంపాదించుకుంటుంది. అట్లా కలిస్తే నీ గుర్రపు కళ్లాన్ని పట్టుకుని దక్షిణ ప్రాంతం అంతటిని ఒక త్రాటిమీద నడిపించడానికి నీకు నేను సహకరిస్తానని అందులో రాశాడు. కానీ జయసింగ్‌ అం‌గీకరించలేదు. అయినా జయసింగ్‌తో యుద్ధం వద్దని నిర్ణయించుకొన్న శివాజీ సంధి చేసుకొన్నాడు.

ఔరంగజేబుకు బీజపూర్‌ ‌కొరుకుడు పడలేదు. పైగా బీజపూర్‌ ఆదిల్‌ ‌షాహి గోల్కొండ కుతుబ్‌ ‌షాహీ కలిశారు. ఈ సమయంలో తమకు కుదిరిన ఒప్పందం ప్రకారం బీజపూర్‌ ‌పైన మొగలు సైన్యం చేస్తున్న యుద్ధంలో శివాజీ సహకరించాడు. కానీ మొగలులు గెలవలేదు. శివాజీ దగ్గర గుర్రపు దళ అధికారిగా ఉన్న నేతాజీ పాల్కర్‌ అదుల్‌ ‌షాహి కొలువులో చేరిపోయాడనే సమాచారం తెలిసిన జయసింగ్‌కు అనిపించింది, ఒకవేళ శివాజీ బీజాపూర్‌ ‌సుల్తాన్‌తో కలిస్తే మొగలులకు దక్షిణాదిన పుట్టగతులు ఉండవు. అందుకే శివాజీని తనకు అను కూలంగా మార్చుకోవాలనే ఢిల్లీకి ఆహ్వానించమని ఔరంగజేబుకు సూచించాడు. శివాజీ ఢిల్లీకి వెళ్లాడు. ఔరంగజేబు కుట్ర బుద్ధినే ప్రదర్శించాడు. శివాజీని నిర్బంధించి దాడి చేయాలని పథకం తయారుచేసిన ఔరంగజేబుకు గుణపాఠం చెప్పి సమయస్ఫూర్తితో తప్పించుకుని తన కోటకు చేరుకున్నాడు శివాజీ. కొంతకాలం తర్వాత పట్టాభిషిక్తుడైనాడు.

హిందూపద పాద షాహీగా…

శాలివాహన శకం 1596 ఆనంద నామ సంవత్సరం జేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం (సాధారణ శకం 1674 సంవత్సరం జూన్‌ 6) ‌రాయఘడ్‌లో శివాజీ మహారాజ్‌ ‌సార్వభౌముడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. దానికి పండితులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. పరిష్కారానికి సమర్ధ రాముని సూచనతో కాశీ నుండి గాగభట్‌ను పిలిపించారు. గాగ భట్‌ ‌రామదాస స్వామి శిష్యుడు. ఆయన రాయ్‌ఘడ్‌కి వచ్చి అందరిని ఒప్పించి తనే స్వయంగా శివాజీ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిం చాడు. ఆ రోజు అనేకమంది పాశ్చాత్య దేశాల వారు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో కాబూల్‌ ‌నుండి జాబుల్‌ ‌వరకు ఉండే హిందూ రాజులు విదేశీ ఆక్రమణదారులపై అనేక యుద్ధాలు చేశారు, అనేక రణనీతులు ప్రయోగించారు. ఆ ప్రయత్నాలు ఎప్పుడూ పూర్తిగా సఫలం కాలేదు. చాలా విఫలమై నాయి. కానీ శివాజీ హిందూ ధర్మాన్ని, సంస్కృతులను రక్షించడానికి అనుసరించిన వ్యూహాలతో విజయం సాధించి చరిత్ర గతిని మలుపు తిప్పాడు. శివాజీ తర్వాత కూడా అది కొనసాగింది. పీష్వాల కాలంలో కొంతకాలమైనా అటక్‌ ‌నుండి కటక్‌ ‌వరకు దేశమంతా ఒకే ఛత్రం కిందికి తెచ్చారు. శివాజీ అనుసరించిన వ్యూహం, సాధించిన విజయాలు ఒక సార్వభౌముడిగా పట్టాభిషేకం జరగటం అనేక మందికి ప్రేరణ కలిగించింది.

పరంపరాగతమైన మన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం

పరంపరాగతమైన మన పరిపాలన వ్యవస్థను శివాజీ అమలులోకి తెచ్చాడు. అష్ట ప్రధాన్‌లతో పాలన సాగింది. శివాజీ ప్రజాజీవనం దాదాపు 36 సంవత్సరాలు. ఈ వ్యవధిలో ఆయన యుద్ధాలకు, సైనిక చర్యలకు వెచ్చించిన కాలం ఆరున్నర సంవత్సరాలకు మించదు. మిగతా 30 సంవత్సరాలు పాలనా వ్యవస్థను వికసింప చేయటంలోనే గడిపారు. శివాజీ ఏర్పాటు చేసిన పాలన విభాగాలు ఆయన పోరాట విజయాలకు చెక్కుచెదరని పునాదులుగా నిలిచాయి.

మొగల్‌ ‌సామ్రాజ్య పతనానికి నాంది

హైందవీ స్వరాజ్యం పిలుపుతో మొగల్‌ ‌వైభవం బీటలు వారడం మొదలైంది. శివాజీ పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజస్థాన్‌ ‌రాజపుత్రులందరూ తమ విభేదాలను మరిచి దుర్గాదాస్‌ ‌రాథోడ్‌ ‌నాయకత్వంలో నిలబడ్డారు. దాంతో ఔరంగజేబు సైన్యం రాజస్థాన్‌ను వదిలిపోయింది. మొగల్‌ ‌సైన్యం రాజస్థాన్‌లో మళ్లీ అడుగుపెట్టలేదు. రాజా ఛత్రసాల్‌ ‌శివాజీ నుండి ప్రేరణ పొందాడు. అస్సాం రాజు చక్రధ్వజసింహుడు, కూచ్‌బిహార్‌ ‌రాజు రుద్రసింహుడు, శివాజీ యుద్ధ నీతిని అనుసరించి రాజ్యాలను కాపాడుకున్నారు. శివాజీని కలవాలని గురు గోవింద్‌సింగ్‌ ‌దక్షిణం వైపు వచ్చాడు. కానీ విధి వక్రించి కలవలేకపోయాడు. శివాజీ పట్టాభిషేకం అనేకమందిలో విశ్వాసం పాదుకొల్పింది. 244 సంవత్సరాలు పాలించిన మొఘల్‌ ‌సామ్రాజ్యం పతనానికి దారి ఏర్పరిచింది.

 ఔరంగజేబుకు మిగిలిందేమిటి ?

జీవించి ఉండగా శివాజీని ఔరంగజేబు ఏమీ చేయలేకపోయాడు. శివాజీ, ఆయన కొడుకు శంభాజీ ఇద్దరు పరమపదించారు. ఆ తరువాత దక్షిణా పథాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఔరంగజేబు యుద్ధనికి వచ్చాడు. 25 సంవత్సరాలు ఉన్నాడు. శివాజీ పరమపదించిన తర్వాత కూడా హైందవీ స్వరాజ్‌ ‌లక్ష్యంగా శివాజీ సైన్యం పోరాడుతూనే ఉన్నది. ఆ స్ఫూర్తే ఔరంగజేబును మహారాష్ట్ర లోపలికి రానివ్వలేదు. ఆ సమయంలో జరిగిన గెరిల్లా పోరాటంతో దెబ్బతిన్న ఔరంగజేబు వెన్ను చూపి పారిపోవాలని చూశాడు. సాధ్యం కాలేదు. చివరకు దారిలోనే చనిపోయాడు. శవాన్ని ఆగ్రా వరకు తీసుకు పోలేకపోయారు. దారిలోనే సమాధి చేయవలసి వచ్చింది. ఔరంగజేబుకు మిగిలిందేమిటి? సైన్యం పీనుగుల పెంట అయింది. రాజ్యం బంజరుగా మిగి లింది. నాలుగు సంవత్సరాల పాటు ప్లేగు వ్యాధితో లక్షమందికి పైగా సైనికులు చనిపోయారు.

—————–

శివాజీ పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవమా?

శివాజీ పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏటా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహిస్తుంది. ‘సంఘానికి సిద్ధాంతమే ఆదర్శం. కానీ ఒక వ్యక్తిని ఆదర్శంగా స్వీకరించాలంటే శివాజీనే స్వీకరించాలి’ అని డాక్టర్‌జీ చెప్పేవారు. శివాజీ జీవితాన్ని స్మరించుకుంటూ ఈ దేశాన్ని శక్తిమంతమైన, వైభవశాలి అయిన దేశంగా తీర్చిదిద్దడానికి మనం పునరంకితం కావాలి అని చెప్పేవారు. హైందవి స్వరాజ్య లక్ష్యం కోసం పనిచేయడానికి శివాజీ పిలుపునిచ్చి సమాజాన్ని సంసిద్ధం చేశాడు. విజయాలను సాధించాడు. అదే శివాజీ మనకు ఇచ్చే ప్రేరణ.అందుకే ఏటా హిందూ సామ్రాజ్య దినోత్సం నిర్వహిస్తాం. శివాజీ ఏ విధంగా హైందవీ స్వరాజ్యంతో సమాజాన్ని సంసిద్ధం చేశాడో, ఎట్లా పోరాటాలు చేశాడో, ఎట్లా పరిపాలన చేశాడో ఆ విషయాలు తిలక్‌, ‌సావర్కర్‌, ‌డాక్టర్జీ వంటి అనేకమంది ప్రజల ముందుకు తీసుకెళ్లి స్వరాజ్య పోరాటం చేసారు. అదే ప్రేరణతో స్వతంత్రం లభించింది. అదే ప్రేరణగా మనం దేశాన్ని వైభవశాలిగా నిర్మిద్దాం.

భారతదేశం అన్ని ఆక్రమణల నుండి బయటపడి స్వరాజ్యం సంపాదించుకొని 75 సంవత్సరాలైనా హైందవి స్వరాజ్‌ ‌సాదించుకోగలిగామా? మనదైన పాలన అభివృద్ధి నమూనాలు నిర్మాణం చేసుకోగలి గామా? అధికార లాలసతో నాయకులు ఇస్లాం మత ఛాందసవాదాన్నిదేశంలో ఎట్లా పెంపొందిస్తున్నారో చూస్తున్నాం. అందుకే ఇప్పుడు శివాజీ చూపించిన ఆదర్శం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. శివాజీ తన కాలంనాటి ఇస్లాం సామ్రాజ్యవాదంపైన పోరాడాడు. ఆ సామ్రాజ్యంలో మతకలహాలు జరగలేదు. మహిళలు అవమానాలకు గురికాలేదు. శిక్షలు కఠినంగా ఉండేవి. ఆ పరిపాలన ఇప్పటికి అనుసరణీయం. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు దిశా నిర్దేశం శివాజీ జీవితమే.

—————–

‘అమెరికాను ఓడించడానికి స్ఫూర్తి’

వియత్నాం రక్షణ శాఖ మంత్రి మేడం బిన్‌ 1977‌లో ఢిల్లీ వచ్చారు. రాజధానిలో ఎక్కడైనా శివాజీ విగ్రహం ఉంటే పూలమాల వేయాలని ఆమె ఆకాంక్షించారు. అధికారులు హడావిడిగా తిరిగి శివాజీ విగ్రహాన్ని గుర్తించి ఆమెను తీసుకెళ్లారు. ఆమె శివాజీ విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ, ‘మా పోరాటానికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్‌. ‌శివాజీ మహారాజ్‌ ఒక పక్క యుద్ధ వ్యూహాలు పటిష్టంగా రచించుకుంటూ, రెండో ప్రక్క సైన్యంలో జాతీయభావాన్ని నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ వ్యూహాన్ని మేము అనుసరించాం. దాంతో శక్తిమంతమైన అమెరికాను ఓడించి మా స్వాతంత్రాన్ని మేము కాపాడుకున్నాం. అందుకే శివాజీ మాకు ప్రేరణ’ అన్నారామె.

————–

 ‘ఈ రోజున మా వంటి సన్యాసులు నిర్భయంగా రాజవీధులలో తిరుగుతు న్నామంటే అది శివాజీ మహారాజు పెట్టిన భిక్ష’.

– కంచి పరమాచార్యచంద్రశేఖరేంద్ర స్వామిజీ

About Author

By editor

Twitter
YOUTUBE