– భమిడిపాటి గౌరీశంకర్
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘నిన్ను తలుచుకొని రోదించ కుండా ఉండటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను, నా హృదయం నుంచి బయటకు పంపటం చేత కాదని నా ప్రతీ కన్నీటి బిందువు నాకు గుర్తు చేస్తున్నది’’.
ఆమె… ఆ చీకటి గదిలో బందీగా… ఒంటరిగా…
ఆమె… ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… అమెరికాలో ఉద్యోగం… ఆరెంకెల జీతం… సౌకర్యవంతమైన జీవితం ఆమె ‘కులం’… ఓ అణచబడిన వర్గానిది.. ఆమె మతం… కరుణను బోధించడం కోసం ‘శిలువ’ను మోసింది… ప్రేమను పంచి… నమ్మి మోసపోయింది.. భగవంతుడికే తప్ప లేదు వెన్నుపోటు…
అదే ఆ వ్యథ… తన వారే, తనవాడిని… తన మతం కాదని… తన కులం కాదని… హత్య చేశారు.
ఆమె… ఒంటరిగా…
ఆరోజు… ఆమెకు బాగా గుర్తుంది…
పోలీసు స్టేషన్లో… ప్రత్యేక గదిలో… ఆమెనుంచారు. ఆమె భర్తను తన తల్లిదండ్రులు ‘హత్య’ చేశారు. తన భర్త ఉన్నత విద్యావంతుడు. విదేశంలో తనలాగానే మంచి ఉద్యోగంలో కుదురు కున్నవాడు. గ్రీన్ కార్డు ఉంది. ఆర్థికంగా, సామాజికంగా ఓ స్థాయి ఉన్న వ్యక్తి. తను ఆయనను వివాహం చేసుకోవడం వారికి ఇష్టం లేదు. ఆయన లేకుండా తన తల్లిదండ్రులింటికి వెళ్లడం నాకూ ఇష్టం లేదు. తల్లిదండ్రులు దైవంతో సమానమంటారు కానీ… పిల్లల వ్యక్తిత్వాలను గౌరవించలేని వారిని ఏమనాలి? అందరూ ఇలానే ఉంటారా? అని కొన్ని వందల గొంతులు ఆమెను ప్రశ్నించాయి. ‘అంత మందీ ఇంత దారుణంగా ఆలోచిస్తారా’ అని ఆమె కూడా లక్షల మందిని ప్రశ్నించింది. ‘సమాజంపైన ఉమ్మేసింది…’ పబ్లిక్ గానే. పత్రికల వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. స్త్రీకి సహాయం చేయడం కోసం వందల కలాలు, వందల చేతులు. వాటిలో ఎన్ని తన వంటి కుమార్తెలకు స్వేచ్ఛనిస్తాయి?
‘పోలీసుల రక్షణలో మీకు బాగుందా’ ఓ మహిళా విలేకరి ప్రశ్న..
‘‘బాగుందా అంటే…?’ అమె ప్రశ్న మళ్లీ తనే ‘నేను ఘోరంగా నా వారి చేతనే మోసగింపబడ్డాను’’ అంటూ చేతులతో ముఖం దాచుకొని ఏడ్వసాగింది.
‘‘ఏం జరిగిందో చెప్పగలరా’’ ఒకతను ప్రశ్నిం చాడు. అక్కడి దృశ్యాలను కెమెరాలు నిశ్శబ్దంగా చిత్రిస్తున్నాయి. చుట్టూ పోలీసులు మౌనంగా వింటున్నారు.
‘‘నేను మా తల్లిదండ్రులకు రెండో కుమార్తెను, అక్క ఇంగ్లండ్లో తన కుటుంబంతో ఉంది. నేను ఆమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. నా తల్లిదండ్రులు పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మమ్మల్ని ఎటువంటి ఆంక్షలు లేకుండానే పెంచారు.
సమాజం పట్ల ఓ విశాల దృక్పథాన్ని బోధించారు. కానీ, ఆ బోధనలు కేవలం వారికి అపకారం జరగనంత వరకు… వారి కంఫర్టబుల్ జోన్ కదలనంత వరకేనని తరువాత తెలిసింది.’’ ఆమె గొంతులో దుఃఖపు జీర… ఆగింది.
ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెకు టీ అందించగా, తాగి గ్లాస్ క్రింద పెట్టి టీ ఇచ్చిన స్త్రీకి ధన్యవాదాలు తెలిపింది.
‘‘మీ పేరు… పేపర్లో ప్రచురించటం కోసం పోలీసులు ఇప్పటకే ప్రకటించారు. అయినా ఓ లీడ్ కోసం విలేకరి ప్రశ్న.
‘‘ఎందుకు నా పేరు…? ఈ దేశంలో కులం, మతం తెలియటం కోసం పేరు. కానీ, వాటి సహాయంతోనే మనుషులును చంపేస్తుంటే ఇంక పేర్లతో పనేముంది?’’ అంది ఆమె వేదనగా…
‘‘కావచ్చు… కానీ… జరిగిన సంఘటనకు ఎన్నో రకాల వ్యాఖ్యానాలు… కథలు జతవుతున్నాయి కదా? వాటికి ఏదైనా మీ సమాధానం…’’ అంది ఓ విలేకరి.
‘‘నేను… మీ వంటి ఆడదాన్నే, నా పేరు ఇప్పటికీ ఎఫ్.ఐ.ఆర్.లో రాశారు. పోలీసులు చెప్పారు. ప్రస్తుత కథ ఎవరికైనా పనికొస్తుందంటారా? లేదా? ఓ రెండు రోజుల కాలక్షేపం బఠాణినే అంటారా’’ అన్నది… కాస్త…చిరాకుగా…
ఇంతలో ఆమె న్యాయవాది ఆమె దగ్గరకు వచ్చి కొన్ని కాగితాలపైన సంతకాలు తీసు కున్నాడు. స్టేషన్ ఆఫీసర్ వచ్చి ‘‘మిత్రులారా! ఈమె భర్తను… ఈమె తల్లిదండ్రులు కిరాయిగూండాలతో చంపించేశారు. ప్రస్తుతం ఆమె మా సహాయం అవసరమంటున్నది. ఆమె భయాలు ఆమెవి. ఆమె క్షేమంగా ఆమెరికా వెళ్లిపోవాలను కుంటున్నది. వీసా, పాస్‌పోర్టు వంటివి ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నాయి. వాటిని మీరు తీసుకురావాలి. ఇక్కడ మీకు కూడా లాభం ఉంది’’. అని ఆగి… బాధితురాలి ముఖంలోకి చూసి… కాస్త ఆగాడు.
‘లాభం’ అనే మాటకు ఆమె ముఖంలో రంగులు మారటం అతను గమనించాడు. అతనికి తన మాటలలోని భావం అర్థ్ధమయింది. కానీ.. ఉద్యోగం చేసిన అలవాటు అంతే.
వారంతా ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లబోయారు కానీ అంతలో వారికో అనుమానం. హంతకుడు దొరికాడు. కోర్డు రిమాండు విధించింది. మరి ఆ తల్లిదండ్రులను…
‘‘దర్యాప్తు చేస్త్తున్నాం. గృహనిర్బంధంలో ఉంచాము’’ అన్నాడు స్టేషన్ ఆఫీసర్. ‘సరే’ అని అందరూ బయలుదేరారు.
బాధితురాలు… ఒంటరిగా మిగిలిపోయింది.
పోలీస్ స్టేషన్ తన దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఆమెకు కావలసినవి మహిళా పోలీసు కానిస్టేబుల్స్ సమకూర్చు తున్నారు.
ఇంతలో స్టేషన్ బయట ‘మత సంఘాల’ వారు గోల చేయటం ఆరంభించారు. ‘‘హంతకులను హత్య చేయాలి’’
‘‘ఉరితీయండి… లేకుంటే మాకప్ప గించండి … చంపేస్తాం’’
‘‘మా మతం మైనార్టీ కాదు… మెజార్టీనే. మేము ఓట్లు వేయందే ఎవరూ నాయకులు కారు… కాలేరు’’ అంటూ ఫ్లకార్డులు చేతబట్టి అరుస్తున్నారు. దగ్గరలోనే స్థానిక ఎన్నికలున్నాయి మరి. దీనినో ట్రంప్ కార్డుగా వాడుకోవాలనేది. వారి అభిమతం’’…
బాధితురాలు విషాదంగా నవ్వుకుంది. తను ఇక్కడకు వచ్చి తప్పు చేశానా? అనుకుంది. లేదు… నాకు న్యాయం కావాలి… ‘న్యాయం’… ఎలాంటిదై ఉండాలి? మరో ప్రశ్న. హంతకుడు జైలులో ఉన్నాడు. తనెలాగూ ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లి పోతుంది. మరి న్యాయం ఎవరి కోసం? ఎందుకు?
ఆమె ఆలోచనలను తుంచి వేస్తూ, తన కుల నాయకుడు, తన మత పెద్ద వచ్చారు ఆమె దగ్గరకు. ‘‘అమ్మా!’’ కుల పెద్ద అనవసర ఆప్యాయత.
‘చెప్పండి’ అన్నట్టుగా తను అతని వంక చూసింది
‘అమ్మా… పెళ్లి మన కులాచారం ప్రకారం, లేదా మన మతాచారం ప్రకారం చేసుకొని ఉంటే బాగుండేది కదా!’ అన్నాడు. ఆమె అతడిని చిరాకుగా, కోపంగా చూసింది.
నిజమే! తను, నాగేశ్వర్ వేరువేరు కులాలకు చెందినవారం, మా మతాలు కూడా వేరు. అందుకే రాజ్యాంగం మాకిచ్చిన హక్కుననుసరించి, ఇద్దరం మేజర్లం కనుక ఆర్యసమాజంలో వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. ఆర్థికంగా ఎవరి సహాయం అవసరంలేనివారం. ఉన్నత విద్యా వంతులం. మనసులు ఒక్కటై మనుషులు ఒకటిగా బతకాలనుకోవటం తప్పా..? కాదంటే… రాజ్యాం గాన్ని పట్టపగలు… నడిరోడ్డు మీద దారుణంగా హత్య చేస్తారా? మేము ఏ కులాన్ని, మతాన్ని చిన్నబుచ్చలేదే. ఎవరిచ్చారు వారికి ప్రాణం తీసే హక్కు? అవతలి వారు నన్ను హత్య చేస్తే…! మేమేమి వారిని మోసం చేయలేదే. ఇరువర్గాల వారిని ఓప్పించాం. వారు కూడా అంగీకారం తెలిపినట్లు నటించారు. చివరకు మోసం చేశారు.
నష్టపోయింది ఎవరు?
ఎవరిది పరువు? ఏం మిగిల్చాయి కుల మతాలు? తుఫాన్‌లు, వరదలు, కరవు కాటకాలు వస్తే అందరూ ఒకే దగ్గర తలదాచుకుంటారు కదా! ఆ స్థలం… ఏ మతానికి చెందినది? పుష్పాలు ముడుచుకొనే తలకు మతం ఉంది. మరి పువ్వులదే మతం, కులం? తగలేస్తే… అమ్మో… నాయకుల గతి ఏం కావాలి… దేశం ‘విశ్వం’ అయితే… వారి ఉనికి…!?
ఆమె నవ్వుకుంది…
సాయింత్రమయింది.. ‘‘అమ్మా… రాత్రులు స్త్రీలు ఇక్కడ ఉండకూడదు… ఎక్కడ ఉంటారు? మీ అత్తగారు వాళ్లొచ్చారు. వారింటికి వెళతారా? భయం వద్దు. మీకు తోడుగా పోలీసులు ఉంటారు…’’ అన్నాడు స్టేషన్ అధికారి.
మళ్లీ తనే…‘ప్రెస్ వారొచ్చారు. ఏవో అడుగు తారట. మీరు చదువుకొన్నవారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు… జాగ్రత్తగా చెప్పండి…’’ అన్నాడు.
ఆమె సరేనంది… మొత్తం స్టేషన్ ఖర్చు ఈ రెండు రోజులుగా ఆమె పెట్టుకుంది. అది తన ధర్మమనుకుంది. అన్నట్లు ‘ధర్మాని’ది ఏ కులం? ఏ మతం…?
బయట ఓ బండ మీద ఆమె కూర్చుంది. ఇటూ, అటూ ఇద్దరు మహిళా పోలీసులు నిల్చోని ఉన్నారు. ప్రెస్ వాళ్లు ఆమెను గురించి అడిగారు.
‘‘ఏమీ లేదు. నాది, నాగేశ్వర్‌ది కులాలు, మతాలు వేరువేరు. మేమిద్దరం ఒక దగ్గరే పని చేస్తున్నాం. ఆయన నాకు ఐదేళ్లు సీనియర్. ఒకరినొకరం ఇష్టపడ్డాం. రెండిళ్లలో చెప్పాం. వారు సరేనన్నారు. పెళ్లి చేశారు. కానీ… నాలుగో రోజే…’’ ఆమె దుఃఖితురాలైంది.అలా ఉండిపోయింది..
క్షణం తరువాత…‘‘నేను ఏడవను. నా ఏడుపు వారికి ఆనందం కాకూడదు. నాకంటూ ఓ లక్ష్యం ఉంది. మా ఇద్దరి ఆస్తిపాస్తులు చట్టరీత్యా నావే. నాకు కులమతాలతో పని లేదు. వాటిని ‘స్వార్థ్ధం’ కోసం వాడుకొనే చోట నేనుండలేను. త్వరలోనే అమెరికా వెళ్ళిపోతాను…’’ అంది ఆవేశంగా…
‘‘కానీ రేపు మీరు తల్లిగా మారాలనుకొని మరో వివాహం లేదా ఎవరినైనా దత్తత తెచ్చుకొని… పెంచి…పెద్ద చేసి… ఓ తల్లిగా ఆలోచిస్తే…’’ ఓ మహిళా విలేకరి ప్రశ్న…
‘‘ఆలోచించను. నా అనుభవం నాకు పాఠం. బంగారు వస్తువులు అందరూ ధరిస్తారు. కానీ.. ఆ బంగారానికి మతం లేదు. గాలి, నీరు, అగ్ని, వాయువు, చెట్లు…ఇలా దేనికి కులం, మతం లేవు. వాటికి పరువు హత్యల బాధలేదు. ఇవన్నీ మనకే. ఏది పరువు? ఏది మతం? ఏది కులం? ఎవరు దీనిని నిరంతరం మనకు గుర్తు చేస్తున్నారు… వారి నుంచి దూరంగా వెళ్లాలి. వెళ్తాను ఎంత దూర మయినా…!’’ అంది. ఆమె మాటల్లో ధృడత్వం…
‘నిజమే.. మీకు అన్నీ రకాలుగా ఆలంబన లున్నాయి. ఇవేవి లేని వారి పరిస్థితి ఏమిటి?’’ మరో విలేకరి ప్రశ్న.
‘‘ఇకనుంచి నా పని అదే. నా జీవితం ఎటు వెళుతుందో నేను చెప్పలేకపోవచ్చు. కానీ, ఎలా వెళ్లాలో నేను మాత్రమే తేల్చుకోగలను. నాకు మీ సహాయం కావాలి. చేయగలరా? అడిగింది. మహిళా విలేకరులంతా ఆమె చేతిలో చేయివేసి హామీ ఇచ్చారు.
‘‘ఓ హిందువు ముస్లింను చంపొచ్చు. ఓ ముస్లిం, హిందువును చంపొచ్చు. కానీ చనిపోయేది మనుషులు మాత్రమే. మతం కాదు, కులం కాదు. ఇదెందుకు జనం గ్రహించరని మీరు సమాజాన్ని ప్రశ్నించండి. ప్లీజ్…’’ అని బండ మీద నుంచి లేచింది.
ఆ బండకున్న చిన్న రంధ్రం నుంచి ఓ లేత మొక్క సన్నగా, చిన్నగా బయటకు వస్తున్నది. ఓ ప్రెస్ ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించాడు.
ఇద్దరు పోలీసుల సహాయంతో ‘ఆమె’ తన ఇంటికి వె…ళు…తు… న్న..ది…
జ్ఞానం కన్నా ఊహ.. చరిత్ర కంటే కల్పన… వాస్తవాల కంటే కలలు.. అనుభవం కంటే ఆశ… మృత్యువు కంటే ప్రేమ శక్తిమంతమయినవి…