– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

నిజాం ఏలుబడిలో తొలి బలిపశువులు భాష, సంస్కృతులే. 1911లో గద్దె ఎక్కిన నాటి నుండి ఒక పద్ధతి ప్రకారం తెలుగును తుడిచిపెట్టాడు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. ఉర్దూను బోధనా భాషగా ప్రకటించాడు. లక్నో నుండి ఉర్దూ విద్వాంసులను, కవులను రప్పించాడు. మెడిసిన్‌, ఇం‌జనీరింగ్‌  ‌పాఠ్యపుస్తకాలను అందులోకి  తర్జుమా చేయించాడు. తెలుగుకు తెలంగీ, బేడంగీ అని వెక్కిరింపు మొదలైంది. అందుకే దాశరథి కృష్ణమాచార్య నిజాంను ‘ముసలినక్క’ అని సంబోధించాడు. ఉస్మానియాలో నియమితులైన వారంతా బయటి వారే. దీనికి వ్యతిరేకంగా రాజ్యంలోని ముసల్మానులు ‘ముల్కీ’ (స్థానికుడు) ఉద్యమం తీసుకువచ్చారు.

నిజాం రాజ్యం భారతదేశంలోని అతి పెద్ద సంస్థానం. కానీ ఈ రాజ్యంలో ఉన్నవి నాలుగు ఇంటర్మీడియట్‌ ‌కళాశాలలు. ప్రతీ జిల్లాకు ఒక పౌఖాన్యా- హైస్కూలు, ప్రతీ తాలూకాకు ఒక వస్తాన్యా- మిడిల్‌ ‌స్కూలు ఉండేవి. గ్రామాల్లో తహతాన్యా -ప్రయిమరీ స్కూలు ఉండేది. నిజాం నవాబు ఖాన్గీబడులు- వీధి బడులను ఫర్మానా ద్వారా నిషేధించాడు. అందువల్ల ఉపాధ్యాయులు తమ ఇళ్లలోనే తెలుగు చదువు చెప్పేవారు.

‘ఆచంద్రతారార్కం నిజాం రాజ్యం వర్ధిల్లాలి’ అనే ప్రార్థనతో తరగతులు ప్రారంభమయ్యేవి. ప్రతీ విద్యాలయంలో దీన్యాత్‌, అం‌టే మత విద్య (ఖురాన్‌ ‌పీరియడ్‌) ‌తప్పనిసరి. శుక్రవారం వారాంతపు సెలవు. ప్రధాన సెలవులలో ఒకటి హుజూర్‌ ‌సాల్గిరా, అంటే ప్రభువు వారి జన్మదినం. ఆ రోజు పిల్లలందరూ ఊరేగింపుగా నరసింహస్వామి గుట్ట దగ్గర ఖేల్‌ ‌మైదాన్‌కు చేరుకోవాలి. అన్ని మదర్సాల తుల్బా, అంటే అన్ని స్కూళ్ల విద్యార్థులు చేరు కుంటారు. మిఠాయి పంచుతారు. మొహరం పీర్ల పండుగకు 15 రోజులు సెలవులు. రంజాన్‌ ఏ ‌కాలంలో వచ్చినా ఒంటిపూట బడి మాత్రమే. నిజాం కాలండర్‌ ‌హిజ్రా ప్రకారం జరుగుతుంది. క్రీస్తు శకానికీ హిజ్రాశకానికీ సుమారు 500 సంవత్సరాలు తేడా ఉంటుంది. హిజ్రా అంటే మహమ్మద్‌ ‌ప్రవక్త మక్కా వదలి మదీనా వెళ్లడం.

నిజాం రాజ్యంలో మత మార్పిడి, అందులోని విషాదం, నిస్సహాయత దయనీయంగా ఉండేవి. దాశరథి రంగాచార్యుల ‘చిల్లరదేవుళ్లు’ నవలలో బహదూర్‌ ‌ఖాన్‌ ‌మతం మార్చినప్పుడు ఎందరో స్త్రీల మంగళసూత్రాలను త్రెంచిన ఘట్టం చదువుతూ మాడపాటి హనుమంతరావు వెక్కెక్కి ఏడ్వడం ప్రారంభించారట. తరువాత ముఖం కడుక్కుని దాశరథితో అన్నారట. ‘నీవు రాసిన తీరు నన్ను కదిలించింది, ఇటువంటి దృశ్యాలను ఎన్నిటినో ప్రేక్షకులుగా చూసిన దౌర్భాగ్యం మాది’ అన్నారట. ఉస్మాన్‌ ‌రాజ్యం అలాంటి పిశాచ రాజ్యం. నిజాంతో పాటు జాగీర్దారులు, దొరలు, దళారులు, వారి తాబేదారులు, పటేల్‌, ‌పట్వారీలు మున్నగు వారంతా చోటా నిజాములే.

 మహారాజుల దుశ్చర్యలను గురించి దివాన్‌ ‌జర్మనీ దాస్‌ ‘‌మహారాజా’ అనే నవల్లో వారు ప్రజల రక్తాన్ని ఎలా పీల్చారో వివరించారు. ‘మేలియా దో కే చీనార్‌’ అనే తన ఆత్మకథలో కిషన్‌చందర్‌ అనే ఉర్దూ రచయిత కశ్మీర్‌లో ప్రజలను ఎలా పీడించారో వివరించాడు. ఓ కవి చెప్పినట్లు ఛెంఘిజ్‌ఖాన్‌, ‌తామర్లేన్‌, ‌నాదిర్షా, గజనీ, ఘోరీ, సికిందర్‌ ఎవరైతేనేం! ఒక్కొక్కడూ మహా హంతకుడు. అందుకే దాశరథి నిజాంను ‘దగాకోరు, బడా చోర్‌ ‌రజాకార్‌ ‌పోషకుడవు’ అన్నారు.

నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులయ్యారు. అది చూసి నవాబు బెదిరి పోయాడు. ఈ జనమంతా తన మీద పడ్డట్లే భయ పడ్డాడు. నిజాంకు జనమంటే బెదురు, చదువంటే బెదురు, వెలుగంటే అదురు. అందుకే గస్తీ నిషాన్‌ ‌తిర్యన్‌-53‌ను ప్రకటించాడు. అది నిజాం ప్రజల సమస్త హక్కులను హరించింది. వారిని కట్టేసింది, నోరు కుట్టేసింది. ఇదే సమయంలో ‘సుల్తాన్‌ ‌బజారు’ పేరు చెప్పినా నిజాంకు భయమే. కారణం, అక్కడ రెసిడెంట్‌ ‌పాలన. అంటే బ్రిటిష్‌ ‌పాలన. అక్కడి యువకులే నిజాం పాలనకు చరమగీతం పాడ నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్‌లోని సుల్తాన్‌ ‌బజారుకు చెందిన ఓ బట్టల దుకాణాదారుడు, ఓ క్షురకుడు, ఆర్యా ఫోటో స్టూడియో యజమాని సత్యనారాయణ, ఓ దర్జీ నిజాం తలరాతను మార్చాలని హైదరాబాదు విమోచనోద్యమంలో భాగమయ్యారు. కోటి, అబిద్స్ ‌మధ్య సుల్తాన్‌ ‌బజార్‌ ఉం‌టుంది. దీన్ని పూర్వం రెసిడెన్సీ బజార్‌ అనేవారు. ఇక్కడే బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ ఉం‌డేవాడు. తరువాత నవాబ్‌ ‌సయ్యద్‌ ‌సుల్తానుద్దీన్‌ ‌పేరున సుల్తాన్‌ ‌బజారైంది. ఇక్కడ 1892లో ఆర్యసమాజ్‌ ‌శాఖను ప్రారంభించారు. ఇప్పుడున్న ఉమెన్స్ ‌కాలేజీ నాటి బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ ‌కార్యాలయం. బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ ‌తాలూకా ఆఫీసర్లు ఈ ప్రాంతంలో మకా చేసి ఉండేవారు. దీనిపై నిజాం ఏనాడూ దాడిచేయలేదు. కనుక దేవిదీన్‌ ఆర్య సమాజానికి ఈ భూమిని దానం చేశారు. ఇక్కడ ఆర్య బాల బాలికల పాఠశాల ఉండేది. పండిట్‌ ‌రుద్రదేవ్‌, ‌పండిట్‌ ‌నరేంద్రదేవ్‌ల నాయకత్వం మత మార్పిడి లకు వ్యతిరేకంగా స్థానిక యువత సహాయంతో పోరాడారు. ఆయనే ఆర్య యువ క్రాంతిదళ్‌ ‌స్థాపించారు.

నారాయణరావ్‌ ‌పవార్‌ ఉద్యమం ఆసక్తికర మైనది ఈయన ఒక దళం ఆరంభించాడు. ఇందులో గన్‌ఫౌండ్రీ ప్రాంతవాసులు పండిట్‌ ‌విశ్వనాథ్‌, ‌రెడ్డి పోచానందం, లాలాగూడా రైల్వే కార్మికుడు జి.నారాయణస్వామి, న్యూ బాంబే టైలర్స్ ‌షాపు నడిపే బాలకిషన్‌, ‌మోడరన్‌ ‌హెయిర్‌ ‌కటింగ్‌ ‌సెలూన్‌ ‌యజమాని గుండయ్య, శంషాబాద్‌ ‌ప్రాంతవాసి జగదీష్‌, ‌న్యాయవాది కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ దళం సలహాదారు, ఫైనాన్షియర్‌ ‌కూడా. దేవయ్యకు చెందిన దిల్షాద్‌ ‌టాకీస్‌ ఎదురుగా ఉదయ్‌ ‌క్లాత్‌ ‌స్టోర్సు ఉండేది. రాత్రి రహస్య సమావేశాలు ఆ మేడపైన నిర్వహించేవారు. అక్కడకు హైదరాబాద్‌ ‌పాత నగరం నుండి భీష్మదేవ్‌ అని మరో మిత్రుడు వచ్చేవాడు. బ్రిటిష్‌ ఇం‌డియాలో ‘షహీదీ కి పటోలీ’ అనే పుస్తకం (అమరదళం) నిషేధించారు. రాస్థాన్‌ ‌నుండి బాలకిషన్‌ ‌రహస్యంగా ఓ ప్రతిని తెప్పించాడు. ఆ పుస్తకం వారి విప్లవ జీవితాన్ని తీర్చిదిద్దింది.

కాని తమ దగ్గర ఆయుధాలు, బాంబులు కొనుగోలు చేయడానికి సరిపడా ధనం లేదు. హైదరాబాద్‌ ‌నుండి వచ్చిన శరణార్ధులకు హయగ్రీవా చారి ఆంధ్రాలో శరణాలయం నడుపుతున్నారు. ఆయనను సహాయం అర్ధించగా, ఆర్థికంగా ఆదుకోలేకపోయారు. దానితో బాల్‌కిషన్‌ ‌తన భార్య నగలు అమ్మగా వచ్చిన ధనంతో ఆయుధాలను కొన్నారు. ఉత్తర భారతం నుంచి అరబ్బు, కాంది శీకుల రైలు వస్తున్నది. దానిని అడ్డుకోవడానికి ఘట కేసర్‌ ‌దగ్గర పట్టాలకు గల షిప్‌ప్లేట్లను తొలగించారు. కాని గాంగ్‌మేన్‌ ‌సకాలంలో స్పందించి ట్రైనును రక్షించారు. తరువాత పోలీసు లైన్సుపై బాంబులు విసిరారు. అది కొంతవరకూ విజయవంతమైంది. ఇక ఏమైనా నిజాంను తుది ముట్టించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. సైన్యం, పోలీసుల కదలికలు, నిజాం దినచర్య పూర్తిగా అధ్యయనం చేశాకే ఈ పనికి పూనుకోవాలని ముస్లిం యువకుల వేషధారణతో పాతబస్తీ ఏరియా బాగా తిరిగి అవగాహన తెచ్చుకున్నారు. నారాయణరావు పవార్‌, ‌బాలకిషన్‌ ‌ముస్లింల వేషధారణలో చారుసాలా మైదానంలో మహ్మదాలీ జిన్నా ప్రసంగం విన్నాక వారిద్దరిలో ఆవేశకావేశాలు వచ్చాయి. ఆత్మ గౌరవం లేకుండా జీవించడంకంటే చనిపోవడం మేలని అక్కడే ప్రతిజ్ఞ తీసుకున్నారు. వీరు నేతాజీ ప్రసంగాలను ఆసక్తిగా వినేవారు. ‘మీ రక్తం నాకివ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అనే నినాదం బాగా ఉర్రూతలూగించింది.

నిజాంపై బాంబులు విసిరి చంపాలని నిర్ణయించుకున్నారు. ఆపై ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రోజూ సాయంత్రం దార్‌ ఉల్‌షిపాలోని తన తల్లి సమాధిని సందర్శించడానికి నిజాం క్రమం తప్పకుండా అదే రూట్‌లో వస్తాడు. పండిట్‌ ‌విశ్వనాథ్‌, ‌నారాయణరావు పవార్‌ ‌బాంబులు కొనడానికి బొంబాయి వెళ్లారు. షోలాపూర్‌లో కొండా లక్ష్మణ్‌ను కలిశారు. రజాకారులను ఎదుర్కోవడానికి తమకు బాంబులు కావాలన్నారు. నిజాంను ఎందుకు చంపకూడదు అని అతను అడిగినప్పుడు, నిం చెప్పేశారు. ఆయన ఆరువందల రూపాయిలు సాయం చేశారు. వెంటనే బొంబాయి వెళ్లి దీక్షిత్‌ ‌మహారాజును కలిశారు. అతని నుండి రెండు బాంబులు కొన్నారు. తిరుగు ప్రయాణంలో కొండా లక్ష్మణ్‌ను కలువగా ఆయన మూడు రివాల్వర్‌లు, మూడు విషం సీసాలు సిద్ధం చేసి ఉంచారు. బందీలుగా రహస్యాలు బయట పెట్టడం కంటే చనిపోవడమే మేలని సూచించి మూడు విషం సీసాలు ఇచ్చారు.

నిజాంను ఎందుకు చంపాలని అనుకున్నామో వివరంగా రాసి నారాయణ స్వామికి ఇచ్చారు. ప్రణాళిక అమలు చేసే రోజు ఆ ప్రతిని ప్రెస్‌కు రేడియోకు ఇవ్వాలని చెప్పారు. దానిపై నారాయణ రావు పవార్‌ ‌ముందు దాడి చేయాలి, అక్కడ కుదరక పోతే జగదీశ్‌, అదీ వీలు పడకపోతే గుండయ్య నిజాంను చంపాలి. ఇది ప్రణాళిక. నారాయణరావు పవార్‌ ‌నిజాంపై బాంబు విసిరాడు. అయితే అది కారు డోరుకు తగిలి, రోడ్డుపై పడి పెద్ద శబ్దం చేసింది. దానితో నిజాం ప్రాణాలతో బయటపడ్డాడు. జగదీశ్‌, ‌గుండయ్యలు తప్పించుకున్నారు. నారాయణరావును పట్టేశారు. నిజాంను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. జవాన్లు పవార్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. పవార్‌ ‌హిందువా, మహ్మదీయుడా అని తెలుసుకోవడానికి అతని బట్టలు విప్పారు. ‘ఖత్నా’ ‘సున్తీ’ చేయనందున హిందువుగా గుర్తించారు. ఎదురు సెల్‌లో గుండయ్య కన్పించాడు. వరంగల్‌లో గల ఆయన తండ్రికి కబురు పెట్టారు. తండ్రి వచ్చి చూసి ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.

పవార్‌కు చివరకు కోర్టు మరణశిక్ష, గుండయ్యకు, జగదీష్‌కు ఆజన్మ కారాగార శిక్షలు విధించింది. పవార్‌ ఉరిశిక్షను సెషన్స్ ‌కోర్టు ఖాయం చేయగానే పండిట్‌ ‌రాంప్రసాద్‌ ‌బిస్మిల్‌ ఉద్యమకారుని కవిత్వంలోని ఆ పంక్తులు బిగ్గరగా చదివారు.

‘‘సర్‌ ‌కటా సక్తే హై లేకిన్‌ ‌సార్‌

‌జూకా సక్తే నహీ’’

(తలను నరికి వేయవచ్చును, కానీ తల వంచకూడదు)

నారాయణరావ్‌ ‌పవార్‌ ‌సాహసం గురించి నిజామాబాద్‌ ‌కారాగారంలో ఉండగా దాశరథికి తెలిసింది. ఒక కవిత రాశారు.

‘ఒక కప్పు అగ్నిరసం తాగించిన/ నీ హస్తం విసిరిన రవిగోళం (గ్రెనైడ్‌)/ ‌నరకాసుర మర్దనానికి నడిచిన యాదవ యోధుని (కృష్ణుడు) కోదండ వినిర్గిత బాణ -నాలుగు డిసెంబర్‌ 47/ ‌నారాయణరావు నీలో అగ్ని సముద్రం ఉందట నిజమేనా?/ అగ్ని మనిషి నారాయణరావ్‌’

చివరకు సెప్టెంబరు 17, 1948 నాటి పోలీసు చర్య తరువాత వారు  విడుదలయ్యారు.

About Author

By editor

Twitter
YOUTUBE