పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న విచిత్ర పరిస్థితి అసలే అథోగతిలో ఉన్న దేశాన్ని మరింత దయనీయ స్థితికి దిగజారుస్తోంది. కేవలం మతం ఆధారంగా ఏర్పడి, మతమౌఢ్యం పతాకస్థాయికి చేరిన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి పాకిస్తాన్‌ ‌గొప్ప ఉదాహరణ. చివరకు ఆ దేశ జాతిపిత జిన్నా సమాధిని కూడా ధ్వంసం చేశారంటే నాగరికత ఎంతటి దుస్థితికి దిగజారిందో అర్థమవుతోంది. ఒకవైపు ఇమ్రాన్‌ఖాన్‌-‌సైన్యం మధ్య పోరు, మరోవైపు ప్రభుత్వం-న్యాయవ్యస్థ మధ్య జగడం వ్యవస్థలను నిర్వీర్యంచేసి ప్రజలను దుర్భరస్థితిలోకి నెట్టేస్తున్నాయి. అప్రతిహతంగా అధికారాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటూ వచ్చిన సైన్యం తొలిసారి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు వ్యవస్థల పతనం దేశానికి రాచపుండుగా మారాయి. కేవలం మూడు రోజుల విధ్వంసంలో రూ.250 మిలియన్‌ ‌రూపాయల విలువైన ఆస్తినష్టం జరిగిందంటే విధ్వంసం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. ఇదేసమయంలో పాకిస్తాన్‌ ‌రెండు ముక్కలయ్యే ప్రమాదమున్నదని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌హెచ్చరిస్తుండటం గమనార్హం. 1971 నాటి పరిస్థితులే పునరావృతమవుతాయమని ఉదహ రిస్తున్నాడు. ఇమ్రాన్‌ఖాన్‌ – ‌షహబాజ్‌ ‌షరీఫ్‌-ఆర్మీ చీఫ్‌ అసీఫ్‌ ‌మునీర్‌ల మధ్య జరుగుతున్న ఈ పోరాటం దేశం మరోసారి ముక్కలు కావడానికి దారితీస్తే అంతకన్నా దౌర్భాగ్యం మరోటుండదు.

ఇమ్రాన్‌ ‌వర్సెస్‌ ‌సైన్యం

ప్రస్తుతం ఇమ్రాన్‌ ‌ఖాన్‌ను, ఆయన పార్టీ పాకిస్తాన్‌ ‌తెహ్రిక్‌ ఈ ఇన్సాఫ్‌ (‌పీటీఐ)ను పూర్తిగా తెరమరుగు చేయాలన్న కృత నిశ్చయంతో సైన్యం పనిచేస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించడం, ప్రొవెన్షియల్‌ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకించడం ద్వారా ఉన్నత న్యాయాస్థానాలు ఖాన్‌ ‌పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం సైనికాధికారుల్లో బలంగా నాటుకు పోయింది. ఖాన్‌ ‌మద్దతుదారులు 123 మందిని తక్షణమే విడుదల చేయాలని లాహోర్‌ ‌హైకోర్టు ఆదేశించడం సైన్యానికి పుండుమీద కారం చల్లినట్టే. ఖాన్‌ను ఎట్టిపరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రానివ్వకూడదని సైన్యం గట్టి పట్టుదలతో పావులు కదుపుతున్నా, సుప్రీంకోర్టు ఆదేశాలు, సైనిక ఆస్తులపై జరిగిన విధ్వంసకాండ పెద్ద అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడం సైన్యానికి కొరుకుడు పడటంలేదు. ఇదిలావుండగా బెయిల్‌పై ఉన్న ఇతరత్రా కేసుల్లో ఇమ్రాన్‌ ఏ ‌క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశముంది. మే 17న పెద్దసంఖ్యలో పోలీసులు తమ ఇంటిని చుట్టు ముట్టారని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ఆరోపించారు. లాహోర్‌లోని జమన్‌పార్కులోని తన ఇంట్లో 40 మంది ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టు పంజాబ్‌ ‌ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించడమే కాదు.. అల్లర్లపై జ్యుడిషియల్‌ ‌కమిషన్‌ను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ పరిణామాలు మళ్లీ ఖాన్‌ ‌వర్సెస్‌ ‌సైన్యం అనే పరిస్థితికి దారితీస్తున్నాయి.


‌పాక్‌ ‌సైనిక చట్టం

పాకిస్తాన్‌ ‌సైనిక చట్టాన్ని 1952లో అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం కింద సైనిక న్యాయ నిబంధనల కింద సైనికులపైనే విచారణ జరపవచ్చు. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు సాధారణ పౌరులను కూడా విచారించే వీలు కల్పిస్తున్నాయి. 1966లో అప్పటి సైనిక నియంత, ఈ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. దీని ప్రకారం తిరుగుబాటుకు పాల్పడే సాధారణ పౌరులను కూడా విచారించి శిక్షించేందుకు వీలుకలిగింది. అంటే సైనిక ఆస్తులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సాధారణ పౌరులపై విచారణ జరిపి శిక్షించవచ్చు. ఇటువంటి కేసులను ఫీల్డ్‌జనరల్‌ ‌కోర్ట్ ‌మార్షల్‌ ‌పేరు గల కోర్టు విచారిస్తుంది. ఈ కోర్టు మిలిటరీ లీగల్‌ ‌డైరెక్టరేట్‌ ‌పర్యవేక్షణలో పనిచేస్తుంది. దీన్నే జడ్జి అడ్వకేట్‌ ‌జనరల్‌(‌జేఏజీ) బ్రాంచ్‌ అని పిలుస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, లాయర్లను నియమించు కునేందుకు కోర్టు వీలు కల్పిస్తుంది. లాయర్లను నియమించుకోలేకపోతే తమకు ప్రతినిధిగా సైనికాధి కారులను ఏర్పాటు చేసుకోవచ్చు. నేరం రుజువైతే ఆర్మీ కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు 40 రోజుల పాటు సమయం ఇస్తారు. సైనిక న్యాయ స్థానంలో తమకు న్యాయం జరగదని భావించి నప్పుడు వారు నేరుగా పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. కేసు తీవ్రతను బట్టి రెండేళ్ల నుంచి జీవితకాలం వరకు జైలుశిక్ష పడవచ్చు. మరణశిక్ష కూడా విధించే వీలుంది. ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ప్రధానిగా ఉండగా 2018 ఆగస్టు నుంచి, 2022 ఏప్రిల్‌ ‌వరకు 40మంది పౌరులను ఈ చట్టం కింద విచారించారు.

2021లో పాకిస్తాన్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త ఇద్రిస్‌ ‌ఖత్తక్‌ను ఈ చట్టం కింద గూఢచర్యం కేసులో విచారించి 14 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. 2020లో 200 మంది పౌరులపై నేర నిర్ధారణ జరపగా, పెషావర్‌ ‌హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. వీరంతా నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులు. పౌర, సైనిక ఆస్తులపై దాడికి పాల్పడ్డారన్నది వీరిపై ఆరోపణ. సాధారణ పౌరులను సైనిక న్యాయ స్థానంలో విచారించడాన్ని, పాకిస్తాన్‌లో, విదేశాల్లోని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


ఇమ్రాన్‌-‌మునీర్‌ ‌మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు

ఇమ్రాన్‌ఖాన్‌కు-మునీర్‌కు మధ్య పోరాటం ఇప్పటిది కాదు. మునీర్‌ ఐ.ఎస్‌.ఐ. ‌చీఫ్‌గా ఉన్న కాలంలో, అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ అవి నీతిపై ఒక నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉప్పు-నిప్పు చందంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. పాక్‌ ‌సైన్యాధిపతి అసీఫ్‌ ‌మునీర్‌ ‌తన అరెస్ట్‌కు పారా మిలిటరీ దళాలకు ఆదేశాలు జారీ చేశాడని ఖాన్‌ ‌గతవారం ఆరోపించిన తర్వాత ఆయన అరెస్ట్ ‌కావడం, తర్వాత కొద్దిరోజులకు రెండు వారాల బెయిల్‌పై బయటకు రావడం జరిగిపోయాయి. కాగా బెయిల్‌ను మే 31వరకు పొడిగించడం ఖాన్‌కు ఊరట కలిగించే అంశం. ఇమ్రాన్‌•ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పీటీఐకి స్వల్ప విజయం మాత్రమే. ఎందుకంటే ఖాన్‌ ‌బెయిల్‌పై బయటకు వచ్చినా పార్టీకి చెందిన ఏడువేలమంది నేతలు జైళ్లలో మగ్గుతున్నారు. కొంతమంది విడుదలైనప్పటికీ, పార్టీ తరపున ఆందోళనలో పాల్గొనబోమని హామీ ఇచ్చిన తర్వాతనే సైన్యం వారిని విడుదలచేసింది.

ఇప్పటికీ ఇమ్రాన్‌ఖాన్‌ ‌దేశంలో అత్యంత ప్రజా దరణ పొందిన నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎన్నికలు జరిగితే ఆయనే ప్రధాని కావడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్న నేపథ్యంలో, ఆయన్ని సైనిక చట్టాల కింద విచారించడానికి షహబాజ్‌ ‌షరీఫ్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం ఒప్పుకోవడంలో పెద్ద విశేషమేం లేదు. జాతీయస్థాయి ఎన్నికలు జరపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఖాన్‌ ‌తన పార్టీ నేతృత్వంలోని పంజాబ్‌, ‌ఖైబర్‌ ‌ఫక్తూన్‌క్వా ప్రావెన్స్‌ల్లోని ప్రభుత్వాల చేత అసెంబ్లీలను రద్దు చేయించాడు. కానీ ఎన్నికల నిర్వహణకు తగినన్ని నిధులు లేవని చెబుతూ ప్రభుత్వం తక్షణం ఎన్నికలు జరపడానికి తిరస్కరిం చింది. పంజాబ్‌ ‌ప్రావెన్స్‌లో ఎన్నికలు జరపా లన్న మే 14 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఇంకా అమలు జరపలేదు. ఖాన్‌ అరెస్ట్‌కు ముందు ప్రభుత్వం, విపక్ష నేతలు సమావేశమై ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి యత్నించారు. కానీ కీలక విపక్ష నేతలంతా జైళ్లలో ఉండటంతో ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు మధ్యవర్తిత్వం నెరపడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌ముందుకు రాగా, మునీర్‌ ‌దానిని తిరస్కరించారన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల ప్రభావంతో వచ్చే అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతాయా? అనే అనుమానాలు ఉత్పన్నమవు తున్నాయి. ఎన్నికలు జరిగినా, ఓడినా వారు ఈ ఫలితాలను ఒప్పుకోరు. పోనీ ఎన్నికలను వాయిదా వేస్తే రాజ్యాంగాన్ని, ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించినట్టే. అందువల్ల ఎన్నికల నిర్వహణ ద్వారా రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే, రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేయవచ్చు.

చీఫ్‌ ‌జస్టిస్‌పై ప్రభుత్వ పోరాటం

ఒకవైపు ఖాన్‌-‌సైన్యం మధ్య పోరు సాగుతుండగా, మరోవంక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడానికి సంకీర్ణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇమ్రాన్‌ ‌ఖాన్‌ అరెస్టయిన ఒక్క రోజులోనే ఆయన విడుదలకు ప్రధాన న్యాయమూర్తి ఉమర్‌ అతా బండియాల్‌ ఆదేశాలు జారీ చేయడం అందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయ మూర్తికి వ్యతిరేకంగా ప్రభుత్వం పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో, ప్రధాన న్యాయమూర్తి రాజీనామా కోరుతూ కొందరు సుప్రీంకోర్టు ఎదుట పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపారు. విపక్షం సైన్యంపై, ప్రభుత్వం సుప్రీం కోర్టుతో పోరాడుతున్నాయి. నిజంగా ఇది ప్రమాదకర స్థితి. ‘స్వేచ్ఛాయుత హింసకు’ ఇదొక రాచబాటగా మారింది. సైనిక ఆస్తులపై దాడులకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది సైన్యం తప్ప ప్రభుత్వం కాదు. సైన్యం నిర్ణయానికి కేబినెట్‌ ‌స్టాంప్‌ ‌వేస్తుందంతే! ఒకవేళ అట్లా చేస్తే సైనిక జోక్యానికి చట్టబద్ధత ఇచ్చినట్లవుతుంది. సైనిక కోర్టుల ఏర్పాటు, ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహ రించాలన్న నిర్ణయాలు, సైన్యం పట్టును మరింత పెంచేవే తప్ప మరోటికాదు. అదీకాకుండా సైనిక చట్టాల కింద సాధారణ పౌరులను విచారిస్తే ఇప్పటికే సైన్యం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మరింత పెరుగు తుంది. తనను ఏదోవిధంగా కొన్నేళ్లపాటు జైలు శిక్షకు గురిచేస్తారన్నది ఖాన్‌ ‌భయం. ఒకవేళ అదే నిజమైతే పరిస్థితి మరింతక్షీణిస్తుంది. గతంలో సైన్యం చేపట్టిన ఇటువంటి చర్యలు పనిచేసినా, ప్రస్తుత పరిస్థితిలో వికటించడం ఖాయం. విధ్వంసకులను శిక్షించా ల్సిందే. కానీ సైనిక చట్టాల కిందకాదు. ఇదే సమయంలో రావల్పిండి సైనిక ప్రధాన కార్యాలయం, లాహోర్‌లో సైనికకమాండర్‌ ఇం‌టిని అల్లరి మూకలు ధ్వంసం చేస్తుంటే చేతులుడిగి చూస్తున్న దెవరు? ఆయా ప్రదేశాల్లో రక్షణ బాధ్యతలు ఎవరు వహిం చాలి? వీటిపై కూడా విచారణ జరపాలి. నిజం చెప్పా లంటే సాధారణ ప్రజలెవరూ సైన్యం అధీనం లోని సున్నిత ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి సాహసించరు! దురదృష్టమేమంటే ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకే వాడుకోవాలని చూస్తోంది. ఇంతటి దౌర్భాగ్యస్థితి మరే ఇతర దేశంలో కనిపించదు.

దేశ ప్రజలే సమిధలు

ప్రభుత్వం-సైన్యం ఒకపక్క, ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌మరో పక్క జరుపుతున్న ఈ పోరాటం మధ్యలో దేశప్రజలు సమిధలవుతున్నారు. తమ కుటుంబ సభ్యులకు కడుపునిండా తిండిపెట్టలేని దుస్థితి వారిది. ఆహార ద్రవ్యోల్బణం 50శాతం పెరిగిపోయింది. వాస్తవానికి, ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి, దేశ ఆర్థిక సంక్షోభం ఆజ్యం పోసింది. ముఖ్యంగా పిల్లలకు అన్నం కూడా పెట్టలేని దుస్థితి పెరిగేకొద్దీ ఖాన్‌కు సామాన్యుల మద్దతు మరింత పెరుగుతోది. ఆర్థిక నిర్వహణ సక్రమంగా లేదన్న కారణంతో ఖాన్‌ను పదవీచ్యుతుడిని చేసి ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో విఫలం కావడం, మరోపక్క భీకర వరదలు, గత దశాబ్ద కాలంలో కార్మికవర్గ వేతనాలు దారుణంగా పడి• పోవడం వంటివి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 4.4 బిలియన్‌ ‌డాలర్ల విదేశీమారకద్రవ్య నిధులు కేవలం మూడు వారాల దిగుమతులకు సరిపోతాయి. 6.5 బిలియన్‌ ‌డాలర్ల ఐఎంఎఫ్‌ ‌బెయిల్‌ అవుట్‌ ‌ప్యాకేజీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులను నిలి పేయడంతో, దేశంలోని చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. దీనికితోడు గతంలో ఉదారంగా రుణా లిచ్చిన దేశాలు కూడా ముఖం చాటేయడం మరో ఇబ్బంది. ఇటువంటి దిక్కులేని స్థితిలో ఈ సమస్య నుంచి దేశాన్ని తేలిగ్గా ఒడ్డెక్కిస్తానని ఖాన్‌ ‌చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE