– రాజేశ్వర్
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడ అంతర్గత సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణానాతీతం. అంతర్యుద్ధం, లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుం టారు. అక్కడి పాలకులు పట్టించుకోక, స్వదేశానికి వచ్చేదారి లేక నానా అగచాట్లు పడుతుంటారు. ఎప్పుడు ఎటువైపు నుంచి తూటా వచ్చిపడుతుందో తెలియక, ఎటువైపునుంచి బాంబు పేలుడు సంభవిస్తుందో తెలియక బతుకు జీవుడా అంటూ దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. స్వదేశీ పాలకుల నుంచి సరైన స్పందన కొరవడి చేసేదేమీ లేక ఆకలిదప్పులతో అలమటిస్తుంటారు. అంతా బాగుంటే అయినవాళ్ల దగ్గరకు రాగలుగుతారు. లేనట్లయితే ఇంతే సంగతులు.
ఇదంతా చరిత్ర. ఇప్పుడా పరిస్థితి ఎంతమాత్రం లేదు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నాయకత్వంలో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ కేంద్రంలో కొలువు దీరాక ఈ పరిస్థితిలో గణనీయ మార్పు వచ్చింది. ప్రవాస భారతీయులకు ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చిన వారిని ఆదుకునేందుకు, సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు, తాత్కాలికంగా పునరావాస, ఉపాధి సౌకర్యాలు కల్పించేందుకు ఢిల్లీ సర్కారు క్షణాల్లో సమాయత్తమవుతోంది. విదేశాంగ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులను, ఇతర మంత్రులను రంగంలోకి దించుతోంది. సంబంధిత దేశాల అధి నేతలు, మంత్రులు, ఉన్నతాధికారులతో సంప్ర దింపులు జరుపుతూ ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వాయు, జల, రహదారి… ఏది అందు బాటులో ఉంటే ఆ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. ఖర్చు విషయంలో వెనకాడటం లేదు. అంతర్గత సంక్షోభం వల్ల అల్లాడుతున్న ప్రవాస భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తోంది. దీనికి ముందు అంతర్యుద్ధం, అంతర్గత సంక్షోభవం వల్ల భారతీయ సంతతికి చెందిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆయా దేశాల అధినేతలు, దౌత్యవేత్తలతో మాట్లాడుతోంది. తాత్కాలికంగా వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
అంతర్యుద్ధం కారణంగా సూడాన్ కొద్ది రోజులుగా అట్టుడుకుతోంది. ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య ప్రాంతంలో విస్తరించిన సూడాన్ నిరుపేద దేశం. అయితే సహజ వనరులకు లోటులేదు. 4.57 కోట్ల జనాభాతో ఆఫ్రికాలోని అతి పెద్ద దేశాల్లో ఒకటి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్, ఈజిప్టు, ఎరిట్రియా, ఇథియోపియా, లిబియా సరిహద్దులు కలిగి ఉంది. రాజధాని నగరం కార్తూమ్. సూడాన్ సైన్యం, ర్యాపిడ్ సపోర్టు ఫోర్సెస్ మధ్య గత మూడువారాలుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరులో 500 మందికి మరణించినట్లు అంచనా. 4200 మంది గాయపడినట్లు చెబుతున్నారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇరువైపులా ప్రకటన వెలువడినప్పటికీ ఆచరణలో ఒట్టిమాటగానే మిగిలింది. సూడాన్ లో సుమారు 3000 మంది భారతీయులు నివసిస్తు న్నారు. వీరిని స్వదేశం తరలించడానికి ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో భారత్ ఒక కార్యక్రమం చేపట్టింది. వాయు, జలమార్గాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 1725 మందిని భారత్‌కు తరలిం చారు. సూడాన్ పోర్టు ప్రాంతంలోని ఒక భారతీయ పాఠశాలను తాత్కాలికంగా పునరావాస కేంద్రంగా మార్చారు. సూడాన్‌లోని వివిధ సమస్యాత్మక ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా సూడాన్ పోర్టుకు అక్కడి నుంచి విమానాల్లో, ఐఎన్‌ఎస్ సుమేధ తదితర నౌకల ద్వారా సౌదీ అరేబియా లోని జెడ్డా నగరానికి తరలించారు. అక్కడి నుంచి విమానాల్లో ముంబయి, బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీకి తరలిం చారు. ముందు జాగ్రత్త చర్యగా వీరికి టీకాలు వేస్తున్నారు. అంతేకాక క్వారం టైన్‌లో ఉంచుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఆస్పత్రులు, ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో క్వారం టైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత భోజనవసతి సదుపాయాలు కల్పించారు. తాజాగా మూడో విమానం 360మంది ప్రయాణికులతో బెంగళూరుకు చేరుకుంది. నాలుగో విమానం 231 మంది ప్రయాణికులతో ఢిల్లీ చేరుకుంది. 367 మంది ప్రయాణికులతో అయిదో విమానం ఢిల్లీ వచ్చింది. 320 మంది ప్రయాణికులతో మరో విమానం బెంగళూరు వచ్చింది. గతనెల 24 ఆపరేషన్ కావేరిని కేంద్రం ప్రారంభించింది. ఇందుకోసం సూడాన్ పోర్టులో, జెడ్డా నగరంలో కేంద్రం సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భారతీయుల తరలింపులో ఎయిరిండియా విమానాలతో పాటు, ఇండిగో విమానాలు కూడా పాలుపంచుకుంటు న్నాయి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, సహాయ మంత్రి వి.మురళీధరన్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వత్రా తదితర ఉన్నతాధికారులు భారతీ యుల తరలింపు, పునరావాస, సహాయ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు వారికి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. ఇతర అధికారిక కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ సూడాన్ నుంచి ప్రవాస భారతీయుల తరలింపు, వారికి వసతి, పునరావాస కార్యక్రమాల్లో ఖర్చుకు వెనకాడవద్దని అధికారులకు నిర్దేశించారు. చివరి భారతీయుడిని క్షేమంగా తరలించే వరకు విశ్రమించవద్దని వారికి సూచించారు. సంక్షోభంలో చిక్కుకున్న సోదరులను రక్షించుకోవడం కన్నా గొప్ప కార్యక్రమం ఏదీ ఉండబోదని వారిని ఉత్తేజ పరుస్తున్నారు.
పేర్ల వెనక ఉద్దేశమిదీ….
సూడాన్ లో చిక్కుకున్న వారి తరలింపు కోసం ఆపరేషన్ కావేరీ… పేరును ప్రకటించినప్పుడు అందరూ ఆశ్ఛర్యపోయారు. ఈ పేరుకు, తరలింపునకు సంబంధం ఏమిటని పలువురు ప్రశ్నించారు. కానీ ఈ పేరు ప్రకటించడం వెనక మోదీ అంతరంగం మరో విధంగా ఉంది. మోదీ నూటికి నూరుశాతం నికార్సైన భారతీయుడు. ఆయన మనసంతా భారతీయతతో నిండి ఉంటుంది. సూడాన్‌లో చిక్కుకున్న వారిలో కర్ణాటక వాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జీవనది కావేరీ జలాలు కర్ణాటకతో పాటు పొరుగున్న ఉన్న తమిళనాడు, కేరళను సస్యశ్యామలం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాల ప్రజలకు కావేరీ నదితో భావోద్వేగమైన సంబంధం ఉంది. ఈ నది పేరు చెప్పగానే అక్కడి ప్రజల మనస్సులు పులకించిపోతాయి. అందుకనే సూడాన్‌లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయుల తరలింపు కార్యక్రమానికి ఆపరేషన్ కావేరీ అని పేరు పెట్టారు. గతంలోనూ వివిధ దేశాల్లో సంక్షోభాల కారణంగా చిక్కుకుపోయిన ప్రవాస భారతీయుల తరలింపు కోసం ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఇలాంటి పేర్లే పెట్టారు. అఫ్గాన్ ప్రభుత్వాన్ని తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్న సందర్భంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు ‘ఆపరేషన్ దేవీశక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించి వందల మంది ప్రవాస భారతీయులను తరలించారు. కాబుల్, కాందహార్ విమానాశ్రయాల నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకువచ్చారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సంక్షుభిత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయుల తరలింపు కోసం ‘ఆపరేషన్ గంగ’ అనే కార్యక్రమం చేపట్టారు. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌లో పెద్దయెత్తున భారతీయులు నివసిస్తు న్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లారు. ముఖ్యంగా వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులు పెద్దయెత్తున ఆ దేశానికి వెళ్లారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వీరిని తరలించడానికి భారతీయతతో ముడి పడిన ఆపరేషన్ గంగ అనే పేరు పెట్టారు. గంగా నదికి, ఇక్కడి ప్రజలకు గల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 2022 ఫిబ్రవరి నెలాఖరులో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 20వేల మందిని తరలించారు. రుమేనియా, హంగరీ, పోలండ్, స్లోవేకియా తదితర ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి తరలించారు. మంత్రులు జైశంకర్, హర్దిప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. కొవిడ్ సమయంలో వందే భారత్ కార్యక్రమం ద్వారా లక్షలమంది ప్రవాస భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకువచ్చారు. సముద్ర సేతు కార్యక్రమం ద్వారా నౌకల్లో 55 రోజుల పాటు భారతీయులను తరలించారు. జలశక్తి, ఐరావత్, శార్దూల్, మగర్ నౌకల ద్వారా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రవాస భారతీయులను తరలించారు. ఆపరేషన్ మైత్రి కార్యక్రమం ద్వారా 2015లో నేపాల్ భూకంప బాధితులకు మోదీ సర్కారు సాయ మందించింది.
అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తరలించారు. కేవలం స్వదేశీయుల సంక్షేమమే కాకుండా ఎవరికి ఎటువంటి సాయం అవసరమైన అందించడంలో భారత్ ముందు వరుసలో ఉంటోంది. తాజాగా టర్కీ (తుర్కియే), సిరియాల్లో భూకంపం కారణంగా భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. ఆ దేశాలకు సాయ పడేందుకు ఆపరేషన్ దోస్త్… కార్యక్రమం చేపట్టింది. భారత్‌కు చెందిన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు (ఎన్‌ఢీఆర్‌ఎఫ్) దళాలను ఆయా దేశాలకు పంపిం చింది. మందులు, ఆహారంతో వెళ్లిన ఈ దళాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అంతర్జాతీయంగా మన్ననలు అందు కున్నాయి. వాస్తవానికి అంతర్జాతీయ రాజకీయాల పరంగా చూస్తే టర్కీ మనకేమీ మిత్రదేశం కాదు. కాకపోగా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు అదేపనిగా అంతర్జాతీయ వేదికలపై వంత పాడుతుంది. అయినప్పటికీ మానవతా దృష్టితో ఆ దేశానికి సాయమందించి తన పెద్ద మనసు చాటుకుంది. కష్టకాలంలో విదేశాలకు ఆపన్న హస్తం అందించే మోదీ సర్కారు భారతీయుల విషయంలో ఎంత శ్రద్ధాసక్తులు చూపుతుందో చెప్పడానికి చేపట్టిన వివిధ కార్యక్రమాలే నిదర్శనం.
– సీనియర్ జర్నలిస్ట్