దేశంలో ఏదయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పితే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. అది రాజ్యాంగం ద్వారా దానికి సంక్రమించిన అధికారం. మణిపూర్‌లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుని కర్ఫ్యూ దాకా వెళ్లాయి. దాంతో కేంద్రం తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆర్టికల్ 355 విధించి శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇంతకీ మణిపూర్‌లో ఈ పరిస్థితికి దారితీసిన అంశాలేమిటి?
గత వారం మణిపూర్‌లో హింస చెలరేగింది. మైతేయీలకు గిరిజన హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్ర జనాభాలో మైతేయీల వాటా 53 శాతం వరకూ ఉంటుంది. వీరిని గిరిజనుల జాబితాలో చేరిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు వీలుపడుతుంది. మరోవైపు అటవీ భూములపైనా హక్కులూ సంక్రమిస్తాయి. మైతేయీ లకు గిరిజన హోదా కల్పించడంతో రిజర్వేషన్లలో తమ వాటా తగ్గిపోతుందని ఇప్పటికే గిరిజనులుగా గుర్తింపు పొందిన తెగలు వాదిస్తున్నాయి. శతాబ్దాల నుంచి తమ దగ్గరే ఉన్న అటవీ భూములకూ ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నాయి.
మణిపూర్ లోయప్రాంతంలో ఎక్కువగా మైతేయీ ప్రజలు జీవిస్తున్నారు. చుట్టుపక్కల కొండప్రాంతాల్లో కుకీలదే ఆధిక్యం. అయితే, మైతేయీలు అధికంగా ఉండే ప్రాంతంలో కుకీలు, కుకీలు అధికంగా ఉండే ప్రాంతంలో మైతేయీలు స్వల్ప మొత్తంలో జీవిస్తుం టారు. ఆయా ప్రాంతాలలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. కొన్నిచోట్ల మొత్తం గ్రామాలనే తగులబెట్టారు. ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు.
ఇలా ప్రారంభమైంది
మైతేయీ కమ్యూనిటీని ఎస్టీలలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మణిపూర్ హైకోర్టు రాష్ట్ట్ర ప్రభుత్వానికి సూచించడాన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ల్ యూనియన్ (ఏటీఎంఎస్ యూ) మే 3వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు చేపట్టింది. ఆ మరునాటి (మే 4) నుంచి హింస ప్రజ్వరిల్లింది. అది మొదటి నాలుగైదు రోజుల్లోనే మణిపూర్, చురాచాంద్ పూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, టెంగ్పోపాల, కాంగ్పొపొక్పి తదితర ప్రాంతాలకు విస్తరించింది. దాడులు, గృహదహనాలు విశృంఖలంగా సాగాయి.
ఏదైనా రాష్ట్రంలో అంతర్గత ఘర్షణల వల్లగానీ, ఇతర కారణాలతో పరిస్థితి అదుపు తప్పినప్పుడు శాంతిభద్రతలను అమలు చేసే బాధ్యతను రాజ్యాంగంలోని 355వ అధికరణ ప్రకారం కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఆ ప్రకారమే, మణిపూర్‌లో ఆర్మీ, అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగప్రవేశం చేశాయి. కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తేవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మెజిస్ట్రేట్లకు ‘కనిపిస్తే కాల్చివేత’ (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని అప్పగించింది. మొబైల్ డేటా, బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లు నిలిపివేసింది. సైన్యం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. ఆర్మీడ్రోన్లు. హెలికాప్టర్లు మణిపూర్‌ను జల్లెడ పట్టాయి. దాదాపు 10వేల మంది సైనికులు, పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి.
హింసలో కొన్ని పదుల మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కచ్చితంగా ఎంత మంది చనిపోయారనే అంశంలో స్పష్టత లేదు. మణిపూర్ సెక్యూరిటీ ఎడ్వయిజర్ కులదీప్ సింగ్ మాత్రం 37 మంది చనిపోయినట్లు ప్రకటించారు. కుకీ, మైతేయీ తెగలకు చెందిన దాదాపు 23 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని డిఫెన్స్ బృందాలు ప్రకటించాయి. ఆయా రాష్ట్రాలు హింస ప్రజ్వరిల్లిన ప్రాంతాలనుంచి తమ వారిని తరలించాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం మణిపూర్ నుంచి విద్యార్థులను ప్రత్యేక విమానం ద్వారా సురక్షితంగా రప్పించింది. సిక్కిం, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా తమ వాళ్లను కాపాడుకున్నాయి.
నేపథ్యం…
మణిపూర్‌లో ముఖ్యంగా మూడు తెగలవాళ్లు ఉన్నారు. కుకీ, నాగా, మైతేయీ.. ఈ మూడింటితో పాటు కుకీ ఫంగల్ అన్న చిన్నతెగ కూడా ఉంది. కుకీ,నాగాతెగల ప్రజలంతా క్రైస్తవులు. వారిని ఎస్టీ లుగా పరిగణిస్తున్నారు. మెజార్టీ తెగ ప్రజలు మైతీలు. వీళ్లంతా హిందువులు. మణిపూర్‌లో రెండు వేల సంవత్సరాలకు పైగా ఉంటున్నారు. ఇందులో ముస్లిం మతంలోకి మారిన వారిని మైతీ పంగల్ అంటారు.
22వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే మణిపూర్‌లో 10శాతం లోయలో ఉండే మైదాన ప్రాంతం. మిగతా 90శాతం పర్వతాలు, కొండలతో, లోయలతో ఉంటుంది. ఎత్తయిన కొండప్రాంతంలో కుకీ, నాగా ప్రజలుంటే, లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మైతేయీలు ఉంటారు. స్వాతంత్య్రం వచ్చాక కుకీ, నాగా ప్రజలను ఎస్టీలలో చేర్చారు. ఈ కొండ ప్రాంతానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 371సీ కింద రక్షణ కల్పించారు. అంటే…ఈ కొండ ప్రాంతాలలో బయట ఎవరూ స్థలాలు అమ్మటానికి లేదు. బయట వాళ్లు కొనటానికి లేదు. కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరయినా స్వేచ్ఛగా స్థలాలు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.
ఒకే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారికి వేర్వేరు చట్టాలు, అధికారాలు అమలవుతున్నాయి. మణిపూర్‌లో కొండ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా హిల్ ఏరియా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి విశేష అధికారాలు ఉన్నాయి. బడ్జెట్ రూపొందించే టప్పుడు హిల్ ఏరియా కమిటీ అనుమతి కూడా పొందాలి. ప్రభుత్వం రూపొందించిన అంశాలు కుకీ, నాగా ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలిగించదని నిర్ధారించుకున్న తర్వాతే అది అమల్లోకి వస్తుంది. దానితో పాటు మణిపూర్ లాండ్ రెవెన్యూ, లాండ్ రిఫార్మస్ మీద కూడా ఈ కమిటీకి అధికారం ఉంటుంది. మణిపూర్‌లో కుకీలు, నాగాలకు ఎస్టీ హోదా కల్పించారు. కొండప్రాంతం అడవులలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించారు. కానీ క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా వారి ఎస్టీ హోదాను ఎందుకు రద్దు చేయలేదని ఇతర వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు
కొన్ని వేల ఏళ్లుగా ఉంటున్న తమకు ప్రత్యేక హక్కులు లేకుండా చేశారని మైతేయీలు నిల దీస్తున్నారు. కుకీ, నాగాలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ తమను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దానితో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా మణిపూర్‌లోకి ప్రవేశించిన వలసదారులు తమ అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదన సహేతుకంగా అనిపి స్తుంది. కాలక్రమంలో వాళ్లు మైనార్టీలుగా మారి పోయారు. గత కొన్నేళ్లుగా మైతీల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను విన్న కోర్టు మైతీలను ఎస్టీలలో చేరుస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపవలసిందిగా సూచిం చింది. దాంతో కుకీ, నాగా ప్రజలు మితిమీరిన దౌర్జన్యానికి దిగారు. కుకీలు కత్తులతోనూ, నాగాలు ఏకే 47లతోనూ విరుచుకు పడ్డారు.
దశాబ్దాలుగా కుకీలు, నాగాలు అడవులలో గంజాయి సాగు చేస్తూ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు తీసికెళ్లి అక్కడ ఐఎస్‌ఐ ఏజెంట్లకు అమ్ముతున్నారు. మణిపూర్‌లోని అడవులను ఇందుకు ఉపయోగించుకుంటున్నాయి. పాకిస్తాన్ ఐఎస్‌ఐకి డబ్బులు సమకూరే మార్గాలలో మణిపూర్‌లో కుకీలు ఉంటున్న అడవులు ఒక మార్గం. మరో వైపు బంగ్లాదేశ్, బర్మానుంచి వచ్చే కుకీలకు నకిలీ ఆధార్ కార్డులు సమకూరుస్తున్నారు. ఇవన్నీ కుకీలు చేస్తున్న ఆగడాలని చెప్పకనే చెబుతున్నాయి. మణిపూర్‌లోని రిజర్వుడు, రక్షిత అటవీ ప్రాంతాన్ని ఈ ట్రైబల్ కమ్యూనిటీలు ఆక్రమించుకోవటంపైన బీజేపీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. మాదకద్రవ్యాలపైన పోరాటంలో భాగంగా కుకీలను అణచివేయటం ఓ మార్గమని ముఖ్యమంత్రి బైరన్‌సింగ్ కూడా భావిస్తున్నారు. మరో వైపు మణిపూర్‌లో గిరిజనుల జనాభా బాగా పెరిగిపోవటంతో వాళ్లు చుట్టుపక్కల ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నారు. వాళ్లంతా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కొత్త గ్రామాలను గుర్తించటానికి ఒక విధానం అంటూ లేకుండా పోయింది. అటవీ చట్టం అమలుపైన కూడా పారదర్శకత లేదు. ఇది కూడా బీజేపీలో సొంత పార్టీ వాళ్లలోనే ఆగ్రహానికి కారణమవుతోంది.
చురాచంద్ పుర్ జిల్లాలో, 1966లోనే ప్రొటెక్టెట్ ఏరియాగా ప్రకటించిన చూరాచంద్ పుర్- ఖైపుమ్ రక్షిత అటవీప్రాంతంలో హఠాత్తుగా సర్వే ఎందుకు చేపట్టారని బీజేపీ ఎమ్మెల్యే పావోలీన్లాల్ హావోకిప్ నేరుగా అటవీశాఖ మంత్రినే నిలదీశారు. ఈ ఎమ్మెల్యే కుకీ కావటం గమనార్హం. ప్రభుత్వం దగ్గర సర్వే రికార్డులు లేనప్పుడు, ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించటం తప్పని, అది చెల్లదని వాదిస్తున్నారు. ఈ అంశంపై స్పష్టత వచ్చేవరకూ సర్వేలు నిలిపివేయాలని కోరారు.
ఆయా డిమాండ్ల మాట ఎలా ఉన్నా, ముఖ్య మంత్రి బైరన్ సింగ్ స్పష్టంగా ఉన్నారు. శాటిలైట్ మేపింగ్ ఆధారంగా కొండ ప్రాంతాలలో ఫారెస్ట్ కంపోజిషన్‌ను గుర్తిస్తామని, ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆక్రమణలకు గురయ్యాయంటూ కొన్ని ఇళ్లను గత నెల (ఏప్రిల్) తొలగించారు కూడా. మరో వైపు మైతీలకు ఎస్టీ హోదా కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయవలసిందిగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హింస ద్వారా సాధించేదేమీ ఉండదని, ప్రజలు ముందుకొచ్చి సానుకూలంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి, ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జి కిషన్ రెడ్డి సూచిస్తున్నారు. ‘మణిపూర్‌లో హింస దురదృష్టకరం. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నా’నని ఆయన వివరించారు. మణిపూర్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. మణిపూర్‌లో త్వరలోనే పరిస్థితులు చక్కబడవచ్చు.
– డాక్టర్ పార్థసారథి చిరువోలు, సీనియర్ జర్నలిస్ట్