– చంద్రశేఖర ఆజాద్
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
‘‘నేను రాలేకపోతున్నాను అంటే ఆయన మిమ్మల్ని ఏమీ అనరు కదా! ఇలాంటి పనులు ఇష్టంతో చేయాలి. బలవంతంగా కాదు’’ అంది హారిక.
రిత్విక్ మాట్లాడకుండా తలూపాడు.
అప్పటి నుంచి చకచక పనులు చేస్తున్నాడు. ముందు పాస్‌పోర్ట్ రెన్యూవల్‌కి డేట్ తీసుకున్నాడు. సీరియల్ వారికి ఫోన్‌చేసి ‘నేను చేయలేకపోతున్నాను’ అన్నాడు. అప్పుడే ఓ సినీ దర్శకుడు కాబోతున్న యువకుడి ఫోన్…
‘‘రిత్విక్ గారూ… మనం ఓ సినిమాకి కలిసి పనిచేయబోతున్నాం’’.
‘‘ఏ సినిమా బాబూ?’’
‘‘పిల్లల సినిమా. ఓ ప్రముఖుడు మనల్ని కలవాలనుకుంటున్నారు. ఆయన ఓ కథ చెబుతారు. మనం ఓ పది రోజులు స్క్రీన్ ప్లే రాసుకుంటాం. అది ఫైనల్ అయ్యాక మీరు డైలాగ్స్ రాసుకోవచ్చు’’.
రిత్విక్ మాట్లాడలేకపోయాడు.
‘‘ఏంటి సైలెంట్ అయ్యారు? ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. మీరు పిల్లల కోసం ఎన్నో రచనలు చేసారు. మీరు కథ-మాటలు అందించిన టెలీఫిల్మస్ నేను చూసాను. ఈ సినిమాలో తన మనవడ్ని చూసుకోవాలని తాతగారు ముచ్చటపడుతున్నారు. నేను మీ పేరు చెప్పాను. ఇంతకు ముందు మనం కలిసి పని చేయాలనుకున్నాం. కుదరలేదు. ఆయనే నిర్మాత. అందుకని ఆర్థిక సమస్యలు వుండవు. ఇది మనకు మంచి అవకాశం’’.
‘‘నేను కాదనటం లేదు. అదేంటో… వస్తే అన్ని అవకాశాలూ ఒకేసారి మీద పడిపోతాయి. నిన్నటి దాకా నేను ఖాళీగా వున్నాను. ఇప్పుడు సీరియల్, సినిమా అంటున్నారు. ఇంతకు ముందు ఓ సినిమాకి సగం వరకు పని చేసాం. ఇప్పుడు వాళ్లు కూడా వస్తాం అంటున్నారు’’.
‘‘మనకి పది రోజులు చాలు రిత్విక్ గారూ…’’
‘‘ఏమీ అనుకోవద్దు. నేను ఆరునెలలు హైదరాబాద్‌లో వుండటం లేదు. మీరు ఇస్తున్న అవకాశం వినియోగించుకోలేకపోతున్నాను. సారీ’’.
‘‘ఎబ్రాడ్ వెళ్తున్నారా?’’
‘‘అలాంటిదే’’. అతను నిట్టూర్చి అన్నాడు.
‘‘మంచిది. మీరు ఎక్కడున్నా నేను వాట్సప్ కాల్ చేస్తాను. అప్పుడు బిజీగా వుంటే తర్వాత చేయండి. నేను ఫోన్‌లో మీకు కథ చెబుతాను. అలాగే సినాప్సిస్ పంపిస్తాను. మనం చర్చించుకోవచ్చు. ఈ సినిమాకి మీ కంట్రిబ్యూషన్ ఏదొక రూపంలో వుండాలని నా కోరిక’’.
‘‘అలాగే చేద్దాం’’ అన్నాడు రిత్విక్.
అదే సమయంలో అతని వాట్సాప్‌కి ఎవరో మెసేజ్ పంపారు.
అమెరికా తెలుగు సంఘం వారు నవలల పోటీ పెట్టారు. ఒక నవల మాత్రం తీసుకుంటారు. బహుమతి రెండు లక్షలు.
రిత్విక్‌కి నవ్వు వచ్చింది.
చివరి తేదీ ఎప్పుడని చూసాడు. ఇంకా రెండున్నర నెలలు వుంది.
*******
రాత్రి హారిక గదిలోకి వచ్చేసరికి రిత్విక్ రాసుకుంటున్నాడు.
దగ్గరకు వెళ్లింది.
అతను డైరీ రాస్తున్నాడు.
రిత్విక్ జీవితంలో డైరీ ఓ భాగం.
ఆమె మాట్లాడకుండా ఓ పుస్తకం అందుకుని చదువుతోంది.
అతను రాస్తున్నాడు తదేకంగా!
చిన్నతనం నుంచి జీవితం నాతో ఆడుకుంటూనే వుంది. ఎప్పటికప్పుడు క్రాస్‌రోడ్స్‌లో నిలబడటమే. ఓ అవకాశం వచ్చిన సమయంలోనే మూడు నాలుగు అవకాశాలు వస్తాయి. ఏం చేయాలో తోచదు. అవన్నీ నిలబడేవి కూడా కాదు. అలా అని తిరస్కరించలేను.
ఇంటర్ మీడియట్ మాత్రం చదివిన నేను ప్రైవేట్‌గా డిగ్రీ చేయాలను కున్నప్పుడు ఇలానే పోటీలు.. పోటీలు. చదువుకోవాలా? కథలు రాయాలా?
రచనే ఎప్పుడూ నన్ను లొంగదీసుకుంది. రాయటం వరకు నా కర్తవ్యం. వాటికి బహుమతులు వస్తాయా? సాధారణ ప్రచురణకు కూడా తీసుకోరా! ఇలాంటివి నాకు అనవసరం. అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ఇంత ఒత్తిడిలో రాయటం అవసరమా? స్వేచ్ఛగా, హాయిగా, హృదయంతో రాయవలసిన వాటిని ఇలానా రాయటం! ఇందులో నా ఆత్మ వుందా? ఒత్తిడిలోనే నువ్వు బాగా రాస్తావు అంటారు కొందరు. నీ పేరు లేకపోయినా నీ రచనను గుర్తు పట్టవచ్చు అంటారు ఇంకొందరు.
రచయితగా మారాక ఒక్క రచనయినా పది మంది బాగుంది అనే స్థాయిలో చేయాలి కదా! అలాంటిది నా నుండి వచ్చిందా? నాకు అలా అనిపించ లేదు. రచనలు చేస్తున్నప్పుడు నాలో నేను నవ్వుకున్న, ఏడ్చిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అవన్నీ ఆ నాటి వాన చినుకులు.
అప్పుడు ఫోన్ మోగింది. గోవింద్ బుద్ధ!
‘‘సర్’’ అన్నాడు వినయంగా.
‘‘నిర్ణయం తీసుకున్నావా? నువ్వు వస్తున్నావా?’’
‘‘తప్పకుండా వస్తాను సర్’’.
‘‘నిన్ను నేను బలవంతం చేస్తున్నానా? నీ అవకాశాల్ని నేను బ్రేక్ చేస్తున్నానా రిత్విక్’’.
‘‘నేను అలా అనుకోను సర్. నన్ను వేధిస్తున్నది ఒకటే’’.
అవతల నుండి గోవింద్ మౌనం.
‘‘నన్ను ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. ఈ మధ్య కాలంలో నా రచనలు కనీస ప్రచురణకు కూడా నోచుకోవటం లేదు. బహుశా నేను పాతబడి వుంటాను. కొత్త తరం ఆలోచనలకు తగిన రీతిలో నా రచనలు వుండకపోవచ్చు’’.
అప్పటికీ ఆయన మాట్లాడలేదు.
‘‘అందుకని భయపడుతున్నాను. మీ అంచనాలకు తగినట్లు నేను వుండక పోవచ్చు. మీరు డిసప్పాయింట్ అవుతారు’’.
అదే మౌనం.
‘‘అంతే సర్. నా అవకాశాలను మీరు బ్రేక్ చేయటం కాదు. నేను ఈ రంగంలోకి వచ్చే ముందు మీరు ఓ ఆఫర్ యిచ్చారు. నేను నీ వెనక వుంటానన్నారు. అది కూడా పరాజయాలు నన్ను పలకరిస్తే. అలాంటి ధైర్యం నాకు ఎవరూ ఇవ్వలేదు సర్. ఇప్పుడిక్కడ నాకు గెలుపు లేదు. అలాగని ఓటమి కూడా లేదు’’.
‘‘ఎప్పుడు వస్తున్నావు’’ అన్నాడు గోవింద్.
కొద్ది క్షణాల తర్వాత అన్నాడు రిత్విక్.
‘‘పాస్‌పోర్ట్ రాగానే’’.
‘‘పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో పని అవగానే బయలుదేరు. అది మెల్లగా వస్తుంది. అవసరం అనుకుంటే ఇంటి నుండి కొరియర్‌లో పంపిస్తారు. లేదంటే మా వాళ్లు కలెక్ట్ చేసుకుంటారు’’.
‘‘అలాగే సర్’’.
‘‘బయలుదేరే ముందు ఫోన్ చెయ్యి రిత్విక్’’ అని గోవింద బుద్ధ ఫోన్ కట్ చేశాడు.
‘‘నిర్ణయం అయిపోయింది కదా! ఇంక ప్రశాంతంగా నిద్రపోండి’’ అంది హారిక. చిన్నగా తలూపాడు. తర్వాత డైరీ పూర్తి చేసి చివరి వాక్యం రాసుకున్నాడు.
‘‘ఐ విల్ బి విత్ యు అని గోవింద బుద్ధ అన్నారు. ఇంతకు ముందే కాదు ఇక నుండి నా వెనకాల, నా పక్కన వుండేది హారిక కూడా’’.
డైరీ మూసాడు.
*******
ఆ ఉదయం…
రిత్విక్ సూట్ కేస్ సర్దుకుంటున్నాడు. ఇంకా బ్యాగ్ కూడా వుంది. చివరిగా డైరీ వుంచాక లాక్ చేసింది హారిక.
అదే సమయంలో ముక్కులకి మట్టివాసన తగిలింది. బాల్కనీలోకి వెళ్లాడు.
వాన చినుకులు… ఈనాటి వాన చినుకులు.
రెండు చేతులూ చాచాడు. చిన్న చిన్న చుక్కలు అలా చేతుల మీద పడి క్షణకాలం మెరిసి శరీరంలోకి ఇంకిపోతున్న భావన. పరుగులు తీసుకుంటూ కిందకు వెళ్లి తడిచిపోవాలన్న కోరిక. అప్పుడు డోర్ బెల్ మోగింది.
‘‘కారు వచ్చేసిందా!’’ అనుకున్నాడు.
తలుపు తీసిన హారిక ఆశ్చర్యంతో చూస్తోంది.
ఎదురుగా గోవింద్ బుద్ధ!
గుర్తు పట్టి ‘‘లోపలకు రండి’’ అంది కంగారుగా. ఆ మాటలు విని రిత్విక్ హాల్లోకి వచ్చి ఆయన్ని చూసాడు. అప్రయత్నంగా ఆయన పాదాలకు నమస్కరించాడు.
‘‘హరిక’’ అని పరిచయం చేయబోతుంటే…
‘‘నీ నవలను ఈ అమ్మాయికి అంకితం చేసావు. నాకు గుర్తుంది’’ అన్నాడు గోవింద్.
‘‘మనుషులకు విజయాలు అకారణంగా రావు. రాత్రికి రాత్రి వచ్చే విజయాలు అలానే అదృశ్యం అవుతాయి’’ అనిపించింది రిత్విక్‌కి.
‘‘కాఫీ తీసుకువస్తాను’’ అంది హారిక.
‘‘ఇప్పుడేం వద్దు. నేను నిన్ను చూడటానికి వచ్చాను హారికా. ఎప్పటి నుండో మీ ఇంటికి రావాలని వుండేది. మీ ఇద్దరు అబ్బాయిల పెళ్లికి రిత్విక్ నాకు శుభలేఖలు పంపించాడు. నేను గ్రీటింగ్స్ మాత్రం పంపగలిగాను’’.
హారిక, రిత్విక్ ఒకరి నొకరు చూసుకుంటున్నారు.
‘‘అమ్మాయి… కొన్ని నెలలు నువ్వు మాకు సహకరించాలి’’.
‘‘తప్పకుండానండి’’ అంది.
‘‘బయలుదేరదామా రిత్విక్’’ అన్నాడు గోవింద్ బుద్ధ.
*******
వాన చినుకల మధ్య కారు విజయవాడకి పరుగులు తీస్తోంది.
ఇద్దరూ కారు వెనకాల కూర్చున్నారు.
ఎవరూ మాట్లాడుకోవటం లేదు.
గోవింద్ మెల్లగా నిద్రలోకి జారిపోయాడు. క్రమంగా గురక వినిపిస్తోంది. అప్పుడు తిరిగి రిత్విక్‌లో ఆయన గురించిన ఆలోచనలు.
మొదటి రచన ప్రచురించినప్పుడు, అది పత్రికలో చూసుకుంటున్నప్పుటి మధుర క్షణాలను ఎవరూ మరిచిపోలేరు. రిత్విక్ తొలి రచనను ప్రచురించింది గోవింద్ కాదు. ఆ పత్రికలో కథ రావాలని ఎంతో తపన. అలాంటిది ఓ ప్రయోగాత్మక రచనను సీరియల్‌గా ప్రచురించారు. అప్పుడు పర్వతాన్ని అధిరోహించిన భావనే కలిగింది. ఆ తర్వాత అనేకమైన మధురానుభూతులు. అవన్నీ వరసగా కళ్ల ముందు కదిలివెళ్తున్నాయి.
ఇప్పటి ప్రయాణం మాత్రం ఊహకు అందనిది!
అసలు ఎందుకో కూడా తెలియదు.
కారు సడన్‌గా ఆగింది.
ఉలిక్కిపడి లేచాడు గోవింద్.
రోడ్డుకి అడ్డంగా ఓ పశువు పరుగుతీసుకుంటూ వెళ్లింది.
‘‘భయపడ్డావా?’’ రిత్విక్‌ని అడిగాడు.
‘‘ప్రయాణాల్లో ఇలాంటివి సహజం. కాస్త భయం. నా గురించే కాదు’’ అన్నాడు.
‘‘ఎయిర్ బ్యాగ్స్ వున్నాయి. అయినా అవి ఒక్కోసారి తెరుచుకోవు. అది ఎంత ఖరీదయిన కారయినా. దాన్ని డెస్టినీ అంటారు. కర్మ అంటారు. భగవంతుడు నుదుటి మీద ముందే రాసి వున్నాడు అనుకుంటారు. అవునా?’’
‘‘మనుషులు పోయాక ఎవరేం అనుకున్నా తిరిగి రారు కదా సార్’’ అన్నాడు రిత్విక్.
నిశ్శబ్దం.
మళ్లీ కారు పరుగులు తీస్తోంది.
ఆయన అక్కడున్న ఏపిల్ అందుకుని రిత్విక్‌కి యిచ్చాడు.
‘‘వద్దు సార్’’.
అప్పుడు నైఫ్ తీసుకుని నాలుగు ముక్కులు చేసాడు. రెండు ముక్కలు రిత్విక్‌కి యిచ్చాడు.
‘‘మీ పిల్లలు ఎలా వున్నారు రిత్విక్’’.
‘‘బాగున్నారు. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటున్నారు’’.
‘‘నీకు డబ్బులు పంపిస్తుంటారా?’’
‘‘అయినా అంత అవసరం లేదు. మా ఖర్చులు చాలా తక్కువ’’.
‘‘డ్రింక్ చేస్తావా?’’
‘‘ఈ మధ్య తీసుకుంటున్నాను. రెగ్యులర్‌గా కాదు. అకేషనల్‌గా’’.
గోవింద్ చిన్నగా తలూపాడు.
ఇద్దరూ ఏపిల్ ముక్కలు తింటున్నారు.
‘‘నీకు నేనంటే భయం కదూ’’ అన్నాడు సడన్‌గా.
‘‘అది భయం కంటే గౌరవం. నాకు ఈ తరం ఎడిటర్లతో అంత దగ్గర పరిచయాలు లేవు. ఒకరిద్దరు నా సమకాలికులు. మీరు నా కంటే పెద్దవారు. అందుకని నేను మీతో ఫ్రీగా మూవ్ కాలేను’’.
‘‘పిల్లలు నువ్వంటే భయపడతారా?’’ అన్నాడు రిత్విక్‌ని చూస్తూ.
‘‘నాన్నకు కోపం వస్తుంది కొన్ని విషయాల్లో అన్న భయం ఇప్పటికీ వుంది సర్. అయినా పిల్లల విషయాల్లో నేను ఎక్కువ జోక్యం చేసుకోను. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాక వారిని కోప్పడే సందర్భాలు దాదాపు లేవు. ఒకటి రెండు విషయాల్లో అసంతృప్తి వుంటుంది. నేను ఓ పని అనుకుంటే పూర్తి అయ్యే దాకా అసహనంగా వుంటాను. ఎప్పటి పనులు అప్పుడు చేయమంటాను. వాళ్లు వాయిదా వేస్తుంటారు’’.
గోవింద్ బుద్ధ తలూపాడు.
‘‘నీ ఆస్తంతా నువ్వు సంపాదించావా? మీ తాత, నాన్నల నుండి వచ్చిందా?’’
‘‘నేను జీరో నుండి మొదలయ్యాను సర్. అయినా నాకుంది రెండు స్థలాలు. ఓ ఫ్లాట్. అవి నాకూ, హారికకి సరిపోతాయి. అది కూడా ఎలాంటి ఖరీదయిన రోగాలు రాకపోతే’’.
‘‘అంటే పిల్లల మీద నువ్వు ఆధారపడనవసరం లేదంటావు’’.
‘‘అప్పుడప్పుడు హారికతో అంటాను. మనం ఎవరి మీదా ఆధారపడే అవసరం రాకపోవచ్చు అని. డబ్బుల కోసం అలాంటిది వుండకపోవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మనం నిర్మించుకున్నవన్నీ కూలిపోవటానికి నిమిషాలు చాలు సర్. ఆరోగ్యపరంగా మాత్రం పిల్లల మీదో, మరొకరి మీదో ఆధార పడాల్సిందే’’.
అప్పుడాయన రిత్విక్‌ని చూస్తూ…
‘‘మాస పత్రికకు మూడున్నర దశాబ్దాలుగా కంట్రిబ్యూట్ చేస్తున్నావు. నీకు ఎన్ని బహుమతులు ఇచ్చానో నాకు తెలుసు. నీకంటే కొత్తగా వచ్చే వారికి ఎక్కువ యిచ్చాను. నేను బిజినెస్ మాన్‌ని. నువ్వు కూడా కమర్షియల్‌గా రాస్తే ఎలా వుండేదో’’.
– పి. చంద్రశేఖర ఆజాద్