– ‌జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‘‌చదువు అంటే? డిగ్రీలు సంపాదించడం కాదు, కేవలం విజ్ఞానాన్ని పొందడమూ కాదు’ అంటారు నైనా జైస్వాల్‌. ‘ఆ ‌రెండూ కాక,  మరి ఇంకేమిటి?’ అని మనం ప్రశ్నిస్తే, ఆమె ఇచ్చే ఏకైక సమాధానం ఏమిటో తెలుసా? ‘నిత్యజీవితంలో ఎదుగుదలకు మరో పేరే చదువు’ అని.

ఈమె వయసు రెండు పదులకు మరో రెండేళ్లు ఎక్కువ. 22. ఇదే పేరు (నైనా) వినగానే, మనకు గుర్తొచ్చేది టేబుల్‌ ‌టెన్నిస్‌. అం‌తర్జాతీయ స్థాయి క్రీడాకారిణి. అటువంటప్పుడు చదువు గురించీ చెప్తున్నారేమిటో! అని ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా. అందులోనే కాదు, ఇంకా అనేక అంశాల్లో ప్రతి ఒక్కరినీ విస్మయపరచే పనులు చేయడం తనకు అలవాటైన విద్య. ఇంత పిన్న వయస్కురాలు ఈ మధ్య రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ (డాక్టరేట్‌) అం‌దుకున్నారు. ‘ఇందులోనూ రికార్డేనా’…. అని ఆంధప్రదేశ్‌ ‌గవర్నర్‌, ‌వర్సిటీల ఛాన్సెలర్‌ ‌జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌చిరునవ్వుల ప్రశంసను వినమ్రంగా స్వీకరించారు. అంతటి సంచలనాల లలన గురించి…

నైనాజైస్వాల్‌ ‌పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. తల్లి భాగ్యలక్ష్మి, తండ్రి అశ్విన్‌కుమార్‌. ఏ ‌ముహూర్తంలో ‘నైనా’ అని ఆ పిల్లకు పేరు పెట్టారో కానీ, అన్ని పనుల్లోనూ విశేషమే! బాలమేధావి, యువసాహసి అనే పేర్లకు సకల విధాలా అర్హురాలు. సహజ సిద్ధంగా ఉన్న ప్రతిభో, తల్లిదండ్రుల పెంపకం ప్రభావమో- ఏ పని చేపట్టినా అగ్రస్థాయికి చేరడమే!! ఏడేళ్ల ప్రాయంలోనే రామాయణ శ్లోకాలు  కంఠస్థం చేసింది. ధారణ, జ్ఞాపకశక్తి తన సొంతమయ్యాయని నిరూపించింది. ‘ఒకసారి చెప్తే, వింటే చాలు – ఠక్కున పట్టేస్తుంది’ అంటూ మురిపెంగా చెప్తారు మాతృమూర్తి. ప్రత్యేకించి తల్లి, తనయది అంతంత విశేష అనుబంధం. ఇంకా విడమరచి చెప్పాలంటే, వారిద్దరూ క్లాస్‌మేట్స్.

‌నేడు న్యాయవాదం రేపు సివిల్‌ ‌సర్వీస్‌

‌చదువుల తల్లి నైనా తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి లా కోర్సు (ఎల్‌.ఎల్‌.‌బీ)లో చేరారు. ఇద్దరూ ప్రథమ శ్రేణిలో కృతార్థులయ్యారంటే, ఆ కుటుంబ నేపథ్యాన్ని మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘న్యాయవాద వృత్తి అంటే ఎందుకు ఇంత మక్కువ? అని అడిగితే, ‘నాన్న న్యాయవాది కాబట్టి న్యాయస్థానాల్లో సాగించే వాదనల్ని ఆసక్తిగా వినేదాన్ని’- అన్నారు నైనా. ‘ఆయనను వింటూ, గమనిస్తూ, పెరిగాను. అందుకే లా కోర్సును విజయవంతంగా చేశాను. అలా అని న్యాయవాద  వృత్తి స్వీకరిస్తానని కాదు. అసలు నా ప్రధాన లక్ష్యం – సివిల్‌ ‌సర్వీసెస్‌. ఎలాగూ క్రీడా రంగంలో బిజీబిజీగా ఉన్నా, ఇంతలోనే లా కోర్సును అమ్మతో కలిసి పూర్తిచేశా. కీలక ధ్యేయం సాధించడానికి ఇది ఉపకరిస్తుందని నమ్ముతున్నా, చదువంటే ఎప్పుడూ ఇష్టమే. అమ్మతోపాటు కళాశాలకు వెళ్లడం మరీ ఇష్టం. పరీక్షలకు కలిసే సిద్ధమవడం ఇంకెంతో ఇష్టం.  ఇప్పుడు మీకు బాగా అర్థమైందని అనుకుంటా. కన్నవారు ముందు నడిస్తే,   ఆ అడుగుజాడే బిడ్డగా నాది. అన్నట్లు నాకు సోదరుడు ఉన్నాడు. వాడి పేరు అగస్త్య. మేమిద్దరం అమ్మానాన్న బాటలోనే నడుస్తున్నాం. దారిచూపే పని వారిదే. అందులో నడిచే బాధ్యత మాది!’ అన్నారు ఆ చిచ్చర పిడుగు ఆడపిల్ల.

వరస విజయాల ఖజానా

‘మీకు ఇంకో మాట కూడా చెప్తా. ప్రజా సంబంధాల రంగమంటే నాకెంతో ఆసక్తి. పదీ పదకొండేళ్ల నుంచే ఆ అభిరుచి ఉండేది. ఈ లోగా నాన్నే నా కన్నా ముందుగానే మాస్‌ ‌కమ్యూనికేషన్స్ ‌డిగ్రీ సాధించేశారు. అదే అనుభవంతో నాకెంతో శిక్షణ ఇచ్చారు. అమ్మ గురించి ముందే చెప్పానుగా. లా కోర్సులో నాకు క్లాస్‌మెట్‌ అయింది. ఇప్పటికీ తాను ఎంఎస్సీ. నా ఆశయాలు నేను నెరవేర్చుకునేందుకు, వారిద్దరూ బాట చూపించారు. మాటలతో కాదు… చేతలతో’ అంటున్నప్పుడు నైనా కళ్లు తళుక్కుమన్నాయి. అతి చిన్న వయసులోనే ఎస్‌ఎస్‌సీ చేసిన ఆమె; ఆ పరీక్షల హాజరుకు ప్రత్యేక అనుమతి పొందాల్సి వచ్చింది. భాగ్యనగర్‌లోనే ఇంటర్‌ ‌చదివేసింది. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్‌ ‌చేసినప్పుడు, పోస్టుగ్రాడ్యుయేట్‌ ‌కూడా అయినప్పుడు ‘ఇంత చిన్నవయసులోనే ఇన్నిన్ని విజయాలా’ అంటూ వరసబెట్టి ఆశ్చర్యపోవడం బంధుమిత్రుల, సన్నిహితుల, శ్రేయోభిలాషుల వంతైంది.

రికార్డుల కథానాయిక

దేశంలో పరిశీలించి చూస్తే, నైనాయే యంగెస్ట్ ‌గ్రాడ్యుయేట్‌.  ‌పిన్న వయసులో అదీ అతి చిన్న ప్రాయంలో డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ అయిందీ ఆ అమ్మాయే. ఘన విజయ ప్రస్థానం గురించి వివరాలడిగితే, నాటి పదోతరగతి మొదలు నేటి డాక్టరేట్‌ ‌దాకా పరంపరను మహదానందంగా గుర్తు చేసుకున్నారు. మొత్తం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన యూనివర్సిటీ కేంబ్రిడ్జి. ఇంగ్లండ్‌లోనిది. అక్కడ పదో తరగతి కాగానే పరీక్షల జైత్రయాత్ర సాగించి, ఆరీత్యా ఆసియా ఖండంలోనే పిన్న వయస్కురాలిగా ప్రశంస పొందారామె. మన దేశంలో పీజీలోనూ అదే విధమైన విలక్షణత కనబరచి, తనకు తానే సాటిగా అన్నిటా అంతటా నిరూపించుకున్నారు. డాక్టరేట్‌లో తాను ఎంచుకున్న ‘అంశం – వనితల సాధికారత’కు సంబంధించిందే. ఇలా ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఏ అంశం  చేపడితే అందులో వరస ఘనతలు సాధించి బహుమేటిగా రికార్డుల హీరోయిన్‌ అయ్యారు. చదువులో, ఆటపాటల్లో, వాద్య సంగీత ప్రదర్శనల్లోనూ తానే అందరికన్నా మిన్న.

వేగం… వెన్నతో పెట్టిన విద్య

కంఠోపాఠం చేయడంతోపాటు, అతివేగంగా రాయడంలోనూ నైనాది మరో రికార్డు. ఆమె టైప్‌ ‌చేస్తుంటే, క్షణాల్లో అక్షరాల్ని కుమ్మరిస్తుంటే, ఆ మిషన్‌ అల్లలాడాల్సిందే. కీబోర్డు మొత్తాన్నే తన అధీనంలోకి తీసుకునే విధానం ఆ అమ్మాయికి ఎంతో బాగా తెలుసు. మనో, వాయు వేగం అంటారు కదా!… అటువంటివన్నీ అనుభవంలోకి తెచ్చుకోవడం పరిపాటిగా మారిందనాలి. కుడి చేతితో ఎంత ధాటిగా రాస్తుందో,  ఎడమ చేతితోనూ అంతే! రాతలు, చేతల్లో ప్రభంజనాలు సృజించగల ఆమె మాటల్లో కూడా దీటుతనమే ప్రతిఫలిస్తుంది. ఎన్నెన్నో రికార్డులు తన ఖాతాలో జమపడుతున్నా, అనేకం జతచేరుతున్నా,  ఆ యువతి మాటల్లో వినయ విధేయతలే జాలువారుతుంటాయి. ఎదిగినా, ఒదిగినా ఆమెకు సమంగా మరెవ్వరూ ఉండలేరని అనిపిస్తుంది. ఆదర్శం, స్ఫూర్తి – వీటికి ఒకే ఉదాహరణగా తనవైపే వేలు చూపుతారు ఎవరైనా. అదీ నైనా శిఖారాగ్రత.

పరిణత మనస్కురాలు

ఆటపాటల్లో జగజ్జెట్టి అనేందుకు బోలెడన్ని నిదర్శనాలు. పదిహేనేళ్ల  వయో విభాగం టెన్నిస్‌ ‌పోటీల్లో  తానే నెంబర్‌వన్‌. ‌జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా అనేక పర్యాయాలు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. అప్పట్లో వరసగా పలు సంవత్సరాలు హ్యాట్రిక్‌ ‌విన్నర్‌ అయ్యారు. అంతర్జాతీయంగా ఎన్నోసార్లు బంగారు పతకాలను పొందారు. ఆసియా స్థాయిలో, హాంకాంగ్‌ ‌పోటీల్లో తిరుగులేని పటిమ తనదని చాటి చెప్పారు. పుష్కరకాలం క్రితమే ఇంటర్నేషనల్‌ ‌టేబుల్‌ ‌టెన్నిస్‌ ‌ఫెడరేషన్‌ ‌వారి ‘వరల్డ్ ‌హోప్స్ ‌టీమ్‌’‌కి ఎంపికైన తొలి తెలుగుతేజం, వనితా కిరణం నైనా జైస్వాల్‌. ఎం‌చుకున్న ఏ రంగంలోనైనా, తానుగా చేపట్టిన ఎటువంటి విద్యలోనైనా ‘ప్రథమం’ అనిపించుకున్న భారత జాతీయ కీర్తి కిరీ•ధారిణి. వయసుకు మించిన అనేక రెట్ల పరిణతి ఆమెది.

అన్నింటా పెద్దపీట

‘మనిషికి మరణం ఉంటుంది, మానవత్వానికి ఉండదు…ఆహారం లేకపోవడం పేదరికం కాదు, కుటుంబంలో ప్రేమంటూ లేకపోవడమే దారిద్య్రం.. మంచిని పంచుకుంటేనే అది ఉత్తమ జీవితం’ ఇవన్నీ నైనా ప్రసంగ అంశాలు. వీటి గురించి సభల్లో ఆమె చెప్తున్నంతసేపూ అందరి  కళ్లు, చెవులూ అటువైపే! సంచలనం అనే పదానికి అర్థం ఏమిటన్నది ఆమెను చూస్తేనే తెలుస్తుంది. ప్రముఖత్వానికి నిర్వచనం ఏమిటన్నది ఆ మాటలు వింటే మనకి అవగతమవుతుంది. జాతికి సగర్వకారణం.

About Author

By editor

Twitter
YOUTUBE