– ‌జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌పాకిస్తాన్‌ ‌మాజీ ప్రధాని, తెహ్రిక్‌ ఇ ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ (70) అరెస్ట్ ఊహించిందే. పదవి పోయిన తర్వాత ఇంతకాలం అరెస్ట్ ‌కాకుండా నెట్టుకురావడంలో ఇమ్రాన్‌ఖాన్‌ ‌చరిత్ర సృష్టించారనే చెప్పాలి. కానీ న్యాయస్థానం ఎదుటే ఆయనను భద్రతాదళాలు ఈడ్చుకుంటూ తీసుకుపోవడం అందరినీ విస్తుపోయేటట్టు చేసింది. పాకిస్తాన్‌లో అధ్యక్ష, ప్రధాని, ఆర్మీచీఫ్‌ ‌వంటి ఉన్నతస్థానాల్లో పనిచేసిన వారికి ఆ పదవుల్లో ఉన్నంత వరకే రక్ష! పదవి పోయిందంటే ఇక వారి పతనం మొదలైనట్టే. విచారణలు, జైళ్లు, అవసరమైతే మరణ దండనలు! పాకిస్తాన్‌లో గతం నుంచి వర్తమానం వరకు జరుగుతున్న చరిత్ర ఇదే! పదవిని కోల్పోయిన తర్వాత ఆ దేశ అధ్యక్షులు, ప్రధానులు విదేశాల్లో స్థిర పడటానికి ప్రధాన కారణం ఇదే! కాకపోతే ఇమ్రాన్‌ఖాన్‌ ‌గత ప్రధానుల మాదిరిగా కాకుండా దేశంలోనే ఉండి సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు.

ప్రజాదరణే శ్రీరామరక్షగా ఇప్పటి వరకు అరెస్ట్ ‌కాకుండా ఆపగలిగినా వెంటాడి, వేధించే ప్రభుత్వ వ్యవస్థల ముందు ఈ రక్షణ కొంతమేర మాత్రమే ఉపయోగపడుతుందన్న నగ్నసత్యాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ ఉదంతం వెల్లడి చేస్తున్నది. ఆ విధంగా పాక్‌లో అరెస్టయిన 7వ మాజీ ప్రధానిగా ఆయన చరిత్రలో నిలిచారు. విపక్షనేతగా ఇంతకాలం దేశంలోనే ఉంటూ, ప్రభుత్వాన్ని, సైన్యాన్ని తూర్పారబడుతూ పాక్‌ ‌ప్రజల్లో ప్రతిష్టను పెంచుకున్న నాయకుడిగా కూడా ఇమ్రాన్‌ఖాన్‌ ‌తనదైన ముద్రవేశారు. ఎట్టకేలకు పాక్‌ ‌పారామిలటరీ మే 9, 2023న ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌ ‌హైకోర్టులో ఉండగా లోపలికి ప్రవేశించి మరీ అరెస్ట్ ‌చేశారు. తోషాఖానా కేసులో విచారణకు ఖాన్‌ ‌గైర్హాజరవుతుండటంతో ఇస్లామా బాద్‌లోని డిస్ట్రిక్ట్ అం‌డ్‌ ‌సెషన్స్ ‌కోర్టు ఆయన అరెస్ట్‌కు ఆదేశాలు జారీచేసింది. అయితే విచిత్రంగా ఆయన మే 9న అల్‌-‌ఖదీర్‌ ‌ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్టవడం గమనార్హం.

ఇంతకూ ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఏంటంటే…గత ఏడాది జూన్‌లో ఖాన్‌ ఆయన భార్య బుష్రాబీబీలు, పాకిస్తాన్‌లో స్థిరాస్తి దిగ్గజ వ్యాపారి మాలిక్‌ ‌రియాజ్‌ ‌నుంచి కొన్ని బిలియన్ల రూపాయల (మిలియన్ల డాలర్లు) విలువైన భూమిని విద్యాసంస్థను నెలకొల్పే మిషతో తమ అధీనంలోని ‘అల్‌ ‌ఖదీర్‌ ‌ట్రస్ట్’ ‌కోసం పొందారని, ఇందుకు ప్రతిగా క్విడ్‌ ‌ప్రో కో కింద అతనికి దేశ ఖజానాకు నష్టం కలిగించే రీతిలో 239 మిలియన్‌ ‌డాలర్ల మేర ప్రయోజనం కలిగించారన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలావుండగా గత ఏడాది తనపై జరిగిన హత్యాయత్నంలో ఐఎస్‌ఐకు చెందిన ఉన్నతాధికారి ఫైజల్‌ ‌నజీర్‌ ‌ప్రమేయం ఉన్నదని ఇమ్రాన్‌ఖాన్‌ ‌గతంలో మాదిరి గానే మే 7న కూడా ఆరోపించారు. వీటిని ఖండిస్తూ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్‌ ‌సర్వీస్‌ ‌పబ్లిక్‌ ‌రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్‌) ‌ప్రకటన విడుదల చేసిన తర్వాత ఈ అరెస్ట్ ‌జరగడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన అంశమేంటంటే ఖాన్‌ను అరెస్ట్ ‌చేసింది పోలీసులు కాదు పాక్‌ ‌రేంజర్లు. అంటే పారా మిలిటరీ దళం. అంతర్గత భద్రత మాత్రమే వీరి బాధ్యత. పోలీసులు కాకుండా రేంజర్లు అరెస్ట్ ‌చేశారంటే దీని వెనుక సైన్యం ఉన్నదనే అర్థం.

అనుబంధం వికటిస్తే విధ్వంసమే

ఒకప్పుడు సైన్యంతో ఉన్న గాఢమైన ‘అను బంధం’ ఖాన్‌ను అందలం ఎక్కిస్తే, వికటించిన ‘బంధం’ పదవీచ్యుతుడిని చేసింది. ఇందులో ప్రధానపాత్ర పోషించిన సైన్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురవుతోంది. పాక్‌ ‌సైన్యానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవం ఇది! అసలే అప్పులు పుట్టక ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతుంటే ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌కారణంగా రగిలిన రావణ కాష్టం…‘పాము తన తోకను తానే మింగుతున్న’ చందంగా పరిస్థితిని దిగజార్చింది. ఇమ్రాన్‌ఖాన్‌ ఎటూ తప్పించుకోకుండా వందకు పైగా కేసులు బనాయించినా వచ్చే అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆయన పార్టీ అప్రతిహత విజయానికి ప్రస్తుత పరిణామాలు రాచబాట వేస్తాయనడంలో సందేహంలేదు.

రాజకీయ సంక్షోభం

విపక్షాలన్నీ పాకిస్తాన్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌గా (సైన్యం ప్రమేయం లేకుండా ఏదీ జరగదు) ఏర్పడి 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ ‌ఖాసిమ్‌ ‌ఖాన్‌ ‌సూరీ డిస్మిస్‌ ‌చేయడంతో దేశంలో రాజకీయ సంక్షోభం మొద లైంది. ఇది 2022 ఏప్రిల్‌ 3 ‌నుంచి 10దాకా కొన సాగింది. తర్వాత ఖాన్‌ ‌సిఫారసు మేరకు దేశాధ్యక్షుడు అరీఫ్‌ అల్వీ నేషనల్‌ అసెంబ్లీని రద్దు చేయడంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. అయితే సుప్రీంకోర్టు నేషనల్‌ అసెంబ్లీని పునరుద్ధరించిన తర్వాత, ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఖాన్‌ ‌ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తర్వాత ప్రధానమంత్రి పదవిని షహబాద్‌ ‌షరీఫ్‌ ‌చేపట్టారు. అయితే ఖాన్‌ ‌మాత్రం తాను పదవి కోల్పోవడం వెనుక అమెరికా హస్తముందంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. 2022 ఆగస్టు నెలలో పాకిస్తాన్‌ ‌డెమోక్రటిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఇ‌మ్రాన్‌ ‌ఖాన్‌కు వ్యతిరేకంగా తోషాఖానా కేసును పెట్టింది. తోషాఖానా బహుమతుల వివరాలను వార్షిక ఆస్తుల వివరాలతో పాటు ఎన్నికల సంఘానికి సమర్పించ లేదనేది ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ ప్రారంభిం చిన ఎన్నికల సంఘం అక్టోబర్‌ 21,2022‌న ఇమ్రాన్‌ను పార్లమెంట్‌ ‌నుంచి అనర్హుడిగా ప్రకటించింది. రాజ్యాంగంలోని 63(1)(పి) ప్రకారం ఆయనపై క్రిమినల్‌ ‌విచారణ చేపట్టాలని ట్రైల్‌కోర్టుకు ఆదేశాలు పంపింది. కాగా, తక్షణమే ఎన్నికలు జరపాలని, ఆర్మీచీఫ్‌ను తొలగించాలన్న ఇమ్రాన్‌ ‌డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించడంతో అక్టోబర్‌ 28, 2022‌న లాహోర్‌ ‌నుంచి ఇస్లామాబాద్‌ ‌మార్చ్ ‌చేపట్టారు. తర్వాత నవంబర్‌ 3‌వతేదీన ప్రభుత్వా నికి వ్యతిరేకంగా పంజాబ్‌లోని వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా, ఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో, ఆయన గన్‌మెన్‌ ‌సహా తొమ్మిది మంది పార్టీ కార్యకర్తలు గాయపడగా, ఒక కార్యకర్త మరణించాడు. ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు సెనెటర్‌ ‌ఫైజల్‌ ‌జావెద్‌ఖాన్‌ ‌కూడా ఈ సంఘటనలో గాయపడ్డారు.

జర్నలిస్టు లాగిన తీగ…

ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌కు విదేశాలనుంచి అందిన బహుమతుల వివరాలు తెలియజేయా లంటూ ఇస్లామాబాద్‌కు చెందిన రాణా అబ్రార్‌ ‌ఖలీద్‌ అనే జర్నలిస్టు 2021లో సమాచార హక్కు చట్టం కింద పాకిస్తాన్‌ ఇన్ఫర్మేషన్‌ ‌కమిషన్‌ (‌పీఐసీ)కి ఒక దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని పీఐసీ, కేబినెట్‌ ‌డివిజన్‌ను ఆదేశించింది. ఈ సమాచారాన్ని ఆబ్రార్‌కు పదిరోజుల్లో అందజేస్తామని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని కేబినెట్‌ ‌డివిజన్‌ ‌పేర్కొంది. ఆ తర్వాత కేబినెట్‌ ‌డివిజన్‌ ‌మాటమార్చి, పీఐసీ తనకు ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం చట్టవిరుద్ధమంటూ ఇస్లామాబాద్‌ ‌హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. తోషాఖానా బహుమతుల వివరాలు చట్టం ప్రకారం ఎవరికీ తెలియజేయడం సాధ్యం కాదంటూ వాదించింది. చివరకు 2022 ఏప్రిల్‌లో  హైకోర్టు, పీఐసీ ఆదేశాలకు అనుగుణంగా.. బహుమతుల వివరాలను వెల్లడించాలని డిప్యూటీ అటార్నీ జనరల్‌ అర్షద్‌ ‌ఖయానీని ఆదేశించింది. అయితే 2018 నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ ‌తోషాఖానా వివరాలను బహిరంగ పరచడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్‌ 8‌న ఎన్నికల సంఘానికి ఆయన జవాబిస్తూ, విదేశాలనుంచి వచ్చిన బహుమతుల్లో నాలుగింటిని అమ్ముకున్నట్లు అంగీకరించారు. దీంతో ఎన్నికల సంఘం ఆయన్ను పార్లమెంట్‌ ‌సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తూ కేసును క్రిమినల్‌ ‌విచారణ కోసం ట్రైల్‌కోర్టుకు పంపింది. అయితే ఎన్నికల సంఘం తీర్పును ఖాన్‌ అక్టోబర్‌ 22,2022‌న ఇస్లామాబాద్‌ ‌హైకోర్టులో సవాలు చేయడం కొసమెరుపు.

తోషాఖానా అంటే…

1974లో ఏర్పాటైన తోషాఖానా కేబినెట్‌ ‌డివిజన్‌ అధీనంలో ఉంటుంది. విదేశీ ప్రతినిధులు పాక్‌ ‌రాజకీయ నాయకులు, అధికార్లు, దౌత్యవేత్తలు, మిలిటరీ అధికార్లు మొదలైన వారికి ఇచ్చే బహుమతులను ఇక్కడ భద్రపరుస్తారు. పాక్‌లోని నిబంధనల ప్రకారం ఆయా డిగ్నిటరీలు తమకు వచ్చిన బహుమతుల వివరాలను కేబినెట్‌ ‌డివిజన్‌కు తెలిపి, తోషాఖానాలో భద్రపరచేందుకు అప్పగిం చాలి. ఇమ్రాన్‌ ఇం‌దుకు విరుద్ధంగా తనకు వచ్చిన బహుమతులను నేరుగా బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని, మొహిసిన్‌ ‌షహనవాజ్‌ ‌రంఝాతో పాటు మరికొంతమంది సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

కొనసాగిన విధ్వంసకాండ

ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న ఖాన్‌కు మద్దతుగా ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పాక్‌లో పెద్దఎత్తున అలర్లు చెలరేగాయి. ఖాన్‌ అరెస్ట్‌తో ఇస్లామాబాద్‌, ‌కరాచీ, లాహోర్‌, ‌పెషావర్లలో ఆయన మద్దతుదార్లు పెద్దఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 290 మంది గాయపడ్డారు. పెషావర్‌లో రేడియో పాకిస్తాన్‌ ‌కార్యాలయాన్ని తగులబెట్టారు. లాహోర్‌లోని మిలిటరీ కార్పస్ ‌కమాండర్‌ ఇం‌టిపై దాడిచేసి ఫర్నిచర్‌ ‌ధ్వంసం చేశారు. సైనిక ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడారు. వాళ్లను సైన్యం అడ్డుకోకుండా ఉదాసీనంగా వ్యహరించటం విశేషం. పోలీస్‌ ‌స్టేషన్ల నుంచి ఆయుధాలను లూటీ చేస్తున్నారు. పెషావర్‌లో పారామిలటరీ దళాలపై కాల్పులకు దిగారు. అయితే కాల్పులు జరిపిన వారు ప్రొఫెషనల్స్ ‌కాకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. కాల్పులకు పాల్పడిన వారిని మాత్రం అరెస్ట్ ‌చేశారు. లండన్‌లో పాకిస్తాన్‌ ‌హైకమిషన్‌ ఎదుట ఖాన్‌ ‌మద్దతుదార్లు నిరసన ప్రదర్శన చేశారు. ఇమ్రాన్‌ ‌ఖాన్‌ అరెస్ట్ ‌వల్ల ఇంతటి వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందని బహుశా సైన్యం ఊహించి ఉండదు. ఇంత విధ్వంసం జరుగుతుండగానే, ఖాన్‌ అరెస్ట్ ‌చట్టబద్ధమేనని ఇస్లామాబాద్‌ ‌కోర్టు ప్రకటించింది. అయితే 11వ తేదీన పాక్‌ ‌సుప్రీంకోర్టు, ఖాన్‌ అరెస్ట్ ‌చట్టవిరుద్ధమని ప్రకటించడమే కాదు, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్రాన్‌ అరెస్ట్‌ను జర్నలిస్టులు, లాయర్లు ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ ‌చట్టవిరుద్ధమని దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నా ఖాన్‌ను ఒక రహస్యప్రదేశానికి తరలించి విచారిస్తు న్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇమ్రాన్‌కు పెరగనున్న ప్రజాదరణ

ప్రస్తుత అరెస్ట్‌ను పాక్‌లోని చాలామంది ప్రజలు ‘రాజకీయ వేధింపులు’ గానే చూస్తున్నారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఎన్ని ఆధారాలున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు నేషనల్‌ అకౌంట బులిటీ బ్యూరోను తమ ప్రత్యర్థులను వేధించడానికి ప్రభుత్వం ఒక ఉపకరణంగా వాడుకుంటున్నదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడే అవకాశముంది. గతంలో ఖాన్‌ ‌ప్రభుత్వం, ప్రస్తుత ప్రధాని షహబాజ్‌ ‌షరీఫ్‌ను అరెస్ట్ ‌చేయడానికి ఈ బ్యూరోనే ఉపయో గించుకున్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రస్తుత పరిణామాలు ఖాన్‌ ‌పలుకుబడిని మరింతగా పెంచు తాయి. ముఖ్యంగా సైన్యానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతగా ఆయన మరింత ప్రజాదరణ పొందవచ్చు. నిజం చెప్పాలంటే మాజీ ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌, ‌ప్రస్తుత ప్రధాని ఆయన సోదరుడు అయిన షహబాజ్‌ ‌షరీఫ్‌ల కంటే, ప్రజాదరణలో ఖాన్‌ ఎం‌తో ముందున్నాడు. వచ్చే అక్టోబర్‌లో దేశంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ లోగా ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించవచ్చు. ముఖ్యంగా ఆయనపై అనర్హత వేటుకు ప్రయత్నించ వచ్చు. ఒకవేళ ఖాన్‌ను జైలుకు పంపినా ఆయన పార్టీ పాకిస్తాన్‌ ‌తెహరిక్‌ ఇ ఇన్సాఫ్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువ.

About Author

By editor

Twitter
YOUTUBE