– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌కర్ణాటక ఓటర్లు మూడు దశాబ్దాలకు పైగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 38 ఏళ్లుగా ఒక అప్రకటిత సంప్రదాయంగా పాటిస్తూ వచ్చిన మార్పునే మళ్లీ పాటించారు. అందుకు అనుకూలంగానే తీర్పునిచ్చారు. మే 10వ తేదీన జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ (బీజేపీ)ని కాదని, ప్రతిపక్ష (కాంగ్రెస్‌)‌కి పట్టం కట్టారు. అక్కడ వరుసగా ఏ పార్టీకి కూడా రెండోసారి అధికారం ఇవ్వని ప్రజలు ఈసారీ అదే చేశారు.

ఒక కర్ణాటకలోనే కాదు, కేరళ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అసోం సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా  గతంలో ఇదే ఆనవాయితీ కొనసాగింది. అయితే, ఇటీవల కాలంలో ఆ రాష్ట్రాల ఓటర్లు ఆనవాయితీకి భిన్నంగా తీర్పునిచ్చారు. కేరళలో ఎల్డీఎఫ్‌కు; ఉత్తరాఖండ్‌, అసోం రాష్ట్రాల్లో బీజేపీకి వరుసగా రెండవసారి అధికారం అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లో 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ‌రికార్డు సృష్టించారు. 1985లో జరిగిన అవిభక్త ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీ తివారీ వరుసగా రెండవసారి విజయం సాధించి అధికారం నిలబెట్టు కున్నారు. కానీ, కర్ణాటకకు వచ్చే సరికి.. పాత పద్ధతి లోనే అధికారం చేతులు మారింది. బీజేపీ చేతుల్లోని అధికారం కాంగ్రెస్‌ ‌చేతికి చేరింది. అంటే, కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌విజయం సాధించడం భూమి బద్దలయ్యే బ్రహ్మాండ పరిణామం ఏమీ కాదనే అనుకోవాలి. రాజకీయ చక్ర భ్రమణంలో చోటుచేసుకున్న సహజ పరిణామం. కాకపోతే జాతీయ స్థాయిలో అవసాన దశకు చేరుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి కర్ణాటక ఓటర్లు గెలుపు ఊపిరి పోశారు. అలాగే, 2024లో బీజేపీని ఓడించడం తమతో అయ్యే పనికాదని నిర్ణయానికి వచ్చిన ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌పంచన చేరి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని తహతహ లాడుతున్న కమ్యూనిస్ట్ ‌పార్టీలకు, ఏదో విధంగా ప్రాంతీయ అధికారాన్ని నిలుపుకోవాలని తహతహ లాడుతున్న తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌వంటి ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ ‌గెలుపు తీపి కబురు అందించింది. ఆ విధంగా కర్ణాటక విజయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది, అంతే. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు అంతకు మించిన విశేషం జోడించి ఏదో జరిగిపోయిందనో, జరిగిపోతోందనో హైరానా పడాల్సిన అవసరం లేదు.

గెలుపు గెలుపే!

కారణాలు ఏవైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. కాబట్టి ప్రజల తీర్పును అందరూ ఆమోదించవలసిందే. అందులో రెండో అభిప్రాయానికి తావు లేదు. గెలుపు గెలుపే. ఓటమి ఓటమే. గెలుపును ఆస్వాదిస్తున్న పార్టీలు, నాయకులు తమ ముందున్న కర్తవ్యాన్ని గుర్తెరిగి అడుగులు వేస్తే, ఓటమి చెందిన పార్టీలు, నాయకులు లోపం ఎక్కడ జరిగిందో ఆత్మ‘పరీక్ష’ చేసుకుని గెలుపు వైపు అడుగులు వేయవలసి ఉంటుంది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీని ప్రతిపక్ష స్థాయికి పరిమితం చేసిన కర్ణాటక ఓటర్లు… కింగ్‌ ‌మేకర్‌గా చక్రం తిప్పాలనుకున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ ఆశలనూ గల్లంతు చేశారు. బీజేపీ సీట్లు కోల్పోయినా ఓటుశాతం మాత్రం అలాగే ఉంది. 2018 ఎన్నికల్లో వచ్చిన 36 శాతం ఓటుషేర్‌ను బీజేపీ నిలబెట్టుకుంది. అయినా, 38 సిట్టింగ్‌ ‌స్థానాలను కోల్పోయింది. ఇక జేడీఎస్‌ ‌సీట్లతో పాటు ఓట్లు కూడా కోల్పోయింది. 2018లో 18 శాతం ఓట్లతో 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌.. ఈసారి 5 శాతం ఓట్లు కోల్పోయి 18 సీట్లకు పరిమితమైంది.

ఇక కాంగ్రెస్‌ ‌విషయానికి వస్తే.. 2018లో ఆ పార్టీ 38.04 శాతం ఓట్లతో 80 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 42.88 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. అంటే గత ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 4.48 శాతం ఓట్లే అధికంగా పోలయ్యాయి. దీంతో 57 స్థానాలు అధికంగా లభించాయి. అదే సమయంలో ఒక శాతం కంటే తక్కువగా, అంటే 0.22 శాతం ఓట్లను మాత్రమే కోల్పోయిన బీజేపీ 38 సిట్టింగ్‌ ‌స్థానాలు కోల్పోయింది. జేడీఎస్‌ ‌కోల్పోయిన ఓట్లు నేరుగా కాంగ్రెస్‌ ‌పార్టీకి ట్రాన్స్‌ఫర్‌ అవడం వలన జేడీఎస్‌తో పాటు బీజేపీ కూడా గణనీయ సంఖ్యలో సీట్లు కోల్పోయింది. అందువల్లనే బీజేపీ కేవలం రెండు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో సుమారు 100 సీట్ల (రెండువేల కంటే తక్కువ 58, వెయ్యి కంటే తక్కువ 41)లో ఓడిపోయింది. అయితే, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది ఓట్ల తేడా కాదు. ఆధిక్యత మాత్రమే. అది ఒక్క ఓటైనా, గెలుపు గెలుపే. ఓట్ల లెక్కలు ఎలా ఉన్నా సీట్ల లెక్కల్లో కాంగ్రెస్‌ ‌గెలిచింది. బీజేపీ ఓడిపోయింది. ఇదీ.. 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు సారాంశం.

కారణాలెన్నో..

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎం‌దుకు గెలిచింది? ఎలా గెలిచింది? అని అలోచిస్తే.. అనేక కారణాలు కనిపిస్తాయి. అలాగే, బీజేపీ ఎందుకు ఓడిపోయిందని చర్చిస్తే అందుకూ ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఐదు ఉచిత పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో గట్టి ప్రభావం చూపాయి. యువత, మహిళలే టార్గెట్‌గా కాంగ్రెస్‌ ‌తన మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలు అంటూ ప్రకటించింది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే గృహజ్యోతి పథకం, రాష్టంలోని 1.5 కోట్ల మంది మహిళలకు స్త్రీశక్తి పేరిట ఒక్కొక్కరికి రూ. 2వేల ఆర్థికసాయం అందించే పథకం, అన్నభాగ్య పథకం కింద ప్రతి పేదకుటుంబానికి 10 కిలోల బియ్యం, యువనిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులు, డిప్లొమా పట్టాదారులకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత రవాణా వసతి.. ఇలా అనేక తాయిలాలను కాంగ్రెస్‌ ఎరగా వేసి గెలిచింది. అలాగే, బీజేపీ ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానాన్ని తొలగించి కర్ణాటక విద్యా విధానం అమలు చేస్తామని తెలిపింది. మరోవైపు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ ‌రద్దును తొలగిస్తామని, ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్‌ ‌కల్పిస్తూ జనాభా దమాషాగా రిజర్వేషన్‌ ‌ప్రమాణాలను సవరిస్తామని పార్టీ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచుతామని చెప్పింది. ఈ హామీలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎంతవరకు నిలబెట్టుకుంటుందనేది అనుమానమే అయినా, ఆ పార్టీ గెలుపునకు మాత్రం ఈ హామీలే పునాదులు వేశాయి. అలాగే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అధికారం హస్తం చేతికి చిక్కదనే నిర్ణయానికి వచ్చిన పార్టీ నాయకులు తాత్కాలికంగానే అయినా తమ మధ్యన ఉన్న దీర్ఘకాల విభేదాలు పక్కన పెట్టారు. ముందు ఎన్నికల్లో గెలుద్దాం, ఆ తర్వాత మన సంగతి చూసుకుందామని పీసీసీ చీఫ్‌ ‌డీకే శివకుమార్‌, ‌సీఎల్పీ నేత సిద్ధరామయ్య సయోధ్యను చక్కగా నటించారు. మరీ ముఖ్యంగా బీజేపీ స్థానిక నాయకత్వం చేసిన తప్పులు, అందుకు జాతీయ నాయకత్వం జోడించిన మరికొన్ని తప్పులు కూడా కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊపిరి పోశాయి. అదే సమయంలో మాజీ ముఖ్యమత్రి బసవరాజ్‌ ‌బొమ్మై ప్రభుత్వం అమూల్‌, ‌నందిపాల వివాదం వంటి స్థానిక సమస్యలు, వివాదాలను పరిష్కరించడంలో విఫల మైందనే అభిప్రాయం ఉంది.

ఆ విషయం ఎలా ఉన్నా.. కర్ణాటక గెలుపును కాంగ్రెస్‌ ‌పార్టీతో పాటు మరొకొందరు మేధావులు జాతీయ స్థాయికి అన్వయించి విశ్లేషణలు వినిపిస్తు న్నారు. అంతేకాదు, గీత దాటి ఉత్తర, దక్షిణ భారత విభజన తెచ్చే విధంగా ప్రమాదకర విశ్లేషణలు చేస్తు న్నారు. నిజానికి నిన్నటి వరకు దక్షిణ భారతదేశంలో ఎక్కడా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం లేదు. తమిళనాడులో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నా, ప్రభుత్వంలో చోటు లేదు. ఇంకా చిత్రం ఏమంటే దక్షిణాదికి చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ యాక్సిడెంటల్‌ ‌ప్రెసిడెంట్‌ ‌ఖర్గే ఈ చర్చకు తెర తీశారు. బీజేపీ ముక్త దక్షిణ భారత్‌ ‌సాధించామని ఖర్గే పేర్కొన్నారు.

అదొకటి అలా ఉంటే.. కాంగ్రెస్‌ ‌నాయకులు, కొందరు మేధావులు, కుహనా లౌకికవాదులు కర్ణాటక గెలుపుతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందనే కలలు కంటున్నారు. కథనాలు వినిపిస్తున్నారు. నిజమే, అంపశయ్యపై ఉన్న వ్యక్తిలో ఏ చిన్న కదలిక వచ్చినా సహజంగానే వారిలో ఆశలు చిగురిస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ అంతే. అన్ని సందర్భాల్లో ఫలితం ఒకేలా ఉండాలనే నియమం లేదు కదా.

2018 చివర్లో మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ‌రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అయినా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాలను బీజేపీ స్వీప్‌ ‌చేసింది. కర్ణాటకలో 28 లోక్‌సభ సీట్లకు 26 (బీజేపీ మద్దతుతో గెలిచిన స్వతంత అభ్యర్థి సుమలతతో కలిపి) స్థానాలు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో 29కి 28 సీట్లు బీజేపీ గెలిచింది. ఛత్తీస్‌ఘడ్‌లోనూ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 9 సీట్లు గెలిస్తే.. అధికార కాంగ్రెస్‌ 2 ‌సీట్లకే పరిమితమైంది. రాజస్తాన్‌లో అయితే మొత్తం 25 సీట్లలో 24 బీజేపీ, మిగిలిన ఒక స్థానం బీజేపీ మిత్ర పక్షం ఆర్‌ఎల్డీ గెలిచాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌ఖాతానే తెరవలేదు. అలాగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎల్డీఎఫ్‌.. ‌లోక్‌సభ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో కాంగ్రెస్‌ 15, ‌కాంగ్రెస్‌ ‌మిత్ర పక్షాలు 4 స్థానాలు గెలుచుకున్నాయి. కాబట్టి.. 2023లో కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్‌.. 2024 ‌లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తుందనుకోవడం అజ్ఞానం, కాదంటే అమాయకత్వం అవుతుంది. అలాగే, కర్ణాటక గెలుపు రానున్న రోజుల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గెలుపునకు బాటలు వేస్తుందనుకోవడం కూడా అజ్ఞానమే.

About Author

By editor

Twitter
YOUTUBE