మే 13న వెలువడిన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపాయి. వీటి మీద ఎవరి అంచనాలు వారివి. అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయి (66), కాంగ్రెసు మంచి మెజారిటీతో (135)  అధికారంలోకి వచ్చింది. ఈ వార్త వినగానే కాంగ్రెసు నేత రాహుల్‌గాంధీ ‘ద్వేషం మీద ప్రేమ జయించింది’ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘‌ద్రవిడ ధరిత్రిపై బీజేపీకి మనుగడ లేదు. ఇక్కడ నుంచి తరిమేశాం!’ అన్నారు. కాంగ్రెస్‌ ‌తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘ఆ ఫలితాలే తెలంగాణలో పునరావృతం అవుతాయి’ అన్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి వంద సీట్ల కంటే ఎక్కువ రావ’ని వెంటనే జ్యోతిష్యం చెప్పారు. ఇందులో ఎవరి కోణం వారిదే తప్ప, నిష్పాక్షిక విశ్లేషణ అని చెప్పుకోదగ్గ అంచనా ఏదీ వాటిలో లేదు. ఇవాళ్టి రాజకీయ పార్టీల నుంచి  వాటిని ఆశ్రయించి ఉన్న, అంతర్జాతీయ శక్తుల కనుసన్నలలో నడిచే మీడియా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం కూడా తప్పు. ఇంతకూ జరిగిందేమిటి?

బీజేపీకి 36 శాతం ఓటు బ్యాంకులో దాదాపు మార్పేమీ లేదు. 2018లో 36.4 శాతం కాగా, ఇప్పుడు 36 శాతం. అయినా బీజేపీ మట్టికరిచిందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే విజయం అసెంబ్లీలోనే కనిపించాలని వీరి ఉద్దేశం. దీనిని కాదనలేం కానీ, బీజేపీకి ప్రజాబలం యథాతథమే నన్న వాస్తవం జోలికి ఎవరూ వెళ్లడం లేదు. ఇక్కడ కమలం ఓడింది. కానీ ‘వాడి’ పోలేదన్నదే నిజం. హెచ్‌.‌డి.కుమారస్వామి జనతాదళ్‌ (ఎస్‌) ‌పార్టీ ఓటు బ్యాంకులో 6 శాతం కాంగ్రెసుకు చేరింది. దీనివలన గణాంకాలు మారాయి. బీజేపీ ‘అవినీతి’ గురించి కాంగ్రెసు విస్తృత ప్రచారం చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత గురించి మీడియా ఊదరగొట్టింది. ఇక్కడ గురవింద సామెతను గుర్తు చేసుకోక తప్పదు. ప్రస్తుతం రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ ఇద్దరూ నేషనల్‌ ‌హెరాల్డ్ అ‌క్రమ ఆర్థిక వ్యవహారాల కేసులో బెయిల్‌పైనే బయట తిరుగుతున్నారు. అలనాటి స్వాతంత్య్ర సమరయోధులు తమ ఆస్తులు అమ్మి ఇచ్చిన మూలధనంతో స్థాపించిన పత్రిక అది. కాంగ్రెస్‌ ‌చరిత్రలో తవ్విన కొద్దీ అవినీతి వ్యవహారాలు బయటపడతాయి. యూపీఏ అధికారంలో ఉండగా జరిగిన లక్షల కోట్ల అవినీతి వ్యవహారాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీటికి సోనియా, రాహుల్‌ ‌సూత్రధారులు. కార్తీ చిదంబరం, మోతీలాల్‌ ఓరా పాత్రధారులు. కాబట్టి కాంగ్రెస్‌ ‌వారు అవినీతి గురించి మాట్లాడటమేమిటి? ఒక రాష్ట్ర ఎన్నికల విజయం వీరి మలిన కుడ్యాన్ని వైట్‌వాష్‌ ‌చేయగలదా?

సోనియాగాంధీ భారతదేశానికి మతమార్పిడుల కోసం వచ్చారు. కర్ణాటకలో ముస్లిం- క్రైస్తవ- కమ్యూనిష్టు వర్గాలు బహిరంగంగా కాంగ్రెసుకు మద్దతునిచ్చాయి. అంతేకాదు, నిషిద్ధ పీ•ఎఫ్‌ఐ ఉ‌గ్రవాద సంస్థ రాజకీయ విభాగం ఎస్‌డీపీఐ తన అభ్యర్థులను కాంగ్రెసుకు అనుకూలంగా పోరులో బలహీనపరిచింది. బహుశా బజ్రంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ ‌చెప్పి ఉండవచ్చు. మొదట పాతిక సీట్లలో పోటీకి దిగుతామని బీరాలు పలికిన ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ‌కేవలం రెండే సీట్లకు పోటీ చేశారు. రెండింటిలోను ధరావతు దక్కలేదు. కాంగ్రెస్‌ను ప్రజలు ఈసారి ఎన్నుకున్నారు అన్న ఒక వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటూనే కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇవేమీ జాతీయ భద్రతకు, జాతి గౌరవానికి మేలు చేసేవి కావు. కాంగ్రెస్‌ ‌పార్టీకి జాతీయవాదుల పట్ల ముందు నుంచి ఉన్న వైఖరినే కర్ణాటకలోను ప్రదర్శించింది. అందుకే టిప్పుసుల్తాను జయంతి జరిపింది. స్వాతంత్య్ర వీర సావర్కర్‌ను అవమానించింది. హిజాబ్‌ ‌వివాదానికి మూలం కర్ణాటక రాష్ట్రమే. హిజాబ్‌ను పాఠశాలల్లో అనుమతించనవసరం లేదని కోర్టులు తీర్పు చెప్పినా, వారికే మద్దతుగా నిలిచాయి కాంగ్రెస్‌, ఇతర పార్టీలు. పీఎఫ్‌ఐ అనుబంధ క్యాంపస్‌ ‌ఫ్రంట్‌ ‌నిర్వాకమే హిజాబ్‌ ‌వివాదం. కాంగ్రెసు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు దాడిచేస్తే బాత్‌రూంలో గోడల నిండా వజ్రాలు, నోట్ల కట్టలు లభించాయి. గోమాంసం తింటే తప్పేమిటి? అని ప్రశ్నించాడు కాంగ్రెసు నాయకుడు సిద్ధ రామయ్య. కర్ణాటకలో హనుమంతుడు ఓడిపోలేదు. రోమ్‌ ‌పోపు గెలిచాడు. తాజా వార్త ఏమిటంటే, బజ్రంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐ ‌వంటి ఉగ్రవాద సంస్థ పక్కన నిలబెట్టినందుకు పంజాబ్‌కు చెందిన ఒక హిందువు కోర్టును ఆశ్రయించాడు. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నోటీసులు వచ్చాయి. రాజస్తాన్‌లో జరుగుతున్నవి, మధ్యప్రదేశ్‌ ‌నాయకుడు దిగ్గిరాజా వ్యాఖ్యలు ఏవి గమనించినా హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయించుకోవడానికి కాంగ్రెస్‌కు ఎలాంటి వెరపూ లేదనే తేలుతుంది.

ఇక ద్రవిడవాదం గురించి మాట్లాడే స్టాలిన్‌ అనే పేరు తమిళం కాదు. వాళ్ల నాన్న కరుణానిధి పేరు సంస్కృతం. వాళ్ల టీవీ ఛానల్‌ ‘ఉదయ’ అంటే సంస్కృతం పేరు. వీళ్లకి ఆది నుంచి హిందీ, హిందూ అంటే అకారణ ద్వేషం. ఇక సంస్కృతం అంటే తీవ్రమైన వ్యతిరేకత.

‘అసలు ప్రేమ జయించింది’ అంటూ రాహుల్‌ ‌స్పందించడమే పెద్ద ప్రహసనం కాదా? విద్వేషాన్ని గురించి కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రతినిధి రాహుల్‌గాంధీ మాట్లాడట మేమిటి?1984లో ఢిల్ల్లీ నడివీధులలో వేలాది సిక్కులను ఊచకోత కోసింది ఎవరు? 1975లో రాజ్యాంగాన్ని పక్కనపెట్టి జాతిపై అత్యవసర పరిస్థితిని విధించింది ఎవరు?

నేతాజీ సుభాష్‌బాబును హింసించి చంపింది ఎవరు? ‘కుక్క’ అని పిలిచింది ఎవరు? బయటకు నెట్టి ఆ కుర్చీలో బలవంతంగా కూర్చున్నది ఎవరు? కాంగ్రెస్‌లో నెహ్రూ నాయకత్వంలో పటేల్‌కు ఏం జరిగిందో జాతి మరచిపోలేదు.

అప్పుడే చరిత్ర మరచిపోయారా?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కాని ఇవాళ కాంగ్రెసు పార్టీ మూల సిద్ధాంతాలు ఏమిటి? ఒకే రాజకీయ కుటుంబం మళ్లీ మళ్లీ అధికారంలో ఉండటం. చిత్రంగా కాంగ్రెస్‌ను అంటకాగుతున్న పార్టీలన్నీ ఇదే పోకడను ఆశ్రయిస్తున్నాయి. డీఎంకే, తృణమూల్‌, ఆర్జేడీ ఇదే పంథాలో ఉన్నాయి. ఇవన్నీ కలసి బీజేపీని ఓడించడానికి ఏకం కావాలని అనుకోవడమే వింత.

రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి అన్నాడొక తత్వవేత్త. వెయ్యేళ్ల బానిసత్వాన్ని మరచిపోయారా? 75 సంవత్సరాల ఏక కుటుంబ పాలనలోని దోపిడీ మరిచిపోవాలా?

కర్ణాటకలో ముస్లిం ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకొని గెలిచిన రాహుల్‌గాంధీ 1947లో భారతదేశాన్ని మత ప్రాతిపదిక మీద విభజించారని- ఆ ఘన కార్యం చేసింది ఈ కాంగ్రెసు పార్టీయేననీ సౌకర్యంగా మరచిపోయాడు.

కర్ణాటకలో లింగాయతులకు వక్కళిగలకూ మధ్య కులయుద్ధం నడుస్తున్నది. ఇది కృష్ణరాయలు పాలించిన రత్నాల సీమకు శోభస్కరం కాదు.

కర్ణాటకలో జరిగిన ఎన్నికలకు విదేశాల నుండి బీజేపీని ఓడించడానికి నిధులు ఎవరెవరు పంపారో విచారణలో తేలుతుంది. తెలంగాణ నుండి హెచ్‌డి కుమారస్వామికి ప్రత్యక్షంగా నిధులు అందాయి. అయినా ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే బీఎస్పీ వంటి పార్టీలు కూడా గెలువలేదు.

కర్ణాటకలో బలమైన లింగాయత్‌ ‌నాయకుడు బీఎస్‌ ‌యడ్యూరప్పను పక్కన పెట్టడం బీజేపీకి బాగా నష్టం చేసింది. ఆ పార్టీలో పదవులు స్వీకరించడానికి వయోఃపరిమితి విధించుకున్న సంగతి ఒకటి ఉన్నా ఈ మాట అనుకోక తప్పదు.

కన్నడ రాజకీయాల్లో లింగాయతులది కీలక పాత్ర. వీరు జనాభాలో 17 శాతం ఉన్నారు. నిజలింగప్ప, వీరేంద్రపాటిల్‌, ‌బీడీ జెట్టి వంటి వారంతా లింగాయతులే. వీరంతా లోగడ కాంగ్రెసు నాయకులు. యడ్యూరప్ప కాలం నుండి వీరు బీజేపీకి అనుకూలమైనారు. లింగయతులలో మళ్లీ వీరశైవులు, లింగాయతులు అనే రెండు వర్గాలున్నాయి. వీరికీ ఉడిపి విశ్వేశ్వరతీర్థ (మధ్య) వర్గాలకూ సాన్నిహిత్యం లేదు. మైసూరు ప్రాంతంలో వక్కళిక ప్రాబల్యం ఎక్కువ. వీరూ రైతు వర్గానికి చెందినవారే. అయితే వీరు వైష్ణవులు. ఎస్‌.ఎం.‌కృష్ణ వంటివారు ఈ గ్రూపునకు చెందినవారు. మల్లికార్జున ఖర్గే క్రైస్తవ సోనియాకు వీర విధేయుడు. ఈయన కూడా లింగయత్‌ ‌వర్గానికి చెందినవాడే.

నిజానికి అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సమస్యల మీద జరుగుతాయి. కానీ దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీకి అక్కడ స్థానిక నాయకత్వం పటిష్టంగా లేదు. న్యూఢిల్లీ నుండి నరేంద్రమోదీ, అమిత్‌షాలను పిలిపించి వారి గ్లామర్‌తో ఎన్నికలు గెలవాలను కోవడం బీజేపీ చేసిన వ్యూహాత్మక తప్పిదం. కర్ణాటక ఫలితాలు పక్కనే ఉన్న తెలంగాణ మీద ప్రభావం చూపుతాయని చాలామంది నమ్ముతున్నారు. అయితే, ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది? బీజేపీని ఓడించటం కోసం అందరూ కలువబోతున్నారు. ఇదే కర్ణాటక ఫార్ములా. ఒకే ఒక్క దేశభక్తి పార్టీ మీద ఇంత విద్వేషమా? ఇంతకీ కర్ణాటక ఫలితాలు వెలువడిన మర్నాడే ఉత్తరప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. వాటి గురించి లాంఛనంగానే మన మీడియా వ్యాఖ్యానించింది. ఇక ఏ బీజేపీయేతర నేత వాటి మీద వ్యాఖ్యానించ లేదు. అక్కడ బీజేపీ సునామీ సృష్టించింది. ఏవో కొన్ని చానళ్లు తప్ప మీడియా కూడా సరైన రీతిలో వీటి గురించి విశ్లేషించలేదు. బీజేపీ ఓడిపోతే, లేదా ఏదైనా చిక్కుల్లో పడితే అది ప్రపంచ వార్త. అదే బీజేపీకి విజయం సమకూడితే చిన్న వార్త.

రాహుల్‌గాంధీ ఇటీవల భారత్‌ ‌జోడో యాత్ర చేశారు. అతని వెనుక మాఫియా జోడో వర్గాలు నడిచాయి. స్వాతంత్య్ర వీరసావర్కర్‌ను అడ్డమైన తిట్లు తిట్టిన రాహుల్‌గాంధీని ఒక జాతీయ నాయకునిగా భారత సమాజం అంగీకరించటం ఈ జాతి చేసుకొన్న మహాపాపం. 2006లో చైనా వెళ్లి వారితో చేతులు కలిపి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు అక్రమంగా నిధులు తెచ్చుకున్న మాట నిజమా కాదా?

ఆంధప్రదేశ్‌లో కాంగ్రెసుపార్టీ అస్తమించింది. కాని తెలంగాణలో ఈ కర్ణాటక విజయంతో కాంగ్రెసుకు కొత్త ఆశలు చిగురించాయి. ఎం.ఐ.ఎం. ఓట్ల కోసం ఇటు బీఆర్‌ఎస్‌ అటు కాంగ్రెస్‌ ఇక పోటాపోటీగా ప్రయత్నిస్తాయి. ఈ ఎన్నికలలో జేడీ(ఎస్‌) అనే అవకాశవాద ప్రాంతీయ పార్టీ అంత రించటం శుభసూచకమే. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఫలితాలు వెలువడిన తరువాత శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య, ప్రదేశ్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌సీఎం పదవి కోసం చేసిన హంగామా, అలకలు, ఆరాటాలు మాత్రం జాతికి మంచి వినోదాన్నే ఇచ్చాయి.

కొసమెరుపు

బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్‌ ‌పార్టీ గెలిచింది కాబట్టి ఈ ఎన్నికలలో ఈవీఎం రగడ రేగలేదు. అదే బీజేపీ గెలిచి ఉంటే ఈవీఎంలనీ, ఎన్నికల కమిషన్‌నీ కూడా ప్రతిపక్షాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవే. కాబట్టి ఈసారి ఎన్నికల కమిషన్‌కు కాస్త వెసులుబాటు.

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, ‌విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE