– డా।। గుమ్మా సాంబశివరావు

కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు

సారరహితంబునైన సంసారమందు

భార్యయను స్వర్గమొకటి కల్పనముఁజేసెఁ

బురుషుల నిమిత్తము పురాణపూరుషుండు’’ –

– అని భార్య ప్రాముఖ్యాన్ని చాటి చెప్పిన విశిష్ట రచయిత, కవి, నాటకకర్త కాళ్లకూరి నారాయణరావు. సమకాలీన సామాజిక సమస్యల్ని ఇతివృత్తాలుగా చేసుకొని నాటకాలు రచించి సాంఘిక చైతన్యానికి కారకుడైన ఉత్తమ శ్రేణి రచయిత కాళ్లకూరి (ఏప్రిల్‌ 28,1871-‌జూన్‌ 27,1921). ‌పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో శ్రీమతి అన్నపూర్ణమ్మ, బంగార్రాజు దంపతులకు ఆయన జన్మించారు. బంగార్రాజు కవి పండితులు. ‘కవిరాజు’ బిరుదు కూడా ఉంది. తండ్రిగారే గురువుగా నారాయణరావు విద్యాభ్యాసం సాగించారు. అ తర్వాత పాడి వేంకటనారాయణ దగ్గర నాటక కావ్యాలంకారాలు చదివారు. నారాయణరావుని బాగా ఆదరించినవారు బుద్ధిరాజు వీరభద్రరావు.

‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అనే పలుకులు నారాయణరావు పట్ల ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. బాల్యంలో ఇల్లు విడిచి కాశీ, హిమాలయాల్లో పర్యటించిన వీరు యోగ, చిట్కా వైద్యం, హస్త సాముద్రికం, ఛాయాచిత్ర గ్రహణం, హరికథాగానం, అధ్యాపకత్వం, న్యాయశాస్త్ర వైదుష్యం, వాక్చాతుర్యం,  గానకళా నైపుణ్యం, గ్రంథ రచనం మొదలైన రంగాల్లో తమ ప్రత్యేకతను ప్రదర్శించారు. వీరు ఎన్ని రచనలు  చేసినా  వరవిక్రయం, మధుసేవ నాటకాలు మాత్రం తెలుగునాట చిరకీర్తిని సంతరింప చేశాయి. కాళ్లకూరివారి ప్రతిభను ప్రశంసిస్తూ అక్కిరాజు రమాపతిరావు  చెప్పిన ‘ప్రతిభా వంతుడైన ఏ మహారచయిత అయినా తాను జీవించిన కాలంచేత ప్రభావితుడవుతాడు. ఆ కాలాన్ని ప్రభావితమూ చేస్తాడు. ఆ తర్వాత సాహిత్యంలో పది కాలాలపాటు జీవించి ఉంటాడు. అటువంటి ప్రతిభావంతుడైన కవి శ్రీ కాళ్లకూరి నారాయణరావు. కందుకూరి వారి సంఘ సంస్కరణ కృషి, గురజాడవారి సామాజిక వాస్తవికత, పానుగంటివారి ప్రౌఢి, చిలకమర్తివారి స్వభావోక్తి శిల్పం, వేదం వారి చమత్కారచారిమ ఒక్క రచయితలో చూడాలంటే ఆధునికాంధ్ర సాహిత్యంలో ఆ స్థానం కాళ్లకూరి వారిదే. లోకంలో ఆయనకు నాటక రచయితగా గొప్ప పేరు ప్రతిష్ఠలు వచ్చాయే కాని ఆయన తక్కిన పక్రియలలో కూడా ప్రతిభా సమగ్రుడే అని చెప్పాలి. కథలు, నవల, ప్రహసనాలు, విమర్శలు ఆయన వ్రాశారు. స్వాతంత్య్రోద్యమంవల్ల స్ఫూర్తి పొందారు’ అనే వాక్యాలు అక్షర సత్యాలు.

కాళ్లకూరివారు మంచి నటులుగా కూడా ప్రసిద్ధి పొందారు. ‘నలదమయంతి’ నాటకంలో నల, బాహుక పాత్రలు ధరిస్తే టంగుటూరి ప్రకాశంపంతులు దమయంతి వేషం వేసేవారట. నారాయణరావు కొంతకాలం ‘మనోరంజని’ అనే పత్రికకు సంపాదకులుగా కూడా పనిచేశారు.

కాళ్లకూరి వారి రచనలకు కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేరకాలుగా నిలిచాయి. వీరు బుద్ధిరాజు పాపరాజుగారితో కలసి బందరులో సారంగధర నాటక ప్రదర్శన చూడగా, అది లోపభూయిష్టంగా ఉందని ఆ నాటకాన్ని సంస్కరించి రాయమని కోరటంతో కాళ్లకూరివారు ‘చిత్రాభ్యుదయం’ అనే నాటకాన్ని రచించారు.

తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ విజయాల్లో అభిమన్యు కథ సరిగా లేదనే విమర్శలు రావటంతో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని  కాళ్లకూరి ‘‘పద్మవ్యూహము’’ నాటకాన్ని రాశారు.

కాళ్లకూరివారిని లీలాశుకుని చరిత్ర బాగా ఆకర్షించింది. అంతేగాకుండా ఆ రోజుల్లో గోదావరి మండలంలో వేశ్యా లంపటత్వం వల్ల ఎంతోమంది ధనవంతులు బికారులు కావటం గమనించిన కాళ్లకూరి  వేశ్యావృత్తిని ఖండిస్తూ ‘చింతామణి’ నాటకాన్ని రచించారు.

ఆ రోజుల్లో కన్యాశుల్కం కనుమరుగవుతూ వరశుల్కం మొలకెత్తటాన్ని గుర్తించిన నారాయణరావు ఈ ఆచారం దూష్యమని, సమాజానికి హానికరమని ప్రబోధం గావిస్తూ ‘వరవిక్రయము’ నాటకాన్ని రచించారు.

స్వాతంత్య్రోద్యమంలో భాగంగా గాంధీజీ మద్యపాన నిషేధాన్ని గూర్చి విశేషంగా ప్రచారం చేశారు. ఎంతోమంది సంస్థానాధీశులు ఈ వ్యసనం వల్ల నాశనం గావటాన్ని గుర్తించిన కాళ్లకూరివారు మద్యపానం వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయనే ప్రబోధంతో ‘‘మధుసేవ’’ నాటకాన్ని రచించారు.

ఆంగ్లాన్ని నేర్చుకొని, ఆంగ్ల సంస్కృతికి దాసులై, భారతీయ సంస్కృతిని నిరసిస్తూ, చివరకు ఆంగ్ల స్త్రీలను వివాహమాడి ఎంతోమంది అష్టకష్టాలకు గురి అయ్యారు. అందుకే మన సంస్కృతి ఔన్నత్యాన్ని వివరిస్తూ ఆంగ్ల సంస్కృతీ వ్యామోహకుల కళ్లు తెరిపించటానికి ‘సంసార నటన’ అనే నాటకాన్ని  రచించారు.

కాళ్లకూరివారు ఆనాటి సమాజంలో తమకు తారసపడిన కొంతమందిని దృష్టిలో పెట్టుకొని, తాము రచించిన నాటకాల్లో పాత్రల్ని సృష్టించారు. రచనా ప్రవృత్తినే వృత్తిగా చేసుకొని జీవితాన్ని సాగించిన ఆయన ప్రయత్నం సఫలమైందేనని చెప్పాలి. వీరి రచనల వల్ల ఎంతోమంది  ప్రభావితులయ్యారు. ఎందరో యువకులు వరవిక్రయం నాటకంవల్ల ప్రభావితులై తాము కట్నాలు తీసుకోబోమని నారాయణరావుగారికి ఉత్తరాలు రాశారు. మద్యపాన వ్యసనానికి బానిసలైనవారు కూడా వీరి నాటకాల్ని చూసి పరివర్తన చెందారు.

కాళ్లకూరివారు కందుకూరి వారి ప్రభావంతో ప్రహసన రచనలు కూడా చేశారు. వీరు, లుబ్ధాగ్రేసర చక్రవర్తి, రూపాయి గమ్మత్తు, ధూమశకట ప్రహసనం, కారణంలేని కంగారు, దసరా తమాషాలు, ఘోరకలి, మునిసిపల్‌ ‌ముచ్చట్లు, విదూషకపటము అనే ప్రహసనాలు రచించినట్లు తెలుస్తున్నది. ప్రహసనాల్లో ఒకటి రెండు పద్యాలు కూడా పొందుపరచి తన ప్రత్యేకతను ప్రదర్శించారు. సామాజిక అంశాల్ని వ్యంగ్యంగా ఎత్తిపొడిచి హాస్యాన్ని గుప్పించటం వీరి ప్రసహనాల ఉద్దేశం.

కాళ్లకూరివారు ‘ప్రతాపరుద్రమదేవి’ అనే నవలను కూడా రచించారు. చారిత్రాత్మక సంఘటన లతో కూడిన ఈ నవలను 580 పుటల వరకు మాత్రమే రచించగా ఆ తర్వాత ప్రచురణకర్తలు నాలుగున్నర పుటల్ని ‘శ్రీ వాస్తవ’గారితో  రాయించి ముద్రించారు. అనేక బాలారిష్టాలను అధిగమించి ఈ నవల 1961 నాటికి పాఠకులకు లభ్యమైంది.

కాళ్లకూరి వారు పలు సాహిత్య పక్రియల్లో రచనలు చేశారనటానికి వారు రచించిన కథలు కూడా సాక్ష్యంగా నిలుస్తాయి. ఆయనే సంపాదకత్వం వహించిన ‘మనోరంజని’ పత్రికలో ఈ కథలు ప్రచురితమయ్యాయి. ‘లక్కికి – లిక్కి’, ‘పెద్దల నాటి ముద్దుకథలు’ శీర్షికతో ఓరుపు, శీలము, గర్వభంగము, నిర్వేదము అనే కథల్ని రచించారు. అలాగే విచిత్ర నీతికథలు శీర్షికతో ‘భగవంతుడేమి చేసినను మేలుకే’, ‘సంతృప్తికి సాటియైనది లేదు’, ‘అపకారికుపకారమే యధిక శిక్ష’, ‘మూర్ఖ సేవకుడు ముప్పు’, ‘పేదల కోపము పెదవులకు చేటు’, ‘గొప్పవారు గుణలుబ్ధులు కాని ధనలుబ్ధులు కారు’ అనే కథల్ని రచించారు. ఇంకా  పలు విమర్శక వ్యాసాలను, చరిత్ర గ్రంథాలూ రాశారు.

కాళ్లకూరివారు ఏ పక్రియలో రచన చేసినా అది సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనే వెలువరించారు. అభిమన్యు వృత్తాంతాన్ని ప్రతిబింబింపచేసే ‘పద్మవ్యూహము’ నాటకంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫురింపచేస్తూ అభిమన్యుని పాత్రచేత

‘‘ఎవ్వడు స్వరాజ్యము నిమిత్త మెన్ని రక్త

బిందువులు ప్రీతి వసుధ కర్పింపగలుగు

వాఁడు భూలోకముననన్ని వర్షశతము

లమరుఁడె యుండు కీర్తి కాయంబుతోడ’’ అని పలికించారు.

అలాగే చిత్రాభ్యుదయంలో కూడా సమకాలీన సమాజాన్ని ప్రతిబింబింప చేశారు. తెలుగువారికి విశిష్ట గ్రంథాల్ని అందించిన కాళ్లకూరివారు  వారి రచనల వల్ల ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇప్పటికీ సమాజాన్ని పీడిస్తున్న వరకట్నాన్ని నిరసిస్తూ ‘వరవిక్రయం’ నాటకంలో కాళింది పలు కులు నేటి యువతులకు ఆదర్శం కావాలని భావిస్తూ ఆ పద్యంతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

‘‘నాడు ప్రతినంబు వినుము ప్రాణములనైన

విడిచెదంగాని యడిగిన విత్తమిచ్చి

వరుని గొని తెచ్చినట్టి వివాహమునకు

సమ్మతింపనా రాట్నము సాక్షిగాను’’

About Author

By editor

Twitter
YOUTUBE