– వడలి రాధాకృష్ణ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

విస్తృతమైన ఊహలు, విపరీతమైన ఆలోచనలు మనిషిని పట్టేసి పిండి పిప్పి చేస్తాయంటే ఇదేనేమో!

భాగ్యరాజు అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఉదయం మునిరత్నం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అవి గుర్రుగా అన్పిస్తున్నాయి. అంతలోనే లేని ఆవేశాన్ని రగిలిస్తున్నాయి. కానీ కొంత మౌనం వహించక తప్పడం లేదు.

‘మరోసారి ఆలోచించుకోమంటున్నాను.’ మునిరత్నం ఇప్పుడు కాదు, భాగ్యం కాలం చేసినప్పటి నుండి ఇలానే నసపెడుతూ ఉన్నాడు. కానీ తాను తద్భిన్నం!

భాగ్యం భాగ్యరాజు అర్థాంగి. పరమ సాత్వికు రాలు. అర్థాంగి అనే పదానికి సిసలైన అర్థంలా అగుపించేది. నిత్యం పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు దేవాలయ సందర్శనాలు… భాగ్యరాజు కూడా అలానే ఆమెకు వెన్నంటి ఉండేవాడు. అది ఒక్కటీ తప్ప.

ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌కంపెనీలో తాను ఓ చిన్నపాటి పెద్ద ఉద్యోగస్తుడు.

‘ఈ రోజు సాయంత్రం అయ్యప్పస్వామి భజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆఫీసులోని వారందరూ తప్పక రావాలని మా ఆహ్వానము.’ తమ కంపెనీ మేనేజర్‌ ‌స్టాఫ్‌ అం‌దర్నీ ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం పెద్ద ఆర్డరేసినట్లుంది.

‘అయ్యప్పా! ఆయనెవరు.’

‘నీ ముచ్చుధోరణులాపి బాస్‌ ‌పిలిచినాడు. భోజనానికి వచ్చేయ్‌!’ ‌ప్రక్క సీటులోని ప్రకాశం సలహా సహేతుకంగానే ఉంది.

‘…..’

‘చెప్పాగా ఆయనెవరో ఒకరు! శబరిమలై కొండల్లో వెలిసిన దేముడు!! మన యజమానికి దేముడు!! యజమాని మనకు దేముడు. ఆటోమెటిగ్గా ఆయన కొలిచే అయ్యప్పస్వామి నీకు నాకు దేముడు అయి తీరుతాడు.’

‘…..’

‘అయితీరడమే కాదు. తీరాలి కూడాను. నామాట విను.’ ప్రకాశం మాటలకు భాగ్యరాజు కడుపులో దేలినట్లయింది.

‘ఈరోజు దేముడి భజనకు ప్రసాదానికి రమ్మంటాడు. రేపు భగవంతుని కొలువుకు శబరిమలై  రైలెక్కమంటాడు.’

‘శభాష్‌ ‌రాజూ!’

‘సినిమా టైటిలా…. అయినా ఎందుకో!!’

‘ఓ పరమ నాస్తికవాది, వితండ ధోరణి కల్గిన మనిషి నోటివెంట శబరిమలైలు అక్కడి కొలువుల మాటలు ఇప్పుడు విన్పిస్తూ ఉండటం….’ భాగ్యరాజు నవ్వబోయాడు. కానీ ఆ నవ్వులో జీర్త అగుపిస్తూ ఉంది.

‘బాసైతే ఏమిటి! బాసు భగవంతుడయితే నాకేమిటి.’ భాగ్యరాజ ధోరణి కొంత వికృతంగా ఉంది. అంతేగాదు కచ్చితంగాను అన్పిస్తోంది.

‘నీ ఇష్టం… పోనీ బాస్‌ ఇం‌టికి పార్టీకి పిలిచినా డనుకో! వచ్చి తినేసి పోతే సరి!!

‘పాచీల పేరుతో వచ్చి, అక్కడ భజనమందిరంలో కూర్చొని పాల్గొనడమంటే నన్ను నేను చంపేసుకోవ డమే అవుతుంది.’

‘అది కాదురా! బాసు స్టాఫ్‌ అం‌దర్నీ పేరు పేరునా చెప్పి వచ్చేలా చూడ మన్నాడు.’

‘ఈ భాగ్యరాజు ఎక్కడికీ రాడు.’

‘చూడు రాజూ! దురదృష్టవశాత్తూ నీ భార్య కాలం చేసింది. ఆ మహా ఇల్లాలు పేరు మీద నువ్వేమయినా మంచి కార్యక్రమం చేబడితే భాగ్యమ్మ పేరు ఈ భూమిమీద చిరస్థాయిగా మిగిలిపోతుంది.’ ముని రత్నం మాటలు వేడికోలుగానే ఉన్నాయి. కానీ అవన్నీ భాగ్యరాజులో తెలియని వేడిమిని పుట్టిస్తు న్నాయి.

మునిరత్నం ఊరిలో తనకు చిరకాల మిత్రుడు. చెప్పాలంటే ప్రాణ స్నేహితుడు. అత్యంత ప్రీతిపాత్రుడు కూడాను. లేకపోతే ఇన్నిసార్లు తన వెంట పడుతున్నందుకు మరొకరయితే ఎప్పుడో త్రుంచి పారేసేవాడు.

‘అవును రత్నం! నాకూ మనసులో ఉంది. నా భాగ్యం గతించి సంవత్సరం దాటిపోయినా ఆ షాక్‌ ‌నుండి అంత త్వరగా బయటకు రాలేకపోతున్నాను. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించింది. నన్నే లోకంగా భావించి ప్రాణం ఇచ్చింది. చివరకు ఏమయింది. ప్రాణంలా చూసుకున్న ఇంటి మనిషి ఆ మాయదారి రోగం బారిన పడిపోయింది. ఇక చెప్పేదేముంది… నన్ను ఒంటరిని చేసి పోయింది.’ భాగ్యరాజు మాటలు చాలా బరువుగా ఉన్నాయి. గుండెలోని ఆవేదన మొహంలోకి తర్జుమా కాబడేసరికి కళ్లు వర్షరుతువు నాటి నిండు మేఘాలవుతున్నాయి.

మునిరత్నంకు ఆశ్చర్యంగా ఉంది. భాగ్యరాజును ఈ స్థితిలో చూసింది  ఎప్పుడూ లేదు. ఎల్లవేళలా స్థిరంగా ఉండే మనిషి తాను. ఎవరైనా ఏదయినా విషయాన్ని ప్రస్తావిస్తే వాదనకు దిగేవాడు. వాదిస్తూ ఉండేవాడు. ఎదుటి మనిషిని మారు మాట్లాడకుండా చేసేవాడు.

దానిలో దేముడయినా, దేవాలయమైనా… ఆస్తికత్వమయినా, అస్తిత్వమయినా దేనినీ విడిచి పెట్టేవాడు కాదు. మాటలతో తనదైన శైలితో ఏకిపారేసేవాడు. అందుకే సమాజం అతగాడిమీద ‘‘పరమ నాస్తిక ఘటం’ అన్న ముద్రను వేసేసింది. దేవుడంటే అస్సలు గిట్టని మనిషి, దైవచింతన అంటే తూలనాడి అసహ్యించుకొనే మనిషి భాగ్యరాజు.

అందుకే గిట్టనివారికి, గిట్టినవారికీ అతనంటే ఒక బరువురాయి. అంతేనా ‘పెద్దబండరాయి’ కూడాను.

కానీ భాగ్యం భాగ్యరాజుకు తద్భినం! భర్త విధానాలను చూసి నొచ్చుకొనేది. వలదు వలదంటూ వేడుకొనేది. ‘మన నమ్మకాలు, మన విశ్వాసాలు మనకు  ఉండి తీరాలంతే!’ నచ్చ జెప్పడానకి ప్రయ త్నించేది. దేనినీ పరిగణలోనికి తీసుకోని భాగ్యరాజు భార్య మాటల్ని త్రుంచి పారేస్తూ ఉండేవాడు.

భార్య కాలం చేసిన తర్వాత భాగ్యరాజుకు తన జీవితం మింగుడు పడకుండా ఉంది. తన ఆదర్శాలు తనవి! ఆమె నమ్మకాలు ఆవిడవి. అయినా రెండు వైరుధ్య పోకడల మధ్య తమ సహజీవనం సజావుగానే సాగిపోయింది.

పండగలప్పుడు, పబ్బాలప్పుడు భాగ్యం తనను అడిగి చూసేది. కొంచెం దిగిరావాలని వేడుకొనేది. అదే పనిగా ప్రాధేయపడుతూ ఉండేది. కానీ ఆ ఒక్క విషయం తప్ప మిగతా విషయాలన్నింటిలోను భార్యకు చేదోడువాదోడుగా ఉండేవాడు.

అదే ఆ ఒక్కటీను….!

ఎప్పుడు దేవాలయానికి తోడుగా రమ్మన్నా వచ్చేవాడు కాదు. పోనీ ఇంట్లో ఏ వినాయక చవితి పండగ అప్పుడో వచ్చి ప్రక్కన కూర్చోమనేది.

‘ససేమిరా!’ అనేవాడు. భార్య తాలూకు మనోభావాలను ఎప్పుడూ ఏ మాత్రము ఖాతరు చేయకుండా చాలా మొండిగా మాట్లాడేవాడు.

భాగ్యం ప్రతిసారీ ఖిన్నురాలయి పోయేది. కట్టు కున్నవాడు కలవరానికి గురిచేస్తుంటే భరింపలేక పోయేది. తనలో తాను కొట్టుమిట్టాడుకు పోయేది.

అటువంటి భాగ్యరాజు…. చాలాకాలం తరువాత ఆమె పూజామందిరంలోకి మాత్రము అడుగిడడాన్కి ఇష్టపడని మనిషి, మొదటిసారిగా అటువైపు తొంగి చూశాడు.

అక్కడ జీవితకాలం తనకు సేవలందించిన భాగ్యం ఉన్నట్లే ఉంది. ఒక్కసారిగా ఆవిడ తాలూకు జ్ఞాపకాలు గుప్పుమంటున్నాయి. కానీ అవేమీ పెద్దగా బుర్రకు పట్టడంలేదు. కొంత అసహనం ఆయన గారిని పూర్తిగా కమ్మేయడంతో, తెరిచిన తలుపుల్ని, మదిలోని తలపుల్ని చటుక్కున బిగించి పారేశాడు.

భాగ్యం చనిపోయింది. ఆమె శరీరం సహకరించకపోవడంతో రోగానపడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంతే! అది దైవ నిర్ణయం అనుకోడు. ఆమె ఆయుర్ధాయం తీరిపోయిందని భావించాడు.

ప్రపంచం అటు ఇటుగా ఎటు కదులు తున్నా అది భాగ్యరాజుకు అనవసరం. మనిషిగా తన ధోరణులు తనవి. అలాగని తన వాదనల ద్వారా సాటి మనుషుల్ని ప్రభావితం చేయడం, వారిని ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించడం వంటి తత్వం కాదు తనది.

* * * * * * *

‘చూడు రాజూ! ఇన్నిసార్లు అడుగుతున్నందుకు ఏమీ అనుకోకు. ఊరి శివాలయంలోని ధ్వజస్తంభం శిథిలావస్థకు వచ్చేసింది. పాడైపోయిన దానిని తీసేసి మరొకటి నిర్మించాలని దేవాలయ కమిటీ తీర్మానం చేసింది.

‘……………………’

‘ఈ మధ్యనే రిటైరైపోయినావు. సరిగ్గా ఆ రోజులలోనే మా చెల్లెమ్మ నిను విడిచి వెళ్లిపోయింది.’

‘……………………’

‘ఆ రామలింగేశ్వర స్వామి ఆమెకు ఇష్టదైవం. నువ్వు అవునన్నా కాదన్నా ఆమె ఎప్పుడూ ఆ గుడిని దర్శించుకుంటూనే ఉండేది. అందుకే ఆలోచించి ఆవిడ పేరు మీద నీకు తోచిన చందాను ప్రకటిస్తావని ….!’

‘నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. భాగ్యం పేరు మీద ఇద్దరు పేద విద్యార్థులను దత్తత తీసుకొనే ఆలచనలో ఉన్నాను. వారికి కావాల్సిన అన్ని రకాలయిన సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నాను.’

‘దానిని నేను కాదనడంలేదు. కానీ ఈవైపు కూడా ఆలోచించమంటున్నాను’. మునిరత్నం పోరుతూనే ఉన్నాడు. మనసు పెట్టి ఆలోచించమని సలహా ఇస్తూనే ఉన్నాడు.

‘ఇది నాకు ఇష్టంలేని వ్యవహారం… సమ్మతం కాని పని!’

‘నీకు ఇష్టంలేనిది… ఆమెకు ఇష్టమైనది!! నీకు సమ్మతంకానిది… ఆవిడకు సమ్మతమైనదీను!

‘……………………’

‘నీది కరుడుగట్టిన నాస్తికవాదమన్నది ఎరుగంది కాదు! నీకు నమ్మకం కుదరనిదానిని భార్య కోసం కల్పించుకోమంటాను!!’

‘……………………’

‘అదే ఇప్పుడు నువ్వు ఇచ్చే చందా మరొకరి బాగు కోసం ఖర్చు చేస్తున్నాననుకో….?’

భాగ్యరాజు ఆలోచిస్తున్నాడు. ఆమె బ్రతికి ఉండగా ఆవిడ మనోభావాలను త్రుంచి పారేసినప్పటి భాగ్యం తాలూకు మనోవేదన స్ఫురణకు వస్తూ ఉంది. మునిరత్నం మాటలను సానుకూలంగా ఆలోచిస్తూంటే భార్య తాలూకు జీవన సహేతుకత తనను తట్టి లేపుతూ ఉంది.

విచిత్రంగా ఇప్పుడు ఆమె తనకు విపరీతంగా తోచడంలేదు. తను ఎంచుకున్న మార్గం నుండి కొంచెం ప్రక్కకు జరిగి చూస్తే ప్రపంచం తాలూకు సార్వజనీనతో, అందులో మమేకమైన తన జీవన సహచరి….’

చెప్పాలంటే తనకు ఆర్థికంగా ఏ మాత్రము లోటులేదు. పెంచి పోషించడానికి సంతానమూ లేదు. పైగా తనతో జీవితాన్ని పంచుకున్న భాగ్యం కాలం చేసిన తర్వాత ఎవరూ లేని ఏకాకి బ్రతుకు తనది.

అందుకే మిత్రుడు మునిరత్నం మాటలు తనను వెంటాడుతున్నాయి. ఆయన కోణంలోంచి చూసి నపుడు చనిపోయిన భార్య తాలూకు మనోభావాలను మన్నించి తీరాలన్న తపన ఇప్పుడు భాగ్యరాజును పట్టిలేపుతోంది.

నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభ వోప్తంగా, శాస్త్రోక్తంగా జరిగిపోతూ ఉంది. ఊరు ఊరంతా ముక్కున వ్రేలేసుకుంటోంది. అసలు ఊహించని అరుదైన సందర్భం ఇది. రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ నిర్మాణానికి భార్య పేరు మీద రెండు లక్షల రూపాయలు విరాళమిచ్చాడు భాగ్యరాజు.

చెప్పాలంటే ఈసారి ఊరిలోని అందరికంటే ఎక్కువ చందా ప్రకటించాడు. భార్య తాలూకు జీవన సహేతుకతను మననం చేసుకుంటూ తన నుండి తాను బయటకు వచ్చి ఒక ఆస్తిక సందర్భానికి తన వంతు సహాయ సహకారాలను ప్రకటిస్తూ ఉన్నాడు.

కరడుగట్టిన పరమ నాస్తికవాది భాగ్యరాజు ఏమిటి ఒక దేవాలయం తాలూకు పుణ్య కార్యక్రమానికి  రెండు లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించడమేమిటి అన్న విషయం ఊరిలో చర్చనీయాంశంగా మారుతూ ఉంది.

దేవాలయ ప్రాంగణమంతా నూతన కాంతులతో మెరుపులీనుతూ ఉంది. కార్తిక పౌర్ణమి రోజున వార్షికంగా జరిగే జ్వాలాతోరణ కార్యక్రమం….

భార్య మనసెరిగిన భాగ్యరాజు ఆమె అపు రూపంగా భావించే తోరణంగా కట్టిన ఎండుగడ్డికి కాగడాతో నిప్పు అంటించాడు. తనలోని నాస్తిక ధోరణులన్నీ ఒక్కసారిగా ఈ కాలుతూన్న జ్వాలా తోరణంలో మాడి నుసి అయిపోయినట్లు న్నాయి.

దాని క్రింద రామలింగేశ్వర స్వామివారి పల్లకీ అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉంది. మేళతాళాలు లయబద్ధంగా  వాయిస్తూంటే పల్లకీని మోస్తూన్న బోయీలు పారవశ్యంతో అటు ఇటూ మంటల క్రింద స్వామివారిని త్రిప్పుతున్నారు. భక్తులు పారవశ్యంతో ఆ సదృశాన్ని తిలకిస్తూ ఉన్నారు.

ఉన్నట్టుండి భాగ్యరాజు పల్లకీకి బోయీ తానవుతూ ఉన్నాడు.

భగభగమండుతూన్న జ్వాలాతోరణం క్రింద స్వామివారి పల్లకీని త్రిప్పు తున్నాడు. పోయిన భార్య తాలూకు అభిమతాలు తనను ప్రభావితం చేస్తున్నాయి. దానితో పాతకాలం నాటి ఆయనగారి ఉద్దేశాలు కాలి మటు మాయమవు తున్నాయి.

తెలియని పారవశ్యంతో భాగ్యరాజు ఇంటికి చేరాడు. చాలాకాలంగా ఇంట్లో  మూసి ఉంచిన పూజామందిరం తలుపుల్ని తెరచి చూశాడు. ఎన్నడూ లేనిది ఆయనగారి చేతులు అదే పనిగా వణికిపోతూ ఉన్నాయి. ఎప్పుడూ ఆ పూజామందిరంలోకి తాను అడుగుపెట్టింది లేదు.

ఇప్పుడు తన నుండి తాను విడివడిపోతూ దేవుని మందిరంలో ఇన్నాళ్లూ భాగ్యం వెలిగించిన దీపపు కుందిని వెలిగించడానికి సమాయత్తమవుతున్నాడు.

About Author

By editor

Twitter
YOUTUBE