– టిఎస్‌ఎ కృష్ణమూర్తి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
బస్ ఏదో గ్రామీణ పాయింట్‌లో ఆగింది.
ఆలోచనలలో మునిగిన నేను వాటి నుంచి వెలుపలపడి తలెత్తి చూశాను.
ఎవరో ఒకే ఒక వ్యక్తి బస్ ఎక్కాడు.
కండక్టర్ వద్ద టికెట్ తీసుకుని ముందుకు వచ్చాడు ఆ మనిషి. అంతదాకా డబుల్ సీట్లో దర్జాగా కూర్చుని ఉండిన నేను కొద్దిగా కిటికీ పక్కకు జరిగి ఆ మనిషి కూర్చోవడానికి అవకాశం ఇచ్చాను.
అతడు వచ్చి నావద్ద ఆగాడు కానీ, నా పక్కన కూర్చోకుండా వెనుక వైపునకు వెళ్లిపోయాడు.
అదయితే నాకు తరచు ఎదురయ్యే అనుభవమే!
నిండయిన నా విగ్రహం, క్రమశిక్షణతో నాకల వడిన నా డ్రెస్‌మ్యానర్, నిగనిగలాడే నా కాలిబూట్లు, తాహతుకు మించిన ఖరీదైన నా చేతి వాచీ, కళ్లద్దాలు… ఇవన్నీ కొంతమందిని నా పక్కన కూర్చోవడానికి సంశయించేలా చేస్తాయి!
బస్ కొంత దూరం వెళ్లాక ఎందుకో వెనుతిరిగి చూశాను. మరెక్కడా సీట్లు ఖాళీ లేనందున అతడు నిలబడే కన్పించాడు.
వచ్చి నా పక్కన కూర్చోమన్నట్లుగా చేయి ఊపాను.
కానీ అతడు తను నుంచున్న చోటు నుంచి కదలలేదు!
అయినా నా మనసు ఊరుకోలేదు.
నేనే లేచి అతని వద్దకు వెళ్లి ‘‘అలా పద, నా పక్క సీటు ఖాళీగా ఉంది కద? కూర్చుందాము’’ అన్నాను.
‘‘ఒద్దులేయ్యా!’’ అన్నాడతను.
‘‘ఏం? ఎందుకని?’’ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాను.
‘‘మీరు పెద్దోళ్లయ్యా!’’ అన్నాడు.
అతనలా అనగానే నేనతనికేసి పరీక్షగా చూశాను…
అతడు నా సమ వయస్కుడే! దిగువ మధ్యతరగతి రైతో, రైతు కూలీనో అయి ఉంటాడు.
కష్టంతో అరిగి కరిగిన శరీరం… ముతక దుస్తులు!
‘‘టికెట్ కొన్నావు కదా! మరి ఈ బస్‌లోని ఆ సీటులో సగం మీద నాకెంత హక్కుందో మిగతా సగం మీద అంతే అధికారం నీకూ ఉందికద? పద వెళ్లి ఇద్దరం కూర్చుందాము’’ అన్నాను.
పక్క సీట్లవాళ్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు మాకేసి.
‘‘ఒద్దులేవయ్యా, మీరు గొప్పోళ్లు’’ అన్నాడు.
పాట పాతదే… రాగం కొత్తగా విన్పించింది… అంతే….
ఇంతలో ఇంకో స్టాపులో బస్సు ఆగడమూ, బిలబిలమంటూ కొందరు మనుషులు బస్ ఎక్కడమూ, వారిలో ఇద్దరు చప్పున ముందుకు వచ్చేసి నేను కూర్చుని ఉండిన సీటును ఆక్రమించుకోవ డమూ జరిగిపోయాయి.
నా పని కాస్తా పుణ్యానికిపోతే పాపం ఎదురైనట్లయింది. అయితే మాత్రమేం?…నేను యుద్ధరంగంలో పనిచేసి వచ్చినవాడిని. అతడేమో కాయకష్టం చేసే మనిషిలా ఉన్నాడు. నిలబడి ప్రయాణం చేయడం మాకేం కష్టం కాదు నిజానికి.
‘‘అడ్డు తీయండయ్యా, నేను పోయి ఒకరిని లేపించేస్తాను’’ అన్నాడతడు… తన వల్ల నా సీటు పోయిందన్న బాధ కన్పించింది అతని కళ్లలో.
‘‘ఒద్దు, ఒద్దు… ఆ సీటు మీద ఇప్పుడైతే వారికి అధికారం ఉందిలే… ఇంతకూ నీవు ఎందాకా వెళ్తున్నావు?’’ అని ప్రశ్నించాను.
‘‘అంకిపాడు మిట్టవరకే బాబూ!’’
‘‘ఏం పనిమీద?’’ అంటూ మళ్లీ ప్రశ్నించాను.
‘‘మా నాయన ఆస్పత్రిలో ఉన్నాడయ్యా!’’
అతని జవాబు విని ఆశ్చర్యపోతూ అతనికేసి పరీక్షగా చూశాను. తను నా సమవయస్కుడే! కాబట్టి తప్పక డెబ్బయి అయిదేళ్లు దాటిపోయి ఉంటాయి అతనికీ!!
‘‘మీ నాయన వయసెంతుంటుంది?’’ ఆశ్చర్యం లోంచి తేరుకుంటూ ప్రశ్నించాను.
‘‘మా నాయన లెక్కల ప్రకారం వందకు ఓ సంవత్సరం అటూ ఇటూ ఉంటాయయ్యా!’’
‘‘ఇప్పుడేమిటి జబ్బు?’’
‘‘జ్వరమయ్యా! నలభై రోజులు కాడ్నించి, ఒకటే జ్వరమయ్యా… మా ఊరి పక్కనే రామన్నపేట ధర్మాసుపత్రిలో పదైదురోజులున్నాడయ్యా. ఏమీ గుణం కాలా! ఆనక పెద్ద గోవిందప్ప ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాము. వాళ్లు పదైదు దినాలుంచుకుని బాగానే చూశారయ్యా. అయితే వాళ్లకాడ కూడా ఏమీ గుణం కన్పించలా. దాంతో అంకిపాడుమిట్ట సూపర్ ఆస్పత్రికి తీసుకుపొమ్మని జాబు రాసిచ్చిరయ్యా. పదిరోజుల కాడ్నించీ ఆ ఆస్పత్రిలోనే ఉన్నాడు’’ అన్నాడతడు.
‘‘ఖర్చు చాల అయ్యుంటుందే?’’
‘‘అవునయ్యా! రామన్నపేట ధర్మాసుపత్రిలో ఖర్చేం కాలేదు కానీ పెద్ద గోవిందప్ప ఆస్పత్రి ఖర్చు తట్టుకోలేకే ఇరవయి జీవాలను అమ్ముకోవాల్సి వచ్చిందయ్యా!’’ అన్నాడు.
‘‘జీవాలంటే?’’ ప్రశ్నించాడు అర్థం కాక.
‘‘గొర్రెలు, మేకలయ్యా’’ అన్నాడతడు స్వచ్ఛంగా నవ్వేసి ఏ మాత్రం కల్తీలేని నవ్వది!
ఈ మధ్యకాలంలో అలాంటి స్వచ్ఛమైన నవ్వులు చాల తక్కువగా కన్పిస్తున్నాయి.
‘‘అంకిపాడు మిట్ట సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కూడా చాల డబ్బు ఖర్చయి ఉంటుందే?’’
‘‘అబ్బో దాని మాటెందుకులేయ్యా! మా ఇంటిదానికున్న కొంచెం బంగారం, మా కోడలి బంగారం పూర్తిగా కరిగిపాయె!’’
‘‘మీ కోడలు బాధపడలేదా?’’
‘‘అయ్యో రామ…. ఆ బంగారు బిడ్డ నవ్వుతూ బంగామంతా తీసి నా చేతుల్లో పెట్టేసె గద… ‘‘పెద్దాయప్పకు బాగయి వచ్చి కండ్లముందు కదలాడ్తూ ఉంటే… అదే నాకు పెద్ద బంగారు’’ అంటుంది ఆ బిడ్డ. ఆ బిడ్డకు మామీద ప్రాణ మయ్యా…’’
పై మాటలంటున్నప్పుడు అతని కళ్లలో ప్రశాంతతతో కూడిన తృప్తి కన్పించింది.
‘‘మొత్తానికి నీవు అదృష్టవంతుడివి’’ అన్నాను.
‘‘అవునయ్యా, శానా జీవాలూ, బంగారూ పోతే పోయాయి…మంచి కాలమొస్తే మళ్లీ కూడగట్టు కోవచ్చు… మా నాయన కోలుకుంటున్నాడయ్యా, అదే సాలు మాకు. ఆయన ఇంటి ముంగిటుంటే సాలు మా ఇంటిల్లుపాదికీ కొండంత ధైర్యమయ్యా!’’ అన్నాడు.
అప్పుడతని స్వరంలో ఆనందం, కళ్లలో గొప్ప జీవంతో కూడిన వెలుగు కన్పించింది.
అతన్ని చూస్తుంటే నాకు తెలియని జీవిత పరమార్థమేదో అర్థమవుతున్నట్లుగా అన్పించింది నిమి•షం పాటు.
వృద్ధులను అనాథ శరణాలయాలలో చేర్చేవారు కొందరు, మాయమాటలు చెప్పి వందలాది మైళ్ల అవతలకి తీసుకువెళ్లి వదిలిపెట్టి వచ్చేసేవారు కొందరు కన్పిస్తున్న కాలంలో తన వృద్ధ తండ్రిని బతికించుకోవడానికి ఈ వృద్ధుడు చేస్తున్న కృషి అద్భుతం అన్పించింది.
‘ఈ ప్రపంచాన్ని ప్రశాంతంగా జీవింపచేసుకోవచ్చు!’ అని కూడా అన్పించింది.
‘‘నెమ్మదించిందన్నావు కద? ఎప్పుడు డిశ్చార్జి చేస్తామన్నారు?’’ అని ప్రశ్నించాను…’’ ఈ బక్క మనిషిని ఆ ఆస్పత్రివారు మరెంత పీల్చి పిప్పి చేస్తారో?’’ అని మనసులో అనుకుంటూ.
‘‘మర్నాడు ఇంటికి పంపిస్తామని చెప్పారయ్యా… ఏదో ఒక బాధ పడి బాకీ లెక్క ఆస్పత్రిలో కట్టి మా నాయనను ఇంటికి పిలుచుకుని పోవాలి. ఇన్నాళ్లూ నా ఇంటిది మా నాయన్ను కనిపెట్టుకుని ఆస్పత్రి కాడే ఉండిపోయింది. నా కొడుకుకు మిగిలివున్న జీవాలను కొండకు తోలుకుపోనూ, వాటికి ఆకూ అలమూ కొట్టుకు రానూ, ఇంటికాడున్న గొడ్లకు గడ్డీ, గాదమూ చూసుకోనూ సరిపోతుంది.
మా కోడలికయితే పసిబిడ్డల్ని సమాలించు కుంటూ అన్నం వండనూ, ఆస్పత్రికి గంజి కాసివ్వనూ, గొడ్లకు కుడితిపోయనూ, గానుగపిండీ, తవుడూ ఉడికించి పెట్టనూ… ఇంకా ఇంటిపనులూ సరిపోయాయి. ఇంగ నాకయితే లెక్క సర్దుబాటు చెయ్యనూ, మా నాయనకు గంజి, అమ్మకు అన్నమూ తీసుకు పోయి మంచీ, చెడ్డా చూడడానికి అంకిపాడు మిట్టకూ, మా ఊరికీ తిరగను సరిపోయె.
ఊర్లో కాసింత మడీ, సేనూ ఉన్నాయయ్యా. వాటి ముకం సూసి నెల రోజులు దాటిపాయె. పక్కమడి సీతప్ప మంచోడు గాబట్టి అడపాదడపా నామడీ జూసి నీళ్లు గట్టాడు’’ అంటూ తన సాధకబాధకాలు చెప్పుకొచ్చాడు అతడు. బహుశా మనసులోని బరువలాదించుకున్నాడేమో! అవన్నీ అటుంచితే ఆస్పత్రులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిన అతని దుస్థితికి జాలి కలిగింది.
ఆ సమయంలో నేను కళ్లారా చూసిన, కొద్దో గొప్పో అనుభవించిన రెండు విషయాలు కళ్లముందు కదలాడాయి.
ఒకటి… చిన్నతనంలో నేను చూసిన మావూరి డాక్టర్లు..
డాక్టర్ కృష్ణమూర్తి అనే ఓ మహానుభావుడు ఆజాద్ క్లినిక్ అని ఓ చిన్న ఆస్పత్రిని నడిపేవాడు. పేదలకు, ధనికులకు ఒకటే వైద్యం! ఎవరు ఏమిచ్చినా చూడకుండానే తీసుకుని జేబులోనో, టేబులు సొరుగులోనో వేసుకునేవాడు. రోగి పల్సు చూసి పరీక్షించి, చిన్న కాగితంమీద మందులు రాస్తే కాంపౌండర్ చకచకా వాటర్ మిక్చర్లు కలిపి రోగి తెచ్చుకున్న సీసాలలో వేసి ఇచ్చి ఎలా వాడాలో చెప్పేవాడు. రోగి మరో రోజు ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకుండా ఆ మందులు పనిచేసేవి. వైద్య సేవలన్నీ పేదవారికి ఉచితంగానే లభ్యమయ్యేవి అక్కడ.
ఉదయం ఒక గంట, సాయంకాలం ఒక గంట సైకిలు మీద ఊరిలో రౌండ్లు తిరిగి పెద్దగా జబ్బుపడ్డ వారిని జాగ్రతత్త పరీక్షించి తగు సూచనలు ఇచ్చివచ్చేవాడు. ఊరు పెరిగి, ఆయనకు వయసు మళ్లాక సువేగా మోపెడ్ మీద రౌండ్లు తిరిగి వచ్చేవాడు.
ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో పౌర సన్మానం జరిగింది. తరువాత కొద్దిరోజులకే జీవన యానం ముగించుకుని వెళ్లిపోయాడు.
ఆయనలాంటి వారే ఆల్ఫ్రెడ్ నర్సింగ్ హోం డాక్టర్లు ఆల్ఫ్రెడ్ దంపతులు. అలాగే తక్కువ ఖర్చుతో సేవలందిస్తుండిన షోషా ఆస్పత్రి అందులోని డాక్టర్ వ్యాన్ట్రాడ్ మొదలైన డాక్టర్లు, హోమియో వైద్యులు డాక్టర్ ఎం.ఎర్రమరెడ్డి, ఓంశాంతి క్లినిక్ డాక్టర్ అమరనాథ్, కస్తూరి క్లినిక్ డాక్టర్ తంగరాజు లెక్చర్ ఇంకా హోమియో డాక్టర్ కదం కృష్ణాజీరావ్ డాక్టర్ లక్ష్మీబాయి దంపతులు… ఇలా కొందరి ద్వారా సేవాధర్మంతో ప్రజలకు వైద్యసేవలు అందుతుండేవి.
వాస్తవానికి అవి చాలామంచి రోజులు…. జబ్బులూ తక్కువ… రోగులూ తక్కువే!
రెండవది…నా సర్వీస్ చివరి దశకంలో… కార్గిల్ యుద్ధ సమయంలో నేను చూసిన దేవదూతల లాంటి డాక్టర్లూ వారి సహాయకులు.
యుద్ధ రంగంలో చనిపోయిన వారిని తరలిం చడం నిజానికి పెద్ద సమస్య కాదు. మృతదేహాలను సగౌరవంగా, త్వరతగతిన వెనక్కి తరలిస్తారు.
కానీ గాయపడిన వారినయితే చాలచాల వేగంగా, అతి జాగ్రత్తగా బార్డర్ కేర్ ఆస్పత్రికి తరలిం చాలి. కార్గిల్‌వార్ సమయంలో అక్కడి ఆపరేషన్ థియేటర్లు, ఐసీ•యులు, స్పెష, జనరల్ వార్డులలోని మంచాలు… చివరికి… వరండాలలోని నేలకూడా గాయపడ్డవారితో నిండిపోయాయి. ఆపరేషన్లను థియేటర్లలోనే కాక మంచాలమీద, బల్లలమీద, అరుగులమీద చివరికి నేల మీద కూడా జరపాల్సి వచ్చింది. నిజానికి విధిలేని అత్యయిక పరిస్థితులు అవి.
గాయపడ్డవారి ప్రాణాలు నిలపడమే ధ్యేయంగా మరో యుద్ధంలా డాక్టర్లూ, వారి సహాయకులూ క్షతగాత్రులకు ప్లాస్టిక్ పట్టాల మీదే ఆపరేషన్లు జరుపుకుంటూ పోయారు. వారికి రోజుల తరబడి సరిగా తిండి తినడానికి, నిద్రపోవడానికి వ్యవధి లేదు. వారసలు వ్యవధి కావాలనుకోలేదు! వారికా ధ్యాసే లేదు!!
శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్లను తొలగించడం, సెప్టిక్ అయిన భాగాలను, అవసర మైతే అవయవాలను తొలగించడం, అత్యవసర ఆపరేషన్లు ఎక్కడ వీలయితే అక్కడ అలాగే చేసెయ్యడం, అక్కడి ఎమెర్జెన్సీ కేర్ ముగియగానే అత్యవసరం ఉన్నవారిని హెలికాప్టర్లలో, తతిమ్మా వారిని అంబులెన్సులలో, మిలిటరీ స్పెషల్ వాహనాలలో తరలించడం ఒక పక్క జరిగిపోతూంటే ఖాళీ అయిన స్థానాలలోకి మరో పక్క కొత్తగా యుద్ధ క్షతగాత్రులు వచ్చి చేరుకుంటుండడం. ఆ తంతు మొత్తం సిస్టమాటిక్‌గా, నిరవధికంగా జరిగిపోయింది యుద్ధం పూర్తయ్యే వరకూ కూడా!
విసుగులేదు, విరామంలేదు, తిండి తిప్పలమీద ధ్యాసలేదు. అంకిత భావంతో కర్తృత్వమే కనపడిం దక్కడ! దేవదూతలు కాదు ఆ డాక్టర్లూ, సహాయ కులూ… నిజంగా దేవతలే!
నిజానికి వారి ఆ సేవలు ప్రపంచానికి తెలిసే అవకాశాలుండవు!!
రెండు దశలలో నేను చూసిన అలాంటి వైద్యులు, సహాయకులూ, వైద్యశాలలూ ప్రపంచమంతా ఉంటే ఎంత బావుండును? అని అన్పించింది. ఇలాంటి సామాన్యులకు వైద్య, ఆర్థిక సమస్యలనేవి ఉండేవి కాదు కదా? అని కూడా అన్పించింది.
అతనితోపాటు నిలబడి నా ఆలోచనలలో నేనుండగానే బస్సు అంకిపాడు మిట్ట బస్‌స్టేషను చేరుకుంది. టిఫిన్ బాక్సులున్న చేతి సంచితో బస్ దిగి వెళ్లిపోయాడతను.
బస్‌లో చాల సీట్లు ఖాళీ అయ్యాయి.
నేనూ వెళ్లి ఓ ఖాళీ సీట్లో కూర్చున్నాను.
* * * * * * * * *
చాలా నెలల తరువాత ఓ రోజు పనిమీద అంకిపాడు మిట్టకు వెళ్తే బజార్లో కన్పించాడతడు. తను నన్ను గుర్తుపట్టకుండా వెళ్లిపోతోంటే నేనే ఆపి పలకరించాను.
‘‘ఎరువుల అంగడికి వచ్చానయ్యా’’ అన్నాడు.
‘‘అది సరే మీ నాయన ఎలా వున్నాడు?’’ అని ప్రశ్నించాను ఆసక్తిగా.
‘‘దేవుని దయవలన బాగా కుదురుకున్నాడయ్యా. ముందుటి కన్నా కూడా ఉషారుగా ఉన్నాడు. తెల్లారకట్టే అందరి కన్నా ముందే లేచి గొడ్లకాడ పాలు పిండేసి ఎత్తుకుపోయి పాలడెయిరీ వ్యానుకాడ ఇచ్చేసి వస్తాడు. అన్నం తినగానే జీవాలను కొండకల్ల తోలకపోయి సందేల దాకా మేపు కొస్తున్నాడయ్యా. సేద్యం పనులు చేసుకోను బాగా సులువుగా ఉందయ్యా మాకిప్పుడు’’ అన్నాడతడు.
అతని స్వరంలోని తృప్తిని ఆస్వాదిస్తూ మౌనం వహించాను.
‘‘మీరు గొప్పోళ్లయినా నన్ను పలకరించారయ్యా! చాన సంతోసమయ్యా…. వస్తానయ్యా…’’ అంటూ బయల్దేరాడతడు.
‘‘నేను గొప్పవాణ్ణా?’’ అన్న ప్రశ్న ఉదయించింది నా మనసులో…
నేనూ అతనిలాంటి రైతు కుటుంబానికి చెందినవాణ్ణే!
దాదాపు అరవయియేళ్లకు క్రిందటిమాట… కరువు దెబ్బకు కుటుంబం కుదేలై పోతుండగా, మిలటరీ సెలక్షన్లు జరుగుతోంటే ధైర్యం తెచ్చుకుని వెళ్లాను. అదృష్టవశాత్తు ఎంపికయ్యాను. చదువు మానుకుని వెళ్లిపోయి అప్పుడలా ఆ రోజులలో సిపాయినయ్యాను.
ఎక్కడ ఎలా పనిచేసినా నాకయితే పెద్దగా ఖర్చంటూ ఉండేది కాదు… అందువల్ల జీతం డబ్బులు ఇంటికి పంపేస్తూ కుటుంబానికి బాసటగా నిలిచాను. అదృష్టవశాత్తు సర్వీసులో మంచి అధికారులు ఇచ్చిన సూచనలతో ప్రయివేటుగా చదువుకొనసాగించాను. అది నాకెంతో మేలు చేసింది. డైరెక్టు హవాల్దార్ అయి ఆపై హవాల్దార్ మేజర్ అయ్యాను. చదువుతోపాటు అంచెలంచెలుగా ఎదిగి జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ అయ్యాను. గర్వపడకుండా కష్టాన్ని భరించి పనిచేస్తూ రావడం వల్ల, యుద్ధరంగంలోనే కాక ఆపరేషన్ పరాక్రమ్‌లో సైతం ప్రతిభ కనపరచడం వల్ల మరింత ఎదిగి లెఫ్టినెంట్ కల్నల్‌గా పదవీ విరమణ చెందాను.
రక్షణరంగ ఉద్యోగంలోని కష్టాలూ, సుఖాలూ ఓపికగా అనుభవించినందుకే కడుపులో చల్లకదల కుండా మంచి పెన్షన్ పొందుతున్నాను. ఇంకా కొన్ని సౌకర్యాలూ లభ్యమవుతున్నాయి. సమాజంలో కాస్త మంచిపేరు, సంఘంలో ఒకరకమయిన హోదా.
అంత మాత్రాన నేను గొప్పవాడినా? నిరంతర జీవన సంగ్రామంలో విరామమెరుగక పోరాడుతూ వంద సంవత్సరాల తండ్రిని జీవింపచేసుకున్న అతడు గొప్పవాడా? ఎవరు గొప్పవారు?.. అని ఆలోచిస్తూ నడుస్తూంటే అతడు తన తండ్రిని బ్రతికించు కోవడంలో అతనికి ఎంతో సహకరించిన అతని భార్య, అతని కుమారుడు, కోడలు కూడా గొప్పవారనిపించింది.
అందరికన్నా… వంద సంవత్సరాల వయసులో పెందలాడే పాలు పితికి, డెయిరీ వ్యానుకు అందించి, తిండి తినడం ఆలస్యం… గొర్రెలను, మేకలనూ మేపడానికి తోలుకుపోయి వస్తూ నిండు కుటుంబానికి సహకరిస్తున్న అతని వృద్ధ తండ్రి చాలాచాల గొప్ప వాడనిపించింది.
వంద సంవత్సరాల ఆ రైతు కుటుంబీకుడూ, సైనిక దళంలోకి వెళ్లి ఓ స్థాయికి వచ్చిన నేనూ సరిసమానమే కావచ్చు బహుశా. అందుకే అన్నారేమో ‘జై జవాన్, జై కిసాన్’ అని.